17 February 2017 Written by 

ముగిసిన తమిళ'నాటకం'

sasikగత కొన్ని రోజులుగా తమిళనాడులో ఉత్కంఠభరితంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. రెండురోజుల గడువులో రెండు ఊహిం చని పరిణామాలతో తమిళనాడు రాజకీ యాలు అనూహ్య మలుపులు తిరిగాయి. సీఎం కుర్చీ కోసం ఆరాటపడి, తమిళ నాడులో రాజకీయ సంక్షోభానికి కారణ మైన శశికళ చివరికి అక్రమాస్తుల కేసులో జైలుకుపోగా, ఆ పక్కరోజే 16వ తేదీ ఎన్నో రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికు తెరదించుతూ గవర్నర్‌ విద్యా సాగర్‌రావుప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడిఎంకె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళని స్వామిని ఆహ్వానించడం, ఆరోజే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిపోయాయి. ఇక 15రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోవడమే మిగిలివుంది. అయితే ఇప్పుడున్న పరి స్థితుల్లో పన్నీర్‌ సెల్వం వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తిరిగి అన్నాడిఎంకె పక్కకే చేరే అవకాశాలుండడంతో ఆయన మెజార్టీ పరంగా గట్టెక్కడం పెద్ద సమస్య కాదు. కాకపోతే శశికళపై తిరుగుబాటు జెండా ఎగురవేసి డిఎంకె మద్దతుతో సీఎం పీఠ మెక్కాలనుకున్న పన్నీర్‌సెల్వంకి చివరికి కన్నీరే మిగిలింది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

తమిళనాట కొనసాగుతున్న రాజకీయ సన్నివేశాలు ఒక్కోదానికి తెరపడుతూ వస్తోంది. గత ఐదు నెలలుగా తమిళ రాజకీయ నాటకాలు మంచి సస్పెన్స్‌ మధ్య కొనసాగుతుండడం చూస్తున్నాం. ప్రతి అంశంలోనూ టెన్షన్‌! ఆ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా అంతా కూడా అయిదారు నెలలుగా తమిళనాడు పరిణామాలనే ఆసక్తిగా పరిశీలిస్తోంది.

తమిళనాట జరుగుతున్న సరికొత్త నాటకంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలు ముగిసాయి. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యంపై దాదాపు రెండున్నర నెలలపాటు ఉత్కంఠ కొనసాగింది. ఆమె ఆరోగ్యవంతురాలిగా బయటకు రావాలని అభిమానులు చేసిన పూజలు నిష్ఫలమై, ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్ళారు. ఆమె మరణంతో తమిళనాట ఒక సంచలన ఘట్టం ముగిసింది. ఆమెకు ఆంజనేయ భక్తుడిలాంటి పన్నీరు సెల్వంనే ఆమె స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.

అయితే జయలలిత మరణించిన రెండు నెలలకే తమిళ రాజకీయాలలో మరో సంచలన సన్నివేశానికి తెరలేచింది. జయలలిత నెచ్చెలి, వివాదాస్పదురాలైన శశికళ సీఎం పీఠంపై కన్నేసింది. ఇప్పటికిప్పుడు పన్నీరుసెల్వంను ముఖ్యమంత్రి పీఠం నుండి దించాల్సిన అవసరం ఏమీ లేకపోయినా, వేగంగా పావులు కదిపింది. పన్నీరును దించి తాను సీఎం కుర్చీ ఎక్కబోతున్నానన్న సంకేతాలు పంపింది. తదనుగుణంగానే తన ఎమ్మెల్యేలను సమావేశపరచి తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేలా చేసింది. పన్నీరు చేత రాజీనామా చేయించింది. ఆయన చేతనే తాను సీఎంగా ప్రతిపాదించుకుంది. కథంతా సాఫీగా సాగిపోతుందిలే అనుకున్న తరుణంలో నాటకంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. వీరవిధేయుడు అడ్డం చెప్పాడు. చెప్పినట్లు బుద్ధిగా నడుచుకుంటాడనుకున్న పన్నీరుసెల్వం అడ్డం తిరిగాడు. 'అమ్మ' సమాధి సాక్షిగా శశికళపై తిరుగుబాటు చేసాడు. తనను బెదిరించి రాజీనామా లేఖ తీసుకున్నారని ఆరోపించారు. వేరు కుంపటి పెట్టాడు. దీంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి అనుకుంటున్న శశికళ గుండెల్లో రాయి పడింది. పన్నీర్‌సెల్వం తిరుగుబాటుతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కూడా ఆచితూచి వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే ఎవర్నీ ఆహ్వానించలేదు. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీన శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చే అవకాశముండడంతో ఆ దృష్ట్యా కూడా తొందరపడలేదు. ఈలోపు శశికళ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారందరిని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు తరలించి క్యాంప్‌ పెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు భారీ మొత్తంలోనే డబ్బు ఆశ చూపిందని, కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఆమె వద్దే వున్నారని తెలిసింది.

తలరాతలు మార్చిన తీర్పు!

ఏ సుప్రీం కోర్టు తీర్పు కోసం అయితే గవర్నర్‌ ఎదురు చూసాడో 15వ తేదీ ఆ తీర్పు రానే వచ్చింది. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ శిక్ష పడింది. ఇంకేముంది మొత్తం అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ముఖ్యమంత్రి పీఠమెక్కి సచివాలయానికి పోవాలనుకున్న శశికళ జైలుకుపోవాల్సి వచ్చింది. ఆమె కలలు చెదిరిపోయాయి. ఓ పక్క జైలు జీవితం కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఆ మనిషి ఆ రోజంతా కూడా రాజకీయ వ్యూహాల్లోనే గడిపింది. శాసనసభాపపక్ష నేతగా తన స్థానంలో పళనిస్వామిని నియమించింది. తన మేనల్లుడు దినకర్‌ను పార్టీ ఉపకార్యదర్శిగా నియమించింది. జయలలిత సమాధి వద్దకెళ్లి అంజలి ఘటించి ప్రత్యర్థుల పట్ల ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసి జైలుకు బయల్దేరింది. ఇక్కడితో శశికళ సీఎం కలల ఎపిసోడ్‌ ముగిసినట్లయ్యింది.

ఫస్ట్‌క్లాస్‌ సౌకర్యాల కోసమేనా!

తమిళ ప్రజలెవరూ శశికళను సీఎంగా కోరుకోలేదు. ఆమె సీఎం అనే భావం వచ్చేసరికి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. ఆమెకు రాజకీయ నేపధ్యం లేదు. ప్రజల కోసం పోరా డింది లేదు. జయలలితకు స్నేహితురాలిగా మాత్రమే ఆమె ప్రజలకు తెలుసు. అంతమాత్రాన ప్రజలు జయలలిత స్థానంలో ఆమెను చూడలేరుగా! అయితే ఎమ్మెల్యేల బిర్రుతో ఆమె సీఎం కావడానికి తొందరపడింది. పన్నీరుసెల్వం సీఎం అయ్యిందే రెండునెలల క్రితం. ఇంతలోనే ఆయనను దించేసి శశికళ సీఎం పీఠం ఎక్కా లనుకోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. పన్నీర్‌సెల్వం పరిపాలనలో వైఫల్యాలు కూడా ఏమీ లేనప్పుడు ఆయనను తప్పించాల్సిన అవసరం ఏముందనే ఆరోపణలొచ్చాయి. కాని శశికళ సీఎం కావాలను కోవడం వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన అక్రమాస్తుల కేసులో తీర్పు రాబోతుందని ఆమెకు తెలుసు. తీర్పు అనుకూలంగా వస్తే ఇబ్బంది లేదు. అంతా హ్యాపీనే! అదే వ్యతిరేకంగా వస్తే... జైలులోనూ సాధారణ ఖైదీ జీవితమే! అదే సీఎం హోదాలో వుండి జైలు శిక్ష పడితే జైలులో ఆమెను ప్రత్యేకఖైదీగా పరిగణిస్తారు. ఫస్ట్‌క్లాస్‌ వసతులన్నీ ఉంటాయి. ఈ దృష్టితో ఆలోచించే కోర్టు తీర్పుకు ముందే ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలనుకుంది. ప్రమాణస్వీకారం తర్వాత ఒక గంట సీఎంగా వున్నాచాలు... సీఎం సీఎమ్మే... అప్పుడు ఆమెకు జైలులో రాజభోగాలుండేవి. కాని పన్నీరు సెల్వం తిరుగు బాటు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వేచిచూసే ధోరణితో శశికళ సాధారణ ఖైదీగా మారిపోయింది.

పన్నీర్‌కే ఛాన్సుండేదా?

ఒకవేళ పన్నీరుసెల్వం తిరుగుబాటు చేయకుండా జయలలిత పట్ల చూపినట్లే శశికళ పట్ల కూడా విధేయత చూపుంటే తిరిగి మళ్ళీ ఆయనకే సీఎం పదవి దక్కి ఉండేది. ఎందుకంటే శశికళకు కూడా ఆయనపై నమ్మకం కుదిరేది. ఓ వారంరోజులు ఆయన సీఎం సీటుకు దూరమై ఉండేవాడంతే! వచ్చే ఎన్నికల దాకా తిరుగులేకుండా సీఎం సీట్లో ఉండేవాడు.

విఫలమైన వ్యూహం

శశికళపై తిరుగుబాటు చేసిన తర్వాత తన వద్దకు కొంతమందైనా ఎమ్మెల్యేలు వస్తారని పన్నీరు భావించారు. అయితే 9మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన శిబిరంలో చేరారు. కనీసం 20మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు వచ్చున్నా డిఎంకె మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశముండేది. తగిన సంఖ్యలో పన్నీరు వెంట ఎమ్మెల్యేలు రాకపోవడం కూడా రాజకీయ అనిశ్చితిలో ఓ భాగమైంది.

సీన్‌ మార్చిన గవర్నర్‌

శశికళ సీఎం కాకూడదన్నది ప్రధాని మోడీ నుండి చాలా మంది టార్గెట్‌! అది నెరవేరింది. ఇప్పుడు తమిళనాడులో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడడం కేంద్రంలోని ఎన్డీఏకు అవసరం. ఇందుకు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ప్రశ్న? అన్నాడిఎంకె శాసనసభాపక్షనేతగా ఎన్నికైన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం తప్ప మరోమార్గం లేకుండా పోయింది. తమకు అనుకూలుడైన పన్నీరుసెల్వంను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నా కూడా, బీజేపీ నాయకులకు అది అసాధ్యంగానే కనిపించింది. పన్నీరు పక్కన 10మందికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు లేరు. ఇంకో పక్క డిఎంకె అధినేత స్టాలిన్‌ మాట మార్చాడు. అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో తమ నిర్ణయం ప్రకటిస్తామన్నాడు. అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే అటు పళనిస్వామి, ఇటు పన్నీరుల పక్కన మెజార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. డిఎంకెకి కావాల్సింది ఇటువంటి వాతావరణమే. ఈసారి ఎన్నికలంటూ జరిగితే జయలలిత లేదు కాబట్టి ఖచ్చి తంగా డిఎంకె లాభపడుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏకు డిఎంకె మద్దతు ఇవ్వదు. కాంగ్రెస్‌కి మద్దతుదారుగా వున్న డిఎంకె అధికా రంలోకి రావడం వల్ల తమకు ఎటువంటి లాభంలేదని భావించిన బీజేపీ నాయకులు తమిళనాడులో అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే నిర్ణయించుకున్నారు. ఈ దిశలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు వున్న పళనిస్వామికి అవకాశం కల్పించారు.

మొత్తం ఎపిసోడ్‌లో బలైపోయింది ఇద్దరు వ్యక్తులే! మొదట గతంలోవున్న కేసుల కారణంగా శశికళ జైలుకుపోగా, ఎవరో చెప్పిన మాటల భరోసాతో శశికళపై తిరుగుబాటు చేసి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన పన్నీర్‌సెల్వం ఈ రాజకీయ డ్రామాలో బలైపోయారని చెప్పవచ్చు. ఒకవేళ శశికళపై ఆయన తిరుగుబాటు చేయకుండుంటే, కొద్దిరోజుల క్రితం వదిలిన సీఎం కుర్చీ తిరిగి ఆయన క్రిందకే వచ్చుండేది!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • కావలి నాకే కావాలి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
    మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter