12 May 2017 Written by 

రాత మారని అన్నదాత

farmerప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలైన రైతన్నల తలరాతలు మాత్రం మారడం లేదు. దేశం గతంలో కంటే ఇప్పుడు మరింత అభివృద్ధి పధంలో పురోగమిస్తున్నా, వ్యవసాయ రంగం మాత్రం నానాటికీ వెనుకబడిపోతూనే వుంది. కారణం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. రైతన్నల సమస్యలను ఎవరు పట్టించుకుంటున్నారు కనుక! పండించిన పంటకు తగ్గ గిట్టుబాటు ధర లేక, ఆరు గాలం కష్టించి చెమటోడ్చి పండించిన పంటను అతి తక్కువ ధరకే అమ్మేసుకుని కన్ళీళ్ళతో ఇంటికి చేరుకుంటున్నాడు రైతు. ఇది ఏ ఒక్క గ్రామంలోనో కాదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వున్న దుర్గతి. అయినా పట్టించుకునేదెవరు?... వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు అనేకం వుంటున్నాయి.. అయినా తీర్చేదెవరు?..

సేద్యం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. దుక్కి దున్నాలి, విత్తనాలు చల్లాలి, ఎరువులు వేయాలి, సాగునీరు పుష్కలంగా వుండాలి, పురుగుమందులు అందుబాటులో వుండాలి..పరిస్థితులన్నీ అనుకూలించి ఆ పంటలు పండాలి. అన్నిటికీ మించి పండించిన పంటకు గిట్టుబాటు ధర వుండాలి. దేశానికి అన్నం పెట్టే రైతు నాలుగు మెతుకులు తినాలంటే గిట్టుబాటు ధర వుంటేనే సాధ్యం. అయినా, అది నేటికీ గగన కుసుమంగానే వుంది. వ్యవసాయరంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా, అధునాతన యంత్రసామగ్రి అందుబాటులోకి వచ్చినా పంటచేలో నీళ్ళులేక, అదునుకు పదునైన వర్షాలు లేక ఎదిగొచ్చిన పంట నిలువునా ఎండిపోతుంటే రైతు ఎంత బాధ పడతాడో.. అ బాధ పడేవారికే తెలుస్తుంది. ఒక్కోసారి పంటలకు పుష్కలంగా నీరుందని సంతోషిస్తున్న తరుణంలో అకాల వర్షాలు ముంచుకొచ్చి పంటలను కళ్ళముందే నిలువునా ముంచేస్తుంటే.. ఆ బాధ కష్టపడ్డ రైతు గుండెకే తెలుస్తుంది. కరువొచ్చినా, వరదొచ్చినా ముందుగా బాధపడేది రైతన్నే. వాన రాకున్నా, కుండపోతగా కురిసినా హడలిపోయేది అన్నదాతే. వరి రైతులు, పండ్ల రైతులు, ఆకుతోటల రైతులు..చెరుకు రైతులు, మిర్చి రైతులు, పత్తిరైతులు ఇలా అనేక రకాల పంటలు సాగుచేసుకుంటున్న రైతులు సేద్యంలో బాగా అనుభవం వున్నవారే అయినప్పటికీ, ప్రకృతి ప్రకోపాలకు గురవడం వల్లనో, లేక గిట్టుబాటు ధర లేకపోవడం వల్లనో.. ఇతరత్రా కారణాల వల్లనో ప్రతి ఏటా సమస్యల సుడిగుండంలో పడిపోతూనే వున్నారు. దిక్కుతోచక కొంతమంది రోడ్లెక్కి ఆందోళనల బాట పడుతున్నారు.

అసలు, దేశ ఆర్థికవ్యవస్థకు ఇరుసు వంటి వ్యవసాయరంగం నానాటికీ కుదేలైపోతున్నా పాలకులు పట్టించుకున్నట్లు వుంటూనే పట్టించుకోకపోవడమే విచారకరం. ఇదే అదనుగా తీసుకుని దళారులు, వ్యాపారులు గ్రామీణ రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతులనుంచి అందినంతా దోచుకుంటున్నారు. మనదేశంలో వ్యవసాయదారుల కుటుంబానికి సగటు రాబడి కేవలం ఆరున్నరవేయి కంటే మించడం లేదని ఒకవైపు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కుటుంబమంతా రోజంతా కష్టపడి పనిచేసినా సగటున వచ్చే రాబడి ఇంతే. మరి, ఇంత కొద్దిమొత్తంతో సగటు రైతు కుటుంబం ఏమి తినాలి?.. ఎలా బతకాలి?.. ఇంకా చదువులు, వైద్యం, ఇతరత్రా ఖర్చులను ఎలా భరాయించాలి?..ఇవన్నీ ప్రభుత్వాలు బాగా ఆలోచించాల్సిన విషయాలు. పంటలకు సాగునీరు లేక అనేక ప్రాంతాల్లో రైతులు ఆకాశం కేసి ఎన్నాళ్ళని నిరీక్షించాలి?.. పంటలు పండక చేసిన అప్పులు ఎలా తీర్చాలి?..ఇలా అన్నదాతల జీవితాలకు అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

ఒకవైపు పేదరికం, మరోవైపు దళారుల మాయాజాలం, వ్యాపారుల ఇంద్రజాలం.. ఇంకోవైపు ప్రకృతి విపత్తులు.. నాల్గో వైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం ఇలా నాలుగువైపులా నాలుగురకాల గండాలుంటే, రైతు బతుకులు ఈ కష్టాల సుడిగుండాల్లోంచి ఎలా బయట పడాలి?.. రేయింబవళ్ళు శ్రమించినా పెట్టిన పెట్టుబడే చేతికి రాకపోతుంటే ఇలాంటి సేద్యం ఎంతకాలం చేయగలమనే నిరాశ రైతులను ఆవరిస్తోంది.. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఆ పథకాలు అసలైన లబ్దిదారులకు చేరుతున్నాయో లేదో ఎవరు పట్టించుకుంటున్నారు?.. అయినా, మనదేశంలో రైతులు ఎవరినీ యాచించరు. తాము పదుగురికీ అన్నం పెట్టేవారే కానీ, ఒకరిని అన్నం పెట్టమని అర్ధిం చరు. అలాంటి ధీరగుణం.. ఔదార్యగుణం మన రైతన్నల సొత్తు. మట్టిని నమ్ముకుని నిత్యం కష్టపడి బతుకుతూ, పదిమందినీ బతికిస్తూ సగర్వంగా జీవించేే మన రైతన్నలు.. రైతు కుటుంబాలే మన దేశానికి అసలైన జీవగర్రలు. అలాంటి రైతుల క్షేమంగా వుండాలి. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ప్రకృతి విపత్తులు, మార్కెట్లో మాయాజాలాలు అన్నీ అన్నదాతలపైనే విరుచుకుపడుతుంటే.. ఎన్నని తట్టుకోగలడు రైతన్న. ఇక ఏమీచేయలేని అసహాయస్థితిలో అప్పులు తీర్చలేక, కుటుంబాలను పోషించు కోలేక అనేకమంది రైతులు బలవన్మరణాలకు సైతం పాల్పడుతుండడం ఎంత బాధాకరం!.. ఇకనైనా ఈ దుస్థితి మారాలి. ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. రైతుల కన్నీళ్ళు తుడవాలి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు కలకాలం హాయిగా వుండేలా చూడాలి. రైతన్నలు ఎంత హాయిగా వుంటే దేశం అంతగా సంతోషంతో కళకళలాడుతుందని గుర్తుంచుకోవాలి. పంటలకు వనరుల కల్పన, ఆర్థిక చేయూత, గిట్టుబాటు ధరతో పాటు ఆయాప్రాంతాల్లో రైతుల సమస్యలను ప్రభుత్వాలు సత్వరం పరిశీలించి పరిష్కరించాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, మేధావులు, శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు అందరూ కలసి రైతుల సమస్యల పరిష్కారానికి ఒక బృహత్తరమైన కార్యాచరణ పధకాన్ని ఆలోచించి అమలు చేయాల్సిన తరుణం ఇదే. ఏదేమైనా సరే, దేశానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి. 'రైతే రాజు'అన్నది కేవలం నినాదంగా కాక..అది ఏనాటికీ చెదరని వాస్తవంగా..సగర్వంగా చాటుకోవాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter