25 November 2016 Written by 

మరో పెను విషాదం

train accidentవారి జీవిత ప్రయాణం అనుకోకుండానే ఆగిపోయింది.. గమ్యం చేరకుండానే ముగిసిపోయింది. అనేకమందిని నిద్రలోనే కబళించి మృత్యురాకాసి తన కర్కశత్వాన్ని చాటుకుంది. ఏమి జరిగిందో తెలుసుకునేలోగానే జరగకూడని దారుణమంతా జరిగిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసముద్రంలో ముంచివేసింది. దేశప్రజలకు తీరని వేదన కలిగించింది. ఇండోర్‌ నుంచి పట్నాకు వెళ్తున్న ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గమధ్యంలో కాన్పూర్‌కు సుమారు నూరు కిలోమీటర్ల దూరంలోని దేహత్‌జిల్లా పుఖ్రయా వద్ద ఘోరప్రమాదానికి గురైంది. దాదాపు 146 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ ప్రమాదం భారతీయ రైలు ప్రమాదాల చరిత్రలో మరో పెనువిషాదంగా నమోదైంది. అంతేకాదు, మరో 200 మందికి పైగానే ప్రయాణీకులు గాయాల పాలయ్యారు. రైలు పట్టాలు తప్పడంతో 14 బోగీలు పట్టాలు పట్టుతప్పి బోల్తా కొట్టాయి. వీటిలో కొన్ని బోగీలు తునాతునకలయ్యాయి. మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో చనిపోయినవారు చనిపోగా, చేతులు విరిగి కాళ్ళు తెగి.. అనేకమంది గాయాలతో విలవిలలాడారు. మృత్యువుకు గురైన వారి మృతదేహాలు నెత్తుటి చారికలతో చెల్లాచెదరుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులంతా గాఢనిద్రలో వున్నారు. చిమ్మ చీకటిలో.. వేకువన 3గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనతో ప్రయాణీకుల హాహాకారాలు.. ఆర్త నాదాలు మిన్నుముట్టాయి. కలదెలుసుకునేసరికి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ దుర్ఘటనలో దాదాపు 146 మంది ప్రయాణీకులు మృతిచెందడం అత్యంత బాధాకరం. తెల్లవారేసరికి వారి జీవితాలు తెల్లవారిపోవడం విషాదకరం. పట్టా విరగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించి వుంటుందని భావిస్తున్నా, కుట్ర కోణం లోనూ ఉన్నతాధికార యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. ఈ దుర్ఘటనకు అసలు కారణాలేమిటో దర్యాప్తులో నిర్ధారణ కావాల్సివుంది. ఈ దారుణానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఎంతో గట్టిగా చెప్పారు. ఆ దృఢత్వం ఏళ్లతరబడిగా లేనందువల్లే రైల్వేకి ఈ దురవస్థ దాపురించిందేమో!.. ఇప్పుడే కాదు, దేశంలో ఎన్నో ఏళ్ళుగా రైళ్ళ పట్టాలు ఎంతోమంది ప్రాణాలను బలిగొంటూనే వున్నాయి. గతంలోనూ అనేక ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌ విషయానికి వచ్చినా ఆ రాష్ట్రంలో ఇదేమీ మొదటిది కాదు. 1988లో కర్నాటక ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 75 మంది మృతిచెందారు. 1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాళిందీ ఎక్స్‌ప్రెస్‌ను, మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టడంతో నాలుగువందల మందిదాకా మరణించారు. 1996లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని డోనేంగడ్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ను ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొనడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఈ ప్రమాదం గత ఐదేళ్ళలో అతిపెద్ద రైలు ప్రమాదం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా రైల్వే భద్రతకు రైల్వేశాఖ నిరంతరం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ వుండడమే దురదృష్టకరం. ఎంతగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, తీసుకోవాల్సిన చర్యలు ఇంకా బోలెడన్ని మిగిలే వుంటున్నా యనేందుకు ఈ ప్రమాదమే ఒక తాజా ఉదాహరణ. మన భద్రతా వ్యవస్థలో లోపాల వల్లనే ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతూనే వున్నాయని, ప్రయాణీకుల భద్రత గాలిలో దీపంలాగే వుంటోందని ప్రయాణీకుల ఆవేదన. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్‌దే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. అయితే, ప్రయాణ భద్రతలో మనం ఇంకా ఎంతో వెనుకబడే వున్నాం. అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినా, ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రమాదాలు నివారించడంలో మన రైల్వేవ్యవస్థ ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతోంది. దాదాపు 160 ఏళ్లకు పైగా చరిత్ర వున్న మన రైల్వేవ్యవస్థ ఇప్పటికీ భద్రతా పరమైన లోపాలతోనే సతమతమవుతుండడం విచార కరం. రైలు పట్టాలను నవీకరించుకోవాలని, వ్యవస్థను ఆధు నీకరించుకోవాలని ప్రయాణీకుల భద్రత, శ్రేయస్సే లక్ష్యంగా గతంలో నిపుణులు చేసిన సిఫారసులు ఎన్నో వున్నా అవన్నీ అటకెక్కిపోతున్నాయే తప్ప ఆచరణలోకి రాకపోవడాన్ని ఏమనుకోవాలి?.. భద్రతా వ్యవస్థను మెరుగుపరచేందుకు గతంలో అనిల్‌ కకోద్కర్‌, శ్యాంపిట్రోడా నేతృత్వంలో రెండు వేర్వేరు కమిటీలు నివేదికలు సమర్పించినా అవన్నీ బుట్టదాఖలే కావడం విచారకరం. ఈ నేపథ్యంలో, మనమెక్కిన రైలు మనల్ని గమ్యం చేరుస్తుందో.. లేదోననే భీతితో.. అభద్రతతో ప్రయాణం చేయాల్సిరావడం ఎంత దురదృష్టకరం. ఇకనైనా, రైల్వేవ్యవస్థ మరింత అప్ర మత్తం కావాలి. ప్రయాణీకులను గమ్యం చేర్చే పట్టా లను ప్రాణప్రదంగా చూసుకునేందుకు తగిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి. అవసరమైన సిబ్బందిని తక్షణం నియమించుకోవాలి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సంయుక్తంగా కలసి, రైల్వేవ్యవస్థను ఒక భద్రమైన వ్యవస్థగా పరిపుష్టం చేయాలి. పట్టాలపై తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు, బోగీలు తప్పి బోల్తా కొట్టడాలు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్ళు ఢీకొట్టడాలు, రైళ్ళకు రైళ్ళే ఢీకొట్టుకోవడాలు వంటి అన్నిరకాల ప్రమాదాలను వెంటనే నివారించేందుకు కేంద్రం, రైల్వేశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

ఏదేమైనా..ప్రయాణం ప్రమాదంగా మారకూడదు. ప్రయాణీకుల గమ్యం..ఎప్పటికీ మృత్యుద్వారం కాకూడదు. రైలు పట్టాలు..ప్రాణాలు తీసే మృత్యువుకు రాస్తాలు కాకూడదు. అన్నిరకాల ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించినప్పుడే ప్రయాణీకుల భద్రతకు భరోసా వుంటుంది. ఆ దిశలో ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్నప్పుడే పట్టాలపై ప్రయాణం భద్రంగా సాగుతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter