10 December 2016 Written by 

నింగికెగసిన నిప్పుకణం

jayaఒక వీరవనిత..మౌనంగా..ధీరగంభీరంగా ఆకాశంవైపు అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది. అవలీలగా అవనిని దాటుకుని ఆవలితీరాలకు మళ్లిపోయింది. మహోజ్వల జ్వాలగా ఎగిసిన ఒక నిప్పుకణం..మండుతూనే నింగికెగిసి శూన్యంలో కలసిపోయింది. ఒక ధృవతార..నిశ్శబ్ధంగా నేల రాలిపోయింది. ఏటికెదురీది నిలిచిన ఆ అసాధారణ మహిళ..సవాళ్ళకే సవాల్‌ విసిరే పోరాటయోధురాలు.. ఏళ్ళతరబడి అలుపెరగక అవిశ్రాంతంగా పోరాడిన విప్లవనాయకి..విశ్రమించింది. జీవితంలోనూ, రాజకీయాల్లోనూ ఎన్నెన్నో పోరాటాలు చేసిన ఆ ధీరవనిత..శాశ్వత నిద్రలోకి నిష్క్రమించింది.

అమ్మ.. ఇక లేరు. అమ్మ..అస్తమించింది.

తమిళనాట మహారాణిగా అవతరించి.. తన అపారమైన సేవలతో తమిళ ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా ప్రకాశించిన 'అమ్మ'..అన్నా డిఎంకె అధినేత్రి..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రఅస్వస్థతతో..గుండెపోటుతో తనువు చాలించారు. దాదాపు 70రోజులుగా ఆమె మృత్యువుతో పోరాడారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 5వ తేది రాత్రి 11.30 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పక్కరోజున ఎంజిఆర్‌ సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు జరిగాయి. జయలలిత మృతితో దేశప్రజలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వీరనారిని తలచు కుని కంటతడిపెట్టారు. అమ్మ..ఇక లేదనే బాధతో తమిళనాడు భోరుమని విలపించింది. తల్లిని కోల్పో యిన పిల్లల్లా తమిళ ప్రజలు విలవిలలాడిపోయారు. ఆమె అంత్యక్రియలకు లక్షలాది ప్రజలంతా కన్నీటితో తరలిరావడంతో మెరీనాబీచ్‌ కన్నీటి సంద్రమే అయింది. అంతటి ప్రజాభిమానాన్ని మూటగట్టుకుని, దేశప్రజలకు..ముఖ్యంగా తమిళప్రజలకు తీరని శోకం మిగిల్చి.. ఇక ఏ శోకాలూ.. శాపాలూ లేని సామ్రాజ్యా నికి అధిదేవతగా వుండేందుకు... 'అమ్మ' అదే ధీరగంభీరంతో వెళ్ళిపోయింది. ఈ లోకానికే.. ఇక సెలవంటూ తరలిపోయింది.

జీవితంలో ఎన్నో పార్శ్వాలుంటాయి. జయలలిత జీవితంలోనూ అంతే. పుట్టినప్పటినుంచీ ఎన్ని కష్టాలెదురైనా చివరికి అన్నిటిలోనూ స్వయంకృషితో విజయమే సాధించింది. పదోతరగతి చదువుతూ రాష్ట్రంలోనే ఫస్ట్‌గా నిలచింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగింది. సినీరంగంలో ప్రముఖనటిగా రాణించింది. రాజకీయరంగంలో మహారాణిగా నిలచింది. కృషి, పట్టుదల, అంతులేని ఆత్మవిశ్వాసం, ఎన్నెన్ని సవాళ్ళు..సమస్యలు.. అడ్డంకులెదురైనా సరే..ధీటుగా ఎదుర్కోవడం..మున్ముందుకు సాగిపోవడమే ఆమె నైజం. ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆ పోరాటంలో అపజయం ఎదురైనాసరే.. తలవంచే తత్వం అసలే వుండదు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధించేదాకా పోరాడుతూనే వుండడమే కర్తవ్యం. అలాంటి ధీరలక్షణాలన్నీ పుష్కలంగా వున్న ధీమణి..మహిళామణి జయలలిత. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచీ ఆమె మనస్తత్వం అంతే. పట్టుదలకు ఆమె మారుపేరు. ఎంజిఆర్‌ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి, ఆయన మరణం తర్వాత సొంతపార్టీలోనే అవమానాలు ఎదురైనా సహించారు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో నిలచి గెెలచి..తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా తన సత్తా చూపారు. అంతేకాదు, అప్పట్లో అధికారపక్షంగా వున్న డిఎంకె చేతుల్లో ఎన్నో అవమానాల పాలైనా.. నిండుసభలో పరాభవం ఎదురైనా..ఇక ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానంటూ శపధం చేసి వెళ్ళి పోయి.. చివరికి అన్నంత పనీ సాధించి.. 'జయ' అంటే ఏమిటో నిరూపించుకున్నారు.అంతటి ధీరోదాత్త.. వీరనారీమణి ఆమె. అవినీతి- అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్లినా సంయమనం కోల్పోకుండా..పాలనపై ఏమాత్రం పట్టుతగ్గిపోకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. విశిష్టమైన వ్యక్తిత్వం..విలక్షణమైన మనస్తత్వం.. అన్నిటికీ మించి అసాధారణ నాయకత్వ పటిమ..ఆమెను అత్యున్నతశిఖరాలకు చేర్చాయి. అటు సినీరంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తిరుగులేని నాయకిగా వుండడం ఎంతో అరుదు..ప్రజాసేవారంగంలోనూ ఆమె సాధించిన స్థానం మరెవరికీ రానుగాక రాదు. ఎన్నెన్నో ప్రజాకర్షక పథకాలను అమలుచేసి తమిళప్రజల గుండెల్లో దేవతగా నిలిచారామె. కడుపారా అన్నం పెట్టే 'అమ్మ'గా ఆమె అందరికీ ఆత్మీయులయ్యారు. అత్యంత తక్కువ ధరకే పేదలకు అన్నంపెట్టే అమ్మ క్యాంటీన్స్‌ దగ్గర నుంచి అన్నివర్గాల ప్రజలసంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అమ్మ వాటర్‌, అమ్మ ఇళ్లు.. అమ్మ ల్యాప్‌టాప్స్‌, అమ్మ బేబీ కిట్స్‌, అమ్మ సీడ్స్‌, అమ్మ ఫార్మసీస్‌, అమ్మ కాల్‌ సెంటర్స్‌, అమ్మ మ్యారేజ్‌హాల్స్‌ ఇలా ఎన్నెన్నో.. అన్నీ ప్రజల గుండెలకు హత్తుకు పోయాయి. కోట్లాది ప్రజలు ఆమెకు అభిమానుల య్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక సంచల నాత్మక నాయకురాలిగా, ప్రజాహృదయనేతగా ఆమె భారతదేశ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. ఒక నిత్యచైతన్యకెరటంగా..ధీరోదాత్త పోరాటయోధురాలిగా.. అత్యంత సాహసికురాలిగా..మహానాయకురాలిగా, ప్రజలంతా ఆదరించే ఆదర్శమహిళగా.. 'అమ్మ'గా తన జీవితాన్ని చరితార్ధం చేసుకున్నారు. జీవిత వారాశిలో ఎక్కడో పుట్టి..మహోధృత తరంగమై లేచి..పోరాటాల పెనుగాలి తాకిడికి ప్రభంజనమై వీచి..ఉరకలు పరుగులతో..పడుతూ..లేస్తూ చివరికి అలసిపోయిన కెరటం మెల్లిగా కడలిగర్భంలోనే కలసిపోయినట్లు.. ఆమె చివరికి మృత్యుఒడిలోకి ఒరిగిపోయారు.

తమిళనాట రాజకీయాలనే శాసించిన అమ్మ.. సకలజన హృదయాల్లో చైతన్యకిరణమై వెలిగిపోయిన అమ్మ.. మృత్యువుతో కూడా కడదాకా అలుపెరుగని పోరాటమే చేసింది. అందుకే.. ఆ మహానేత.. ప్రజలందరి హృదయాల్లో 'అమ్మ'గా.. ఒక దేవతగా నిలచిపోయింది. మెరీనాబీచ్‌ కన్నీరుపెడుతుండగా ఆశేష ప్రజల అశ్రునయనాల మధ్య ఆమె శాశ్వతంగా నిష్క్రమించినా.. ఆమె పోరాటస్ఫూర్తి.. ఆ ధీర గుణం, ఆ ప్రజా సేవానురాగం మాత్రం.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచే వుంటాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter