తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. పశుగ్రాసం, నీటి కొరతవల్ల గడిచిన 45 రోజుల్లో 1255 పాడిపశువులు మృత్యు వాత పడినట్లు సమాచారం. పూట గడ వడమే కష్టమైన సమయంలో పశుపోషణ భారంగా మారిన రైతులు వాటిని తెగ నమ్ముకుంటున్నారు. పశుపోషణ భరించ లేక ఇప్పటికే అత్యధిక శాతం పశువులను ఒక్కొక్కటిగా రైతులు కబేళాలకు తరలిస్తు న్నారు. పాల దిగుబడి నిలిచిపోయిన పశువులను తక్కువ ధరలకు రైతులు అమ్మేస్తున్నారు. నీటి కొరతవల్ల పశువుల సంఖ్య తగ్గి పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మార్చి నుంచి కరువు రక్కసి ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో పశుపోషణ రైతులకు తీవ్రమైన భారంగా మారింది. దీంతో జిల్లాలో పాడిపశువులు గడ్డిపోచ కరువై నకనకలాడుతున్నాయి. పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నరైతు కుటుంబాల పరిస్థితి అగమ్య గోచ రంగా మారింది.
Published in
గ్రామసమాచారం
Tagged under
