Friday, 24 February 2017 08:18

పిఎస్‌ఎల్‌వి రాకెట్‌కు ఎక్స్‌ట్రా ఎనర్జీ

Written by 
Rate this item
(0 votes)

galpikaవాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ అది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా ప్రధాని పుతిన్‌, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌, ఇంగ్లాండ్‌ ప్రధాని థెరిసా, జపాన్‌ ప్రధాని షింజో అబేలు అక్కడ సమావేశమై ఉన్నారు. మిగిలిన వారినుద్దేశించి డొనాల్డ్‌ ట్రంప్‌... ఆ ఇండియా వాళ్ళు చూడండి, ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతున్నారట, ఆ ప్రయోగం సక్సెస్‌ అయితే అంతరిక్ష ప్రయోగాలలో వారికి తిరుగుండదు. అంతెందుకు మావే 96 ఉప గ్రహాలను ఇచ్చి వున్నాం. ఫెయిలైతే వారిని బ్లెయిమ్‌ చేయొచ్చు. సక్సెస్‌ అయితే మాతోపాటు మీరందరు కూడా మీ మీ దేశాల ఉపగ్రహాల ప్రయోగాలకు భారత్‌మీద ఆధారపడాల్సి వస్తుంది. అభివృద్ధిలో మనకంటే ఎక్కడో దూరంగా వున్న ఇండియా, అంతరిక్ష ప్రయోగాల్లో మనల్ని దాటిపోతుందంటే నా మనసెందుకో ఒప్పుకోవడం లేదు. అయినా ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపించాలన్న ఆలోచన వీళ్ళకెందుకొచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. అప్పుడు బ్రిటన్‌ ప్రధాని థెరిసా వుండి... ఆ భారతీయులు అంతేనంట సార్‌, ఇంతకుముందు వాళ్లని మేం పరిపాలించాం కదా, వారి మనస్తత్వం మాకు బాగా తెలుసు. ఇద్దరి కోసం తయారుచేసిన బైక్‌పై ఆరుగురు పోతుంటారు. ముగ్గురు ఎక్కే ఆటోలో 13మందిని కుక్కుతారు. నలభైమంది పట్టే బస్సులో నూటనలభైమంది సర్దుకుంటారు. వెయ్యిసీట్లున్న సినిమా హాల్లో ఎగస్ట్రా కుర్చీలేసి రెండువేలమందిని కూర్చోబెడతారు. విమానాలలో అనుమతించడం లేదు కాబట్టి సరిపోతుందిగాని, అనుమతిస్తే విమానాలలో అయినా నిలబడి ఇరుక్కుని ప్రయాణం చేసే రకం వాళ్ళు. ఇప్పుడు అదే సర్దుకుపోయే మనస్తత్వంతో ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను సర్దేసినట్లున్నారని చెప్పింది. జపాన్‌ ప్రధాని షింజోఅబే అందుకుని... భారత్‌ మాకు మంచి మిత్రరాజ్యం. ఆ దేశం ఒక గొప్ప ప్రయోగం జరుపుతున్నం దుకు మాకు ఆనందంగా వుంది. మనం కూడా వెళ్ళి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకిద్దామన్నాడు. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ అందుకుని భారత్‌ మాకు శత్రురాజ్యం. మాకూ ఆ ప్రయోగాన్ని చూడాలని, ఆ రాకెట్‌ ప్రయోగానికి ఏం టెక్నాలజీ వాడుతున్నారో తెలుసుకో వాలనే దురద వుందన్నాడు. అయితే అందరం శాస్త్రవేత్తల రూపంలో షార్‌ సెంటర్‌కు పోదామని ట్రంప్‌ చెప్పడంతో అందరూ ఓకే అన్నారు.

-----

షార్‌ సెంటర్‌లోని కంట్రోల్‌ రూం. ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌, షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌, పలువురు శాస్త్రవేత్తలు వున్నారు. అందరిలోనూ టెన్షన్‌ కనిపిస్తోంది. కిరణ్‌కుమార్‌ వుండి... రేపే పిఎస్‌ఎల్‌వి-సి37 ప్రయోగం. ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపుతున్నాం. సక్సెస్‌ అయితే మన ప్రతిష్ట ఉపగ్రహాలను దాటి పోతుంది. విఫలమైతే తలెత్తుకు తిరగలేం. అదీగాక ఎక్కువుగా విదేశీ ఉపగ్రహాలనే ప్రయోగిస్తున్నాం. ఈ రాకెట్‌ ఫెయిల్‌ కాకుండా ఉండాలంటే ఎగస్ట్రా ఎనర్జీ ఇవ్వాలన్నాడు. కున్హికృష్ణన్‌ అందుకు బదులిస్తూ... సార్‌, ప్రయోగానికి ముందు ఏమేం చేయాలో అన్నీ చేసాం. రాకెట్‌ నమూనాను వెంకన్న పాదాల వద్ద ఉంచి పూజలు చేసాం, చెంగాళమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నాం. రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ వద్ద శాంతిహోమం, నవావరణ, గణపతి పూజలు నిర్వహించి దిష్టి కూడా తీసాం. వాస్తుకు అనుగుణంగానే లాంచ్‌ప్యాడ్‌కు రాకెట్‌ను నిలబెట్టామని చెప్పాడు. అందుకు కిరణ్‌కుమార్‌... ఒక్కోసారి మన బ్రెయిన్‌లతో పాటు ఇంకొన్ని బ్రెయిన్‌లలోని టెక్నిక్‌లు కూడా ప్రయోగాలకు ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఈ జిల్లా రాజకీయ నాయకులను సంప్రదిస్తే బాగుంటుందనిపి స్తోంది. ఎందుకంటే ఈ జిల్లాలోని నాయకులు ఎప్పుడూ ఉత్సా హంగా కనిపిస్తుంటారు. అంతెందుకు ఆ స్టైల్‌ ఆఫ్‌ సింహపురి వివేకాను చూడండి... 66లోనూ 26లా కనిపిస్తాడు. ముందు ఆయనకు ఫోన్‌ చేసి ప్రయోగం సమయానికి ఇక్కడకు రమ్మని చెప్పండి, వారు ఉత్సాహంగా ఉండేందుకు ఏం టెక్నిక్‌ వాడు తున్నారో తెలుసుకోండి, ఆయన సలహాలు మన ప్రయోగానికి ఎంతో ఉపయోగపడుతాయని చెప్పాడు.

-----

రాకెట్‌ ప్రయోగానికి టైం దగ్గర పడింది. శాస్త్రవేత్తల రూపంలో వున్న ట్రంప్‌, థెరిసా, షింజోఅబే, జింగ్‌పింగ్‌, పుతిన్‌లు రాకెట్‌ వద్దకు చేరుకున్నారు. రాకెట్‌కు నాలుగు పక్కలా అరటి పిలకలు కట్టి, పసుపు, కుంకుమ అద్దారు. నలుగురు వేదపండితులు వచ్చి పూజలు చేస్తున్నారు. ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌తో పాటు శాస్త్ర వేత్తలు ఆ పూజల్లో పాల్గొన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ట్రంప్‌ మిగతా వారితో వీళ్ళను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. శాస్త్రీయ కార్యక్రమానికి కూడా సాంప్రదాయాన్ని జోడించిన వీరి సంస్కృతికి నా జోహార్‌ అని అన్నాడు. జింగ్‌పింగ్‌ తప్ప మిగతా వాళ్ళంతా... అవును అన్నట్లు తలూపారు. ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌ ఓ పక్క పూజ చేస్తూనే వాచీ చూసు కుంటూ కున్హికృష్ణన్‌తో... రాహుకాలం రాకముందే రాకెట్‌ను పైకి పంపించాలని, ఇంకా ఆ వివేకా రాలేదా అని అడిగాడు. అప్పుడే అక్కడ వాహనం వచ్చిన అలికిడి...స్టైల్‌ ఆఫ్‌ సింహపురి వివేకా ఒక పెద్ద వాటర్‌ట్యాంకర్‌తో అక్కడకు వచ్చాడు. అది చూసి కిరణ్‌కుమార్‌... ఇక్కడ మంచినీళ్లు మేం అరేంజ్‌ చేసాం, మీరెందుకు నెల్లూరు నుండి తేవడం అని అడిగాడు. అందుకు వివేకా... ఇవి మీరు తాగడానికి కాదు, అంటూ అప్పటికప్పుడు రాకెట్‌కు అమర్చిన నాలుగు స్ట్రాపాన్‌ మోటార్లలో నింపిన ఇంధనాన్ని ఖాళీ చేయించాడు. తర్వాత వాటిని తాను నెల్లూరు నుండి తెచ్చిన పెన్ననీళ్ళతో నింపి మోటార్లకు మూతపెట్టాడు. తర్వాత ఆయనే కిరణ్‌కుమార్‌తో ఇక కొట్టండి కిక్‌... అని చెప్పాడు. వివేకా మాట మీద నమ్మకంతో కిరణ్‌కుమార్‌ ప్రయోగానికి సిగ్నల్‌ ఇచ్చాడు. కౌంట్‌డౌన్‌ జీరోకు రాగానే పిఎస్‌ఎల్‌వి-సి37 నిప్పులు విరజిమ్ముకుంటూ నింగిలోకి దూసూకుపోయింది. అరగంట కాలంలో 104 ఉపగ్రహాలను నిర్దేశించిన కక్ష్యల్లో ప్రవేశపెట్టేసింది. కిరణ్‌కుమార్‌ అక్కడే వున్న వివేకా వద్దకు వెళ్ళి థాంక్స్‌ చెప్పగా, మీరు అడిగిన ఎగస్ట్రా ఎనర్జీ ఈ పెన్ననీళ్లే సార్‌! ఈ నీళ్లు తాగబట్టే మేం ఈ వయసులో కూడా చలాకీగా ఉంటున్నానని చెప్పి బయలుదేరాడు.

104 ఉపగ్రహాలను ఏ విధంగా విజయవంతం చేస్తారో చూద్దామని వచ్చిన ట్రంప్‌, షింజోఅబే, పుతిన్‌, జింగ్‌పింగ్‌, థెరిస్సాలు అసలు నీళ్ళతోనే రాకెట్‌ను పైకి పంపిన భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ చూసి అక్కడే మూర్ఛ వచ్చి పడిపోయారు.

Read 58 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • రాటుదేలిన జగన్‌
    ఆవేశం కాదు ఆలోచనతో కూడిన ప్రసంగం... అర్ధం పర్ధం లేని మాటలతో కాదు అర్ధవంతమైన వివరాలతో విమర్శలు... ఏ అంశం చర్చకు వచ్చినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం... ఏ ప్రశ్న వేసినా ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేకపోవడం... మొన్న ముగిసిన…

Newsletter