Friday, 03 February 2017 07:22

'తెలుగువెలుగు' బస్సులో చంద్రబాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaఓదార్పు వీర వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అప్పుడే కర్నూలు జిల్లాలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఇడుపులపాయకు చేరుకున్నాడు. తండ్రి వై.యస్‌. సమాధి వద్దకు వెళ్లి దండం పెట్టుకుని, అక్కడే వున్న గెస్ట్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడ కొండలు, పచ్చటి పైర్లు చూసి, ఆ రాత్రికి అక్కడే పడుకోవాలనిపించిందాయనకు. ఆ రాత్రికి రెండు పుల్కాలు తిని, నులక మంచం తెప్పించుకుని పొలం గట్టుమీద వేయించుకుని దానిపై నడుంవాల్చాడు. చల్లగా వీస్తున్న పైరుగాలికి ఆయనకు ప్రాణం ఎంతో హాయిగా వుంది. పెద్ద పెద్ద ఇంద్రభవనాల్లో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని అనుకుంటూ చల్లగా నిద్రలోకి జారుకున్నాడు.

----------

జగన్‌ నిద్ర లేచాడు. భారతి ఆయ నకు బెడ్‌ కాఫీ అందించింది. కాఫీ తాగుతూ జగన్‌ 'ఈనాడు' పత్రిక చేతికి తీసుకున్నాడు. ఆ పత్రికలో హెడ్డింగ్‌ చూసి జగన్‌కు కళ్లు బైర్లు కమ్మాయి. 'రాష్ట్రంలో జగన్‌కు పెరుగుతున్న ప్రజా దరణ' అనే హెడ్డింగ్‌తో వార్త... దాని క్రిందనే ''ప్రత్యేకహోదాకై జగన్‌ చేసే పోరాటానికి పూర్తి మద్దతు'' అన్న హెడ్డింగ్‌తో హైటెక్‌రత్న చంద్రబాబు స్టేట్‌మెంట్‌! ఈ విచిత్రవార్త ఏంటబ్బా అని జగన్‌ ఆ వార్తను పూర్తిగా చదివాడు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రత్యేకహోదా కోసం ప్రత్యక్షంగా పోరాడలేమని, కాబట్టి జగన్‌ చేసే పోరాటానికి తాము పరోక్ష మద్దతు పలుకుతామని చంద్రబాబు పత్రికా విలే కరుల సమావేసం పెట్టి మరీ చెప్పారు. ఆ వార్త చదవడంతోటే జగన్‌ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి మహానాయ కుడినా నేను ఇంతకాలం అపార్ధం చేసుకున్నాను. ఇలాంటి మంచి వ్యక్తిపైనా నేను ఇంతకాలం విమర్శలు చేసింది అని పశ్చాత్తాపడ్డాడు. తర్వాత జగనే చంద్ర బాబుకు ఫోన్‌ చేశాడు. చంద్రబాబు అవతల ఫోన్‌ ఎత్తగానే, సార్‌, ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు పలికినం దుకు కృతజ్ఞతలని జగన్‌ అన్నాడు. అందుకు చంద్రబాబు... హోదా పోరా టానికి పరోక్ష సహకారమిస్తాం, విశాఖ బీచ్‌లో క్యాండిల్‌ ప్రదర్శన పెట్టారు కదా, దానికి మా వంతుగా లక్ష క్యాండిల్స్‌ పంపిస్తాం, ఆ క్యాండిల్స్‌ మేం పంపించి నట్లు ఆ వెంకయ్యనాయుడుకు తెలియ నీయ వద్దు. అతను అసలే సిబిఐ ఆఫీసర్‌. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేరకం అని చెప్పాడు. అలాగేనంటూ జగన్‌ ఫోన్‌ పెట్టేసాడు. తర్వాత జగన్‌ ఏబిసిటీవీ ఛానెల్‌ పెట్టాడు. అప్పుడే వార్తలు వస్తు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో తల పెట్టిన సిఐఐ సదస్సు వాయిదా... విశాఖ వేదికగా ప్రతిపక్ష నేత వై.యస్‌.జగ న్మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా ఉద్యమం చేస్తున్నందున, ఉద్యమానికి ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశ్యంతో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మ కంగా ఈ సదస్సును వాయిదా వేయిం చినట్లు తెలుస్తోందని న్యూస్‌రీడర్‌ చదువుతున్నాడు. ఈ వార్తతో జగన్‌కు చంద్రబాబు పట్ల గౌరవం రేంజ్‌ ఇంకొంచెం పెరిగింది. జగన్‌ తర్వాత 'ఆత్మసాక్షి' ఛానెల్‌ పెట్టాడు. అందులో ''పొదుపు ముఖ్యమంత్రి మన చంద్ర బాబు'' అనే అంశంతో ప్రత్యేక కథనం.. విభజన తర్వాత ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించడానికి మన ముఖ్యమంత్రి ఎన్నో పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా దుబారాను అరికట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అందమైన రాజధానిని రూపాయి ఖర్చు లేకుండా నిర్మించాలనే లక్ష్యంతో ఒక్క రూపాయి నష్టపరిహారమివ్వకుండా రైతుల నుండి 33వేల ఎకరాల భూమిని సేకరించారు. రాజధానిని నిర్మించే నిర్మాణ రంగ సంస్థలకు కూడా డబ్బులిచ్చే పనిలేకుండా, ఖర్చుపెట్టిన దానికి తగ్గట్లుగా భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన ఖర్చును కూడా 10వేల రూపాయలకు పరిమితం చేశారు. ఇందులో వేద పండితులకు వెయ్యినూట పదహార్లు ఇవ్వగా, మిగిలిన డబ్బును ఇటుకలకు, టెంకాయలకు ఖర్చుపెట్టారు. సీఎంగా ఆయన రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినా 'తెలుగు వెలుగు' బస్సుల్లోనే వెళుతున్నారు. ఆ బస్సుఛార్జీలు కూడా రాష్ట్ర ఖజానా నుండి కాకుండా తన జేబు నుండే తీసిస్తున్నారు. విదేశా లకు 'తెలుగువెలుగు' బస్సులు లేక పోవడం వల్లనైతేనేమీ, విదేశాలకు పోవాలంటే విమానఖర్చులు అధికంగా ఉండడం వల్లనైతేనేమీ ఆయన సీఎం అయ్యాక ఇంతవరకు విదేశీ పర్యటనలు కూడా చేయలేదు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తన మూలంగా రూపాయి కూడా భారం పడకూడదనే ఆయన ఉన్నతాశయానికి ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. ఇక గోదావరి, కృష్ణ పుష్కరాల నిర్వహణకు ఆయన పెట్టిన ఖర్చు చూసి జాతీయ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. గోదావరి పుష్కరాలను పదివేల నూట పదహార్లతో, కృష్ణ పుష్కరాలను పన్నెండు వేల నూటపదహార్లతో ఎంతో విజయ వంతంగా నిర్వహించారు. ఇంత తక్కువ ఖర్చుతో పుష్కరాలు నిర్వహించవచ్చా...? అనే విషయం తెలిసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిగ్గుతో తలదించు కుంటున్నారు. 2014లో సీఎం అయ్యింది మొదలు చంద్రబాబునాయుడు తన పొదుపు చర్యలలో భాగంగా ఇంత వరకు విమానం ఎక్కలేదు. హెలికాఫ్టర్‌ ముఖం చూడలేదు. గ్రేట్‌ స్టేట్‌... గ్రేట్‌ సీఎం... అంటూ కథనం ముగించారు. తన టీవీ ఛానెల్‌లో చంద్రబాబు పొదుపు చర్యల గురించి అంతపెద్ద స్టోరీ వచ్చే సరికి జగన్‌కు ఏమీ అర్ధం కాలేదు. నిజజీవితంలో జరిగే దానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి ఎక్కడా లింకు కావడం లేదు, ఏదో తేడా జరుగుతుందని మనసుకు అనిపిస్తుంది. ఈసారి ప్రాం తీయ న్యూస్‌ఛానెల్స్‌ కాకుండా జాతీయ ఛానెల్స్‌ చూద్దామని ఎన్‌డి టీవీ పెట్టాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న అవార్డుల ప్రదా నోత్సవ వేడుక ప్రత్యక్షప్రసారం జరుగు తోంది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీలు వున్నారు. వెంకయ్యనాయుడు మైకు పట్టుకుని, రాజకీయాలలో ఉండే నాయకులకు సభ్యత, సంస్కారం, మాటల్లో మర్యాద చాలా ముఖ్యం. మనం చేసే విమర్శలు, ఆరోపణలు చాలా సంస్కారవంతంగా ఉండాలి. అసహ్యంగా, అసభ్యతగా

ఉండకూడదు. ఇలా సంస్కారవంతమైన విమర్శలు చేసే నాయకులను ప్రతిఏటా ముగ్గురిని ఎంపికచేసి 'సంస్కార్‌ చక్ర' అవార్డులను ప్రదానం చేస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. అసెంబ్లీలోనూ, బయట ఎంతో సంస్కారవంతంగా విమర్శలు చేస్తూ, నాయకులు అంటే ఇలా ఉండాలి అనేదానికి ఉదాహరణగా నిలుస్తున్న తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు, బోండా ఉమామహేశ్వర రావు, యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్‌లను ఈ ఏడాది 'సంస్కార్‌చక్ర' అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రకటిం చారు. అంతే హాల్‌ అంతా చప్పట్లతో మార్మోగుతోంది... ఆ మైకంలో జగన్‌ కూడా చప్పట్లు కొట్ట సాగాడు.

నిద్రలోనే జగన్‌ చప్పట్లు కొట్టడాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది తొలుత భయపడ్డారు. వెంటనే ఒక చెంబుడు నీళ్లు తెచ్చి ఆయన ముఖాన కొట్టారు. ఆ దెబ్బకు జగన్‌ ఉలిక్కిపడిలేచాడు. ఒక పదినిముషాల తర్వాతగాని ఆయనకు అర్ధం కాలేదు... అప్పటిదాకా జరిగిం దంతా కలని... తాను ఇడుపులపాయలో నులకమంచంపైనే వున్నాననే విషయం.

Read 166 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ల్యాండవుతున్న విమానం
  దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
 • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
  వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter