Thursday, 20 April 2017 13:40

బెస్ట్‌ డెమోక్రసీ లీడర్‌గా చంద్రబాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaహైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు ఆరోజు అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌లోని తన కష్టార్జితంతో కట్టించుకున్న తన పేదింటికి చేరుకున్నాడు. ఆరోజు ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు జరిగాయో చూద్దామని టీవీ ఆన్‌ చేసి తనకిష్టమైన ఏబిసిడి ఛానెల్‌ పెట్టుకున్నాడు. తన తనయుడు నారా లోకేష్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వార్త రాసాగింది. అంబేద్కర్‌ విగ్రహానికి దండేసి దండం పెట్టుకున్న అనంతరం లోకేష్‌ ఆవేశంగా ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ 126వ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలని చెప్పాడు. ఆ మాట వినడంతోనే చంద్రబాబు తల పట్టుకున్నాడు. వీణ్ణి కాదు అనుకోవాల్సింది, వీడికి చదువు చెప్పినోడిని అనుకోవాలి, జయంతికి, వర్ధంతికి తేడా తెలియకుండా చదువుచెప్పారు. మంత్రి అయ్యాకన్నా మారుతాడనుకుంటే క్యారెక్ట్‌రలో ఏ మాత్రం తేడా లేదనుకుని 'ఆత్మసాక్షి' ఛానెల్‌ మార్చాడు. అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి... అబ్బకు ఆంగ్లం సరిగా రాదు, కొడుక్కి ఆంధ్రం సరిగా రాదు... జయంతులకు, వర్ధంతులకు కూడా తేడా తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలాగా చేస్తామని, అమరావతిని ఐటి రాజధానిగా చేస్తామని చెబుతుంటారు. దీనిని మనం నమ్మాలి. ఎవరన్నా వర్ధంతికి శుభాకాంక్షలు చెబుతారండి... అది ఒక్క లోకేష్‌బాబుకే చెల్లింది అని విమర్శిస్తున్నాడు. అది చూసాక చంద్రబాబుకు ఇంకా చిర్రెత్తుకొచ్చింది. లోకేష్‌ ఎప్పుడన్నా ఒకసారి నోరు విప్పితేనే ఇలా గబ్బు అవుతుంది. కేటీఆర్‌లాగా రోజూ మైకు పట్టుకుంటే ఇంకెంత కంపవుతుందోనని మదనపడుతూ బెడ్‌రూంలోకి వెళ్లి తలక్రింద దిండు పెట్టుకుని... దేవా, ఈ ప్రతిపక్షాలకు మంచిబుద్ధిని ప్రసాదించు, నేను చేసే ప్రతి మంచి పనికీ పెడార్ధాలు తీస్తున్నారు. వారి మనసులు మార్చు, నా ప్రయత్నాలను అర్ధం చేసుకునే మనసును వారికివ్వు అని ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

¬¬¬¬¬

ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అనంతరాము, అరుణ్‌జైట్లీలు సమావేశమై వున్నారు. ఈ ఏడాది బెస్ట్‌ డెమోక్రసీ సీఎం అవార్డును ఎవరికిద్దామంటారని మోడీ అడిగాడు. అరుణ్‌జైట్లీ వుండి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరును, సుష్మాస్వరాజ్‌ దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును, రాజ్‌నాథ్‌సింగ్‌ రమణ్‌సింగ్‌ పేరును ప్రతిపాదించారు. అప్పుడు వెంకయ్యనాయుడు ఆవేశంగా... దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి వారు ఏం చేసారని ఈ అవార్డులివ్వాలి. ఈ అవార్డ్‌కు బెస్ట్‌ లీడర్‌ చంద్రబాబు నాయుడు. ఆయన సీఎం అయ్యాక ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఎంతో బలపడింది. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించ డానికి ఆయన ఎన్నో కొత్త దారులు కనిపెట్టారు. ఆయనెప్పుడూ తన స్వార్ధం చూసుకోలేదు. తన పార్టీ వాళ్లకే పదవులు ఇవ్వా లనుకోలేదు. అందరినీ సమంగా చూసాడు. అన్ని పార్టీల వారినీ గౌరవించాడు. అంతెందుకు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు... ఆ ఓటుకు అత్యధిక రేటు వచ్చేలా చేసిన ఘనత కూడా ఆయనదే! కాబట్టి ఈ అవార్డుకు అన్ని విధాలా ఆయనే అర్హుడని వెంకయ్య చెప్పడంతో మిగతావాళ్లు కూడా ఆయన వాదనతో ఏకీభవించారు. చంద్రబాబును 'ఉత్తమ ప్రజాస్వామ్య రక్షక్‌' అవార్డుకు ఎంపిక చేశారు.

¬¬¬¬¬

ఢిల్లీలోని అశోక హాల్‌... ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. వెంకయ్యనాయుడు అధ్యక్షోపన్యాసం చేస్తూ.... ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో తమవంతు కృషి చేసిన నాయకులను గుర్తించి ప్రతి సంవత్సరం ఒక్కో నాయకుడికి 'ఉత్తమ ప్రజాస్వామ్య పరిరక్షక్‌' అవార్డులివ్వాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రజాస్వామ్య విధానాలను ఆవిష్కరించి, ఓట్లతోనే కాదు నోట్లతోనూ జయాపజయాలను నిర్ణయించవచ్చని చాటిచెప్పిన చంద్రబాబును ఈ ఏటి 'ఉత్తమ ప్రజాస్వామ్య పరిరక్షక్‌' అవార్డును అందుకోవాల్సిందిగా కోరాడు. అప్పుడు సభ మధ్యలో నుండి... 'ఆపండి..' అనే కేక వినిపించింది. అందరూ అటువైపు చూసారు. తమిళనాడు సీఎం పళనిస్వామి లేచి నిలబడివున్నాడు. ఆయన ఆవేశంగా... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నూటపాతికమంది ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌లో పెట్టుకుని కాపాడి ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి నయ్యాను, ఆ అవార్డు నాకే రావాలన్నాడు. అప్పుడే సభ మధ్యలో నుండి... నీకు అంత సీన్‌ లేదు అనే మాట వినిపించింది. అందరూ ఆ వైపు చూసారు. వైకాపా నేత జగన్‌ లేచి వున్నాడు. ఆయన పళనిస్వామి వైపు ఆవేశంగా చూస్తూ... నీకు అంత సీన్‌ లేదు. నూటపాతికమంది ఎమ్మెల్యేలను పెట్టుకుని కూడా సీఎం కావడానికి నవ్వు నానా తంటాలు పడ్డావు. అదే మా చంద్రబాబు 1995లో వైశ్రాయ్‌ హోటల్‌లో 20మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని డ్రామా ఆడించి సీఎం అయ్యాడు. నువ్వు గొప్పా, మా చంద్రబాబు గొప్పా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పలేక పళనిస్వామి తల వంచాడు. తర్వాత జగనే వుండి... మాది పాండవులు, కౌరవుల బంధం. ఏపిలో మేం మేం కొట్టుకుంటే శత్రువులం... అదే పరాయి రాష్ట్రం వాళ్ళు మాపైకి వస్తే అందరమూ మిత్రులమే... మా స్టేట్‌ సీఎంకు ఈ అవార్డు వస్తుందంటే, మాకొచ్చినట్లే కదా... అని చెప్పి కూర్చున్నాడు. జగన్‌ ఉన్నట్లుండి తనపై చూపించిన అభిమానాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయాడు. ఇంతకాలం ఇలాంటి డైమండ్‌నా నేను తిట్టింది, నా వాళ్ల చేత తిట్టించింది అని పశ్చాత్తాపడుతూ ఏడవ సాగాడు. బాబు ఏడుస్తున్నాడు గాని గొంతులో నుండి సౌండ్‌ రాలేదు. సౌండ్‌ రాకపోయేసరికి నాకేదో అయ్యిందనే ఆందోళనతో చంద్రబాబు పెద్దగా అరిచాడు. ఈసారి సౌండ్‌ బయటకొచ్చింది. కాకపోతే ఆ సౌండ్‌కు పక్కనే నిద్రిస్తున్న భువనేశ్వరీదేవి బెదిరిపోయి లేచింది. వెంటనే చంద్రబాబు ముఖం మీద నీళ్ళు చల్లింది. చంద్రబాబు అప్పుడు తెప్పరిల్లుకున్నాడు. అప్పటిదాకా తనకొచ్చింది కల అని తెలుసుకున్నాడు. ఇక బుద్ధుంటే రాత్రి పడుకునేముందు 'ఆత్మసాక్షి' ఛానెల్‌ వార్తలను చూడకూడదు, లోకేష్‌ స్పీచ్‌లను వినకూడదు అని నిర్ణయించుకుని మళ్ళీ ముసుగుతన్నాడు.

Read 19 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter