20 April 2017 Written by 

రసవత్తరం.. తమిళ నాటకం

editorదురాశ దు:ఖానికి దారి తీస్తుందని పెద్దలు వూరకే అనలేదు. ఎంతో అనుభవంతో చెప్పిన మాట అది. ఇప్పుడు చిన్నమ్మ శశికళ విషయంలోనూ జరుగుతున్నది ఇదే అన్నట్లుగా వుంది. తమిళనాట చిన్నమ్మ శశికళ చేసిన రాజకీయాలు చివరికి ఆమెనే రాజకీయంగా ఏకాకిని చేస్తున్నాయా అనిపిస్తోంది..తాజా రాజకీయాలు చూస్తుంటే. జయలలిత మరణానంతరం జరిగిన రాజకీయాలు తమిళనాడులో సంచలనం కలిగిస్తే, ఆ తర్వాత శశికళ రాజకీయప్రవేశం, అనంతరం జరిగిన పరిణామాలు మరింత కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి దూరం చేస్తూ అధికారపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చిన్నమ్మకు ఊహించని మరో పెద్ద షాక్‌ అనే చెప్పవచ్చు.

చిన్నమ్మ తొలినుంచీ మొండివైఖరితోనే రాజకీయం నెరిపింది. తమిళుల ఆరాధ్యదైవంగా ప్రఖ్యాతి గాంచిన 'అమ్మ' జయలలితకు స్నేహితురాలైన శశికళ, జయలలిత మరణానంతరం రాజకీయాలను తన గుప్పెట్లోకి తీసుకుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతాననే అపారనమ్మకంతో పావులు కదిపింది. చిత్తం వచ్చిన రీతిలో వ్యవహరించింది. జయలలిత మరణించగానే పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తాను ఎంపికైనట్లు చిన్నమ్మే ప్రకటించుకుంది. అప్పట్లో తాత్కాలిక ముఖ్యమంత్రిగా వుంటూ, అందులోనూ జయలలితకు నమ్మినబంటుగా వున్న పన్నీర్‌సెల్వంను ఆ పదవి నుంచి ఒక్కసారిగా తొల గించేయడమే కాక, పార్టీ నుంచి కూడా బయటకు పంపిన ఘనత చిన్నమ్మదే. ఆ తర్వాత తనకు ఎంతో విశ్వాసపాత్రునిగా వున్న పళనిస్వామిని రంగంలోకి తీసుకువచ్చి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది కూడా చిన్నమ్మే. తనకు జైలుశిక్ష ఖరారైన తర్వాత కూడా, తన కుమారుడైన దినకరన్‌ను మంత్రిని చేసి, పార్టీకి ఉపకార్యదర్శిని కూడా చేసి, తాను జైల్లో వున్నప్పటికీ తమిళనాడు రాజకీయాలను శాసించాలని భావించింది. కానీ, దురదృష్టం ఆమెను వెంటాడుతూనే వుంది. అధికారపార్టీ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఆమె రాజకీయంగా ఇక కోలుకోలేనంతగా ఖంగుతింటున్నారు. జయలలిత మరణించాక ఇక పార్టీ-ప్రభుత్వమూ రెండూ తానే అయి రాష్ట్రాన్ని శాసించాలనే దురాశే చిన్నమ్మ విషయంలో ఇన్నిరకాల విపరిణామాలకు దారితీసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యాక కూడా తదనంతర రాజకీయ పరిణామాల్లోనూ తనదే పైచేయిగా వుండాలనే చిన్నమ్మ భావన. దీంతో పళనికి పాలనలో స్వేచ్ఛ కరవైంది. మరోవైపు పార్టీలో, ప్రభుత్వంలో దినకరన్‌ హవా ఎక్కువైంది. ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న పళనిస్వామికి ఇవన్నీ శిరోభారంగానే పరిణమించాయి. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి కూడా సరైన సహకారం లేక, పాలన పరిస్థితి నిధుల్లేక నీరసపడే స్థితికి వచ్చింది. తమిళనాడులో ఇలా రోజుకో రకం రాజకీయం జరుగుతుంటుంది.

ఇదిలావుంటే, మరోవైపు చకచకా జరుగుతున్న రాజకీయాల్లో.. కొంతమంది ముఖ్యులైన మంత్రులు సైతం పళనిని కాదని పన్నీర్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో, పళనిస్వామికి చివరికి ముఖ్యమంత్రి పీఠంపైనే విరక్తి కలిగే స్థితి ఏర్పడింది. దీంతో, అటు పన్నీర్‌-ఇటు పళనిస్వామి చీలికవర్గాల ప్రహసనం ఎంతదూరం వెళ్తుందోనని రాజకీయవర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది.

అయితే, తాజా పరిస్థితుల్లో దినకరన్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో, తమిళనాట రాజకీయాలు మరింత వేడెక్కాయి. గత రెండుమూడు రోజులుగా చకచకా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో చీలికవర్గంగా వున్న ఇరువర్గాల వారు భేటీ అయి పార్టీని పరిరక్షించే దిశగా చర్చలు ప్రారంభించారు. అన్నా డిఎంకెని తన గుప్పెట్లో పెట్టుకున్న శశికళను, ఆమె కుమారుడు దినకరన్‌ను పార్టీనుంచి బహిష్కరించడమే పార్టీకి మేలు అనే నిర్ణయానికి వారు వచ్చినట్లుంది. ఈ వర్గ రాజకీయాలతోపాటు, దినకరన్‌పై వచ్చిన ఆరోపణలు, తదనంతర పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని మొత్తంగా దూరంగా పెడతామని తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి జయకుమార్‌ ప్రకటించడంతో అధికార అన్నా డిఎంకె (అమ్మ) పార్టీ చిన్నమ్మ శశికళకు పెద్ద షాకే ఇచ్చినట్లయింది. ఇదే సందర్భంలో చీలిక వర్గాలుగా వున్న పన్నీర్‌ వర్గం, అన్నా డిఎంకె (అమ్మ) వర్గం రెండూ విలీనమయ్యేందుకు జరుగుతున్న చర్చల ప్రక్రియలో మరింత వూపు వచ్చింది.

పార్టీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దినకరన్‌ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసి పాలన సాగిస్తామని.. పార్టీ, పాలన రెండూ ఒక కుటుంబం చేతిలో వుండకూడదన్న పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అధికారపార్టీ స్పష్టం చేయడంతో పన్నీర్‌సెల్వంతో విలీనం మాటలు కలిపేందుకు వారికి దారి ఏర్పడింది. ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసంలోనూ తొలుత ఈ విషయాలన్నీ చర్చించే ఒక నిర్ణయానికి రావడంతో ఇరుపార్టీల్లోనూ ఆ మేరకు ఏకాభిప్రాయం కుదరడానికి దోహదం చేసినట్లనుకోవచ్చు. శశికళ కుటుంబం పార్టీ నుంచి దూరమైతేనే విలీనం అనేమాట పరిశీలనకు వస్తుందని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెగేసిచెప్పడం..ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఆ ప్రతిపాదనలకు సరేననడంతో, ఇరువర్గాల విలీనంపై జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఎట్టకేలకు పళనిస్వామి-పన్నీర్‌ సెల్వం వర్గాలు రెండూ ఏకం కావడానికి జరిగిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతుండడంతో రెండువర్గాల్లో కొత్త ఉత్సాహం రెక్కలు విప్పుతోంది. పన్నీర్‌ సెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని, పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు కావాల్సిన వ్యూహాలన్నీ సిద్ధమైనట్లున్నాయి. అయితే, ఇదంతా బిజెపి వ్యూహమేననే వూహాగానాలూ లేకపోలేదు. రేపటి రాజకీయాలు ఎలా వుంటాయో ఊహించలేం! ఏదేమైనా.. ఇన్నాళ్లూ తమిళ రాజకీయాల్ని శాసించిన చిన్నమ్మ..ఈ తాజా పరిస్థితుల నుంచి ఎప్పటికి కోలుకుంటుందో!.. ఏమో!.. కాలమే చెప్పాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • కావలి నాకే కావాలి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
  మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter