23 December 2016 Written by 

ఉగ్రరక్కసికి ఉరే సరి!

terrorతమ ఘాతుకాలతో ఎందరి కుత్తుకలు కోశారో..ఎన్ని కుటుంబాల కన్నీళ్ళతో వారి నెత్తుటిదాహం తీర్చుకున్నారో..ఎంతెంతమంది అమాయకుల ప్రాణాలు బలితీసుకుని వికటాట్టహాసాలు చేస్తున్నారో!..వీరి దారుణ మారణకాండలకు ఎన్నో కుటుంబాలు నిత్యశోకంతో..తీరని వేదనతో కుమిలిపోతూనే వున్నాయి. అలాంటి ఉగ్రభూతాలకు గుణపాఠంగా, బాధితులకు ఊరటనిచ్చేవిధంగా న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు ఎంతో చరిత్రాత్మకమైనది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సుమారు మూడేళ్ల క్రితం బాంబు పేలుళ్ళ ఘటనతో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాద ముష్కరులకు ప్రత్యేకన్యాయస్థానం మరణదండన విధించింది. తద్వారా న్యాయదేవత తన విశిష్టతను మరోసారి చాటుకుంది. మానవత్వానికి శత్రువుగా మారి, శాంతికి విఘాతం కలిగిస్తూ..అనేకమంది అమాయకుల ప్రాణాలను హరిస్తూ దేశంలో హింసలతో ధ్వంసరచన గావిస్తున్న ఉగ్రరాకాసులకు ఈ తీర్పు గుణపాఠమని చెప్పక తప్పదు. విధ్వంసాలు, ఘాతుకాలతో అమాయకుల ఉసురుతీసే ఉగ్రవాద ఘాతుకులకు సరైన శిక్షే పడిందన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. భారత్‌లో మారణహోమాలు సృష్టించి నెత్తురుటేరులు పారించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) కు చెందిన ఉగ్రవాదులకు ఉరిశిక్షే సరైనదని ప్రత్యేక కోర్టు నిర్ధారించడంతో, ఆ ముష్కరుల అమానుషాలకు బలైనవారి కుటుంబాలకు కాస్తంత ఊరట కలిగిం చింది. 2013 ఫిబ్రవరి 1వ తేదిన దిల్‌సుఖ్‌నగర్‌లో పేలిన బాంబుపేలుళ్ళు ఒక నిండుచూలాలి కడుపులోని శిశువుతో సహా 18 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘోరదుర్ఘటనలో మరో 131 మంది అమాయకులు గాయాలతో విలవిలలాడిపోయారు. ఈ విషాదానికి దేశం చలించిపోయింది. ఈ మారణహోమం సృష్టిం చిన ఆ అయిదుగురు ముష్కరులకు కోర్టు ఉరిశిక్షలను ఖరారు చేసింది. ఆ మేరకు చర్లపల్లి కేంద్ర కారాగారం లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు వుండగా, ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ మాత్రం పరారీలో వున్నాడు. పాక్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడ్డారని ఎన్‌ఐఏ తన దర్యాప్తులో పేర్కొంది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో అయిదుగురికి ఉరిశిక్ష పడగా, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. ఈ జంటపేలుళ్లకు మూల కారకుడైన రియాజ్‌ భత్కల్‌ పరారీలో వున్నాడని, బహుశా పాక్‌లోనే అతను తలదాచుకుని వుంటాడని భావిస్తున్నారు. గతంలో భారత పార్లమెంట్‌ మీద దాడి చేసిన కేసులో అఫ్జల్‌గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్‌లో నక్కి వున్న ఉగ్రముష్కరులు పదేపదే ప్రకటించివున్న నేపథ్యంలో, ఆ తరువాత కొద్దికాలానికే దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్ళు జరగడం అందరికీ తెలిసిందే. ఈ దారుణాలకు మూలకారణం ఐఎం ఉగ్రవాద సంస్థే. 2006లో వారణాసిలోను, ముంబైలోనూ వరుస పేలుళ్ళతో అది దేశాన్ని అల్ల కల్లోలం చేసింది. 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కులలో జరిగిన ఘాతుకాలు కూడా ఐఎం ఉగ్రవాదమూకలవే. అంతేకాదు, 2008లో జైపూర్‌లోను, అహ్మదాబాద్‌లోను, ఢిల్లీలోనూ మారణహోమాలు సృష్టించింది. 2010లో పుణే లోను, బెంగళూరు, మళ్ళీ ఢిల్లీ-వారణాసిల్లోనూ ఉగ్ర కోరలు సాచి ఎందరో అమాయకుల ప్రాణాలు తీసింది కూడా ఈ ఉగ్రవాద సంస్థే. 2011లో మరోసారి ముంబైలోను, 2012లో పుణేలోనూ ఐఎం ఘాతుకాలు మరెంతో ఘోరమైనవి. ఇలాంటి ఉగ్రవాదమూకలకు ఆశ్రయమిచ్చి ప్రోత్సహిస్తున్నది పాకిస్తానేనని ప్రత్యేకించాల్సిన అవసరం లేదు. అలాంటి ఉగ్రరాక్షసులకు ఇప్పుడు ఈ కేసులో సరైన శిక్ష పడడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేకించి ఎన్‌ఐఏ అధికారులు, వారి సిబ్బంది, దర్యాప్తు బృందం అంతా సమిష్టిగా పనిచేయడం వారి దీక్షాదక్షతలకు నిదర్శనమనే అనవచ్చు. అధికారుల నిరంతర కృషి వల్లే దిల్‌సుఖ్‌నగర్‌లో దాడులు చేసిన ఉగ్రముష్కరులకు కఠినదండన విధించడం సాధ్యమైందనే అనుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి 459 మంది సాక్షులను విచారించడం, 152 డాక్యుమెంట్లు పరిశీలించడం, దాదాపు 200 ఆధా రాలను సేకరించడమంటే మాటలు కాదు. వీటి వెనుక ఎంతో కృషి, వుంది. న్యాయస్థానానికి సమగ్రమైన దర్యాప్తు నివేదికను అందించడంలో ఎన్‌ఐఏ చేసిన బృహత్తరప్రయత్నం ఎంతైనా మెచ్చుకోదగ్గది.

అయినా, ఉగ్రవాదమన్నది అంత సులభంగా సమసిపోయేది కాదు. నెత్తురు రుచిమరిగిన ఉగ్రవాద రక్కసి ఎల్లవేళలా పొంచి వుంటూనే వుంటుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా తన కోరలు చాస్తూనే వుంటుంది. నిఘా సంస్థలు క్షణం కూడా ఏమరుపాటు లేకుండా పనిచేయడమే కాక ప్రజలు కూడా ఎల్లవేళలా ఇలాంటి ముష్కరుల పట్ల అప్ర మత్తంగా వుండాలి. శాంతికి సహనానికి ఆలవాలమైన మన భారతదేశంలో దారుణ మారణకాండలు సాగించే ఉగ్రవాద రక్కసికి ఎలాంటి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా అందరూ అప్ర మత్తం కావాలి. అచంచలమైన దేశభక్తితోనే ఇలాంటి ఉగ్రవాద మూకలను తరిమికొట్టడం సాధ్యమవుతుంది. ఉగ్రవాదాన్ని తుదకంటా తుదముట్టించేందుకు అందరూ సమాయత్తమైనప్పుడే ఉగ్రరక్కసి వికృతకృత్యాలు సమసిపోతాయి. అందుకు ప్రభుత్వాలు-ప్రజలు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి. శాంతియుతమైన మనదేశాన్ని ఉగ్రవాదభూతాన్నుంచి రక్షించుకోవాలి. ప్రత్యేకించి ఈ తీర్పు ఉగ్రరాకాసులకు గుణపాఠం కావాలి. అయితే, నిబం ధనల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సివుంటుంది. అయినా, ఉన్నత న్యాయస్థానాల్లోనూ ఈ కేసు త్వరలోనే ఒక కొలిక్కివస్తుందని భావిద్దాం!..ఉగ్రభూతాలకు కఠినశిక్షలు ఖరారు కావాలని ఆశిద్దాం!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter