Friday, 20 January 2017 10:46

నెల్లూరుకి శని పట్టిందా...?

Written by 
Rate this item
(0 votes)

kaluvaస్వాతంత్య్ర సమరం నుంచి సారా వ్యతిరేకోద్యమం దాకా ఉద్యమాలకు ఊపిరిపోసిన జిల్లా నెల్లూరుజిల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎందరో చరిత్రాత్మక నాయకులకు, ఉద్ధండ రాజకీయ నేతలకు జన్మనిచ్చిన జిల్లా నెల్లూరుజిల్లా. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగంలో సంచలనాలకు మారుపేరుగా పిలవబడుతున్న జిల్లా నెల్లూరుజిల్లా. దాన కర్ణులకు - దాన ధౌరేయులకు పేరు గాంచిన జిల్లా నెల్లూరుజిల్లా. అలాంటి జిల్లా కేంద్రమైన నెల్లూరు పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. నెల్లూరు నగరం ఏం పాపం చేసుకుందో, నగరవాసులకు ఏ శాపం తగిలిందో తెలియదుగాని అత్యంత దయనీయంగా నెల్లూరు స్థితి మారి పోయింది. దీనావస్థలతో నగరం నలిగిపోతోంది.

ఈ నెల్లూరుకు గ్రహణం పట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్‌ బాగుచేయలేని ఎయిడ్స్‌ వ్యాధి కంటే దారుణమైన వ్యాధితో బాధపడుతోంది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా అధికారులు, సిబ్బంది కుమ్మక్కై పందికొక్కుల్లా దోచుకుంటూ పట్టణాన్ని అధోగతిపాలు చేస్తున్నారు.

''ఈ నగరానికి ఏమైంది'' అంటూ గతంలోనూ ''నగరమా నరకమా'' అంటూ ఇటీవల కాలంలోనూ 'లాయర్‌'తో పాటు అన్ని దినపత్రికల్లో సైతం మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిర్లక్ష్యాన్ని, అవినీతిని, అక్రమాలని ఎండగడు తున్నా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇద్దరు... పట్టణాభివృద్ధి శాఖ మంత్రులూ నెల్లూరోళ్లైనా ఈ వార్తలకు చీమ కుట్టినట్లైనా చలించక పోవడం అటు ప్రజలను ఇటు రాజకీయ మేధావులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న పాపమేమిటని అర్ధంకాక తలపట్టుకుంటున్నారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నగరంపై అసలు ఆసక్తి లేదు. నెల్లూరు నెక్ట్స్‌ ద్వారా ఆయన చేసిన ప్రయత్నాలకు పెద్దగా స్పందన రాకపోవడంతో నగరాన్ని ఆయన గాలికి వదిలేశాడు. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్‌ ప్రక్షాళన విషయంలో తమకేమీ పట్టనట్లుగానే వెంకయ్య వ్యవహరించడం విడ్డూరమైన విషయం.

ఇక మరో మంత్రి నారాయణ ఆయన ఆత్తవారింటికి అల్లుడొచ్చినట్లు ఏ పండగకో పబ్బానికో వస్తాడు. రొట్టెల పండుగ, పెద్దల పండుగ లేదా ప్రభుత్వ పథకాల పండుగ అంటూ పండగ వేళల్లోనే కనపడతాడు. ఇక మధ్యలో ఎప్పుడో రాత్రివేళల్లో వచ్చి వెళ్తాడు.

నగరాభివృద్ధికి చెందిన ఇద్దరు మంత్రులూ నెల్లూరోళ్లే అయ్యుండి కూడా కనీసం కార్పొరేషన్‌కి ఒక నిఖార్సయిన ఐ.ఏ.ఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించడానికి సంకోచిస్తున్నారంటే నగరం పట్ల వీరికున్న శ్రద్ధ, ఆసక్తి స్పష్టమైపోతోంది.

చివరికి నగరంలో దోమలు, పందులు వీరవిహారం చేస్తున్నాయి. నెల్లూరులో 5లక్షల మంది ప్రజలుంటే ఏ 5వేలకోట్లకు పైగానే దోమలుంటాయి. నగరంలోని ఏ ప్రాంతం చూసినా ముక్కులదరగొట్టే మురుగుతో మురికి గుంటలతో గబ్బుకొట్టిపోతోంది.

సమర్ధత వున్నా... సహకారం లేదు

శ్రీ ఎమ్మెల్యేలిద్దరూ డమ్మీలే

ఇక నెల్లూరు నగరంతో పాటు రూరల్‌లో సైతం వై.సి.పి ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ప్రజలకు పెద్ద శాపంగా మారినట్లే అనిపిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలూ యువకులు, ఉత్సాహవంతులు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో పాటు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తుకు ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలన్న ఆలోచన, దృక్పథం కలిగిన వాళ్లు. అయితే వాళ్లకు 'పవర్‌' లేదు, ఇద్దరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కావడంతో వాళ్ల ఆదేశాలు ఆలోచనలు ఆచరణలో సాధ్యం కావడం లేదు. అధికారులు వీళ్లనసలు లెఖ్ఖపెట్టడం లేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఆదేశించినా తమ స్టైల్‌లో సమాధానం చెప్పి పని ఎగ్గొట్టడంలో ఆరితేరిన నెల్లూరు నగర కార్పొరేషన్‌ సిబ్బంది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలనూ అసలు ప్రజా ప్రతినిధులుగా చూస్తున్నట్లు కూడా లేదు.

అటు రూరల్‌ ఇటు నగరంలో సమస్యలను వీళ్ళ దృష్టికి తీసుకెళ్లినా ఆ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరు ఎమ్మెల్యేలూ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం మాత్రం సున్నానే! ఉదాహరణకు మాగుంట లే అవుట్‌ ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌ నుండి సిపిఆర్‌ కళ్యాణ మండపం వరకూ మంజూరు కాబడిన డ్రైన్‌ నిర్మాణాన్ని తీసుకుంటే 15రోజుల క్రితం 'లాయర్‌'లో ఇక్కడ కాంట్రాక్టర్‌ అహంకార పోకడ అధికారుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉటంకిస్తూ వార్త ప్రచురితమైంది. సదరు వార్తకు వెంటనే స్పందించిన రూరల్‌ శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకున్నాడు. వెంటనే మునిసిపల్‌ అధికారులతో మాట్లాడడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. లాయర్‌లో వార్త వచ్చిన మూడురోజుల తర్వాత మళ్ళీ ఓ ప్రముఖ దినపత్రికలో సైతం ఈ డ్రైన్‌కి సంబంధించిన వార్త ప్రచురితమైంది. అప్పుడు కూడా శ్రీధర్‌రెడ్డి మళ్ళీ స్పందించి జె.సి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కానీ ఫలితం శూన్యం. కార్పొరేషన్‌ అధికారులు సమస్య వున్న ప్రాంతాన్ని సందర్శించి తమదైన తరహాలో చూస్తాం... చేస్తాం... చించేస్తాం... పొడిచేస్తాం అంటూ వెళ్లి పోయారు. అంతా ఎక్కడ గొంగళి అక్కడే. కంకర, ఇసుకతో పాటు కాంట్రాక్టర్‌ తీసిన గొయ్యి, అందులో లక్షల్లో దోమలు, వందల్లో పందులు, బిక్కుబిక్కు మంటూ ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌లో చదివే పిల్లల ప్రాణాలు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే.

నగరమంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు

ఎక్కడపడితే అక్కడ పోస్టర్లు, ఫ్లెక్సీలు వుండకూడదని, ఇష్టానుసారం పోస్టర్లు అంటించడం ఫ్లెక్సీలు కట్టడం వంటివి అనుమతించరాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసి నప్పటికీ ఆ ఆదేశాలను సైతం ఖాతరుచేసే నాయకుడూ లేడు, నాథుడూ లేడు. ఇక నెల్లూరులో విగ్రహాలకు కొదవలేదు. ఆ విగ్రహాల ఐలాండ్లకు వేసే ప్రచార పోస్టర్లకూ అసలు కొదవ లేదు. గౌరవ మంత్రిగారి ఆశీస్సులతో ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కుడి భుజం అనుచరులు ఓ అడుగు ముందుకేసి ఎక్కడా ఐలాండ్లు అన్నవే కనపడకుండా మొత్తం అన్నింటినీ అభ్యర్థి పోస్టర్లతో ముంచేశారు. ఎలక్షన్ల పోస్టర్లు సైతం ఎక్కడపడితే అక్కడ అంటించకూడదన్న నిబంధన కూడా మంత్రికి ఆయన అనుచర గణానికి వర్తించేటట్లు లేదు. టౌనంతా పోస్టర్లు, ఫ్లెక్సీలతో గలీజుగా తయారైనా ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించకపోవడం వింతే కాదు విడ్డూరం కూడా!

కరువైన శాంతిభద్రతలు

గత యేడాదికాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపో యాయి. చైన్‌ స్నాచింగ్‌ కేసులతో పాటు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు నెల్లూరు నగరం నిలయమైపోయింది. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడానికీ నేరాలను నియంత్రించడానికి దొంగలను దుర్మార్గులను గుర్తించడానికి నగరమంతా సి.సి కెమెరాలు పెట్టామని ఓ వైపు చెప్తూనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సీటు బెల్టు పెట్టుకోలేదని, సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారని రాంగ్‌ పార్కింగ్‌లో వాహనం నిలిపారంటూ సి.సి.కెమెరాలు తీసిన ఫోటోల ఆధారంగా ఫైన్‌ కట్టండంటూ నోటీసులు పంపిస్తోంది పోలీసుశాఖ. తమ డిపార్ట్‌మెంట్‌కు ఆదాయం రాబట్టడంలో చూపిస్తోన్న చొరవ, నేర నియంత్రణలో లేదనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.

ఆర్‌.టి.సితో సహా నగరమంతా...

బహిరంగ మూత్ర విసర్జన

ఇక ఆర్‌.టి.సి బస్టాండ్‌తో సహా నగరంలో ఎక్కడపడితే అక్కడ బహిరంగ మూత్రవిసర్జనతో అంతా ఉచ్చగబ్బుగా తయారైంది. కార్పొరేషన్‌కి ప్రత్యేక అధికారిగా వున్న జిల్లా కలెక్టర్‌ సైతం కార్పొరేషన్‌తో ఎందుకొచ్చిన పరేషాన్‌ అన్నట్లుగా వుండి పోతున్నారు. నగరంలోని అన్ని విభాగాలు కార్పొరేషన్‌ విధుల తోనే ముడిపడి ఉంటాయి. చివరకు ట్రాఫిక్‌ నియంత్రణ సక్రమంగా జరగాలన్నా కార్పొరేషన్‌ సహకారం అవసరం. అటు పారిశుద్ధ్యం, పట్టణ సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ కట్టడాల నియంత్రణ, నిర్ణీత ప్రదేశాలలో పెయిడ్‌ పార్కింగ్‌... ఇవన్నీ కార్పొరేషన్‌ బాధ్యతలే. అయితే నెల్లూరు కార్పొరేషన్‌కి సరైన అధికారిని నియమించే ఆలోచనే లేని ఇద్దరు పట్టణాభి వృద్ధి శాఖల మంత్రుల పుణ్యమా అని నగరం అధోగతి పాలై పోయింది.

బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు కదా, నాకెందుకొచ్చింది అని వెంకయ్యనాయుడు, ప్రజల ఓట్లతో నేను మంత్రిని కాలేదు కదా నాకేం సంబంధం అని నారాయణ... ఇద్దరూ నెల్లూరు కార్పొరేషన్‌ని కార్పొరేషన్‌ అధికారులని ఊరి మీదకి వదిలేయ డంతో ఇక్కడ వారిదే ఇష్టారాజ్యమైపోయింది. ప్రభుత్వాలు మారి 3సంవత్సరాలు పూర్తి కానున్నా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దోస్తులే అధికారంలో వున్నా నెల్లూరు నగరం నరక కూపంగానే మిగిలిపోయి వుందంటే నిజంగా నెల్లూరుకు శనిపట్టింది అనిపిస్తోంది. శని ఒక్కో దశలో నిర్ణీత కాలం పాటు ఉంటుందంటారు. మరి నెల్లూరుకు పట్టిన శనికి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. మరి ఇంకైనా వీడుతుందో లేక మరి కొన్నేళ్లు పట్టిపీడిస్తుందో... వేచిచూడాల్సిందే!

Read 1991 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • వివేకన్నా... నీ రాక కోసం.. నిలువెల్ల కనులై...
  సింహపురి సోగ్గాడా... స్టైల్‌ ఆఫ్‌ సింహపురీ... ఓ వివేకా... ఎన్నిరోజు లైందయ్యా నిన్ను చూసి... నిన్ను చూడక, చిరునవ్వుల లొలికే నీ ఫేసు చూడక మా వాళ్ళ ముఖం వాచిపోయిం దనుకో... నాలుగేళ్ళు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా, పదిహేనేళ్ళు ఎమ్మె ల్యేగా వుంటే…

Newsletter