నెల్లూరు నగరంలో నుండి రూరల్ గ్రామాలకు వెళ్ళే పలు సెంటర్లు నిత్యం ట్రాఫిక్ రద్దీతో సమస్యలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో నుండి జొన్నవాడ, నరసింహపురం, పొట్టేపాలెం, తాటిపర్తి, ములుమూడి వంటి గ్రామాలకు మూలాపేట గేటు సెంటర్ మీదుగా వెళ్లాలి. ఇరుకళలమ్మ గుడి నుండి జొన్నవాడ పెన్నా వంతెన వరకు రోడ్డును నాలుగులైన్లు చేసారు. కాని, మూలాపేట గేటు మలుపు వద్ద వంతెన మాత్రం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇది నాలుగురోడ్ల కలయిక కావడంతో వాహనాలు మలుపు తిరిగేటప్పుడు తరచూ ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. అంతేకాకుండా ఇసుక రీచ్‌ల నుండి ఇసుక లోడ్‌తో వచ్చే ట్రాక్టర్ల వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య
ఉత్పన్నమవుతోంది. ఇక రూరల్ గ్రామాలకు వెళ్లే ఆటోలను కూడా ఈ మలుపు వద్దే ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటుండడంతో వాహనాలు ఆగిపోతున్నాయి. ఇక్కడ వున్న వంతెనను వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదు. వంతెనను ఇప్పటికిప్పుడు వెడల్పు చేయలేరు కాబట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేవరకు ఇక్కడ ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను కీలక సమయాలలో ఖచ్చితంగా
ఉండేటట్లు చూడాలి.