05 May 2017 Written by 

పైశాచిక..పాక్‌

pak armఒకవైపు కొందరు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులను అడ్డుకునేందుకు సైనికులు ప్రయత్నిస్తుంటే, మరోవైపు నుంచి మరికొంతమంది ముష్కరులు దొంగదెబ్బతీసి దొరికిన జవాన్లను దొరికినట్లు చంపుతారు. ఇదీ... నీతి లేని పాక్‌ సైనిక దుర్నీతి. ఈ అకృత్యాలు ఈనాటివి కావు. ఎప్పటినుంచో పాక్‌ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతూనే వుంది. తాజాగా జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్‌లోనూ పాక్‌ తన పైశాచిక తత్వాన్ని ఇలాగే ప్రదర్శించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గస్తీలో వున్న మన జవాన్లను ఇద్దరిని పాక్‌ సైనికులు అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు. పాక్‌ సైనికులు, ఉగ్రవాదులు సభ్యులుగా వున్న బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బిఏటి) సభ్యులు దొంగచాటుగా భారత భూభాగంలోకి ప్రవేశించి గస్తీలో వున్న ఇద్దరు జవాన్లను దారుణాతిదారుణంగా హతమార్చారు. ఆటోమేటిక్‌ ఆయుధాలు, రాకెట్‌ లాంచర్లతో విరుచుకుపడి వారిపై గుళ్ళ వర్షం కురిపించారు. అంతేకాదు, అత్యంత అమానవీయంగా ఆ జవాన్ల శరీరాలను ఛిద్రం చేసి, తలలు నరికివేశారు. తామూ సైనికులమేనన్న స్థితిని, సైనిక నీతిని సైతం అహంకారంతో విస్మరించారు.

ఈ ఘటనలో సిక్కు పదాతిదళానికి చెందిన నాయబ్‌ సుబేదార్‌ పరంజీత్‌ సింగ్‌, సరిహద్దు భద్రతాదళంలోని 200వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ ప్రేమ్‌సాగర్‌ ఇద్దరూ పాక్‌ సైనికుల కాఠిన్యానికి బలైపోయారు. పాక్‌ అమానుషత్వానికి, పైశాచికత్వానికి ఇది పరాకాష్ట. ఈ సంఘటన మనదేశాన్నంతా కుదిపివేసింది. సైనికులను కాల్చి చంపి, అత్యంత కిరాతకంగా వారి తలలు నరికి.. మొండెం నుంచి వేరుచేయడం, దేహాలను ముక్కలు చేయడం పట్ల దేశమంతటా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. నియంత్రణరేఖను అతిక్రమించి భారత భూభాగంలోకి జొరబడడం, దొరికిన సైనికులను దొరికినట్లు కాల్చిచంపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘించడం తొలి నుంచీ పాక్‌ చేస్తున్న అకృత్యాలే. కయ్యానికి కాలుదువ్వే తత్వంతో చేస్తున్న పాక్‌ కుయత్నాలను భారత్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వుంది. పాక్‌ దుర్నీతిని ప్రపంచానికి తెలియజెప్తూనే వుంది.

అయితే, ఇటీవల పాక్‌ ఆర్మీచీఫ్‌గా జావేద్‌బజ్వా వచ్చాక మన సైనికులపై పాక్‌ సైనికుల అమానుషత్వం మరింతగా పెరిగిపోయింది. సైనికులను చంపడమే కాక, వారి మృతదేహాలపై కూడా కక్ష తీర్చుకునే పైశాచిక పద్ధతి ఎంత అమానవీయమో!..అయినా పైశాచికత్వానికి మారుపేరుగా, కరడుగట్టిన ఉగ్రవాదానికి మారుపేరుగా తయారైన పాక్‌కు ఇలాంటివన్నీ మామూలే. ఎంతటి ఘోరమైన అకృత్యాలనైనా అవేమీ పెద్దవిషయం కాదన్నట్లు వ్యవహరించడం, తమపై ఆరోపణలు చేయడం సరికాదని అనడం, ఆధారాలుంటే చూపండంటూ హుంకరించడం, కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని దబాయించడం, అసలు అలాంటి ఘాతుకాలు తమకు తెలియనే తెలియదన్నట్లు బుకాయించడం వంటివన్నీ పాక్‌కు మామూలే. ఇలాంటి ఎత్తులు జిత్తులన్నీ పాక్‌ ఎంతోకాలం నుంచీ చేస్తున్నవే. భారత్‌-పాక్‌ దేశాల మధ్య వున్న విభేదాలు పరిష్కరించుకునేందుకు కొద్దిగా సానుకూల వాతావరణం ఏర్పడినట్లు భావిస్తే చాలు.. ఇలాంటి అఘాయిత్యాలతో మళ్ళీ కయ్యానికి కాలుదువ్వే విధంగానే వ్యవహరించడం పాక్‌కు అలవాటు. అది దాని నైజం. పాక్‌ దుర్మార్గాలకు వెరవకుండా ఆరు నెలల క్రితం భారత్‌ సేనలు సర్జికల్‌దాడులు చేసిన తర్వాత, పాక్‌ తన దుందుడుకు చర్యలకు ఇక స్వస్తి చెప్తుందనే అందరూ భావించారు కానీ, పాక్‌ వ్యూహాత్మకంగా మళ్ళీ ఇలాంటి కిరాతకాలకు ఒడిగడుతూనే వుండడం దారుణం.

భారత్‌లో దౌష్ట్యాలకు పాల్పడడం పాక్‌కు అలవాటే. భారత జవాన్లను చంపడం, వారి మృతదేహాలను ముక్కలుముక్కలు చేసి వికృతహాసం చేయడం కూడా ఇటీవల వారికి చాలా మామూలైపోతోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే మూడుసార్లు పాకిస్తాన్‌ సైనికులు ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో భారతజవాన్ల పట్ల ఇలాగే అమానుషత్వం ప్రదర్శించారు. ఈ రెండు ఘటనలు కూడా నియంత్రణరేఖ వద్ద వున్న మిచిల్‌ సెక్టార్‌లోనే జరిగాయి. తాజాగా మొన్న కృష్ణఘటి సెక్టార్‌లో ఇద్దరు సైనికులను అదేవిధంగా హతమార్చి రాక్షసానందం పొందారు. ఈ ఏడాది ఇప్పటికే 65 సార్లు పాక్‌ బలగాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డా యంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా వుందో తేటతెల్లమవుతోంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే జమ్ము కాశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి పాక్‌ సైన్యం ఏడుసార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. 2014లో 150 సార్లు, 2015లో మరో 150 సార్లు, 2016లో 228 సార్లు పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నిసార్లు అతిక్రమణలు చేస్తున్నా భారత్‌ నిబ్బరంగా చూస్తూనే వుంది.

సైనికుల మృతదేహాలను ఛిద్రం చేసే అత్యంత పైశాచికమైన ఘటనలు భయంకరమైన యుద్ధాల్లో సైతం వుండవు. అలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు తగు శాస్తి తప్పదని, అందుకు బదులు తీర్చుకుంటామని భారత్‌ స్పష్టం చేస్తోంది. పాక్‌ మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలకు దిగకుండా గుణపాఠం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఒకవైపు కశ్మీర్‌లోయలో ఆందోళనల మంటలు పెట్టి చోద్యం చూస్తూనే, మరోవైపు సరిహద్దుల్లో జవాన్లపై అమానుషత్వాలకు.. అకృత్యాలకు పాల్పడుతూ పాక్‌ తన దుష్టనీతిని చాటుకుంటోంది. ఉగ్రవాదానికి పుట్టినిల్లయిన పాక్‌, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి మారణహోమాలు సృష్టించడం ద్వారా భారత్‌ను అడుగడుగునా భయపెట్టాలని చూస్తూనే వుంది. భారత్‌ను కష్టాల్లోకి నెట్టడమే పనిగా పెట్టుకుని చేస్తున్న పాక్‌ దుశ్చర్యలకు భారత్‌ ఏనాడూ భయపడదని తెలిసినా, పాక్‌ అనునిత్యం దుష్కృత్యాలను కొనసాగిస్తూనే వుంది. ఇకనైనా భారత్‌పై అమానుషత్వాలు మానకుంటే..చివరికి నష్టపోయేది తానేనన్న విషయాన్ని పాక్‌ తెలుసుకోవాల్సి వుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter