Friday, 10 February 2017 09:57

కన్నీళ్ళు పెట్టుకున్న నెల్లూరు దేశం నేతలు

Written by 
Rate this item
(0 votes)

galpikaఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల ఉత్పత్తి కేంద్రమైన నెల్లూరు నగరం. కాపువీధిలోని స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇల్లు. ''అమ్మడు లెట్స్‌ కుమ్ముడు'' అనే 'ఖైదీ నెం.150' సినిమాలోని పాట రింగ్‌టోన్‌తో వివేకా సెల్‌ మోగింది. నిద్రమత్తులో వివేకా కళ్లు తెరచి సెల్‌ వైపు చూసాడు. నైట్‌రైడర్‌, ముదురుదోమల మంత్రి నారాయణ నుండి ఫోన్‌... ఈ అయ్యవారికి నిద్ర రాదు, నిద్రపోయేవాళ్లను ప్రశాంతంగా పడుకోనీయడు అని వివేకా మనసులో తిట్టుకుంటూ ఫోన్‌ ఎత్తాడు. వివేకన్నా, అర్జంట్‌గా ఒకసారి మన ఇంటి దాకా రాకూడదా అని అవతల నుండి నారాయణ అడిగాడు. వివేకా దానికి... ఇంత అర్థరాత్రి అంత అర్జంట్‌ పనేంటని అడిగాడు. నారాయణ అందుకు... ఇది అర్ధరాత్రా? సూర్యుడు నెత్తిమీదకొచ్చున్నాడు. ఇంతకీ నువ్వేదేశంలో ఉన్నావని అడిగాడు. వివేకా ఆశ్చర్యంగా... నేను నెల్లూరులోనే నా బెడ్‌రూంలో

ఉన్నాను, కాకపోతే నాకు అంతా చీకటిగా వుంది అంటూ కళ్లు తడుముకున్నాడు. ఆయన కళ్లకు వున్న నల్లద్దాలు చేతికి తిగిలాయి. వివేకాకు విషయం అర్ధమైంది. నల్లద్దాలు పక్కనపెట్టేసి రెడీ కావడానికి బాత్రూంలోకి దూరాడు.

```````

మంత్రి ఇంట్లో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డిలు ఉన్నారు. అప్పుడే వివేకా కూడా వచ్చాడు. వివేకా అందరివైపు చూసాడు. అందరి ముఖాల్లోనూ విచారం కనిపిస్తోంది. వివేకా వారితో... ఏంటి, బంగాళాఖాతంలో అందరివీ తలా ఒక షిప్‌ మునిగిపోయినట్లు ఫేస్‌లు పెట్టి వున్నారు. ఏమైందని అడిగాడు. వెంటనే నారాయణ చెప్పడం కాదు చూపిస్తాను ఉండూ అంటూ ఒక సి.డిని పెట్టి టీవీ ఆన్‌ చేశాడు. టీవీ స్క్రీన్‌ మీద సీన్‌ మొదలైంది.

నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ ఛాంబర్‌... మేయర్‌ అజీజ్‌ ప్రెస్‌మీట్‌... అజీజ్‌ మాట్లాడుతున్నాడు. ఈమధ్య నెల్లూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీకు తెలుసు... అభివృద్ధిలో నెల్లూరు నగరాన్ని జెట్‌ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాను. నేను చేస్తున్న అభివృద్ధి చూసి చంద్రబాబే ఆశ్చర్య పోతున్నారు. అజీజ్‌ ఏంట్రా, ఇంత యాక్టివ్‌గా అభివృద్ధి కార్యక్ర మాలు చేస్తున్నాడు, ఇతనేమన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడా? అనే అనుమానం మీకు రావచ్చు. మీకు వచ్చిన అనుమానం కరెక్టే... యస్‌... నేను వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అసెంబ్లీ నుండి పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు, లోకేష్‌లు నన్ను ఒకటే బ్రతిమలాడుతున్నారు పోటీ చేయమని. వారి బాధ చూడలేకే నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నేను పోటీ చేయడమే కాదు, జిల్లా లోని పది అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాను అని చెపుతుండగా... 'ఈరోజు' పత్రిక విలేకరి వుండి... సార్‌, మీపై మంత్రి నారాయణ ఆగ్రహించారట కదా, ఎందుకు? అని అడిగాడు. అందుకు అజీజ్‌, ఆ అయ్యవారికి అంత సీన్‌ లేదు, ఆయనేమన్నా లెక్చరరా, నేను స్టూడెంట్‌నా? ఆయన సొమ్మేదన్నా తెచ్చి నాకు పెట్టాడా... ఆయన నాపై కోప్పడ్డానికి... నేను భయపడడానికి అని బదులిచ్చాడు. టీవీ 10.5 విలేకరి వుండి... ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల విషయంలో సోమిరెడ్డి, ఆదాల, ముంగమూరులతో విబేధాలున్నాయట కదా? అని ప్రశ్నించాడు. అందుకు అజీజ్‌... మీరు సింహానికి చిట్టెలుకలకు పోటీ పెడుతున్నారు. నా ముందు వాళ్లెంత ఆఫ్ట్రాల్‌, అయినా నాతో విభేదాలు పెట్టుకునే స్థాయికి వాళ్లింకా ఎదగలేదు. చంద్రబాబుతో అజీజ్‌కు విబేధాలు అనండి... కరెక్ట్‌! లేదా వెంకయ్యనాయుడుతో విబేధిస్తున్న అజీజ్‌ అని రాయండి రైట్‌... ఈ గల్లీ లీడర్లకు నాకూ పోటీ ఏంటి అని ప్రెస్‌మీట్‌ ముగించాడు. అక్కడితో సి.డి అయిపోవడంతో నారాయణ టీవీ ఆఫ్‌ చేసాడు. వివేకా అందరి వైపు చూసాడు... అందరి కళ్లల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి... నారాయణ, వివేకాతో... నీకు అసలు హృదయం లేదా? ఆ అజీజ్‌ అన్న మాటలకు మా గుండెలు ముక్కలయ్యాయి. ఏడుపు తన్నుకొస్తోంది, కానీ నీకున్నది గుండె కాదు బండ... అందుకే అలా ఎలాంటి చలనం లేకుండా వున్నావని ఆవేదనగా ప్రశ్నించాడు. అప్పుడు వివేకా... ఈ సీన్‌లు చూసాక బండలాంటి నా గుండె కూడా ముక్కలైందంటూ కళ్లకున్న నల్లద్దాలు తీసాడు. ఆశ్చర్యం... వివేకా కళ్లల్లో కూడా కన్నీళ్లే! అందరూ ఆశ్చర్యంగా... నువ్వు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అని అడిగారు. అప్పుడు వివేకా... నా రాజకీయ చరిత్రలో ఇంతటి ఘోరాన్ని ఎప్పుడూ చూడలేదు. నేదురుమల్లి, నల్లపరెడ్డి, మాగుంట, మేకపాటి, బెజవాడ వంటి రాజకీయ కుటుంబాలను ఎదుర్కొన్నాం... ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఈ తొట్టి పిచుక అజీజ్‌ చేతిలో ఇంత అవమానమా? మనం ఇంత మంది కొమ్ములు తిరిగిన నాయకులం వుంటే జిల్లాలో పదిసీట్లను ఆయన గెలిపిస్తాడా... అని వివేకా అన్నాడు. అతను ఎందుకలా మాట్లాడుతున్నాడని నారాయణ అడిగాడు. అప్పుడు వివేకా... ఇది థర్డ్‌ స్టేజ్‌ ఆఫ్‌ హెల్లోసినేషన్‌... అతనిలో ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువయ్యాయి. ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిన వాళ్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే పార్టీని గెలిపిస్తామని, తాను మంత్రినవుతానని, నెల్లూరును రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో నడుపు తానని, నెల్లూరులో ఒక్క ముదురుదోమను కూడా లేకుండా చేస్తానని చెబుతుంటాడు... కాలం గడిచేకొద్ది అతనిలో ఈ ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువై... ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం తానేనని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు. ఇప్పుడే అజీజ్‌ వ్యవహారం సీఎంకు చెబుతానంటూ నారాయణ ఫోన్‌ చేసాడు. అవతల చంద్రబాబు ఫోన్‌ ఎత్తాడు. నారాయణ అజీజ్‌ వ్యవహారమంతా చెప్పాడు. అంతా విన్న చంద్ర బాబు... నాకిప్పుడు నెల్లూరు గురించి పట్టించుకునేంత తీరిక లేదు. అవతల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నా అపాయింట్‌మెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ లాగా అమెరికాను అభివృద్ధి చేయా లంట... ఇంకో పక్క ఇంకో ఆరునెలల్లో అమరావతిని సింగపూర్‌లాగా చేసేయాలి... ఢిల్లీ నుండి చూస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికల నుండి ఎలా గట్టెక్కాలో చెప్పి పుణ్యం కట్టుకోండని ప్రధాని మోడీ బతిమలాడు తున్నాడని చెప్పి పెట్టేసాడు. చంద్రబాబు మాటలు విన్నాక అందరికీ ఒక విషయం అర్ధమైంది... అజీజ్‌ మాటల్లో ఏం తప్పులేదని!

Read 126 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter