Friday, 06 January 2017 13:08

అల్లీపురం అరుణాచలం

Written by 
Rate this item
(0 votes)

galpikaఅల్లీపురంలోని సింహపురి చాణక్య, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసం. బయటకెళ్లే పనులేమీ లేక పోవడంతో జెమిని ఛానెల్‌లో రజనీకాంత్‌ హీరోగా నటించిన ''అరుణాచలం'' సినిమా వస్తుంటే కుటుంబసభ్యులతో కలసి చూస్తున్నాడు. సినిమా మధ్యలో అరుణా చలం తండ్రి సింహాచలం పెద్దకోటీశ్వ రుడు కావడం, మూడువేలకోట్లు ఆస్థిని ఆయన తన కొడుకు అరుణాచలంకు కొన్ని షరతులతో దక్కేలా వీలునామా వ్రాసి వుండడం వంటి సీన్‌లు వస్తున్నాయి. వాటిని చూసి సోమిరెడ్డి మనసులో... మా నాయన కూడా ఇలా రాసిపెట్టి వుంటే ఈరోజు ఎలక్షన్‌ల కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా, ఆయన ఇచ్చిన కొద్దోగొప్పో ఆస్థిని కూడా ఎలక్షన్‌లకే తగలేసాను. నాకు తెలియకుండా నా పేరుతో ఆయన ఆస్తులు రాసిపెట్టి ఉంటే ఎంత బాగుండు... ఆడుతూ పాడుతూ ఇంకో నాలుగు ఎలక్షన్‌లు చేసుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటికి 'జెమిని' టీవీలో సినిమా అయిపోవడంతో ఆరోజు వార్తలు చూద్దామనిచెప్పి టీవీ 9I9=99 ఛానెల్‌ పెట్టాడు. ఈయన ఛానెల్‌ మార్చ డంతోనే స్క్రీన్‌ మీద సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కనిపించసాగాడు. ఆయన చేతిలో కొన్ని పేపర్లున్నాయి. కాకాణి విలేరుల సమావేశంలో మాట్లాడుతున్నాడు. ఇదిగోండి... ఇవి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విదేశాలలో ఆయనకు వెయ్యికోట్ల ఆస్తులున్నాయి. భారతదేశం నుండే మనీ లాండరింగ్‌ ద్వారా సింగపూర్‌, హాంకాంగ్‌, మలే షియా దేశాలకు ఆయన డబ్బు వెళ్లింది. విదేశాలలో ఆయనకు భూములు కూడా ఉన్నాయి. ఇవే ఋజువులు అని ప్రెస్‌ మీట్‌ ముగించాడు. అంతే... ఆ ప్రెస్‌ మీట్‌ చూడగానే సోమిరెడ్డి నిల్చున్న చోటే జూనియర్‌ ఎన్టీఆర్‌ మాదిరిగా ఆనందంతో డ్యాన్స్‌ చేయసాగాడు. అక్కడేవున్న తన భార్య జ్యోతి, కొడుకు రాజగోపాల్‌రెడ్డిలను కౌగిలించుకుని... దేవుడున్నాడు జ్యోతి... దేవుడున్నాడు, మా నాయన ఇచ్చిన ఆస్తులను రాజ కీయాలలో కొచ్చి తగలేసాననే బాధ ఇంతకాలం నాకుండేది. మా నాన్న దేవుడు... నేను ఇచ్చిన ఆస్తులను వీడు నిలుపుకోలేడనే ముందుచూపుతో ఆయన కొంత ఆస్థిని నాకు తెలియకుండానే జాగ్రత్త చేసినట్లున్నాడు. నేను రాజ కీయాలలో ప్రయోజకుడినయ్యాకే ఆ ఆస్థి నాకు చెందాలని వీలునామా రాసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి వద్ద ఇచ్చినట్లున్నాడు. ఇప్పుడు ఈ రూపంలో బయటపడ్డాయి. ఏదేమైనా మనం అరుణాచలం సినిమా చూడడ మేంటి, ఆ సినిమాల్లో రజనీకాంత్‌కు జరిగినట్లే మనకు జరగడమేంటి, అంతా ఆ దేవుడి దయ అని చెప్పి సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిత్రపటం ముందు నిలబడి కుటుంబసభ్యులందరూ దండం పెట్టుకున్నారు. తర్వాత సోమిరెడ్డి పి.ఏ హజరత్‌కు చెప్పి మురళీకృష్ణ హోటల్‌ నుండి పది కిలోల స్వీట్స్‌ తెప్పించాడు. టీవీలలో కాకాణి ప్రెస్‌మీట్‌ చూసి తెలుగుదేశం నాయకులు బీద రవిచంద్ర, బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ తదితరులంతా అల్లీపురంకు వచ్చేశారు. సోమిరెడ్డి అంద రికీ స్వీట్లు తినిపించసాగాడు. అది చూసి పోలంరెడ్డి అవాక్కై... ఆ కాకాణి ఆరో పణలను ఖండించకుండా ఇలా స్వీట్లు తినిపిస్తున్నావేందన్నా అని అడిగాడు. అందుకు సోమిరెడ్డి... ఎందుకు ఖండిం చాలి, ఆయనేం తప్పు చేసాడని ఖండిం చాలి, నాక్కూడా తెలియకుండా వున్న నా ఆస్తుల గురించి నాకు తెలియజేసాడు. ఈరోజు ఆయన చెప్పకపోయి వుంటే, ఆ ఆస్తుల గురించి నాకు తెలిసేది కాదు కదా, వచ్చే ఎలక్షన్‌కు ఎవర్ని అప్పు అడగాలా అని అనుకుంటున్నాను, ఇక నాకు చింతలేదు, నాలుగైదు ఎలక్షన్‌లను అవలీలగా లాగేస్తాను, ఇప్పటిదాకా డబ్బు లేకపోబట్టే నాలుగు ఎలక్షన్‌లు ఓడి పోయాను, ఇక చూపిస్తాను నా పవరేంటో అంటూ జ్యోతి... రాజా... అంటూ తన భార్య, కొడుకులను పిలిచాడు. వాళ్లు వచ్చారు. వారితో... ఇప్పటిదాకా ఉన్న డబ్బులను నా రాజకీయాలకే వాడు కుంటూ మిమ్మల్ని అశ్రద్ధ చేసాను, ఇప్పుడు హ్యాపీగా మీకు ఏం కావాలంటే అవి కొనుక్కోండి... పెళ్లప్పుడు అల్లుడికి కూడా మనం డబ్బుల్లేక ఏమీ కొనివ్వలేదు, జూబ్లీ హిల్స్‌లో ఒక బంగళా, ఒక మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొనిద్దాం! అని చెప్పి వాళ్లను పంపించాడు. తర్వాత పి.ఏ హజరత్‌ను పిలిచి... మనం అప్పులు ఇవ్వాల్సిన వారి లిస్టు రాసి పెట్టు... వడ్డీతో సహా చెల్లిం చేద్దాం, అట్లాగే నెల్లూరు మాగుంట లే అవుట్‌, ఆదిత్యనగర్‌లలో మంచి సైట్‌లు చూసి పెట్టు, కొనిపడేస్తే ఓ పక్కన ఉం టాయి. అల్లీపురంలో మా నాయన సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి పేరుతో స్కూల్‌ వుంది కాబట్టి ఒక మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ కూడా కడదాము... వీటికి స్థలాలు కూడా చూసి పెట్టు, సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మన డబ్బుతోనే వాటర్‌ప్లాంట్లు పెడదాం, రోడ్లు వేయిద్దాం, డ్రైనేజీలు కట్టిద్దాం... వీటన్నింటికి పక్కా ప్లాన్‌లు రెడీ చేయండి, వెయ్యి కోట్లలో సగం సర్వేపల్లి నియో జకవర్గం అభివృద్ధికే కేటాయిస్తున్నాను, దాని అమలుకు పక్కా ప్లాన్‌ రెడీ చేయండి అని చెప్పాడు.

తర్వాత ఓ స్వీట్‌ బాక్స్‌, పూలబొకేలు తీసుకుని సోమిరెడ్డితో పాటు పోలంరెడ్డి, కురుగొండ్ల, బీద, బొల్లినేని, డాక్టర్‌ జడ్‌.యస్‌.లు కారులో పొదలకూరు రోడ్డులోని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. కారులో కూడా వెయ్యి కోట్లపై చర్చ... సోమిరెడ్డి మిగతా నాయకులతో... నాకంతా కలగా వుంది రామకృష్ణన్నా... అరుణాచలం సినిమా చూడడమేంటి... అదే సమయంలో నా పేరుతో వెయ్యికోట్లు ఆస్తులు బయట పడడమేంటి... ఈమధ్య పూజలెక్కువ చేస్తున్నానని, దాని ఫలితమే అయ్యుం టుందని చెప్పగా... పోలంరెడ్డి వుండి... చంద్రమోహనన్నా, నా దగ్గర కొంచెం క్యాష్‌ టైట్‌గా వుంది, వచ్చే ఎలక్షన్‌లో నన్ను కొంచెం చూడన్నా అని అన్నాడు. దానికి సోమిరెడ్డి... ఏం ఇబ్బంది లేదన్నా, అవసరమైతే జిల్లాలో అందర్నీ చూస్తానని హామీ ఇచ్చాడు. వీళ్లు మాట్లాడుకుంటుండగానే కాకాణి ఇల్లు వచ్చింది. కారు దిగి వీళ్లు లోపలకు వెళ్లారు. సోమిరెడ్డిని చూడగానే కాకాణి ఆశ్చర్యంతో, గౌరవంతో లేచి నిలుచోగా, సోమిరెడ్డి అమాంతం ఆయనను కౌగి లించుకుని చేతిలో స్వీట్స్‌ ప్యాకెట్‌, పూలగుత్తి పెట్టి... గోవర్ధనా ఇంతకాలం నిన్ను అపార్ధం చేసుకున్నాను, మనసులో ఏమీ పెట్టుకోవద్దు, నీ మూలంగానే నాకు విదేశాల్లో వెయ్యికోట్లు ఆస్తులున్నాయన్న విషయం తెలిసింది. దానికి సంబంధిం చిన డాక్యుమెంట్స్‌ నీ వద్దే వున్నాయి కదా, దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏవన్నా టాక్స్‌ కట్టాల్సి వస్తే కట్టేద్దాము, నా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఇంతకాలం కాపాడినందుకు థ్యాంక్స్‌... నా ఆస్తుల డాక్యుమెంట్స్‌ నాకిచ్చావంటే ఇక నేనెళ్లిపోతా... అవతల అప్పులోళ్లు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారట... వాళ్ల అప్పులన్నీ సెటిల్‌ చేయాలి... నేను కూడా జీవితంలో ఫైనాన్షియల్‌గా సెటిలై పోవాలి... అని చెప్పాడు. అప్పుడు కాకాణి కొన్ని డాక్యుమెంట్లు తెచ్చి సోమిరెడ్డికి ఇస్తూ... ఇవి అసలివో నకిలీవో నాకు తెలియదు కాని, వేరే రూటులో నాకొచ్చాయన్నాడు. అప్పుడు సోమిరెడ్డి... లేదు ఖచ్చితంగా నాకు విదేశాల్లో ఆస్తులున్నాయి... ఇవి నకిలీవైతే అసలు వాటిని నువ్వెక్కడో దాచి వుం టావు... నా ఆస్థిని కాజేయాలని ప్లాన్‌ చేసుంటావ్‌... దీని మీద నేనూరుకోను... ఎంత దాకానైనా పోరాడుతానని హెచ్చ రించాడు. దాంతో కాకాణి... ఇదెక్కడి మేళంరా బాబూ అంటూ తల గోక్కోసాగాడు.

Read 275 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter