Friday, 05 May 2017 12:13

ప్రపంచ పిచ్చోళ్ళ తిక్క కుదిర్చిన చంద్రబాబు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది జపాన్‌ రాజధాని టోక్యో! జపాన్‌ ప్రధాని షింజోఅబే కార్యా లయం. షింజో అబేతో పాటు చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా, పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ మోర్కెల్‌లు సమావేశమైవున్నారు. జపాన్‌ ప్రధాని షింజోఅబే వారినుద్దేశించి మాట్లాడుతూ... మిమ్మల్నందరినీ ఇంత అర్జంట్‌గా పిలిపించినందుకు మన్నించండి, కాని పిలిపించాల్సిన పరిస్థితి మాత్రం అలాంటిది. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి పిచ్చోళ్ల చేతిలో రాళ్ళ దెబ్బలు తినడానికి సిద్ధంగా వున్నట్లుంది. ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడాలో చర్చించేదానికే మిమ్మల్ని పిలిపించానన్నాడు. వెంటనే చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ వుండి... సోది ఆపి స్టోరీ ఏంటో చెప్పండన్నాడు. ఆ తర్వాత భారత ప్రధాని మోడీ కూడా... మా దేశానికి వెళ్ళి నేను కూడా జనాన్ని బాదాల్సిన పనులు చాలానే వున్నాయి, సబ్జెక్ట్‌లోకి రండి అన్నాడు. అందుకు షింజో అబే... ప్రపంచానికి ఇప్పుడు ఇద్దరు పిచ్చోళ్ళు ప్రమాదకరంగా తయారయ్యారు. ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రెండోవాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌. వీళ్లిద్దరి తలకాయలు ఒకటే, ఆలోచనలు ఒకటేగా ఉంటున్నాయి. ఇద్దరు కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇద్దరి దగ్గరా అణు బాంబులే కాదు అంతకుమించిన శక్తివంతమైన బాంబులు కూడా వున్నాయి. ఆ కిమ్‌ అయితే మూడురోజుల్లో అమెరికాను నాశనం చేస్తానంటున్నాడు. ట్రంప్‌ అయితే ఉత్తరకొరియాను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానంటాడు... ఒక్క విషయం ఏంటంటే ఈ రెండు దేశాల సైన్యం కాని, ప్రజలు కాని యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కేవలం ఈ ఇద్దరు మాత్రమే కోరుకుంటున్నారు. ఇద్దరి పిచ్చోళ్ల వెర్రివేషాలకు మూడో ప్రపంచ యుద్ధం అవసరమా? లక్షలాది మంది ప్రజలు బలికావాలా? యుద్ధం దెబ్బలు తగిలిన వాళ్లం కాబట్టే, అణుబాంబుల వినాశనాన్ని అనుభవించిన వాళ్ళం కాబట్టే ఆ బాధ తెలిసిన వాళ్లంగా నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసానన్నాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వుండి... వాళ్ళిద్దర్నీ యుద్ధం చేసుకుంటే చేసుకోనీయండి, మనం చూస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు కదా, మేం చూడండి, భారత్‌తో దొంగచాటు యుద్ధాలు చేస్తూ ఎంత పైశాచికానందం అనుభవిస్తున్నామో అని చెప్పాడు. వెంటనే భారత ప్రధాని మోడీ లేచి... సార్‌, యుద్ధాలను తమ పైశాచిక అనందాల కోసంగా పరిగణించే మానవత్వంలేని మనుషుల గురించి మనం ఆలోచించనక్కరలేదు. ప్రపంచ శాంతి కోసం మేమెప్పుడూ ముందుంటాం. మానసిక ప్రవర్తన విపరీతంగా వుండే ట్రంప్‌, కిమ్‌ లాంటి వారిని కొన్ని టెక్నికల్‌ పద్ధతుల ద్వారా దారికి తేవాలి. వీళ్లిద్దరి మనసుల్లోనూ యుద్ధం చేయాలనే ఆకాంక్ష బలంగా వుంది. వారి మనసుల్లో వున్న ఆ కాంక్షను నెరవేరిస్తే చాలు... 'చంద్రముఖి' సినిమాలో దెయ్యం వదిలేసిన 'జ్యోతిక' లాగా తిరిగి మామూలు మనుషులవుతారని చెప్పాడు. ఆ తలకాయ నొప్పేదో మీరే చూసి ఈ ప్రపంచానికి ఆ పిచ్చోళ్ల యుద్ధోన్మాదం నుండి విముక్తి కల్పించండని షింజోఅబే వేడుకున్నాడు.

------------

డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో కూర్చుని ఉత్తరకొరియాపై యుద్ధ సన్నివేశాలను లైవ్‌లో చూస్తున్నాడు. అమెరికా యుద్ధ విమానాలు రయ్‌మంటూ నింగికి లేస్తున్నాయి. కొన్ని నిముషాలలోనే ఉత్తర కొరియా దేశంలోని భారీభవనాల మీద బాంబులు వేస్తున్నాయి. ఆ బాంబుల ధాటికి ఉత్తరకొరియాలోని అన్ని నగరాలు ధ్వంస మవుతున్నాయి. ఆ సీన్‌లు చూస్తూ ట్రంప్‌ వెర్రికేకలు వేస్తూ ఆనందంతో ఊగిపోతున్నాడు.

-----------

ఉత్తరకొరియా అధ్యక్షుడు తన కార్యాలయంలో కూర్చుని లైవ్‌ చూస్తున్నాడు. ఉత్తరకొరియా యుద్ధ విమానాలు అమెరికా మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియా, లాస్‌ఏంజల్స్‌ వంటి నగరాలన్నీ కూడా ధ్వంసమవు తున్నాయి. ఆ సీన్‌లు చూసి కిమ్‌ వికటాట్టహాసం చేయసాగాడు. ఇన్నాళ్లకు నా కసి తీరిందని మనసు ప్రశాంతం చేసుకున్నాడు.

------------

టోక్యోలోని షింజోఅబే కార్యాలయం. అంతకుముందులాగే అన్ని దేశాల అధినేతలు వచ్చారు. షింజో అబే వుండి... మోడీగారు, మీకు అన్ని దేశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మూర్ఖత్వా నికే మేనమామలుగా వున్న వాళ్లిద్దరినీ మీరు ఎలా దారికి తేగలిగారు అని అడిగాడు. అందుకు మోడీ... మీరంతా వాళ్లిద్దర్నీ ఒక వైపే చూసారు, నేను వాళ్లను రెండో వైపు చూసాను. వాళ్లు చిన్నప్పటి నుండి యుద్ధాలను చూస్తూ పెరిగారు. కాబట్టి మేం కూడా యుద్ధం చేయాలనే ఆకాంక్ష వారిలో పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం లాగా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను ఒకటే ఆలో చించాను, మనం ఎదుర్కోవాల్సింది వాళ్లిద్దర్నీ కాదు, వాళ్ళలో వున్న యుద్ధం చేయాలన్న శాడిజాన్ని అని! పేషంట్‌ రోగం కనిపెడితే డాక్టర్‌కు వైద్యం చేయడం సులభమవుతుంది. వాళ్లిద్దరి రోగాన్ని కనిపెట్టాను కాబట్టే సమస్యను పరిష్కరించడం నాకు సులభమైందని మోడీ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్‌ లెవల్లో చెప్పాడు. వెంటనే బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా... ఇంత ఘనకార్యం చేసినందుకు మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నామని మోడీతో అంది. అందుకు ఆయన... నో, ఇందుకు నేను ఏ మాత్రం అర్హుడిని కాను, దీనికి అర్హులైన వాళ్లు ఇక్కడే వున్నారు... పిలుస్తానుండండి అని... ఎవరికో ఫోన్‌ చేసాడు. రెండు నిముషాల తర్వాత హైటెక్‌రత్న చంద్రబాబు లోపలకు వచ్చాడు. మోడీ అతనిని చూపిస్తూ ఈ సన్మానం చేయాల్సింది ఈయనకే... మూడేళ్లలోనే ఎన్నో నగరాలతో కూడిన రాజధాని కట్టిస్తానని చెప్పాడు. ఇన్ని నగరాలను ఒకే నగరంలో ఎలా పొందుపరుస్తారని అడిగాను. అందుకు ఆయన చెప్పిన సమాధానం... రాజధానులు కట్టాలంటే కావాల్సింది ఇటుక, ఇసుక, సిమెంట్‌ కాదు, ఒక కంప్యూటర్‌, ఒక గ్రాఫిక్‌ డిజైనర్‌ ఉంటే చాలన్నాడు. ఆ గ్రాఫిక్స్‌లోనే ఆయన అమెరికా, ఉత్తర కొరియాలను సృష్టించాడు. వాటి మీద బాంబులు వేస్తున్నట్లు, యుద్ధం జరుగుతున్నట్లు గ్రాఫిక్‌ డిజైన్‌ చేసాడు. ఇందుకు 'బాహుబలి' డైరెక్టర్‌ రాజమౌళి సహకారం కూడా తీసుకున్నాడు. అమెరికా, ఉత్తర కొరియా సైనికులు, అధికారులు కూడా ఆయనకు సహకరించడం వల్ల వారి దేశాధినేతలకు వీరు గ్రాఫిక్‌ డిజైన్‌ చేసిన యుద్ధ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయగలిగారు. ఆ యుద్ధం సీన్‌లను లైవ్‌లో చూడడం వల్లే ట్రంప్‌, కిమ్‌లిద్దరిలోనూ యుద్ధకాంక్ష తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళు మామూలు మనుషులు. శాంతిమూర్తి గాంధీకి వారసులు. శత్రు దేశాలు కవ్వించినా వాళ్లిద్దరూ ఇక 'అహింసే మా ఆయుధం' అంటారని చెప్పాడు. మోడీ మాట్లాడ్డం అయ్యాక, ఆయా దేశాధినేతలంతా చప్పట్లతో హోరెత్తించడమే కాదు, శాలువాలు కప్పి చంద్రబాబును అభినందించారు.

Read 116 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter