11 January 2017 Written by 

ఉచిత విద్య... వైద్యంతోనే... పేదలకు పెద్దపండుగ

freeపండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ... ఆధునిక భారత నిర్మాత.

లాల్‌బహుదూర్‌ శాస్త్రి... నిజాయితీకి ప్రతీక.

శ్రీమతి ఇందిరాగాంధీ... బ్యాంకుల జాతీయకరణ.

రాజీవ్‌గాంధీ... సాంకేతిక విప్లవం.

పి.వి.నరసింహారావు... ఆర్ధిక సంస్కరణలు.

వాజ్‌పేయి... స్వర్ణ చతుర్భుజితో దేశమంతా

నాలుగులైన్ల జాతీయరహదారులు.

మన్మోహన్‌సింగ్‌... 2జీ స్కాం, బొగ్గు స్కాం...

భారతదేశ ప్రధానులుగా పనిచేసిన నాయకులందరూ తమ పాలనా కాలంలో ఒక్కో అంశంపై తమ బ్రాండ్‌ వేసుకున్నారు. వీరి పేర్లు తలచు కోగానే పైన సూచించిన అంశాలు గుర్తుకువస్తాయి.

మరి ప్రధానిగా రెండున్నరేళ్ల పాలనా కాలంలోనే నరేంద్ర మోడీ ఈ తరం ప్రజలే కాదు, రాబోయే తరాల వారు కూడా గుర్తుంచుకునే విధంగా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. అదే పెద్దనోట్ల రద్దు. స్వతంత్ర భారత చరిత్రలో దేశ ప్రజలు కొన్ని ఉత్పాతాలను ఎదుర్కొన్నారు. చైనాతో ఒక యుద్ధం, పాకిస్థాన్‌తో మూడు యుద్ధాలు, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెనీ వంటివ... అయితే వీటి మూలంగా దేశం యావత్తు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వ్యతిరేకులు మాత్రమే కష్టాలు పడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశంలో వున్నప్రజలంతా కూడా ఇబ్బంది పడింది పెద్దనోట్ల రద్దు మూలంగానే! పేదలను ఉద్ధరించడం కోసమే పెద్దనోట్లను రద్దు చేసానని ప్రధాని ఇప్పటికీ చెబుతున్నారు. ఆ ఉద్ధరించే మార్గం ఎలా ఉంటుందో చెప్పడం లేదు. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి! మోడీ నిజాయితీని ఇక్కడ శంకించలేం! తనదైన శైలి పనితీరు చూపాలనే ఏ నాయకుడూ ఒడిగట్టలేని సాహసానికి పూనుకున్నాడు. తన క్యాబినెట్‌కు కూడా తెలియకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన రద్దు నిర్ణయాన్ని విని బీజేపీ నాయకులే నోరెళ్లబెట్టారు. ఈ మోడీ ఏంటి మన కొంపే ముంచాడని భావించిన నాయకులు కూడా వున్నారు. పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల మార్పిడి గడువు తర్వాత దాదాపు నాలుగైదు లక్షల కోట్లు బ్లాక్‌మనీ బ్యాంకులకు రాకుండా ఆగిపోతుందని, ప్రజలు డిజిటల్‌ కరెన్సీ వైపు మళ్లుతారని, అన్ని స్థాయిల్లో అవినీతి ఆగిపోతుందని, ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గుతుందని, నకిలీ కరెన్సీ పీడ వదిలి ఉగ్రవాదం చీడ విరుగు డవుతుందని మోడీ ఆశించారు. కాని ఆయన ఆశలకు, వాస్తవ ఫలితాలకు చాలా తేడా వుంది. దేశంలో బ్లాక్‌ అంతా వైట్‌ అయిపోయింది. కాని పెద్దనోట్ల రద్దు మూలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడుతున్నాయి. సంస్థలు మూతపడుతున్నాయి.

పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చంకలు గుద్దుకుంటున్నారు గాని, ఎన్ని కుటుంబాలు రోడ్డునపడుతున్నాయో గమనించడం లేదు. అసలు దేశంలో బ్లాక్‌మనీ అన్నది కరెన్సీ రూపంలో చాలా తక్కువగా వుంది. లక్షల కోట్ల బ్లాక్‌మనీ ఉండేది బినామీ ఆస్తుల రూపంలో! మోడీ పెద్దనోట్ల రద్దు కంటే కూడా బినామీ రాయుళ్ల భరతం పట్టి ఉంటే దేశ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి ఈరోజు చాలా మెరుగ్గా ఉండేది.

పెద్దనోట్ల రద్దు మూలంగా జరగాల్సిన నష్టం జరిగిపో యింది. జరిగిన కాలాన్ని, జరిగిపోయిన నష్టాన్ని ఎలాగూ భర్తీ చేయలేము. పెద్దనోట్ల రద్దు మూలంగా పేదలకు ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు.

కానీ మోడీ అనుకుంటే ఈ దేశంలో ఒకటి మాత్రం సాధ్యం అవుతుంది. చదువు, వైద్యం, ఆహారం, వసతి ప్రజల ప్రాధమిక హక్కులు. ఈరోజు దేశంలో ఆహార సమస్య లేదు. 20, 30ఏళ్ల క్రితం దేశంలో ఆహార ధాన్యాల కొరతే పెద్ద సమస్య. ఇప్పుడు అడుక్కునేవాడికి కూడా తిండికి కరువు లేదు. ఇక ప్రతి ఒక్కరికీ వసతి అనే మార్గంలో కూడా చాలా పురోగతి సాధించాం. అయితే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న ఆశయం మాత్రం ఈ దేశంలో నీరుగారిపోతోంది. ఇది మధ్యతరగతి మహాభారతం. నూటికి 70మంది మధ్యతరగతి ప్రజలే! ఈరోజు వారికి చదువులు భారమయ్యాయి. ఆసుపత్రుల ఖర్చులు మోయలేనంత బరువయ్యాయి. సర్కారు చదువులు చట్టుబండలయ్యాయి. రిక్షా పుల్లర్‌కు సైతం సర్కార్‌ చదువు మీద నమ్మకం లేక ప్రైవేట్‌ స్కూళ్ళలో తమ పిల్లలను చేర్పిస్తు న్నాడు. ఒక పిల్లోడి చదువుకు ఎల్‌కెజి నుండే వేలతో ఖర్చు మొదలవుతుంది. ఇంటర్‌, ఎంసెట్‌ వద్దకు వచ్చేసరికి లక్షలు, ఎంబిబిఎస్‌, పీజీ కాడికి పోయేసరికి కోట్లలో ఉంటుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇన్ని కోట్లు పెట్టి తన బిడ్డను డాక్టర్‌ లేదా ఇంజనీర్‌ చేసుకోగలడా?

ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే! ఒక రోగంతో ఆసుపత్రికిపోతే నాలుగు కొత్త రోగాలతో బయటకు రావాలి. ఇంత అధ్వాన్నంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు మాత్రం పోగలరు. ప్రతి ఒక్కరికీ కార్పొరేట్‌ వైద్యమే దిక్కవుతోంది! కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఖర్చుల సంగతి చెప్పాలా? కోట్లు ఖర్చుపెట్టి కార్పొరేట్‌ ఆసుపత్రులు కట్టుకున్న వాళ్ళు వైద్యంతో వ్యాపారమే చేస్తారు. వాళ్ల నుండి సామాజిక సేవ ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఈ దేశంలో సమ న్యాయం అనేది ఒక్క రోగాల విషయంలోనే అమలవుతుంది. పేదోడికైనా, పెద్దోడికైనా రోగాలలో మినహాయింపు లేదు. అయితే పెద్దోడు ఎన్ని లక్షలు ఖర్చైనా కార్పొరేట్‌ ఆసుపత్రులలో మెరుగైన వైద్యచికిత్స పొందగలడు. మరి పేదోడికి అంత స్థోమత ఎక్కడిది? ఈరోజు దేశంలో ఎక్కువశాతం మంది ప్రజలు తమ అవసరాలను తగ్గించుకుని రోజూ తమ సంపాదనలో అంతో ఇంతో పొదుపు చేసేది బిడ్డల చదువుల కోసం, పెద్దజబ్బులు వస్తే ఆసుపత్రుల ఖర్చుల కోసం.

పెట్టుబడిదారి దేశాలలో, ప్రైవేట్‌ రంగం రాజ్యమేలే దేశాలలో సైతం విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ప్రజలకు ఇవి రెండూ కూడా ఉచితంగా అందుతుంటాయి. భారతదేశంలోనే ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన రంగాలు ప్రైవేట్‌ ఆధీనంలోనూ, ప్రైవేట్‌ ఆధీనంలో ఉండాల్సిన అంశాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో విద్య, వైద్యం చాలా ప్రాధాన్యత కలిగినవి. పేద, మధ్య తరగతి ప్రజల సంపాదనను సగం ఈ రెండే హరిస్తున్నాయి. దేశంలో ప్రభుత్వ విద్య, వైద్యం క్రమ క్రమంగా కనుమరుగవుతోంది. కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి ఈ రెండు రంగాలు పూర్తిగా వెళ్లిపోతున్నాయి.

ప్రధాని నరేంద్రమోడీకి దేశం పట్ల, పేద ప్రజల పట్ల చిత్తశుద్ధే ఉంటే ముందు విద్య, వైద్య రంగాలపై దృష్టిపెట్టాలి. ఈ రెండింటిని ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి. దేశ ప్రజలకు మెరుగైన చదువులు, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించేలా ఈ రెండు రంగాలను జాతీయీకరణ చేయాలి. దేశ ప్రజలకు ఈ వరాన్ని ఆయన అందిస్తే ప్రజలు పెద్దనోట్ల రద్దు కష్టాలను మరచిపోవడమే కాదు, నరేంద్రమోడీని ఆజ న్మాంతం తమ గుండెల్లో పెట్టుకుంటారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న మోడీ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది కూడా! పేదలకు ఆయన మేలు చేయాలనుకుంటే ఆయన ముందున్న అత్యుత్తమ మార్గమిది!

ఇకనన్నా వట్టిమాటలు కట్టిపెట్టి మోడీ ఈ దిశగా త్వరలోనే ఓ సంచ లన నిర్ణయం తీసుకుంటారని భారతా వని ఎదురుచూస్తోంది. ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే పేదప్రజలకు పెద్దపండుగ!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter