23 December 2016 Written by 

అమ్మ జీవితం హిస్టరీ... మరణం మిస్టరీ !

jayalalithaఈ భూమ్మీద పడ్డ తొలిరోజుల్లో జయరామన్‌ కోయల వల్లి... పసిప్రాయంలో సినిమాల్లో చేరాక జయరామన్‌ జయలలిత... సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక పురచ్చితలైవి జయలలిత... తమిళనాడు సిఎం అయ్యి అనేక ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టాక అమ్మ జయ లలిత... మనిషి ఒక్కరే, కాని పేర్లు మారాయి. పదవులు మారాయి. ప్రజల మనసుల్లో, ఆలోచనల్లో, వారి భావాల్లో ఆమె స్థానం మారుతూ వచ్చింది. ఒక భర్తకు భార్య కాలేకపోయినా, ఒక బిడ్డకు అమ్మ కాలేకపోయినా కోట్లాదిమంది ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్న భాగ్యం బహుశా చరిత్రలో మథర్‌థెరిస్సా తర్వాత జయలలితకే దక్కిందేమో! జయలలిత... ఒక పేరు కాదు ఒక చరిత్ర! నడిచిన చరిత్ర... నడుస్తున్న చరిత్ర కూడా!

నిజంగా ఆమె జీవితం ఒక హిస్టరీనే! ఎందుకంటే ఆమె తండ్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూలా ప్రధా ని కాదు, షేక్‌ అబ్దుల్లాలా ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఆమెకు రాజకీయ నేపథ్యం వారసత్వంగా రాలేదు. ఫ్రీగా రాలేదు. పోరాడితే వచ్చింది. ఆమె తన జీవితంలో తండ్రి ఎలా ఉంటాడో చూడలేదు. అలాగే బిడ్డనూ చూసే అదృష్టం దక్కలేదు. కాబట్టి ఆమె జీవితంలో ఆ రెండుపాత్రలకు స్థానం లేకుండా పోయింది. తన వ్యక్తిగత జీవితంలో ఆమె అతి దగ్గరగా చూసిన పాత్ర అమ్మ. ఆ పాత్ర నుండే ఆమె ప్రేమను పొందింది. అందులోని మాధుర్యాన్ని చవిచూసింది. కాబట్టే తన జీవితంలోనూ అమ్మపాత్రను అద్భుతంగా మలచుకుని కోట్లాదిమందికి 'అమ్మ'లా మారింది. తన సినిమా, రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినా, ఆమెకు మిగిలింది, ఆమె జీవితానికి పరిపూర్ణత చేకూర్చింది ఆమె కనుమూసిందని తెలియగానే అమ్మా, అమ్మా అంటూ రోదించిన కోట్ల గొంతుల్లోని వేదనలే!

తన జీవితాన్నే ఒక హిస్టరీగా మలచిన ఈ 'అమ్మ' మరణం మిస్టరీ కావడం విశేషం. చావుపుట్టుకలు మానవజీవితంలో సహజమే అయినా ఆమె మరణంలోని కొన్ని అసహజ సంఘటనలే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆమె మరణంపై అనుమానాలు లేవనెత్తుతూ కొందరు ఏకంగా ప్రధానమంత్రికే లేఖలు వ్రాసే స్థాయికి పరిస్థితి చేరింది. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరిన మనిషి మృతదేహంగా బయటకు రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ఉగ్రవాద ఘాతుకానికి బలయ్యారు. వై.యస్‌.రాజశేఖరరెడ్డి లాంటి నేత హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఇవి వూహించని మరణాలు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించడం వేరు. క్యాన్సర్‌ లాంటి వైద్యం లేని వ్యాధులతో మరణిస్తే ఆ సంగతి వేరు! కాని జయలలిత విషయం అది కాదు. ఆమె మరణంలో బి.పి, షుగర్‌లు ప్రధానపాత్ర పోషించాయి. ఇవి కంట్రోల్‌లో లేకపోవడం వల్లే ఆమెలో మూత్రపిండాలు, కిడ్నీ, కాలేయం వంటి సమస్యలు ఉత్పన్న మయ్యాయి. ఆసుపత్రిలో వుండగా తీవ్రమైన గుండెపోటుకు కారణం కూడా షుగర్‌, బిపిలే! మరి ఒక ముఖ్యమంత్రికి బి.పి, షుగర్‌లు కంట్రోల్‌ చేయలేనంతగా తమిళనాడు ప్రభుత్వ వైద్య విభాగం అధ్వాన్నస్థితిలో వుందా? లేక ఎవరైనా కావాలనే ఆమెలో బి.పి, మధుమేహం స్థాయిని పెంచారా? ఇవి సమాధానాలు చిక్కని ప్రశ్నలుగా మారాయి. అదీగాక జయలలిత వయసు కూడా అంత పెద్దదేం కాదు. 68ఏళ్లు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటుంటే, ఆహార అలవాట్లు అన్నీ నియంత్రణలో వుంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని వుండొచ్చు. ఒకవేళ సీఎంగా జయలలిత తీరికలేని పనిలో వున్నా ఆమె బాధ్యత చూసుకునే వాళ్లు ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధపెట్టి ఉండాలి. కాని ఎవరు కూడా ఆమె ఆరోగ్యంపై అంత శ్రద్ధ పెట్టలేదనే అనుమానాలున్నాయి.

ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికలకు ముందే ఆమె ఆరోగ్యంపై అనేక వదంతులువచ్చాయి. ఎన్నికలలోనూ ఆమె చాలా తక్కువ సభల్లోనే పాల్గొన్నారు. ఎన్నికల నాటికే ఆమె భారంగా నడిచే వారు. అంతలా ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంటే పక్కన వున్నోళ్లు పట్టించుకోకపోవడం శోచనీయంగా తోస్తుంది.

జయకు చిన్నప్పుడే తండ్రి చనిపోగా, సినిమాల్లో ఉండగానే తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఆమె బంధువులకు దూరంగా పెరిగింది. ఒక దశలో సోదరుడు జయకుమార్‌ కుటుంబాన్ని పొయెస్‌ గార్డెన్‌లోనే పెట్టుకుంది. కాని అక్కడ జయ నెచ్చెలి శశికళ ఆధిపత్యం దెబ్బకు జయకుమార్‌ కుటుంబం అక్కడనుండి బయటకొచ్చేసింది. అప్పటి నుండి కుటుంబసభ్యులెవరూ ఆమెకు దగ్గరగా లేరు. 30ఏళ్లుగా శశికళ, ఆమె బంధువులు మాత్రమే జయను చుట్టుముట్టి వున్నారు. ప్రభుత్వ వ్యవహారాలలోనూ వీరిదే కీలకపాత్ర. శశికళ కోటరీ మితిమీరిన జోక్యం వల్ల తమిళనాడుకు రావాల్సిన కొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని, ఇది తెలిసి జయలలిత కొంతకాలం శశికళను దూరం పెట్టారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత శశికళ క్షమాపణ చెప్పడంతో జయ ఆమెను దగ్గర చేర్చుకున్నా, బంధువర్గాన్ని మాత్రం రానీయలేదు. శశికళ భర్త నటరాజన్‌ను కూడా పొయెస్‌ గార్డెన్‌లోకి అడుగుపెట్టనీయలేదు. ఒకటైంలో ఇంట్లో వంటమనిషి దగ్గర నుండి ప్రతిఒక్కరూ శశికళ మనుషులే వుండేవాళ్ళు!

పొయెస్‌ గార్డెన్‌ను ఇంతలా అల్లుకుపోయిన శశికళ తనకు తాను కలలో కూడా వూహించనంతటి జీవితాన్ని అందించిన జయ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంటే, నడవలేని పరిస్థితి దాకా వస్తే ఎందుకు ఉపేక్షిందనే అనుమానాలు లేకపోలేదు. జయలలిత తలచుకుంటే విదేశాలకు వెళ్లి వైద్యచికిత్స చేయించుకుని ఉండొచ్చు. వ్యాధి అంత ముదిరే దాకా ఎందుకు రానిచ్చారన్నదే ప్రశ్న!

ఇక అపోలో ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అక్కడి వైద్యులు తమ శాయశక్తులా ఆమెకు వైద్యసేవలందించారు. ఒక దశలో కోలుకుందని ఆనందపడ్డా, ఆ తర్వాత గుండెపోటు రూపంలో మృత్యువు ముంచుకొచ్చి జయలలితను ఈ లోకం నుండి తీసుకుపోయింది.

అయితే జయలలిత మరణం తర్వాత శశికళ బంధువర్గమంతా మళ్ళీ ఆమె మృతదేహం చుట్టూ మూగింది. జయ దూరంగా పెట్టిన నటరాజన్‌ తిరిగి పొయెస్‌ గార్డెన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ప్రాణ స్నేహితురాలి మృతదేహం పక్కనే శశికళ రాజకీయ పావులు కదిపింది. స్నేహితురాలు లేదనే బాధకంటే కూడా అన్నాడిఎంకె పార్టీని తన చేతు ల్లోకి తీసుకోవాలని, తన మనిషిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనే ఎక్కువుగా కనిపించింది. దీంతో స్వతహాగానే అనుమానాలు తలెత్తాయి. అన్నాడిఎంకె న్యాయవ్యాది కృష్ణమూర్తి, జయ మేనకోడలు దీపా జయకుమార్‌ ఆరోపణలు చేసినా, తెహల్కా డాట్‌కామ్‌ ప్రత్యేక కథనాల్ని వెల్లడించినా, సినీనటి గౌతమి జయమృతిపై అనుమానాలు తేల్చాలంటూ ప్రధానికి లేఖ వ్రాసినా... ఇవన్నీ జయ మృతిలో శశికళ పాత్ర ఏంటో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నవే! జయ జీవితం భావితరాలకు హిస్టరీగా మిగిలిపోవాలేగాని, ఆమె మరణం ఒక మిస్టరీగా మారకూడదనే ఉద్దేశ్యమే వీరి ఆందోళనలల్లో కనిపిస్తోంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter