03 February 2017 Written by 

హోదా ఊబిలో చంద్రసైన్యం

desamఇంతకంటే దగా ఉందా? ఇంతకంటే మోసం ఉందా? ఇంతకంటే వంచన ఉందా? ఇంతకు మించిన దారుణం ఉందా? భారతదేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటకు, చేసిన బాసకు విలువలేకుంటే ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తున్నట్లా? ప్రజాప్రభుత్వం నడుస్తున్నట్లా?

ఆంధ్రప్రదేశ్‌... మూడేళ్లుగా రెండు ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన రాష్ట్రం. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చిప్ప చేతికిచ్చి పంపించిన ఘనత యూపిఏ ప్రభుత్వానిది. అయితే విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా కల్పిస్తామన్న హామీని అటకెక్కించిన కీర్తి నేటి ఎన్డీఏ ప్రభుత్వానిది. 2014 ఎన్నికల ప్రచారసభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం సి.డిలను మళ్ళీ ఒక్కసారి చూస్తే, నాయకులు ఇంత కర్కోటకంగా ఎలా మారగలుగుతారనిపిస్తోంది. ఆరోజు మోడీ ఆంధ్రప్రదేశ్‌పై ఎంతో ప్రేమ కురిపించాడు. ఎంతో దయ చూపించాడు. అలాంటి మోడీ ప్రధాని అయ్యాక ఏపికి ఇలా దగాటోపీ ఎలా పెట్టగలిగాడన్న అనుమానాలు రాక తప్పవు. ప్రత్యేకహోదా విషయంలో ఏపిని కేంద్రం నిలువునా మోసం చేసింది. 14వ ఆర్ధిక సంఘం ఒప్పుకోవడం లేదని, ఇప్పుడు హోదా వున్న రాష్ట్రాలకే ఎత్తేస్తున్నామని కుంటిసాకులు చెప్పింది. కాని, ఏపికి హోదా ఇవ్వకపోవడానికి, మోడీ మాటతప్పడానికి కారణాలు వేరే వున్నాయి. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది. పెట్టుబడులన్నీ ఏపి వైపు క్యూ కడతాయి. ఈ రాష్ట్రానికి 900కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతముంది. మంచి జీవనానికి అనువైన రాష్ట్రం. మంచి నాగరికత వున్న ప్రాంతం. తీవ్రవాదం సమస్య లేదు. స్థానిక ప్రజలతో ఇబ్బందులు రావు. కాబట్టి ప్రత్యేకహోదా ఇచ్చుంటే ఇప్పుడు హోదా అమలవుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమలను సైతం ఏపికి తరలించి ఉండేవాళ్లు. ఇక తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒడిస్సా, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలలో కంటే ఏపిలోనే పెట్టుబడులు ఎక్కువుగా వచ్చేవి. ఏపికి అన్ని విధాలా అనుకూల వసతులున్నాయి. ప్రత్యేకహోదా వచ్చుంటే పారిశ్రామికవేత్తల పెట్టుబడికి మొదటి ఛాయిస్‌ ఏపినే!

ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని మోడీ గ్రహించాడు. అందుకే ఏపి సీఎంను ప్రత్యేకప్యాకేజీతో కొట్టాడు. నోరెత్తకుండా చేసాడు. ఒకవేళ నోరెత్తితే 'ఓటు-నోటు' కేసు కత్తిని బాబు మెడపై వేలాడదీసాడు. విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని గొంతు చించుకుని అరచిన వెంకయ్యనాయుడు కూడా ఏపికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లప్పగించి చూస్తుండిపోయాడు. ఆయనకు మోడీని ప్రశ్నించే తెగువ, నిలదీసి అడగాల్సిన అవసరం కూడా లేకుండా పోయాయి. అంత సాహసం చేసి మోడీ దృష్టిలో విరోధి కావడం ఇష్టం లేదు. అందుకే ఆయన కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీయే మిన్న అని చెప్పడానికి నానా తంటాలు పడ్డాడు. ప్రత్యేకప్యాకేజీని ఏపికి విదిల్చినందుకు సన్మానాలు కూడా చేయించుకున్నాడు.

ప్రత్యేకహోదా అంకం సమసిపోయిందనుకున్న తరుణంలో తమిళనాడులోని జల్లికట్టు రూపంలో ఈ చిచ్చు మళ్ళీ రేగింది. ప్రత్యేకహోదా కోసం ఇటీవల విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం, చంద్రబాబు పోలీసులను పెట్టి వాటిని అణచివేయడం చూసాం. జగన్‌ చేసే ఉద్యమం మూలంగానో, కమ్యూనిష్టులు చేసే ఆందోళన వల్లనో, పవన్‌ కళ్యాణ్‌ పెట్టే ట్వీట్‌ల కారణంగానో ఏపికి ఇప్పుడు ప్రత్యేకహోదా రాకపోవచ్చు. అయితే ప్రత్యేకహోదా విషయంలో అధికారపార్టీ నాయకులు ఆడుతున్న కపట నాటకాలు మాత్రం ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నామని, ప్యాకేజీకి ఒప్పుకోబట్టే పోలవరం ప్రాజెక్ట్‌ వచ్చిందని, కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఎవరికి వస్తుంది, ఎవరు అభివృద్ధి చెందుతారు? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇది ప్రజలకే అంతుబట్టడం లేదు. కేంద్రం నుండి నిధులొచ్చినా అవి ఎక్కడకు పోతాయో, ఎక్కడ పనులు జరుగుతాయో ఎవరికీ తెలియదు. అదే ప్రత్యేకహోదా వస్తే దాని మూలంగా వచ్చే పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూముల విలువలు పెరుగుతాయి. పరిశ్రమల మూలంగా ఇతర వ్యాపారాలు జోరందుకుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్నింటికిమించి పన్నుల రూపేణా ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనాన్ని చవిచూస్తారు. ఇక చంద్రబాబు కేంద్రం దయతలచిందని చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ విభజన చట్టంలో ఉన్నదే! ఏపికి ఇది హక్కేగాని నరేంద్రమోడీ భిక్ష కాదు. దీని కోసం మనం కేంద్రం ముందు దేబిరించాల్సిన పనిలేదు. పోలవరంకు ఎంత ఖర్చయినా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే! కాని, చంద్రబాబు పోలవరం కాంట్రాక్ట్‌ పనిని తన చేతుల్లోకి తీసుకుని హోదాపై కేంద్రంతో రాజీపడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు అంచనా వేయించినట్లుగా పోలవరంకు కేంద్రం పూర్తి స్థాయి నిధులివ్వడం కూడా సందేహంగానే ఉంది.

ప్రత్యేకహోదాను ఇటీవల కేంద్రమంత్రి సుజనాచౌదరి పందుల పోరాటంతో పోల్చడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు చూస్తే ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలేవీ మనకంటే బాగా అభివృద్ధి చెందలేదంటున్నారు. వీళ్లు అమాయకులా? లేక ప్రజలను మరీ అమాయకులనుకుంటున్నారా?

ఉత్తరాఖండ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, జమ్మూ-కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు పూర్తిగా కొండలు, లోయలతో కూడిన ప్రాంతాలు. అక్కడ జనావాసానికే కష్టం. ప్రత్యేకహోదా అమలవుతుంది కాబట్టే ఆ రాష్ట్రాలు ఆమాత్రమన్నా అభివృద్ధి చెందాయి. ప్రత్యేకహోదా ఉండబట్టే కదా తెలుగుదేశం నాయకులు కొందరు ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టగలిగింది. కొండలు, లోయలు ఉన్న రాష్ట్రాలలోనే పెట్టుబడులు పెట్టంగా లేనిది, ప్రత్యేకహోదా వస్తే ఏపి వంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరా? ఆ రాష్ట్రాల కంటే కూడా ఏపిలో భారీగా పెట్టుబడులు పెడతారు.

ప్రత్యేకహోదాతో ప్రయోజనాలు లేవనడం తెలుగుదేశం నాయకుల ప్యాకేజీ ఎత్తుగడలో భాగమే! ప్యాకేజీతో నాయకులు బాగుపడతారు. ప్రత్యేకహోదాతో రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఈ నాటకం రాష్ట్ర ప్రజలకు తెలుసు! రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం ప్రత్యేకహోదాపై పోరాడాల్సిన ముఖ్యమంత్రే ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter