రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల దాకా ఎటువంటి పనులు లేవు. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి పనులు మొదలు కాకపోవడంతో చాలా మంది ఖాళీగా వున్నారు. దీనికి తోడు ఇసుక వేలంలో చాలా కాలం స్థబ్దత నెలకొనడంతో ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు, జేసీబీలు పని లేకుండా వుండిపోయాయి. కాగా, ఇటీవల మూడు, నాలుగు నెలల నుండి జిల్లాలో ముమ్మరంగా నీరు-చెట్టు పనులు మొదలయ్యాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వందకోట్లకు తక్కువ కాకుండా చెక్‌డ్యాంలు, ఇతర సాగునీటి నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పనులు మొదలు కావడంతో నిర్మాణ కూలీలకు గిరాకీ పెరిగింది. జేసీబీలు, ప్రొక్లెన్లకు డిమాండ్ వచ్చింది. మిషన్లు ఖాళీగా లేకుండా పనిలో పడ్డాయి. నెల్లూరులో డ్రైనేజీ పైప్‌లైన్, మంచినీటి పైప్‌లైన్ పనులు మొదలుకావడం, అదే సమయంలో అన్ని మండలాలలో నీరు-చెట్టు పనులు ప్రారంభించడంతో కూలీలు దొరకడమే కష్టమైంది. అయితే పనులు ముమ్మరంగా మొదలైన తరుణంలోనే పెద్దనోట్ల రద్దు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారింది. కూలీలకు ఇవ్వడానికి చిన్న నోట్లు లేకపోవడంతో వాళ్లు సరిగా పనులకు రాక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి బిల్లులు పెట్టాలనుకున్న కాంట్రాక్టర్లకు ఇది విఘాతంగా మారింది.
Published in
గ్రామసమాచారం
Tagged under
