నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా మాటతీరే! కాలు జారితే తీసుకోవచ్చు గాని, నోరు జారితే తీసుకోలేమనే సామెత వుంది కదా!
ఇలా అతిగా నోరు జారే ఒకప్పుడు తమ ముందు కూర్చోవడానికే భయపడ్డ చిన్నాచితకా నాయకుల చేత కూడా నానా మాటలు అనిపించుకుంటున్నారు ఆనం సోదరులు. ముఖ్యంగా ఈ వయసులో ఆనం వివేకానందరెడ్డి ప్రతిపక్ష నేత జగన్‌పై చేస్తున్న విమర్శలు చాలా అతిగా వుంటున్నాయి. ఆపై నలుగురి చేత నాలుగు అనిపించుకుంటున్నాడు. ఎవరి మెహర్బానీ కోసం వివేకా జగన్‌పై ఇంతగా విరుచుకుపడుతున్నాడో అర్ధం కావడం లేదు. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే సీఎం పదవి రాదు, మంత్రి పదవి ఇవ్వరు. ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి మీద కూడా గ్యారంటీ లేదు. మరెందుకు జగన్‌ను అంతగా ఆడిపోసుకోవాలి. కరుడుగట్టిన తెలుగుదేశం నాయకులు కూడా జగన్‌ను తిట్టనంతగా ఈయన ఎందుకు తిట్టాలి. జగన్‌తో పడకపోతే దూరంగా ఉండొచ్చు, లేదా రాజకీయ అవసరాల కోసం రాజకీయ కోణంలోనే విమర్శలు చేయొచ్చు. కాని జుగుప్సాకరమైన విమర్శలేంటి..? జగన్ పగలు రైతు దీక్ష చేస్తాడు.. రాత్రి మందు కొట్టి గుడ్డలిప్పుకుని పడుకుంటాడు... ఇవి విమర్శలా? విజ్ఞత ఉండేవాళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి! కాంగ్రెస్‌లో వున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆశించి వివేకా, రామనారాయణరెడ్డిలిద్దరు కూడా జగన్‌పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. జగన్‌ను నరరూప రాక్షసుడన్నారు. ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదన్నారు. ఉరి తీయాలన్నారు. వీళ్ళ ఆస్తులన్నీ ఏం కొల్లగొట్టాడని జగన్‌ను ఉరితీయాలి? జగన్‌కు ఆనం సోదరులకు మధ్య ఎటువంటి రాజకీయ వైరం లేదు. వై.యస్. హయాంలో వీళ్ల ప్రాబల్యానికి జగన్ ఎప్పుడూ అడ్డుపడింది కూడా లేదు. మరి అతని మీద ఉరితీయాలనేంత కక్షను వీళ్ళు ఎందుకు పెంచుకున్నారో ఎవరికీ అర్ధం కాదు. కాంగ్రెస్‌లోనే కాదు తెలుగుదేశంలో చేరాక కూడా చంద్రబాబు ఇస్తాడో లేదో తెలియని ముష్టి పదవి కోసం జగన్‌పై మళ్ళీ వ్యక్తిగత విమర్శలతో రెచ్చిపోతున్నారు. వివేకా, రామనారాయణరెడ్డిలది మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ చరిత్ర. ఇంతకాలం ఏ పార్టీలో వున్నా
గౌరవం పొందారు. కాని ఇప్పుడు ఇప్పటిదాకా సంపాదించుకున్న ఆ గౌరవాన్ని పోగొట్టు కుంటున్నారు. జగన్‌పై వివేకా చేసే విమర్శలను ఎవరూ పర్షించడం లేదు. ప్రతిఒక్కరూ, ఆఖరుకు తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళు ఈ స్థాయికి దిగజారిపోయారా అని అనుకుంటున్నారు. చివరకు సొంత తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డే తన అన్న ఆనం వివేకాను వీధుల్లో పెట్టాడు. అన్న అని కూడా చూడకుండా నిలువునా కడిగేసాడు. ఇక నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ వివేకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, దీనిపై వివేకా తనయుడు ఆనం రంగమయూర్‌రెడ్డి స్పందించి అనిల్‌ను ఒరే అని సంబోదిస్తూ సవాల్ విసరడం, వైసిపి కార్పొరేటర్ పి.రూప్‌కుమార్‌యాదవ్ మయూర్‌కు కౌంటర్ ఇస్తూ మూడడుగుల మనిషివి, ఆడోళ్లచేత కొట్టించుకుంటావని హెచ్చరించడం... వంటి మాటలన్నీ కూడా హద్దులు దాటినవే! సాధారణంగా ఇంకో సామాజికవర్గం నాయకులు ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆనం సోదరులపై విమర్శలు చేస్తే రెడ్లలోనన్నా రోషం రావాలి. కాని నెల్లూరులో రెడ్లు కూడా అనిల్‌కు ఈ విషయంలో మద్దతునిస్తున్నారు. ఈరోజుకీ ఆనం పక్కన తిరేగే వాళ్ళు కూడా జగన్‌పై ఆయన చేసే విమర్శలను సహించడం లేదు. కాకపోతే వివేకా కోసం భరిస్తున్నారంతే! రోజురోజుకీ జగన్‌పై రెచ్చిపోతూ జనంలో పలుచబడిపోతున్నాడు వివేకా! అంతేకాదు, తన రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే ఏ మాత్రం దరిదాపుల్లోలేని నాయకుల చేత నానా మాటలనిపించుకోవడం అతనికి అవసరమా?