వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన పంటలను నీటముంచి వికటాట్టహాసం చేస్తుంది. ఈ ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల లాడిపోతున్నారు. అసలే మెట్టప్రాంత రైతులు..కొద్దోగొప్పో నీటితో అష్టకష్టాలు పడి పంటలు పండించుకుంటే ఆ పం టంతా హరీమంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా, అసలే కరువు వాతపడి రైతులు దీనావస్తలో వున్న సమ యంలో వడగండ్లు పడి మరింత కడ గండ్లు తెచ్చాయి. మండే ఎండల్లో కురిసిన ఈ అకాలవర్షాలు రైతులను మళ్ళీ అప్పుల సుడిగుండంలోకి నెట్టేశాయి. కష్టాల్లో వున్న తమను ఆదుకుని తగు చేయూత నందిం చాలని రైతన్నల కుటుంబాలు ప్రభు త్వాన్ని వేడుకుంటున్నాయి. ఇటీవల
ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండా పురం మండలాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు మళ్ళీ అష్టకష్టాల పాలయ్యారు. పలుచోట్ల వడగండ్ల వాన కూడా కురవడంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతరైతులు కోట్లరూపాయల్లో నష్టాల పాలయ్యారు. అసలే వర్షాభావంతో కరువు దెబ్బకు ఇక్కడ పంటలు వేసిందే తక్కువ. అయినా వరుణుడి ఆగ్రహానికి పంటలన్నీ నీటిపాలై నాయి. రైతులకు కన్నీటినే మిగిల్చాయి. సుమారు 400ఎకరాల్లో వరి నీట మునిగి పోయింది. మరో 250ఎకరాల్లో బత్తాయి, వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి తోట లతో పాటు, మొక్కజొన్న, మిరప తదితర పంటలన్నీ మునిగిపోయాయి. అటు వరి రైతులు, ఇటు తోటల రైతాంగం ఈ అకాలవర్షానికి అతలాకుతలమైపోయారు. అప్పోసప్పో చేసి ఎంతో కష్టపడి సాగు చేసుకున్న పంటలు నీట మునగడంతో మళ్ళీ తిరిగి కోలుకోలేనంతగా అప్పుల పాలయ్యారు. వరికుంటపాడు మండలం లోని గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పు రొంపిదొడ్ల గ్రామాల్లోనైతే ఏకంగా వడగండ్ల వానే పడింది. ఈదురుగాలులు, వడగండ్లు కలసి పంటలన్నిటినీ భీభత్సం
చేశాయి. వింజమూరు మండలంలోని వింజమూరు, చాకలకొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్ళవారిపల్లి, ఊటుకూరు, కాటేపల్లి, తమిదపాడు తదితర ప్రాంతా ల్లోనూ, కొండాపురం మండలంలోని గరిమెనపెంట, చల్లవారిపల్లి తదితర ప్రాంతాల్లోనూ వరితో పాటు బత్తాయి, బొప్పాయి తోటలు, తమలపాకు తోటలు, అరటితోటలతో పాటు మిరప, మొక్కజొన్న పంటలు అన్నీ వర్షార్పితమయ్యాయి. ఇక ఆ రైతన్నలకు దేవుడే దిక్కు అన్నట్లుగా అయింది పరిస్థితి. జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరి శీలించి, నష్టం వివరాలను తక్షణం అంచనా వేయించి, నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాల్సి వుంది.