Friday, 11 August 2017 15:02

ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. మీ అందరికీ నా అభినందనలు అని చెప్పాడు. అమిత్‌షా అందుకుని... ముఖ్యంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎన్నుకోవడం మన పార్టీకి పెద్ద మైలేజీ కానుంది. రాజ్యసభలో ఇంత కాలం మనం డిఫెన్స్‌లో వుంటుండేవాళ్లం. ఇప్పుడు అది మారబో తోంది. రాజ్యసభలోనూ చక్రం తిప్పబోయేది మన వెంకయ్యే అని చెప్పాడు. వారు అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా... మోడీ టీవీ ఆన్‌ చేసి 'రిపబ్లిక్‌' ఛానెల్‌ పెట్టాడు. అందరూ టీవీ వైపు చూసారు... స్క్రీన్‌పై వస్తున్న ఫ్లాష్‌ న్యూస్‌ చూసి అందరూ షాకయ్యారు. 'ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయనున్న వెంకయ్యనాయుడు, మరికొద్ది సేపట్లో రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించనున్న ఉషాపతి...' అని బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తున్నాయి. మోడీతో పాటు అక్కడున్న వారందరికీ తల తరిగినంత పనయ్యింది. ముందుగా మోడీ తేరుకుని... ముందు అర్జంట్‌గా వెంకయ్యజీ వద్దకు వెళదాం పదండి అంటూ అందర్నీ తీసుకుని వెంకయ్యనాయుడు ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ వెంకయ్యనాయుడు అచ్చతెలుగులో రాజీనామా లేఖను వ్రాస్తున్నాడు. అది చూసి మోడీ... ఏమైంది వెంకయ్యాజీ, ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అందుకు వెంకయ్య... నాకు ఉపరాష్ట్రపతిగా కంటే ఉషాపతిగా ఉండడమే హాయిగా వుంది. నన్ను రాజీనామా చేయనివ్వండని కోరాడు. అమిత్‌షా అందుకుని... దీని వెనుక ఏదో బలమైన కారణమే వుంది. ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారో కారణం చెప్పండని బ్రతిమ లాడాడు. అప్పుడు వెంకయ్య... మొన్న నెల్లూరెళ్లాను కదా... అప్పటినుండే రాజీనామా చేయాలని డిసైడ్‌ అయ్యానన్నాడు. నెల్లూరులో ఏం జరిగిందని అమిత్‌షా అడిగాడు. అందుకు వెంకయ్య... ఇది నోటితో చెబితే అర్ధమయ్యేది కాదు... అంటూ వేలితో గాల్లో స్క్రీన్‌ గీసి ఫ్లాష్‌బ్యాక్‌ ప్లే చేసాడు.

------

అది ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానం. విఆర్‌సి గ్రౌండ్‌లో తన కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొనేందుకు వెంకయ్యనాయుడు అప్పుడే హెలికాఫ్టర్‌లో దిగాడు. వెంకయ్య దిగగానే అక్కడున్న అభిమానులు, బీజేపీ కార్యకర్తలు... ''వెంకయ్యనాయుడు జిందాబాద్‌'' అంటూ నినాదాలు చేయసాగారు. ఉపరాష్ట్రపతి ప్రోటోకాల్‌ అధికారులు నినాదాలు చేస్తున్న కార్యకర్తలతో... సార్‌ ఇప్పుడు ఉపరాష్ట్రపతి... మీరిలా జిందాబాద్‌లు కొట్టకూడదని వారించారు. వెంకయ్యకు అది కొంచెం ఇబ్బందనిపించింది. ఈ కార్యకర్తలు అభిమానంతో కొట్టే జేజేలకు ఇక నేను దూరంగా ఉండాల్సిందేనా? అని మనసులో బాధ ఏర్ప డింది. అయినా తమాయించుకుని అక్కడ గుమికూడిన జనాన్ని...ఏం పుల్లయ్య బాగున్నావా... ఏం గురవారెడ్డి... పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ పేరు పేరునా పలకరించసాగాడు. ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ వచ్చి... సార్‌, మీరిప్పుడు ఉపరాష్ట్రపతి. జనంలోకి మరీ ఇంతగా దూసుకుపోకూడదని చెప్పాడు. వెంకయ్య చేసేదేమీ లేక కారు ఎక్కాడు. రోడ్డు పొడవునా విద్యార్థులు జాతీయ పతకాలతో స్వాగతం పలుకుతుండగా ఆయన పోలీస్‌ ఆఫీసు రోడ్డు మీదుగా పోసాగాడు. కరెక్ట్‌గా కస్తూర్భా కళాక్షేత్రం జంక్షన్‌ వద్దకు వెళ్లేసరికి ఆ సందులో నుండి బోండాలు కాలుస్తున్న వాసన వచ్చింది. వెంకయ్య జింకపిల్ల మాదిరిగా కారు నుండి దూకేసి బోండాలు కాలుస్తున్న టిఫిన్‌ కొట్టు వద్దకు వెళ్లాడు. అక్కడ వేడి వేడిగా కాల్చిన బోండాలను పెట్టుకుని తినబోతుండగా, ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ వచ్చి సార్‌, ఇప్పుడు మీరు ఉపరాష్ట్రపతి... ఎక్కడపడితే అక్కడ ఏ చెత్తంటే ఆ చెత్త తినకూడదు అన్నాడు. ఇది చెత్తేంటి, నాకిష్టమైన ఆహారం... నేను చిన్నప్పటి నుండి పులిబొంగరాలు తినే పెరిగానని వెంకయ్య అన్నాడు. దానికతను... నిన్నటిదాకా మీరు ఏం తిని పెరిగారో మాకు అన వసరం, ఇకనుండి మేం సూచించిన ఆహారమే మీరు తీసుకోవాలి అని చెప్పారు. కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు సెంటర్‌కు వెళ్లాక...

ఉదయగిరి నుండి వచ్చిన పాత స్నేహితులు కనిపించారు. దాంతో వెంకయ్య కారు దిగి, వారితో క్షేమ సమాచారాలు ముచ్చటించు కుంటూ నడవసాగాడు. వాళ్లతో కలిసి నడుస్తుంటే వెంకయ్యకు 1978-83 ప్రాంతంలో ఉదయగిరి పల్లెల్లో నడిచి ప్రచారం చేసిన సంఘటనలు గుర్తుకు రాసాగాయి. ఆయన మనసుకు అది ఎంతో హాయిగా వుంది. అప్పుడే ప్రోటోకాల్‌ అధికారి వచ్చి... సార్‌, మీరిప్పుడు ఉపరాష్ట్రపతి... రాజకీయ నాయకుడి మాదిరిగా రోడ్డుమీద నడవకూడదు, ముందు కారెక్కండి అని చెప్పాడు. వెంకయ్య అయిష్టంగా కారెక్కాడు. అలా కాన్వాయ్‌ సర్వోదయ కాలేజీ వద్దకు వచ్చింది. అక్కడ కాలేజీ గ్రౌండ్‌లో కొందరు పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. ఆ సీన్‌ చూడగానే వెంకయ్యకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. వెంకయ్య కారు దిగి చెంగు చెంగున ఎగురుకుంటూ సర్వోదయ గ్రౌండ్‌ లోకి వెళ్లాడు. ఓ జట్టు వైపు చేరి అడ్డపంచె ఎగ్గట్టి ''కబడ్డీ... కబడ్డీ'' అంటూ కూతకు పోయాడు. మంచి హుషారు మీద అటు ఇటూ తిరుగుతూ కూతపెడుతున్నాడు. అంతలో ఓ ఆటగాడు వెంకయ్య కాలును పట్టుకోబోయాడు. అతన్ని తప్పించుకునే సమయంలో వెంకయ్యకు తన పంచె అడ్డమొచ్చి పడబోయాడు. దాంతో, వెంటనే అక్కడకు ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ వచ్చి... సార్‌, మీరిప్పుడు ఉపరాష్ట్రపతి... ఇలా ఎక్కడపడితే అక్కడ గేమ్స్‌ ఆడకూడదు. ముఖ్యంగా మీరు ఈ పంచె తీసేసి సూటూ, కోటు వేసు కోవాలి. ఈ అడ్డపంచె వల్ల చాలా ఇబ్బంది ఉందన్నాడు. అప్పటికే లోలోపల రగిలిపోతున్న వెంకయ్యకు అతని మాటలతో నషాళానికంటింది. పదవినైనా వదులుకుంటాను గాని, నా ఆంధ్రా పంచెకట్టును వదులుకునే ప్రశ్నే లేదు. ఈ దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి పదవులు పుట్టక ముందే ఈ పంచెకట్టు పుట్టింది. నాకు పదవి కంటే పంచే ముఖ్యం... నా పంచెకట్టు అడ్డమనుకుంటే ఇప్పుడే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేస్తాను అంటూ వెంకయ్య రుసరుసలా డుతూ కారెక్కాడు. వెంకయ్య నోటి నుండి రాజీనామా మాట రాగానే 'ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా' అంటూ మీడియా కోడై కూయసాగింది.

----

వెంకయ్య వేలితో గీసిన ఎయిర్‌స్క్రీన్‌పై సీన్‌లు ఇక్కడితో అయిపో యాయి. జరిగింది ఇది సార్‌, ఉపరాష్ట్రపతి పదవినైనా వదులుకోవడానికి నేను సిద్ధమేగాని, నా పంచెకట్టును నేను వదులుకోను అని వెంకయ్య చెప్పాడు. అందుకు మోడీ... ఈ దేశ ప్రజలు తొలిసారిగా తెలుగు పంచెకట్టును చూడబోతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి మీ పంచె అడ్డం కాదు... అందం అని చెప్పి శాంతింపజేశాడు.

Read 258 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter