ఓ పక్క షార్ నుండి వదిలిన జిఎస్ఎల్వి-ఎఫ్09 రాకెట్ అంతరిక్షంలో విజయకేతనం ఎగురవేసింది. అదే సమయంలో నెల్లూరుజిల్లా నుండే వదిలిన మరో రాజకీయ రాకెట్ ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అత్యున్నత పదవిని చేపట్టి నెల్లూరుజిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. ఆ రాజకీయ రాకెట్ పేరే యం.వెంకయ్యనాయుడు.
నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలంలోని ఓ మారుమూల గ్రామం చౌటపాలెంకు చెందిన వెంకయ్యనాయుడు ఒకే జెండా, ఒకే అజెండా సిద్ధాం తానికి కట్టుబడి బీజేపీ కార్యకర్త నుండి కేంద్రమంత్రి దాకా అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆవాస పాలక మండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కెన్యాలోని నైరోబిలో ఈ నెల 8వ తేదీన జరిగిన ఆవాస పాలక మండలి సమావేశంలో ఆయనను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆవాస పాలక మండలి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన భారతీయులలో వెంకయ్యనాయుడు మూడోవారు. మాజీఅధ్యక్షుడు మైఖేల్ మ్లియిర్ నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 58 దేశాల ప్రతినిధులు గల ఈ మండలిలో ఆసియా పసిఫిక్ సభ్య దేశాలన్నీ వెంకయ్య పేరును ప్రతిపాదించగా, మిగతా దేశాలు కూడా మద్దతు పలికాయి. ఐక్యరాజ్య సమితి ఆవాస 26వ పాలకమండలి సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్యను ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
ఐక్యరాజ్య సమితి ఆశయాలకు అనుగుణంగా, నూతన ఎజెండా అమలుపై దృష్టి సారించి చేపట్టిన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత పదవిని చేపట్టి భారతీయుడిగా దేశానికి, నెల్లూరీయుడిగా నెల్లూరోళ్లకు గర్వకారణంగా నిలిచిన వెంకయ్యకు 'లాయర్' అభినందనలు.