పెద్దనోట్ల రద్దు ప్రభావం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు క్యూలు లేవు. బ్యాంకుల్లో అడిగిన వారికి అడిగినంత కాకపోయినా అవసరాల మేరకు డబ్బులు ఇస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు బ్యాంకుల్లో నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. 2వేల నోట్ల కంటే కూడా కొత్త 500నోట్లు బాగానే చెలామణిలోకి రావడంతో చిల్లర కష్టాలు తీరాయి. వ్యాపారాలు సాధారణ స్థితిలో జరుగుతున్నాయి. కరెన్సీ కష్టాలు చాలావరకు తీరినట్లే! మరి వ్యాపారంలో వస్తున్న నష్టాలను తగ్గించుకునేదెట్లా? పెద్దనోట్ల రద్దు మూలంగా స్థంభించిపోయిన వ్యాపార లావాదేవీలను తిరిగి పట్టాలెక్కించేదెట్లా? ఇదీ పెద్ద ప్రశ్నగా మారింది.
పెద్దనోట్ల రద్దు మూలంగా బంగారం వ్యాపారం బాగా దెబ్బతింది. నల్లధనం బాగా చెలామణి అయ్యేది బంగారం కొనుగోళ్లలోనే! నోట్ల రద్దు తర్వాత కేంద్రం బంగారం కొనుగోలుకు పాన్‌కార్డును సమర్పించాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది. పాన్‌కార్డు ఇవ్వడమంటే బంగారం ఎంతకు కొంటున్నారన్నది రికార్డవుతుంది. దీనికి సంబంధించి ఆదాయపన్ను వివరాలు అన్నీ ఉండాలి. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనడం తగ్గించేసారు. బంగారం అమ్మకాలు పడిపోవడంతో వ్యాపారులు లాభాలు పోయి నష్టాల్లో కొనసాగే పరిస్థితి.
నోట్ల రద్దుకు ప్రధానంగా బలైంది రియల్ఎస్టేట్ వ్యాపారం. ఈరోజు దేశంలోనే వ్యవసాయం తర్వాత ప్రత్యక్షంగా గాని పరోక్షంగాగాని ఎక్కువ శాతం మందికి వ్యాపారం, ఉపాధి కల్పిస్తున్న రంగమిది. ఒకరకంగా ఈరోజు రైతుల భూములకు విలువ తెచ్చింది కూడా ఈ రియల్ ఎస్టేటే! మనం వాడే గుండుసూది నుండి ప్రతిఒక్క వస్తువుకు ఈరోజు రియల్ ఎస్టేట్‌తో అనుబంధమేర్పడింది. ప్రభుత్వ ఆదాయ వనరుల్లో రియల్ఎస్టేట్ ఒక భాగమైంది. పెద్దనోట్ల రద్దుకు ముందు రాష్ట్రంలో జిల్లా వారీగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం చూడమనండి, నోట్ల రద్దు తర్వాత ఈ మూడునెలల ఆదాయం చూడమనండి! రియల్ ఎస్టేట్ వల్ల రిజిష్ట్రార్ శాఖ ఆదాయం ఎంతగా పడిపోయిందో తెలుస్తుంది. ప్రభుత్వానికి ఆదాయాన్నిస్తూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా వృత్తి వ్యాపార రంగాలకు ఆర్ధిక మార్గంగా వున్న రియల్ ఎస్టేట్ మాత్రం పెద్దనోట్ల రద్దు ప్రభావం నుండి ఇంకా తెప్పరిల్లుకోలేదు. ఇది ఎక్కువుగా బ్లాక్‌మనీ మీద ఆధారపడిన రంగం. ఇప్పుడు బ్లాక్ అంతా బ్యాంకుల్లో వుంది. ఆంక్షలను అధిగమించి బ్లాక్ బయటకు రావడం కష్టం. అందుకే 'రియల్'కు ఈ కష్టనష్టాలు.