Friday, 25 November 2016 13:26

నాయకులకు చిల్లర కష్టాలు

Written by 
Rate this item
(0 votes)

galpika''శ్రీ శ్రీనివాసం శ్రీ వేంకటేశం శ్రీ శ్రీనివాసం శితపారిజాతం'' తిరుమల కొండపై శ్రీవారి దివ్యనామస్మరణ మైకుల్లో మార్మోగుతోంది. సుప్రభాత సేవ ముగించుకుని విఐపి బ్రేక్‌ గ్రీవెన్స్‌కు రెడీ అయిన శ్రీవారు ఒక్కో భక్తున్ని పరిశీలిస్తున్నాడు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా తన హుండీలో 500, 1000 నోట్లు వేస్తుండడాన్ని చూస్తూ... మీ భక్తి పాడుకాను, మొన్నటి దాకా వంద రూపాయల నోటు తీసి భారంగా వేసేవాళ్లు... ఇప్పుడు 500, 1000నోట్లు లెక్కలేకుండా వేస్తున్నారు, నాకు మాత్రం చిల్లర అవసరం లేదనుకుంటున్నారా... నాకూ ఖర్చులుం టాయి. మా పద్మావతికి ఏదన్నా కొన్నివ్వాలిగా... చిల్లర వేయండిరా మీకు పుణ్యం ఉంటుంది... ఈ మోడీ పెద్దనోట్లు రద్దు సెగ నాకు కూడా తగిలిందని మనసులో అనుకోసాగాడు.

--------

హైదరాబాద్‌లోని హైటెక్‌రత్న చంద్రబాబు నివాసం. టీవీల్లో పెద్దనోట్ల రద్దు వార్తలను చూస్తూ చంద్రబాబు దిగులుగా కూర్చున్నాడు. పక్కన టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌, గాలి ముద్దుకృష్ణమనాయుడులు కూడా వున్నారు. అప్పుడే భువనేశ్వరీదేవి వచ్చి... ఏమండి దేవాన్ష్‌కు తినడానికి బిస్కెట్లు లేవు, బజారుకెళ్లి నాలుగు బిస్కెట్‌ ప్యాకెట్లు కొనుక్కురండి అని చెప్పింది. చంద్రబాబు ఆమె వైపు దీనంగా చూస్తూ... నా వద్ద జేబులో వంద రూపాయలు కూడా లేవు. జేబులో నేనెప్పుడూ డబ్బులు పెట్టుకోనని తెలుసుగా... నీ దగ్గర పోపుల డబ్బాలో ఓ వంద ఉంటే పట్టుకురా అని చెప్పాడు. ఆ మాటకు భువనేశ్వరీ దేవి... నా దగ్గరంతా వైట్‌ మనీనే... పోపుల డబ్బాలో బ్లాక్‌ మనీ ఏమీ లేదు అని చెప్పింది. దేవాన్ష్‌ హుండీలో ఏమన్నా చిల్లర ఉందేమో చూడు... అని చంద్రబాబు చెప్పాడు. దేవాన్ష్‌ పేరుతో వంద కోట్ల ఆస్తులు వ్రాసారు గాని, ఆ బుడ్డోడి హుండీలో ఎప్పుడన్నా ఒక్క రూపాయి బిళ్ల వేసారా? వంద కోట్ల కంటే ఈరోజు వంద రూపాయల అవసరమే ఎక్కువైంది. దేవాన్ష్‌ హుండీలో కూడా డబ్బులు లేవు, మీరేం చేస్తారో నాకు తెలియదు, బుడ్డోడికి ఆకలవుతుంది, నాలుగు బిస్కెట్‌ ప్యాకెట్లు తెప్పించండని ఆదేశించింది. అప్పుడు పక్కనే వున్న సోమిరెడ్డి వెంటనే తన జేబులో వున్న వంద నోటు తీసి... ఈ ఆపత్కాలంలో మిమ్మల్ని ఆదుకునే అవకాశం నాకివ్వండి, ఈ నోటు తీసుకోండి అని చేతిలో పెట్టాడు. ఇంట్లో పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో చంద్రబాబు ఆ నోటు తీసుకుని... మన పార్టీ నీతినిజాయితీలకు కేరాఫ్‌ అడ్రస్‌ వంటిది, మన పార్టీలో ఎవరి వద్దా బ్లాక్‌మనీ లేదుగా? అని ప్రశ్నించాడు. అందుకు సోమిరెడ్డి... ఉంటేగింటే మన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దగ్గర ఉండొచ్చన్నాడు. ఆ మాటకు చంద్రబాబు ఆశ్చర్యంతో... ఆయన వద్ద బ్లాక్‌ మనీ ఉందని ఎలా చెప్పగలరు అని అడిగాడు. పార్టీలో అందరికంటే బ్లాక్‌గా ఉండేది ఆయనే! కాబట్టి ఆయన వద్ద వుండే మనీని బ్లాక్‌ మనీనే అంటారుగా అని చెప్పాడు. నీ తెలివి తెల్లారినట్లేవుంది... నల్లగా ఉండే వాళ్ల దగ్గర ఉండేది నల్లడబ్బు, తెల్లగా ఉండే వాళ్ల దగ్గర ఉండేది తెల్లడబ్బు కాదు. ఆదాయ పన్ను పరిధిలోనికి రాని డబ్బును నల్లడబ్బు అంటారు... అయినా ఆ లెక్కలు నీకు తెలియదులే, బయటకెళ్లి బిస్కెట్‌ ప్యాకెట్లు తెచ్చుకుందాం పదండి అంటూ లేచాడు.

--------

లోటస్‌ పాండ్‌లోని ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇల్లు. హాల్‌లో విజయమ్మ సోఫాలో కూర్చుని ఉండగా జగన్‌, భారతిలు నిలబడి ఉన్నారు. విజయమ్మ ఉండి... ఏందిరా ఈ పరిస్థితి, జీవితంలో ఎప్పుడన్నా చూసామా, ఆ తెలుగుదేశం వాళ్లేమో నోరు తెరిస్తే లక్ష కోట్లు అవినీతి అంటారు, ఇంట్లో చూస్తే పప్పులుసు చేద్దామంటే కందిపప్పు లేదు, దాంట్లోకి చింతపండు, కారం, పసుపు, ఉప్పు లేవు. స్కూల్‌కెళ్లిన పిల్లలకు క్యారేజీ పంపాలి, వాటితో పాటూ స్నాక్స్‌ కొనాలి. ఇంట్లో చూస్తే వంద రూపాయలు చిల్లర లేదు అని అంది. అందుకు, భారతి... ఈ పరిస్థితి వస్తుందని ఊహించామా ఏంటత్తయ్య... ఊహించివుంటే కనీసం రెండు వేలకు వందనోట్లన్నా జాగ్రత్త పరచి ఉండేదాన్ని, అప్పటికీ చిల్లర వస్తుం దేమోనని చెప్పి పొద్దున సాక్షి పేపర్‌ కలెక్షన్‌ కోసం బాయ్స్‌ను పంపించాను, అందరూ వెయ్యి నోట్లే ఇచ్చారని అంది. అప్పుడు జగన్‌... నువ్వేమీ బాధపడకమ్మా... ఇప్పుడే ఏటిఎంకు వెళ్లి చిల్లర తీసుకొస్తాను అంటూ లేచాడు.

---------

అది తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాసం. కేసీఆర్‌, కేటీఆర్‌లు అప్పుడే నిద్ర లేచి వచ్చి పేపర్‌లు చదువుతున్నారు. అమ్మా... కాఫీ అంటూ కేటీఆర్‌ కేకేసాడు. వాళ్లమ్మ లోపల నుండి వచ్చి... కాఫీ అని కేకలేస్తే సరిపోతుందా? ఇంట్లో కాఫీ, టీ పొడి వుందా లేదా, పాలున్నాయా లేదా అని చూసుకోవద్దా... ఇంట్లో అవేమీ లేవు. అవి తెస్తేనే మీకు కాఫీ అని చెప్పింది. నాన్న మీ దగ్గర రెండొందలు చిల్లర వుంటే ఇవ్వండి... బజారుకెళ్లి పాలు, కాఫీ పొడి తెస్తానన్నాడు కేటీఆర్‌. ఆ రెండొందలే వుంటే రాత్రి నేను మందులు తెచ్చుకునేవాడిని అవి లేకే ఏడుపంతా అని కేసీఆర్‌ సమాధానమిచ్చాడు. మార్కెట్‌లో చిల్లర దొరకడం లేదు నాన్న... వెయ్యి, 500నోట్లు ఎవరూ తీసుకోవడం లేదు, ఇంట్లో చిల్లర ఖర్చులకు డబ్బులు కూడా లేవని కేటీఆర్‌ అన్నాడు. నువ్వేం దిగులు పడకు బిడ్డా... మన కూలీ స్కీం వుంది కదా... అమీర్‌పేటకు పోయి కూలి పనులు చేద్దాం... వాళ్లే చిల్లర ఇస్తారు అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ను తీసుకుని అమీర్‌పేటకు వెళ్లాడు. అక్కడ కొన్ని షాపుల వద్ద అబ్బా, కొడుకులు కలిసి మూటలు మోసి తమకు కూలీగా షాపుకు వంద రూపాయల లెక్కన ఇమ్మన్నారు... ఆ షాపుల వాళ్లు... సార్‌, వంద రూపాయలిచ్చి మిమ్మల్ని చిన్నబుచ్చ లేము... అందుకే షాపుకు వెయ్యి లెక్కన ఇస్తున్నామంటూ అందరూ వెయ్యి నోట్లు ఇచ్చారు. దాంతో కేసీఆర్‌, కేటీఆర్‌లు నోర్లు తెరిచారు.

------------

ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాసం. వెంకయ్యనాయుడు ఓ ఇన్‌లాండ్‌ లెటర్‌ తీసుకుని చాలా సీరియస్‌గా లెటర్‌ వ్రాస్తున్నాడు.

ప్రియాతి ప్రియమైన ముద్దుల కూతురు

దీపమ్మకు,

మీ తండ్రి దీవించి వ్రాయునది...

జీవితంలో ఇలాంటి రోజు ఒకటొస్తుందని, నీ సాయాన్ని అర్ధించాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పటి దాకా నా జీవితం ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు. కాని నిన్న రాత్రి ఒక చపాతి తిందామని చూస్తే నా దగ్గర గాని, ఓఎస్‌డి సత్య వద్ద గాని చిల్లర డబ్బులు లేవు. మంచినీళ్లు తాగి పడుకున్నాను, జీవితంలో తొలిసారిగా డబ్బులు, అది కూడా వంద నోట్లు సంపాదించుకుని వుంటే ఎంత బాగుండుననిపించింది. కప్పు కాఫీకి కూడా నా దగ్గర చిల్లర లేదు. సాయం అనుకుంటావో, ఋణమే అనుకుంటావో... నీ ఇష్టం. ఈ లేఖ చేరిన వెంటనే నాకు 100నోట్లు ఓ పాతిక సీల్డ్‌ కవర్‌లో పెట్టి కొరియర్‌లో పంపించగలవు. ఈ తండ్రి నీ నుండి ఇంతకంటే ఏమీ ఆశించడు... ఉంటాను తల్లి...

ఇట్లు,

మీ ముద్దుల తండ్రి వెంకయ్య.

----------

ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, సురేష్‌ ప్రభు, సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌లు పెద్దనోట్లు రద్దుపై టీవీ ఛానెల్స్‌లో వస్తున్న వార్తలను చూస్తున్నారు. ఒక్కో బ్యాంకు ముందు నాలుగైదు కిలోమీటర్ల పొడవున క్యూలున్నాయి. నరేంద్ర మోడీ ఆ 'క్యూ'లను చూపిస్తూ... చూసారా నా దెబ్బకు నల్లకుబేరులు డబ్బులు కట్టడానికి ఎలా 'క్యూ'లైన్లలో నిలబడ్డారో అని అన్నాడు. అందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌... వాళ్లు నల్ల కుబేరులు కాదు సార్‌, చిల్లర నోట్లు తీసుకోవడానికి రోజుల తరబడి ఎండకు, గాలికి క్యూలలో నిల్చుని నల్లబడిన అమాయకులు అని చెప్పాడు. అవునా అంటూ... మోడీ నోరు తెరిచాడు.

Read 204 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter