03 June 2016 Written by 

అలరించిన ''నాటా''... ఆట - పాట - మాట..! అమెరికాలో ఆనంద సందడి

nata''నాట''(నార్త్‌ అమెరికా తెలుగు సమితి) 3వ ద్వైవార్షిక సమావేశాలు మే 27, 28, 29వ తేదీలలో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో డల్లాస్‌ నగరంలో ఘనంగా జరిగాయి. 27వ తేదీ సాయంత్రం 6గంటలకు బాంక్వెట్‌తో ప్రారంభమైన వేడుక 29వ తేదీ అర్థరాత్రి కోటి పాటల సందడితో ముగిసింది. 3రోజుల పాటు డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ ఆనంద వేడుకలో వేలాదిమంది తెలుగువాళ్ళు పాల్గొని మధుర జ్ఞాపకాలను మూటకట్టుకుని వెళ్ళారు.

ఈ మూడురోజుల పాటూ వ్యాపార సమావేశాలు, ఆత్మీయ సదస్సులు, సాహిత్య, సాంస్కృతిక, సంగీత వేడుకలతో పాటు యువ వేదికలు, పెళ్ళి చూపులు, రాజకీయ చర్చలూ, మీడియా మీట్‌లు, ఆథ్యాత్మిక ఉపన్యాసాలు వంటి అనేక కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. అమెరికా వై.యస్‌.ఆర్‌.గా అందరూ అపురూపంగా పిలుచుకునే మన నెల్లూరీయుడు నిడిగుంటపాళెం వాస్తవ్యుడు డా|| ప్రేమ్‌సాగర్‌రెడ్డి ఈ సమావేశాలకి రాయల్‌ స్పాన్సర్‌గా వుంటూ ఈ వేడుకలకి నాయకత్వం వహించాడు. సంబరాలకు స్థానికంగా సారధ్యం వహించిన గూడూరు రమణారెడ్డి, కోర్శపాటి శ్రీధర్‌రెడ్డిలు నెల్లూరీయులే కాగా, వీరితోపాటు కృష్ణపాటి రమణ, కోటంరెడ్డి విష్ణు, మండువ సురేష్‌, చిల్లకూరు గోపి, గోశాల రాఘవరెడ్డి, దువ్వూరు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏటుకూరు రఘురామిరెడ్డి, బొమళ్ళ జనార్ధన్‌రెడ్డి, సోమవరపు శ్రీనివాసులురెడ్డి, పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నూకలపాటి మధుసూదనరెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, పెన్నా మోహన్‌రెడ్డి, ప్రతీప్‌కుమార్‌రెడ్డి, మెట్టా ప్రభాకర్‌రెడ్డి, మెట్టా లచ్చారెడ్డి, బసిరెడ్డి ఉదయ్‌కిరణ్‌, వారణాసి ద్వారకా, చేవూరు సుజయ్‌రెడ్డి, గాలి శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇంకా అనేకమంది నెల్లూరీయులు ఈ ఆనంద సందడిని విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించారు. 'నాటా' అంటే నెల్లూర్‌ అమెరికన్స్‌ తెలుగు అసోసియేషన్‌ అనిపించే రీతిలో ఈసారి వేడుక జరగడం విశేషం.

ఆదివారం రోజు జరిగిన ''నేను... నా నెల్లూరు'' అనే నెల్లూరీయుల ఆత్మీయ సమావేశంలో సైతం అనేకమంది నెల్లూరీయులు పాల్గొన్నారు. డా|| ప్రేమ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి సన్నారెడ్డి, 'లాయర్‌' నిర్వాహకుడు తుంగా శివప్రభాత్‌రెడ్డి, శ్రీహరిరెడ్డి, పర్వతరెడ్డి బలరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రేమ్‌ సాగర్‌రెడ్డి తన స్వాగతోపన్యాసంలో ''ఏందబ్బయ్యా'' అంటూ నెల్లూరీ యులను పలకరిస్తూ తన ఊరు తన వారు అంటే తనకు ప్రాణమని, ఎప్పుడూ తన గ్రామానికి, తన వాళ్ళకీ మేలు చేయాలనే తపిస్తుం టానని అన్నారు. తమ సంస్థలో ఎక్కువ మంది నెల్లూరీ యులకు అవకాశం ఇవ్వాలన్నది తన ధ్యేయమని, అర్హత కలిగినవాళ్ళు అప్లై చేస్తే తప్పక వారికి ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తానని అన్నారు.

శ్రీసిటి ఎం.డి రవి సన్నారెడ్డి తన ప్రసంగంలో ఎక్కువ శాతం నెల్లూరీయులు తమ ప్రాంత అభివృద్ధికి చేయవలసిన కృషి గురించే మాట్లాడాడు. ఎన్నో రంగా లలో నిష్ణాతులుగా వున్న నెల్లూరీయులు బయట ప్రాంతాల్లో కోట్ల రూపాయలు సంపాదించి నెల్లూరుకు సంబంధించని ప్రదేశాల్లో పరిశ్రమలను, హోటళ్ళను, ఆసుపత్రులను స్థాపిస్తున్నారని, వీలయినంత మేరకు తమ జన్మభూమికి సేవ చేసే లక్ష్యంతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సైతం పెట్టుబడులు పెట్టి నెల్లూరుజిల్లా అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు ముఖద్వారంగా శ్రీసిటిని ఏర్పాటు చేయడం తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని, తన జన్మభూమి రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం తనకి కలిగిందని అన్నాడు. పరిశ్రమల ద్వారా అభివృద్ధికి దోహదపడదలచిన వారికి అన్ని వేళలా శ్రీసిటీ స్వాగతం చెప్తుందని ఈ సంద ర్భంగా అహ్వానం పలికాడు.

'నాటి నెల్లూరు... నేటి నెల్లూరు... రేపటి నెల్లూరు' అన్న అంశంపై శివప్రభాత్‌రెడ్డి ఇచ్చిన

ఉపన్యాసం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. నెల్లూరుకున్న చారిత్రాత్మక విశేషాలను వివ రించడంతో పాటు ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, కొత్తగా సంతరించు కుంటున్న మార్పులతో పాటు సంచలనాత్మకంగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి గురించి శివప్రభాత్‌రెడ్డి వివరించాడు. భవిష్యత్‌లో నెల్లూరు జిల్లాలో జరుగనున్న ప్రగతి, జిల్లా అభివృద్ధికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేస్తున్న కృషి తదితర అంశాలను వివరిస్తూ తమ జన్మభూమిని అభివృద్ధి చేసుకోవడానికి కేవలం పెట్టుబడులతోనే కాకుండా సేవాస్ఫూర్తితో కూడా యన్‌.ఆర్‌.ఐలు ముందుకు రావాలని, తాము పుట్టిన ఊరిలో గుడికో బడికో ఆసుపత్రికో మంచి నీటి ఎద్దడి నివారణకో లేక శ్మశాన ప్రాంగణానికో తమవంతు చేయూత నందించి పల్లెల అభివృద్ధికి దోహద పడాలని శివప్రభాత్‌రెడ్డి కోరాడు.

సేవా స్ఫూర్తితో ఇప్పటికే కోట్ల రూపాయలు దాన ధర్మాల రూపంలో అందించిన చిరస్మరణీయులైన దివంగత దానకర్ణుల స్ఫూర్తితో నేటితరంలో సేవలందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, దొడ్ల కుటుంబీకులు, అలాగే అమెరికాలో వుంటున్న ఎంతోమంది ప్రేరణతో సేవా పరిమళాలు వెదజల్లడానికి ముందుకు రావాలని శివప్రభాత్‌రెడ్డి పిలుపునిచ్చాడు.

అలరించిన నెల్లూరు కళాకారులు

శ్రీ కరతాళధ్వనులతో మార్మోగిన ప్రధాన వేదిక

శ్రీ సాయి హేమంత్‌కృష్ణకు ప్రశంసల వర్షం

వేణుగానమే ప్రాణంగా..అదే లోకంగా వుంటూ, ప్రత్యేకించి నాసిక (ముక్కు)తోనే అద్భుతంగా వేణుగానం వినిపించడంలో సిద్ధహస్తుడైన సాయిహేమంత్‌కృష్ణ అమెరికాలోని 'నాటా' వేడుకల్లోనూ పాల్గొని 'నాసికా వేణుగానం'తో అందరినీ ఉర్రూతలూగించాడు. నాటా వేడుకల సందర్భంగా ఎంతో వైభవంగా, భారీఎత్తున నిర్మించిన ప్రధాన వేదికపై నెల్లూరీయుని నాసికా వేణుగానం శ్రోతలను మైమరపింపజేసింది. వేణుగానం పూర్తవగానే అక్కడివారి కరతాళధ్వనులతో వేదిక మార్మోగింది. అద్భుతం..అమోఘం..శెభాష్‌ సాయిహేమంత్‌ అంటూ అందరూ అతనిని ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలుత బాంక్వెట్‌లోనూ, ఆ తర్వాత మెయిన్‌ డయాస్‌లోనూ, అనంతరం జరిగిన ఆధ్యాత్మిక సదస్సులోనూ, చివరికి ముగింపు సభలో కూడా సాయిహేమంత్‌కృష్ణ నాసికా వేణుగానం మార్మోగి పోయింది. అంతటి మహదావకాశం నెల్లూరీయునికి రావడం, తన అత్యద్భుతమైన కళతో అందరి మన్ననలందుకోవడం ఎంతో అభినందనీయం.

అద్భుతమనిపించిన.. నదియా నృత్యం

అదేవిధంగా నెల్లూరు నుంచి డల్లాస్‌కు వెళ్ళిన ప్రముఖ నాట్యకళాకారిణి 'నాట్యశిరోమణి' నదియా తన అద్భుతమైన నాట్యంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె నాట్యవైదుష్యానికి అందరూ పరవశించిపోయారు. విలక్షణమైన తన నాట్యంతో అమెరికాలోనూ అందరి ప్రశంసలు అందుకున్నది నదియా.

చివరిరోజు జరిగిన ముగింపు వేడుకలో ఆహుతులతో పాటూ తాను జతకలసి 'డాన్స్‌' చేసి తన నిరాడంబరతను, కార్యక్రమ విజయానికి అంతులేని తన ఆనందాన్ని ప్రదర్శించాడు డా|| ప్రేమ్‌రెడ్డి. మొత్తం కార్యక్రమానికి ఈ దృశ్యం హైలైట్‌గా నిలిచింది.

ఎ.కోదండరామిరెడ్డికి 'జీవనసాఫల్య పురస్కారం'

ఎక్కడో సముద్రతీరంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన వ్యక్తి..అనితరసాథ్యమైన కృషితో, పట్టుదలతో.. విశేష ప్రతిభా పాటవాలతో ఇంతింతై.. అం తంతై ఎదుగుతూ.. చలన చిత్ర సీమలో అద్వితీయమైన దర్శకు నిగా రాణించడం ఎంతో అరు దైన గొప్ప విషయం. అంతేకాదు, తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మందిని ఉత్తమ స్థాయి నటీ నటులుగా ఆయన తీర్చిదిద్దారు. ప్రేక్షకలోకంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సాధించుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయన అసమాన సేవలకు గుర్తింపుకుగా ఇటీవల ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 'నాటా' వేడుకల్లో ఆయనకు ఎంతో విశిష్టమైన జీవనసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

అంతటి ఘనకీర్తి సాధించినవారెవరో కాదు.. మన నెల్లూరీయుడు.. సినీ రంగంలో నెల్లూరుసీమ ఖ్యాతిని దశదిశలా చాటిన ప్రఖ్యాత దర్శకుడు.. మన కోదండ రామిరెడ్డి. ఏ.కోదండరామిరెడ్డి అంటే నంబర్‌-1 దర్శకుడనీ, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడనీ పేరు. మైపాడులో జన్మించి..నేడు అమెరికాలో ఉన్నతస్థాయి పురస్కారాన్ని అందుకున్న ఈ తరం మేటి దర్శకుడాయన. ఆయన నెల్లూరీయుడు కావడం..సింహపురి సీమకే గర్వకారణం. కేవలం ఇరవై ఏళ్ళ కాలంలోనే 75 సినిమాలకు దర్శకత్వం వహించాడాయన. ఒక్కమాటలో చెప్పాలంటే రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీరంగాన్ని ఏలినవాడా యన. 1980లో 'సంధ్య' సినిమాతో చిత్రసీమలో దర్శకునిగా ప్రవేశించిన కోదండరామిరెడ్డి 2009లో పున్నమినాగు సినిమా దాకా విలక్షణమైన, వినోదభరిత మైన.. సందేశాత్మకమైన, చిత్రాలెన్నిటికో దర్శకత్వం వహించారు. తీసిన ప్రతి సినిమా హిట్టే అనేవిధంగా, అనేక హిట్‌ సినిమాల దర్శకునిగా పేరొందారు. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి నటనా సామర్ధ్యానికి వేదికగా ఆయన చిరంజీవి హీరోగా తీసిన సినిమాలు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించాయి. చిరంజీవి నట జీవిత ప్రస్థానానికి కోదండరామిరెడ్డి సినిమాలు స్వర్ణసోపానాలయ్యాయంటే అతిశయోక్తి కాదు. 1983లో ఆయన రూపొందించిన 'ఖైదీ' సినిమా మెగాస్టార్‌ చిరంజీవికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు, న్యాయం కావాలి, రక్షకుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి..వంటి చిత్రాలతో చిరంజీవి సూపర్‌స్టార్‌గా... మెగాస్టార్‌గా ఎదిగారంటే, అందుకు దర్శకునిగా కోదండ రామిరెడ్డి కృషి ఎంతగానో వుందని వేరే చెప్పనక్కర లేదు. మరో హీరో నందమూరి బాలకృష్ణతో అనసూయమ్మగారి అల్లుడు, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు, అక్కినేని నాగార్జున హీరోగా తీసిన విక్కీ దాదా, ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి చిత్రాలు, హీరో వెంకటేష్‌తో తీసిన సూర్య ఐపిఎస్‌, పోకిరి రాజా వంటి చిత్రాలు సూపర్‌హిట్‌ చిత్రాలే.

నెల్లూరు సమీపంలోని ఇందుకూరు పేట మండలంలో వున్న సముద్రతీర గ్రామమైన మైపాడు ఆయన స్వగ్రామం. 1950 జులై 1న ఆయన జన్మించారు. మంచి దర్శకునిగా రాణిస్తూ..చిత్రసీమలో వాసికెక్కిన సినిమాలెన్నో తీసి, నెల్లూరుసీమ ఖ్యాతిని దశదిశలా చాటిన కోదండరామి రెడ్డి దర్శకత్వశ్రేణిలో తొలివరుసలో నిలిచారు. కోదండరామిరెడ్డికి భార్య భారతి, కుమారులు సునీల్‌, వైభవ్‌రెడ్డి వున్నారు. సునీల్‌ వ్యాపార రంగంలో స్థిర పడితే, వైభవ్‌ సినీరంగంలో హీరోగా 2007లో సొంత బ్యానర్‌తో 'గొడవ' సినిమాతో ప్రసిద్ధులయ్యారు. అత్యద్భుతమైన అనేక సినిమాలకు దర్శకత్వం వహించి, ఎందరో నటీనటులను చిత్రసీమకు పరి చయం చేసి.. తెలుగు సినిమా రంగంలో అపూర్వమైన..అద్వితీయమైన దర్శకునిగా పేరొందిన ఎ. కోదండరామిరెడ్డి ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో ఇటీవల జరిగిన 'నాటా' వేడుకల్లో 'జీవన సాఫల్య పురస్కా రాన్ని' అందుకోవడం...నిజంగా ఆయన జీవితానికి సాఫల్యం చేకూరినట్లే. దర్శ కత్వ ప్రతిభలో.. సినీ కళారంగంలో నెల్లూరిసీమ ప్రతిభాపాటవాలను చాటు తున్న ఎ.కోదండరామిరెడ్డికి నెల్లూరీయులందరి తరఫునా అభినందనలు. అమెరికా లోనూ 'నాటా' జీవనసాఫల్య పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా ఆ ప్రఖ్యాత దర్శకునికి 'లాయర్‌'.. హృదయపూర్వక శుభాభినందనలు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
 • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
  నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
 • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
  కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
 • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
  ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter