jumppersనేను పార్టీ మారేది లేదు... పార్టీ మార్చాల్సిన అవసరమే ముంది... మమ్మల్ని ప్రజలు ఒక పార్టీ తరపున ఓట్లేసి గెలిపిం చారు, ఇప్పుడు అధికారంలో లేమని చెప్పి ఇంకో పార్టీలోకి వెళితే... మేం ప్రజలకు ఏం మెసేజ్‌ ఇచ్చినట్లు... పార్టీ మారకముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి.

మరి పార్టీ మారాక... మా నియోజకవర్గం అభివృద్ధి మాకు ముఖ్యం. అధికారపార్టీలో వుంటేనే ప్రజలకు నాలుగు పనులు చేయ గలం. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మెచ్చే మా కార్యకర్త లతో చర్చించి ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారాం.

మొన్నటి భూమా అఖిలప్రియ నుండి నేటి బుట్టా రేణుక వరకు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మారిన ప్రతి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే చెప్పిన మాటలే ఇవి. పార్టీ మారక ముందు ఓ మాట... పార్టీ మార్చాక ఇంకో మాట. అసలు వీళ్లకు అలా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుందో కూడా అర్ధం కాదు. రాజకీయ నాయకులకు రెండు నాల్కలు ఉంటాయ న్నది వీళ్లను చూసేనేమో! ప్రతిపక్షంలో వుంటే అభివృద్ధి చేయలేం... అధికార పార్టీలో వుంటేనే అభివృద్ధి చేయగలం అన్న నాయకులకు ఒకటే ప్రశ్న! పుచ్చలపల్లి సుందరయ్య ఎప్పుడు అధికార పార్టీలో వున్నాడు? వాజ్‌పేయి, అద్వానీ వంటి అగ్రనేతలు దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రతిపక్ష నేతలుగానే వున్నారు. అంతెందుకు దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అవడానికి ముందువరకు కూడా ఏ పార్టీ అధికారంలో వున్నా ప్రతిపక్ష నేత పాత్రనే పోషించాడు. అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నామని చెప్పుకుంటున్న నాయకులెవరు కూడా నియోజకవర్గ ప్రజల మీద ప్రేమతో పార్టీ మారడం లేదన్నది ప్రజలకు తెలిసిన నగ్నసత్యం. వాళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ప్యాకేజీలే అన్నది అందరికీ తెలిసిన నిజం. మన కళ్ళ ముందు ఒక నేరం జరిగింది. నేరం చేసిన వాడే కాదు, చూస్తూ దానిని అడ్డుకోని వాళ్ళు, కోర్టులో చూసింది చూసినట్లు చెప్పని వాళ్ళు కూడా దోషులే! భారత రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, న్యాయమూర్తులు... మరి ఇంతమంది ముందు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతూనే వుంది. ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళను ప్రలోభాలతో ఇంకో పార్టీలో చేర్చుకునే కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. దీనిని అత్యాచారమనాలో... వ్యభిచారమనాలో... పేరు ఏదైనా ఇదొక రాజకీయ నేరమే. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా నేరమే! మరి ఈ నేరాన్ని చూస్తూ కూడా అడ్డుకోలేని ఈ పెద్దలంతా దోషులే కదా!

ఒక పార్టీ టిక్కెట్‌ తెచ్చుకుని, ఆ పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే అధికార పార్టీలోకి దూకే ప్రజాప్రతినిధులను గతంలో ఆయారామ్‌, గయా రామ్‌లు అంటుండేవాళ్ళు. ఇప్పుడు పార్టీలు మార్చే వాళ్ళకు ఆ పేర్లు కూడా తక్కువేమో ననిపిస్తోంది. రాజకీయాలలో ఏ మాత్రం విలువలు, వ్యక్తిగతంగా మనస్సాక్షి అన్నవి వుంటే ఇంకో పార్టీలోకి మారాలనుకున్నప్పుడు ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి. రాజకీయాలలో అది విలువలకు నిదర్శనం. 2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో ఏ ఒక్కరు కూడా విలువలకు కట్టుబడి తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరలేదు. పదవులతో పాటే పార్టీ మారారు. ఇక వీళ్ళు ఎందుకు పార్టీ మారారు అనేం దుకు చాలా కారణాలుంటాయి. ఒక్కరోజు కూడా అధికారం లేకుంటే ప్రజాప్రతినిధులు నిలబడలేని పరిస్థితులొచ్చాయంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడే నాయకులే వుండరు. ప్రజాస్వామ్యానికి ఈ పోకడలు చాలా ప్రమాదకరం. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచనలు ఇంకా ప్రమాదకరం.

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాన్ని పనిగట్టుకుని నిర్వీర్యం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే ప్రజలే ప్రభుత్వం వైపు నిలబడతారు. ఆటో మేటిగ్గా ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనపడుతుంది. పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిష్టులు పాతికేళ్లు పాలించారు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా 4సార్లు అధికారంలోకి వచ్చింది. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సీఎంలు విజయాలలో హ్యాట్రిక్‌ సాధించారు. వీళ్లెవరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్యాకేజీల ఆశ పెట్టి తమ పార్టీలోకి లాక్కోలేదు. కేవలం మంచి పరిపాలన ద్వారా ప్రజలను తమ వైపుకు తిప్పుకునే విజయాలు సాధించారు.

కాని, దేశ చరిత్రలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పోకడలకు బాటలు వేసాడు. ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో వార్‌ను వన్‌సైడ్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ దేశ చరిత్రలోనే ప్రతిపక్షం నిర్వీర్యం కావడం అన్నది ఎక్కడా జరగలేదు. ఏ పార్టీ అయినా చరిత్ర గర్భంలో కలిసిపోవడం అన్నది ప్రజల చేతుల్లో పని. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పంథాలో నడుస్తున్నప్పుడు ప్రజలే ప్రతిపక్షమయ్యి పిడికిలి బిగిస్తారు. అవతల చచ్చు, పుచ్చు పార్టీలున్నా అధికారంలో కూర్చోబెడతారు. మూడేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలనే చూడండి... ఒక ప్రధాని, 20మంది కేంద్రమంత్రులు... పెద్ద ఎత్తున ప్రచారం... ఇన్ని చేసినా ఆమ్‌ ఆద్మీ చీపురు తుఫాన్‌లో బీజేపీ తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి నాయకులు పార్టీ మారి వచ్చినంత మాత్రాన ప్రతిపక్షం నిర్వీర్యం కాదు. ప్రజల అభిమానం పొందగలిగితే ప్రతిపక్షం దానంతట అదే బలహీన పడుతుంది.

trs tdpఓ పక్క కులాలను పక్కనపెట్టాలంటున్నాం, మతాలను మరచిపోదామంటున్నాం... ఇంకో పక్క చూస్తే దేశ రాజకీయాలను కులాలే శాసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ దాకా ప్రతి రాష్ట్రంలోనూ కులపోకడలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వాటి విజయావకాశాలు ఎక్కువుగా ఉండేవి. ఇప్పుడు రెండు బలమైన కులాలు కలిస్తే గెలుపు ఖాయమనే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దీనిని ప్రాక్టికల్‌గా విజయవంతం చేసి చూపించాడు చంద్రబాబునాయుడు. ఏపిలో రాజకీయంగా మూడు ప్రధాన అగ్రకులాలుంటాయి. రెడ్డి, కమ్మ, కాపు... ఈ మూడు కులాలలో ఏ రెండు కులాలు కలిస్తే వారికే అవకాశాలెక్కువుగా ఉంటాయి. గత ఎన్నికల్లో కమ్మ, కాపు కాంబినేషన్‌ కుదిరింది. పవన్‌ కళ్యాణ్‌ను గడ్డం పట్టుకునైతేనేమీ, కాపులకు రిజర్వేషన్లు, డిప్యూటీ సీఎం వంటివి ఎరవేయడం వల్లనైతేనేమీ చంద్రబాబు ఈ రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లయిన కాపుల మద్దతు పొందగలిగాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉందంటే అది కాపుల పుణ్యమే!

చంద్రబాబు ఇదే ఫార్ములాను రేపు తెలంగాణలోనూ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలంగాణలో తెలుగుదేశం ఎత్తిపోయింది. ముఖ్యమైన నాయకులందరూ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. రేవంత్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు వూరేగుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా చూడాలని, ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు ఆరాట పడుతున్నాడు. తెలంగాణలో ఇక అధికారం మీద ఆశ లేదు. మొన్న గ్రేటర్‌ ఎన్నికల్లోనే అది తేలిపోయింది. కనీసం పార్టీనన్నా నిలబెట్టుకోవాలి. ఇందుకోసం టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడా కులం ఈక్వేషన్స్‌ను తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ కాంగ్రెస్సే! ఆ పార్టీలో రెడ్లదే ఆధిపత్యం. టీఆర్‌ఎస్‌లో ఇప్పుడున్న రెడ్లు రేపు కాంగ్రెస్‌లోకి పోరనే గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి తెలంగాణలో రెడ్లకు పోటీగా బలమైన సామాజిక వర్గాలైన వెలమ, కమ్మలను ఒక గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఓ విడత చర్చలు కూడా జరిగాయి. ఈ రెండు కులాలను ఏకం చేసే ఆపరేషన్‌ బాధ్యతలను చంద్రబాబు చెక్కభజన మీడియాగా పేరుగాంచిన ఓ మీడియా సంస్థ అధినేతకు అప్పగించినట్లు తెలుస్తోంది.

cm chandraవలస వచ్చిన నాయకులు... అడ్డదారుల్లో పోగేసిన కోట్ల కొద్ది డబ్బు... అనుకూల మీడియా ప్రచారం... వచ్చే ఎన్నికలలోనూ తమను ఇవే గెలిపిస్తాయని చంద్రబాబు నమ్ముతున్నాడా? వచ్చే ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగాలి, ప్రతిపక్షం ఉనికి ఉండకూడదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు పైవాటిని బలంగానే నమ్ముతున్నట్లుగా వుంది.

ఏ ప్రభుత్వానికైనా లేదా ఏ నాయకుడిని చూసైనా ఓటేయాలంటే ఒక్కటైనా బలమైన కారణముండాలి. 1983లో కేవలం కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత, సినీ గ్లామర్‌ కారణంగా ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాడు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్‌ గెలుపుకు ఇవి దోహదపడలేదు. ఆ రెండేళ్లలో ఆయన రెండురూపాయల కిలో బియ్యంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసారు.రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎన్టీఆర్‌కు మళ్ళీ ఓట్లేసేలా చేసింది.

2004లో చంద్రబాబు వ్యతిరేకత మీద కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వై.యస్‌.రాజశేఖరరెడ్డి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్ట నన్ని ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయం బర్స్‌మెంట్‌, 108 అంబులెన్స్‌, పింఛన్‌లు, డ్వాక్రా ఋణాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం, సెజ్‌ల ఏర్పాటుతో విరివిగా ఉపాధి అవకాశాలు... ఇవన్నీ కూడా వై.యస్‌.కు ఓట్లు కురిపించాయి. 2009 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించాయి. అంతేకాదు, వై.యస్‌ అయిదేళ్ల పాలనలో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిన దాఖలాలు లేవు. వై.యస్‌. ఇంత చేసినా కూడా 2004తో పోలిస్తే 2009కి కాం గ్రెస్‌కు కొన్ని సీట్లు తగ్గాయి. గత మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా వై.యస్‌. చేసినంత అభివృద్ధి, అమలు చేసినన్ని పథకాలు ఇంకే ముఖ్యమంత్రీ చేయలేదు. ఆయన అంత చేస్తేనే సీట్లు తగ్గాయి. మరి ఇంతవరకు ఏమీ చేయని చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుంది?

ఈ మూడేళ్లలో ప్రజలు ఫలానా పథకం వల్ల ప్రయోజనం పొందారని చెప్పే పథకం ఒక్కటీ లేదు. ఏ పథకం మీద కూడా చంద్రబాబు బ్రాండ్‌ లేదు. తెలుగు దేశంకు అదనంగా ఓట్లు తెచ్చే ఒక్క స్కీంను కూడా కొత్తగా తేలేకపోయారు. గతంలో వై.యస్‌. ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లు కూడా అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం వల్ల కోట్లు పోతు న్నాయో గాని ఓట్లు రావు. ఈ రాజధాని ప్రజల సబ్జెక్ట్‌ కాదు. మా రాజధాని వాషిం గ్టన్‌లా ఉండాలని, సింగపూర్‌లా ఉండా లని ప్రజలు కోరుకోవడం లేదు. చంద్ర బాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి పని ఇదే! దీనివల్ల ఓట్లు రావడం మాటేమో గాని, రాజధాని రూపంలో భూములు కోల్పోయిన రైతుల ఓట్లు పోయే అవకాశా లున్నాయి. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సెజ్‌ల పేరుతో సాగిస్తున్న భూ దోపిడీ మూలంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంతేకాదు, గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఋణ మాఫీ వాగ్ధానం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. చంద్రబాబు అమలు చేసిన అరకొర ఋణమాఫీ వల్ల లాభపడ్డ వాళ్లకంటే ఆశపడి భంగపడ్డ వాళ్ళే ఎక్కువ! విఫలమైన ఋణమాఫీ విషయంలో చంద్రబాబుకు ఓట్ల నష్టం కలుగనుంది. డ్వాక్రా ఋణాల మాఫీని గాలిలో పెట్టడంతో మహిళలు వ్యతిరేక మయ్యారు. ఇక నిరుద్యోగ భృతి లేదు, కొత్తగా ఉద్యోగాలు లేవు. అన్నింటికి మించి చంద్రబాబే స్వయంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తుండడంతో యువతలో, నిరుద్యోగుల్లో తెలుగుదేశం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అన్నింటికి మించి విచ్చలవిడి అవినీతి, యధేచ్ఛగా తెలుగు తమ్ముళ్ళ దోపిడీ వంటివి కూడా తెలుగు దేశం ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టాయి.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపాకు మధ్య ఓట్ల తేడా కేవలం 5లక్షలే! ఈ మూడేళ్లలో వైకాపా నుండి ఎమ్మెల్యేలు, నాయకులు వచ్చి తెలుగు దేశంలో చేరారు. కాని వారితో పాటు పెద్దగా జనం రాలేదు. వీళ్ళ మూలంగా తెలుగుదేశంకు కలిసే ఓట్లు తక్కువ. కాని 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయ కత్వాన్ని, ఆయన అనుభవాన్ని, ఆయన సమర్ధతను నమ్మి ఉద్యోగులు, యువత, వ్యాపారులు, నిరుద్యోగులు, కాపులు, వైశ్యులు, బ్రాహ్మణులు తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు. 2014లో వైకాపాకు మద్దతుగా నిలిచిన ఓటర్లలో పెద్ద మార్పుం డదు. కాని తెలుగుదేశంకు ఓటేసిన వర్గాల ప్రజల్లో మాత్రం మార్పు ఉంటుంది. వారిలో సగం మంది చంద్రబాబును వ్యతి రేకిస్తే చాలు... అధికారం తలక్రిందులే!

చంద్రబాబు ప్రజాదరణ పొందే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో వై.యస్‌ సానుభూతి, తన ఆకర్షణ జగన్‌కు ప్రచారాస్త్రాలు కాదు... చంద్రబాబు వైఫ ల్యాలే జగన్‌ ఆయుధాలు!

Page 1 of 23

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter