'సాగునీరూ లేదు..తాగునీరూ లేదు.. ఎట్టా బతకాల దేవుడా' అంటూ కను పూరుకాలువ పరిధిలోని అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో ఎక్కడా చినుకులు రాలక పోవడంతో ఇక్కడి పంటచేలు బీళ్ళు పడిపోతున్నాయి..చెరువులు దొరువులన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడు గంటిపోయాయి. ఈ కాలువ పరిధికింద సుమారు 33 వేల ఎకరాలకు పైగానే ఆయకట్టు వుంది. ఈ ఆయకట్టుకు 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తా మని అధికారులు హామీ అయితే ఇచ్చారు కానీ, ప్రస్తుతం సాగునీటి కొరత వుండడంతో కేవలం 14వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పంపిణీ చేశారు. దీంతో, మిగిలిన రైతాంగానికి పొలాలకు నీరందక, అటు తాగునీరు లేక..చివరికి పశువులకు మేత కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతు న్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల్లోని ఎంతోమంది రైతులు కంటతడిపెడుతున్నారు. సోమశిల జలాశయంలో ఇప్పుడు 24 టిఎంసిల నీరుంది. అధికారులు సాగునీరిస్తామని తొలుత హామీ ఇచ్చినా ఇప్పుడు మెట్టపైరుకు కూడా నీరివ్వలేమంటున్నారని రైతుల వాపో తున్నారు. పంటలు లేకపోవడం ఒక బాధైతే, ఈ కరువు బారినుంచి మూగజీవాలను ఎలా బతికించుకోవాలన్నది మరో వేదన అంటూ ఆయా ప్రాంతాల్లోని రైతులు ఆవేదన చెందు తున్నారు. ఈ ఆయకట్టు కింద వున్న 40 గ్రామాల్లో కేవలం 15 గ్రామాలకు మాత్రమే సాగునీరు పంపిణీ చేశారు కానీ, మిగిలిన 25 గ్రామాలకు మొండిచేయి చూపించారన్నదే రైతుల వేదన. సంగం బ్యారేజీ వద్దకు 3 వందల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నా, ఆమంచర్ల వద్దకు వచ్చేసరికి 50 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని, ఈ నీటిలో కనీసం 5 క్యూసెక్కుల వంతునైనా చెరువులకు కేటాయిస్తే ఈ ప్రాంతంలో తాగునీటికి, పశువుల దాహార్తి తీరేందుకు ఉపయోగపడతాయని రైతుల సూచన. అయినా పట్టించుకునే నాధులే లేరని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కచెరువుపాడు, అంబాపురం, ఓగూరుపాడు, బుజబుజనెల్లూరు, కల్లూరుపల్లి, కంటేపల్లి, కాకుటూరు, తిప్పవరప్పాడు, రామదాసుకండ్రిగ, గురివిందపూడి, వెంకటాచలం, అనపల్లిపాడు, ఇడంపల్లి, కసుమూరు, చౌటపాళెం, కురిచెర్లపాడు, ముద్దుమూడి, చెరుకుమూడి, వడ్డపూడి, గొట్లపాళెం, బండేపల్లి, మడమనూరు, వీరంపల్లి, జట్లకొండూరు తదితర గ్రామాలన్నీ సాగునీటికొరతతో అల్లాడుతున్నాయి. ఈ గ్రామాల్లో పైర్లు వేసుకున్నవారు ఆ పొలాలు ఎండిపోగా చివరికి మూగజీవాలకు మేత కూడా కరువైపోయిందని, పరిస్థితి ఇంత దయనీయంగా వున్నా ప్రభుత్వం కరుణించకపోవడం దారుణమని రైతన్నలు కంటతడి పెడుతున్నారు. జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులైనా ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సాగునీటి పంపిణీకి తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నష్టాల పాలైవున్న తమను ఆదుకునేందుకు తగు సాయం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
అన్నదాతలను వెంటనే ఆదుకోవాలి
- కొరపాటి మురళీనాయుడు
కనుపూరు కాలువ ఆయకట్టు కింద సాగునీరు లేక అవస్తలు పడు తున్న 25గ్రామాల రైతాంగాన్ని వెంటనే ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సా ర్సీపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొరపాటి మురళీనాయుడు కోరు తున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాల బారిన పడి ఈ ప్రాంత రైతులు బాగా నష్టపోయారని, ఈ ఏడాది వర్షాభావంతో పంటలు పండక అన్నదాతలు అల్లాడిపోతున్నారని, ఈ పరిస్థి తుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ తదితర
ఉన్నతాధికారులు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పంటల కోసం రైతులు ఎంతో వ్యయప్రయాసలకు గురైనారని, ఎంతో ఖర్చుపెట్టి దుక్కులు దున్నుకుని పంటలు వేసుకున్నా చివరికి సాగునీరు లేక పంటలు పోగొట్టుకున్నారని, ఇప్పుడు కనీసం మూగజీవాలకు మేత, తాగునీటికి కూడా కరువొచ్చి పడిందని, ఈ స్థితిలో అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.