06 January 2017 Written by 

నిన్న బుస్‌... నేడు తుస్‌

modi nareనవంబర్‌ 8 రాత్రి 8గంటలకు బుస్‌... అన్నాడు.. అవినీతిని అంతం చేస్తానంటూ బుసలు కొట్టాడు. డిసెంబర్‌ 31 వరకు కస్సుబుస్సు మంటూనే వున్నాడు. ఎక్కువ త్రాగకండి మత్తు దించేస్తానన్నాడు. నల్లకుబేరుల గల్లా ఖాళీ చేయిస్తానన్నాడు. క్రొత్త యేడాది భారతావనికి వరాల జల్లు కురిపిస్తానన్నాడు. చివరికి డిసెంబర్‌ 31న తుస్‌మన్నాడు, గుండె ఝల్లుమనిపించాడు.

ఊరించాడు, ఊహలపల్లకీ ఎక్కించాడు. గాల్లో లేపాడు, చుక్కలు చూపించాడు. మాటల్తోనే స్వర్గానికి చేరువగా తీసుకెళ్లాడు. నూటపాతిక కోట్ల మంది ప్రజలను తన మాయాప్రపంచంలోకి తీసుకెళ్లాడు. వాళ్ల ముందు కనికట్టు ప్రదర్శించాడు. హాంఫట్‌ అనగానే దశాబ్దాల తరబడి నెలకొన్న అవినీతి మాయమవు తుందన్నాడు. గుట్టలుగా పోగైన నల్లధనం కట్టలుకట్టలుగా వచ్చి మన కళ్ల ముందు పోగుబడుతుందన్నాడు. ఆ నల్లధనంతో మీ బ్రతుకులు మారుతాయన్నాడు. దేశంలో కొత్త బంగారులోకాన్ని ఆవిష్కరిద్దామన్నాడు. తనకు ఒక్క అవకాశమివ్వమని, దేశాన్ని నీతి మార్గంలో నడుపుతానని, ఓ 50రోజులు కష్టాలు, నష్టాలు భరించండని బ్రతిమలాడు కున్నాడు. ఇన్నేళ్లు అవినీతి రాక్షసులను, కుంభ కోణాసురులను చూసిన ప్రజలు దేశాన్ని ప్రక్షాళన చేస్తానంటూ ఓ మొనగాడు వచ్చాడని నమ్మారు. 50రోజులు కాదు ఇంకా కష్టాలు భరిస్తూనే వున్నారు. మరి 50రోజుల తర్వాత దేశాన్నే సమగ్రంగా మార్చేస్తా నన్న ఆ పెద్ద మనిషి ఏమయ్యాడు? ఏమి చెప్పాడు?

2016 నవంబర్‌ 8వ తేదీన భారతదేశంలో 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నప్పుడు దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు సైతం ఆయన వైపు చూసాయి. ఇదో పెద్ద సాహసకార్యంగా విదేశీ, స్వదేశీ మీడియా అభివర్ణించింది. నల్లధనం, అవినీతి నిరోధానికి ఇదొక ప్రధాన మార్గంగా మేధావులు అభివర్ణించారు. అదే సమయంలో విపక్షాలు రద్దును వ్యతిరేకించాయి. పెద్దనోట్ల రద్దువల్ల వచ్చే నష్టాలను వాళ్లు అరచి గీపెట్టి చెప్పినా ప్రధాని చెవికెక్కలేదు. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థే స్థంభించి పోయింది. అన్ని వ్యాపారాల్లోనూ స్థబ్దత నెలకొంది. ఆయా ప్రభుత్వరంగాల ఆదాయం దారుణంగా పడిపోయింది. దేశం లోని అన్ని రాష్ట్రాల రాబడి తగ్గిపోయింది. దేశ చరిత్రలో దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇంత భారీ నష్టం ఎప్పుడూ జరిగి వుండదు. అయినా ప్రధాని 50రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ప్రజలకు ధైర్యం చెబుతూ వచ్చారు. ఆయన నమ్మకం ఏంటంటే 15.50 లక్షల కోట్ల పెద్దనోట్లుండగా, వాటిలో కనీసం 4లక్షల కోట్లు బ్యాంకులకు రాకుండా పోతుందని, అదంతా నల్లధనం కాబట్టి, ప్రభుత్వానిదే అవుతుందని, ఆ డబ్బుతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మెప్పు పొందవచ్చని అంచనా వేశారు. కాని, 2వేల కొత్త నోట్లను బ్యాంకులు పంపిణీ చేయడంలోనే భారీ కుంభకోణం జరిగింది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆయా బ్యాంకులకు పంపించిన 2వేల కొత్తనోట్లు సగం నల్లకుబేరులకే చేరాయి. నల్లధనం ఆ విధంగా మళ్ళీ నల్లధనమైపోయింది. జనం ఒకటి, రెండు నోట్ల కోసం రోజుల తరబడి 'క్యూ'లలో నిల్చుంటే శేఖర్‌రెడ్డి లాంటి నల్లకుబేరులకు మాత్రం నేరుగా బ్యాంకుల నుండే కరెన్సీ బస్తాలు చేరాయి. ఇక నల్లధనాన్ని అరికట్టేదెక్కడ! మొత్తం 15.50లక్షల కోట్లు పెద్దనోట్లుండగా, దాదాపు 15లక్షల కోట్లకు పైనే డిసెంబర్‌ 30వ తేదీ నాటికి బ్యాంకులకు చేరిందని తెలుస్తోంది. ఇంకా మార్చి 30వరకు ఆర్బీఐ వద్ద నగదు మార్చుకునే వెసలు బాటు ఉండడంతో ఇంకొంత నగదు జమకావచ్చు. మొత్తానికి దేశంలో నల్లధనం లేకుండా పోయింది. మోడీ పుణ్యాన నల్లధనం వున్నోళ్లు కూడా కమిషన్‌లతో దానిని తెల్లధనంగా మార్చుకున్నారు.

నోట్ల రద్దు చేసినప్పటి నుండి ప్రధాని మోడీ, ఆయన భజన బృందం ప్రజలను డిసెంబర్‌ 31వ తేదీన తీపి కబురు చెబుతా మంటూ ఊరిస్తూ వచ్చారు. దేశ ప్రజలు కూడా ఈ 50రోజులు క్యూలలో నిలబడింది మర్చిపోయి ఆరోజు కోసం ఎదురు చూసారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి దేశ వ్యాప్తంగా ప్రజలు భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్‌ కప్‌ వన్డే మ్యాచ్‌ జరుగుతుంటే టీవీల ముందు ఎలా కూర్చుంటారో, ఆరోజు కూడా అలానే కూర్చున్నారు. మోడీ నోటి నుండి వచ్చే మెరుపులు కోసం దేశ ప్రజలు కళ్లార్పకుండా చూసారు. మోడీ ప్రసంగం అణుబాంబు పేలుడు లెవల్లో ఉంటుందని, సంచలనాలుంటాయని, 2017 కొత్త సంవత్సరం మొదటి రోజు నుండి దేశం దశ తిరగబోతుం దని ఆశపడ్డారు. ఆరోజు మోడీ నోరు తెరిచాడు. మెరుపులు లేవు, ఉరుములు లేవు, పెద్దనోట్ల రద్దు తర్వాత బుసలు కొట్టిన మోడీ ఆరోజు తుస్సుమన్నాడు. గర్భిణీస్త్రీలకు 6వేలు, 3కోట్లు కిసాన్‌ కార్డులను రూపె కార్డులుగా మార్చడం వంటి ఎందుకూ పనికిరాని తాయిలాలతో దేశ ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసారు.

ఆర్ధిక నిపుణులు, తన పార్టీలోని సీనియర్‌ నేతలను సంప్రదించకుండా నరేంద్ర మోడీ ఏకపక్షంగా పెద్దనోట్లను రద్దు చేశారు. ఆయన నిర్ణయానికి ప్రజలు బలయ్యారు. ఆయన చెప్పినట్లు ఈరోజు పెద్దనోట్ల రద్దుతో నల్లధనం ఆగిపోలేదు. అవినీతి అంతం కాలేదు. కాని ప్రజల ఇబ్బందులు మాత్రం రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • ఏపిపై కన్నేసిన బీజేపీ
    'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter