06 January 2017 Written by 

విష రాజకీయాలకు విరుగుడు

lawఓటుబ్యాంకు రాజకీయాలతో భారతదేశ లౌకికవాద స్పూర్తిదీప్తులు నానాటికీ మసకబారిపోతున్న సమయంలో ఎన్నికల యజ్ఞానికి పవిత్రత చేకూరేలా రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ఇచ్చిన తీర్పు ఎంతైనా సంచలనం..చరిత్రాత్మకం. మతం, కులం, జాతి, వర్గం భాష ప్రాతిపదికగా ఓట్లను అభ్యర్థించడం ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో కలకలం కలిగించడమే కాక, కులమతాల నుంచి రాజకీయాలను వేరుచేసే దిశగా ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా ప్రజల నుంచి హర్షం వెల్లడవుతోంది. వ్యక్తికి-మతానికి వున్న సంబంధం వ్యక్తిగతమైనదే నని, ఎన్నికల ప్రక్రియ అనేది లౌకికపరమైన ప్రక్రియ కనుక ప్రజాప్రతినిధుల పనితీరు కూడా లౌకికంగానే వుండాలని, అందువల్ల ఎన్నికల ప్రక్రియలో మతానికి తావు లేదని స్పష్టం చేయడంతో ఈ తీర్పుకు మరింత విశిష్టత చేకూరినట్లయింది. భారతావనిలో ఎన్నికల మహాక్రతువు స్వచ్ఛంగా.. మరింత పారదర్శకంగా జరిగేందుకు ఇది మేలుబాటలు పరచినట్లయింది. రెండు దశాబ్దాల క్రితం నాటి 'హిందూత్వ తీర్పు'ను పున:సమీక్షించిన సుప్రీం కోర్టు తాజాగా ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఇది కొన్ని రాజకీయపార్టీలకు, కొంతమంది నాయకులకు అయిష్టంగానే వుండవచ్చునేమో కానీ, రాజ్యాంగ ధర్మాసనం మాత్రం ఈ విషయంలో తాను చెప్ప దలచుకున్నదంతా స్పష్టంగానే చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌తో సహా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మెజారిటీ న్యాయ మూర్తుల అభిప్రాయం మేరకు ఇచ్చిన ఈ తీర్పు అన్ని విధాలా ఎంతో విశుద్ధమైనది.. శ్రేష్టమైనదని చెప్పవచ్చు. ఎన్నికల్లో కులం, మతం, వర్గం పేరిట ఏ అభ్యర్ధి ఓట్లు అడిగినా ప్రజాప్రాతినిధ్య చ ట్టం-1951 లోని 123 (3) సెక్షన్‌ ప్రకారం అది అవినీతి కిందికే వస్తుందని రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 'హిందూత్వ' గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగిందని, అందుకే 'ఎన్నికల్లో మతం పేరుతో ఓట్లు అడగవచ్చా-లేదా?'.. అనే అంశానికే పరిమితమై తాము తీర్పు ఇస్తున్నామని పేర్కొంది. మనది లౌకకరాజ్యాంగ విధానం కనుక, మతాన్నీ..రాజకీయాలను కలపరాదని, ఎన్నికలు లౌకిక విధానానికి అనుగుణంగానే జరగాలని తీర్పు చెప్పింది. ఇలాంటి విషయాల్లో లౌకికవాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్‌, ప్రత్యర్థి ఓటర్ల మతాల పేరుతో ఓట్లు కోరడం చట్టం ప్రకారం అవినీతి కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ''రాజ్య వ్యవహారాలను మతంతో కలపడానికి వీల్లేదని, లౌకకరాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదని, లౌకిక ప్రక్రియ అయిన ఎన్నికల్లో మతానికి చోటు లేదని''..ఖరాకండిగా చెప్పింది. మతం పూర్తిగా వ్యక్తిగతం అంటూనే సంకుచిత రాజకీయాలతో ఎన్నికల ప్రచారాలు నిర్వహించి అధికార పదవులను అందుకోవడం నేరమేనని ఈ తీర్పు ద్వారా సుస్షష్టం కావడంతో ఈ తీర్పుకు మరింత ప్రాధాన్యత వచ్చినట్లయింది. సంకుచిత రాజకీయ ప్రక్షాళనకు దోహదం చేసేందుకు ఈ తీర్పు ఓ మంచి మార్గం వేసిందనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. సమాజంలో రానురాను కులమత వర్గ ప్రాంత రాజకీయాలు వేళ్ళూనుకున్న నేటి పరిస్థితుల్లో సుప్రీం తీర్పు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదే. అయితే, ఇప్పటికే దేశంలో ప్రత్యేకించి కుల రాజకీయాలు సమాజాన్ని మరింతగా భ్రష్టుపట్టిస్తూనే వున్నాయి. ఇక, మతపరమైన శక్తులతో రాజకీయాలు కలిస్తే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. అందుకే, కులమతాలకు, వర్గాలకు-ప్రాంతాలకు అతీతంగా..సమాజాన్ని మంచిదారిలో.. మహోన్నతమైన రీతిలో తీర్చిదిద్దాలని ఎందరో మహనీయులు కలలు కన్నప్పటికీ, ఆ కలలను సాకారం చేసే దిశలో ఇంతదాకా ఏ ప్రయత్నమూ చేయని దుర్దశలో..ఇలాంటి తీర్పులు ఎంతైనా కనువిప్పు కలిగించేవనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజం పట్ల వ్యక్తిగత బాధ్యత, సమాజసేవాభిలాష, ప్రజల సమస్యలపట్ల అవగాహన, శ్రద్ధ, మంచి ఆదర్శాలు, మానవత్వం..సేవాభావం, నాయకత్వ పటిమ, ఆయా నాయకుల కార్యదీక్షా దక్షత ఇలాంటివన్నిటినీ పరిగణనలోకి తీసుకునే రోజులు పోయి, ఏ కులమో-మతమో ప్రాతిపదికగా ఓట్లు చేజిక్కించుకోవాలనే దుర్గతి రాజకీయాల్లో వచ్చేసింది. ఆ దుస్థితి ఇకనైనా వైదొలగిపోవాలన్నది అందరి ఆకాంక్ష. నేటికీ దేశంలో ఎంతోమంది విద్యాధికులు, అనేక వర్గాలవారు, ఎందరో నాయకులు.. ఉన్నత స్థాయివారు సైతం ఇంకా కులం కుంపట్లలోనే మగ్గి పోతున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎంతోకాలంగా కులతత్వంతో రాజకీయాలు సైతం కుళ్ళిపోతూనే వున్నాయి. ఏ కులం వారిని ఎలా ఆకట్టుకోవాలన్నదే ప్రణాళికగా నాయకులు ఎన్నికల రంగంలోకి దిగుతుండడం అలవాటైపోయింది. కొన్నిచోట్ల ఓట్లే కాదు..సీట్లు కూడా కులతత్వంతోనే ముడిపడివుంటా యనే విమర్శలూ లేకపోలేదు. కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు మళ్ళించుకోవడం..కులం గొప్పతో గొప్పనాయకునిగా తమను తామే ముద్రించుకోవడం..తద్వారా ప్రజలను ప్రభావితం చేస్తూ అడ్డదారి రాజకీయాల్లో అందలం ఎక్కాలని చూడడం..ఇవన్నీ సరైన మార్గాలు కానే కాదని నాయకగణం ఈ తీర్పుతోనైనా గుర్తించుకోవాల్సి వుంది.

ఏదేమైనా, కులాలు-మతాలవారీగా ప్రజలను విభజించి పాలించే రాజకీయాలకు ఇక చెల్లుచీటీ ఇస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సర్వదా శిరోధార్యం. ఈ తీర్పు అందరికీ కనువిప్పు అవుతుందనే ఆశిద్దాం!. ఎవరికి వారు నిబంధనావళిని అనుసరిస్తూ.. స్వచ్ఛంధంగా, నీతినిజాయితీలతో వ్యవహరించిన నాడే జాతి ప్రగతితో పల్లవిస్తుంది. భారతావని ఇకనైనా విభజన రాజకీయాలకు కాక.. విశుద్ధమైన రాజకీయాలకు వేదికగా వుంటూ ప్రపంచానికే ఆదర్శం కావాలి. అందుకు మేలుబాటగా ఇచ్చిన ఈ తీర్పు ఎంతైనా అభినందనీయం.. అందరికీ అనుసరణీయం!...



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • ఏపిపై కన్నేసిన బీజేపీ
    'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter