24 February 2017 Written by 

అరవ దేశంలో చిచ్చు ఆరేనా?

palaniరాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో వూహించలేం. అందులోనూ ముఖ్యమంత్రి పీఠం వంటి ప్రతిష్టాత్మక పీఠాలను ఆశించే సందర్భంలో జరిగే రాజకీయాలు మరెంత రంజుగా వుంటాయో చెప్పాల్సిన పనేలేదు. అయితే రాజకీయాల్లో కూడా అదృష్టం.. దురదృష్టాల పాత్రను ఒక్కోసారి కాదనలేం. తలపండినోళ్ళంతా కలసినా, ఎవరెంతగా రాజకీయాలు చేసినా, చివరికి వచ్చేసరికి అనుకున్నదొకటి.. జరిగేది మరొకటి అన్నట్లుగా పరిస్థితి తారుమారై పోతుంటుంది. తీరా సీటు మనదే అనుకుంటున్న సమయంలో కొందరిని దురదృష్టం వెంటాడుతుంటుంది..మరెవరినో అదృష్టం వరిస్తుంటుంది. తమిళనాడులో మొన్నటికి మొన్న దాదాపు జరిగిందిదే.

'అమ్మ' మరణంతో అన్నాడిఎంకె సంక్షోభంలో పడిపోయింది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు పోవాల్సిరావడం, అప్పటికప్పుడు పళనిస్వామిని శశి రంగంలోకి దింపడం, ఆమేరకు ఆయన బలనిరూపణకు సిద్ధం కావడం, అత్యధిక మెజార్టీతో విజయం సాధించి సిఎం పీఠం అధిష్టించడం..అన్నీ కొద్దిరోజుల్లోనే చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కూడా వూహించని పరిణామాలే. సెగలు పొగలతో, ముష్టియుద్ధాలతో అసెంబ్లీ జరిగినా, ఎట్టకేలకు ఎడప్పాడి పళనిస్వామి విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించా రంటే.. ఆయనకు అనూహ్యంగా అదృష్టం కలసి రాబట్టే. ఏదేమైనా పళనికి పట్టాభిషేకం జరగడంతో గత కొద్దిరోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితికి దాదాపు తెర పడినట్లే. 30 మంది మంత్రుల్లోనూ ఒకే ఒక్కరు మినహా, మిగిలినవారంతా పాతవారే కావడం, వారంతా ఇటీవల దాకా వున్న జయలలిత మంత్రివర్గంలోని వారేే కావడం పళనిస్వామికి కలసివచ్చే పరిణామమేనని అనుకోవచ్చు.

శాసనసభలో విశ్వాస పరీక్షలో నిలచి గెలిచి అత్యధికశాతం మంది ఎమ్మెల్యేలు తనవైపే వున్నారని పళనిస్వామి నిరూపించుకోవడం ఒక ఎత్తైతే, ఈ సందర్భంగా అసెంబ్లీ రణరంగంగా మారడం ఎంతైనా దురదృష్టకరం. డిఎంకె ఆందోళనలు, స్పీకర్‌పై దాడి తదితర సంఘటనలతో సభ హోరెత్తింది. ఈ సందర్భంలో, 88 మంది ఎమ్మెల్యేలున్న డిఎంకె నాయకుడు స్టాలిన్‌ అనూహ్యంగా రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టారంటే ప్రత్యర్ధి పార్టీ అయిన అన్నాడిఎంకెని ఇరుకున పెట్టేందుకేనని వేరే చెప్పనక్కర లేదు. ఆ తర్వాత జరిగిన గొడవలతో సభంతా రసాభాస కావడం, అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష అధికార అన్నాడిఎంకెకి అనుకూలంగా, అక్రమపద్ధతిలో జరిగిందని ఆరోపిస్తూ ఆ బలపరీక్షను రద్దుచేయాలంటూ స్టాలిన్‌ ఆందోళనలకు దిగడం తెలిసిందే.

ఏదేమైనా, జయలలిత మరణంతో 'అమ్మ' స్థానం తనకే లభిస్తుందనుకున్న పన్నీర్‌కు చివరికి కన్నీరే మిగిలింది. పన్నీర్‌ సిఎం కావచ్చనే నమ్మకంతో బిజెపి తెరవెనుక రాజకీయాలు సాగించినా 'కమలం'కు నిరాశే తోడైంది. అమ్మ ఆశీస్సులు తనకే వున్నాయంటూ ధీమాతో రాజకీయం చేసిన శశికళకు కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. దీంతో శశి కలలపై నిశి కమ్ముకున్నట్లయింది. చివరి క్షణంలో శశికళ ఆశీస్సులతో రంగంలోకి దిగిన పళనిస్వామికి పట్టాభిషేకం దక్కింది. శశికళ శిబిరంలో అనేకమంది ఎమ్మెల్యేలు నిర్బంధంలో వున్నారని, వారిని విడిపిస్తే తానే గెలుస్తానని ధీమగా పలికిన పన్నీర్‌సెల్వంకు కేంద్రప్రభుత్వం అండదండలు దండిగా వున్నా చివరికి వైఫల్యమే లభించింది. 122 మంది పళనిస్వామికి అనుకూలంగా, పన్నీర్‌వర్గీయులు కేవలం 11 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటువేయడంతో, పళనిస్వామికే విజయం దక్కింది. జైలుకు వెళ్తూ కూడా.. ప్రత్యర్థులపై పగ సాధిస్తానంటూ చేసిన చిన్నమ్మ శపధం నెరవేరినట్లయింది.

ఇదిలావుంటే, ప్రజలకోసం అన్నాడిఎంకె పార్టీని ఏర్పాటుచేసిన ఎంజిఆర్‌, జయలలిత కన్న కలలను సాకారం చేయడమే తన లక్ష్యమని, మళ్ళీ అమ్మపాలన రావడం సంతోషంగా వుందంటూ సిఎం పళనిస్వామి తనదైనశైలిలో ముందుకు సాగుతుండడం మంచిదే. తమిళ ప్రజలు కోరుకుంటున్నది ఇదే. అందుకేే ఆయన అమ్మ మాదిరిగానే జనాకర్షక పథకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో జయలలిత ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంకల్పించారు.

'అమ్మ టూ వీలర్‌ పథకాన్ని' ప్రారంభిస్తూ తొలి ఫైలుపై సంతకం చేశారు. స్కూటీ కొనుగోలుచేసే మహిళలకు 50 శాతం రాయితీ లేదా ఒకేసారి 20వేలు ఇవ్వనున్నారు. గర్భిణులకు ఇస్తున్న సాయాన్ని 12 నుంచి 18వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇళ్ళులేని 5వేల మంది జాలర్లకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు ఇస్తున్న నిరుద్యోగభృతిని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. అంచలంచలుగా మద్య నిషేధానికి ఆదేశాలిచ్చారు. జనరంజక పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో నిలచి పోయేవిధంగా పథకాలకు రూపుదిద్దుతున్నారు.

అయితే ఇక్కడ కొన్ని ధర్మసందేహాలున్నాయి. ఇప్పుడు గెలుపు సాధించినంత మాత్రాన పళనిస్వామి ప్రభుత్వం సుస్థిరంగానే వుంటుందా?.. ఎమ్మెల్యేలను చివరిదాకా ఆయన తనవైపే వుండేలా చూసుకోగలడా?...డిఎంకె సెగను తట్టుకోగలడా?.. రానున్న స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో రాణించగలడా?..ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా వున్నాయి. అయినా, కాలమే ఇలాంటివాటికి పరిష్కారాలు చెప్పాలి.

భవిష్యత్తులోనూ ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సిఎంగా పళనిస్వామి ముందుజాగ్రత్తతో నిబ్బరంగా ప్రజాపాలనకు బాటలు వేసుకోవడం ఒక్కటే ఇప్పుడున్న తరుణోపాయం. రచ్చలు రావిళ్ళతో ఇంతకాలం కాగిపోయిన తమిళనాడుకు ఇక కావాల్సింది ప్రజాపాలన. అదికూడా జనరంజకమైన పాలన. ప్రజల ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రజాభ్యున్నతికి బాటలువేస్తూ పారదర్శకమైన.. సుపరిపాలనను అందించ గలిగితేనే సార్ధకత. లేకుంటే పరిస్థితి మళ్ళీ మొదటికే!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter