Friday, 19 May 2017 08:57

బాబుకు షాకిచ్చిన ట్రంప్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaజరిగిన కథ - హైటెక్‌రత్న చంద్రబాబు తన టీమ్‌తో అమెరికా పర్యటనకు వెళ్లాడు. వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్‌క్లింటన్‌ దంపతులు, బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లు ఆయనకు స్వాగతం పలికారు. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, బిల్‌గేట్స్‌లు చంద్రబాబు దయవల్లే తాము ఈ స్థాయిలో వున్నామని ట్రంప్‌కు చెబుతారు. అసలు తాను అమెరికా అధ్యక్షుడనయ్యిందే చంద్రబాబు వల్లనని చెప్పి వారికే ట్రంప్‌ షాకిస్తాడు. తర్వాత చంద్ర బాబుకు లిబర్టీ ఆఫ్‌ స్టాచ్యూ, నయాగారా ఫాల్స్‌, డబ్ల్యుటిసి భవనాలు కూల్చిన ప్రాంతాన్ని చూపించి తమ దేశపు గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూసిన ట్రంప్‌కు, చంద్రబాబు ధీటుగా కౌంటర్‌ఎటాక్‌ ఇస్తాడు. చంద్రబాబు నోటి వెంట ఎలాగైనా అమెరికా గ్రేట్‌ అనిపించాలని అనుకుంటూ ట్రంప్‌ అతనిని వైట్‌హౌస్‌కు తీసుకెళతాడు.

ఆ తర్వాత...

చంద్రబాబుకు ట్రంప్‌ వైట్‌హౌస్‌ను చూపిస్తూ... ఇదే ప్రపంచాన్నే దడదడలాడించే అధ్యక్షుడి శ్వేతసౌధం. ఎలాగుంది ఈ ఇంద్ర భవనం అని అడిగాడు. అంతా చూసి చంద్రబాబు... ఇది అమెరికా అధ్యక్షుడి భవనమా... నేను ఇంకా అధ్యక్షుడి బాత్‌రూమ్‌ అను కున్నాను... ఇంకో రెండేళ్ల తర్వాత మా అమరావతికి రండి... ఇలాంటి భవనాలు వందలకొద్ది మీకు సులభ్‌కాంప్లెక్స్‌లు మాదిరిగా కనపడుతుంటాయి. మా అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగులకు మీ వైట్‌హౌస్‌ టైప్‌లోనే బాత్‌రూమ్‌లు కట్టించాలనుకుంటున్నాను, మీరు దీనిని వైట్‌హౌస్‌ అంటున్నారు, మొన్నటి దాకా మా రోశయ్య గవర్నర్‌గా వున్న చెన్నైలోని 'రాజభవన్‌' దీనికంటే బాగుంటుంది. ఇలాంటివి మా దేశంలో రాష్ట్రానికొకటి లెక్కన ఉంటాయని చెప్పాడు. చంద్రబాబు మాటలతో ట్రంప్‌ ముఖం గాలితీసిన బెలూన్‌లా అయ్యింది. ఇతనితో ఎక్కువసేపు మాట్లాడి పరువు పోగొట్టుకోవడం ఎందుకని బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం రండి అని డైనింగ్‌ టేబుల్‌ వద్దకు తీసుకుపోయాడు. ఎయిర్‌పోర్టు నుండి అప్పటి దాకా ట్రంప్‌ పక్కనే వున్న యువతిని చూసి చంద్రబాబు... మీ అమ్మాయికి పెళ్లీడు వచ్చినట్లుంది, మీరు లేటు చేస్తే మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకుని వచ్చేటట్లుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయకూడదూ అని సలహా ఇచ్చాడు. షిట్‌... ఆమె నా కూతురు కాదు, నా భార్య మెలానియా అని పరిచయం చేసాడు ట్రంప్‌. చంద్రబాబు నాలి క్కరుచుకుని మనసులో ఈ వయసులో నీకు ఇంత పడుచుపెళ్లాం అవసరమా అనుకుని... సారీ, పొరపడ్డానండి, ఆమె వయసును బట్టి చూసి మీ కూతురై ఉంటుందనుకున్నాను, అయినా మీరు అదృష్టవంతులు, మా దేశంలో ఇలాంటి అవకాశాలు తక్కువ, మా మామ ఎన్టీఆర్‌ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యాడు కాబట్టే సీఎం కుర్చీ నాకు దక్కిందనుకున్నాడు. అప్పుడే సర్వర్‌లు వచ్చి అందరికీ ప్లేట్లలో టిఫిన్‌ వడ్డించసాగారు. చంద్రబాబు మాత్రం వాళ్ళు వడ్డించబోతున్న వంటకాలను వద్దని తన సూట్‌కేసు తెరిచాడు. అందులో నుండి టిఫిన్‌ బాక్సును బయటకు తీసాడు. మూత తీసాడు. అందులో రెండు పుల్కా, కీర, బొప్పాయికాయ ముక్కలు, బాదం, జీడిపప్పులు ఉన్నాయి. ఏంటిది అని ట్రంప్‌ అడిగాడు. నా బ్రేక్‌ఫాస్ట్‌... నేనెక్కడికి వెళుతున్నా మా ఆవిడే నాకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ బాక్సులు పెడుతుంది. ఆమె పెడుతున్న ఆహారం తింటుండబట్టే నేను ఇంత చలాకీగా వున్నాను. ఆమె పెడుతున్న తిండి కాకుండా బయట అడ్డమైన గడ్డి తినబట్టే మావాడు లోకేష్‌కు జయంతులు, వర్ధంతులకు తేడా తెలియకుండా పోయిందన్నాడు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌ ముగిసింది. కరెక్ట్‌గా అక్కడ వీళ్లు బ్రేక్‌ఫాస్ట్‌ చేసే సమయంలో...

ఏపిలో ఏబిసిడి ఛానెల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ ఇలా వుంది... అమెరికాలో హల్‌చల్‌ చేస్తున్న చంద్రబాబు... అమెరికాలో దిగీ దిగగానే పెట్టుబడుల వేట... అమరావతిలో పెట్టుబడులు పెట్టేం దుకు 'క్యూ' కట్టిన అమెరికా కంపెనీలు... వెల్లువెత్తిన పెట్టుబడులను నియంత్రించేందుకు స్క్రీనింగ్‌ కమిటీ వేసిన చంద్రబాబు... అమెరికాలో చంద్రబాబు పర్యటన విశేషాలపై మా ప్రతినిధి గోకుల కృష్ణ అడిగిన ప్రశ్నకు ఐటి మంత్రి లోకేష్‌బాబు వివరణ చూడండి... స్క్రీన్‌ మీద లోకేష్‌ ప్రత్యక్షమయ్యాడు. నాన్నగారి అమెరికా పర్యటన విజయవంతంగా జరుగుతుంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆసక్తిగా వున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పారు. ఇక నాన్నగారి స్ఫూర్తి తోనే బిల్‌గేట్స్‌ ఎదిగారు. కాబట్టి ఆయన కూడా మైక్రోసాఫ్ట్‌ కంపెనీని అమరావతిలో పెట్టడానికి సిద్ధంగా వున్నారు అని చెబుతుండగా మధ్యలో గోకులకృష్ణ కల్పించుకుని... అమరావతికి 'ఆపిల్‌' కంపెనీ కూడా వస్తుందని తెలిసింది, నిజమేనా? అని ప్రశ్నించాడు. ఒక్క ఆపిల్‌ ఏంటి, పైనాపిల్‌, బొప్పాయి, దానిమ్మ, సపోట, ద్రాక్ష... అని రకాల ఫ్రూట్స్‌ కంపెనీలు కూడా అమరావతికి వస్తాయని అమరావతిలో ఉండేవారికి పండ్లరసాలకు ఇబ్బంది లేకుండా చేస్తానని లోకేష్‌ చెప్పాడు. ఆ సమాధానానికి గోకులకృష్ణ చేత్తో జుట్టును బలంగా పీక్కున్నాడు.

వైట్‌హౌస్‌లో టీవీ ఛానల్స్‌లో దీనిని చూసిన ట్రంప్‌, మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ట్రంప్‌ వుండి.... మీరు దిగి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌ కూడా పూర్తి చేసుకోలేదు, కాని మీ మీడియా ఏంటి, మీ అమెరికా పర్యటన విజయవంతమైనట్లు, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలన్నీ పరుగులు తీస్తున్నట్లు చెబుతున్నాయని అడిగాడు. అందుకు చంద్రబాబు... ఇక్కడ జరిగేదానితో మా మీడియాకు అనవసరం, నేనిక్కడ బెడ్‌రూంలో పడుకుని నిద్రపోతున్నా, నిద్రా హారాలు మాని చంద్రబాబు పెట్టుబడుల కోసం తిరుగుతున్నాడంటూ మా వాళ్ళు వార్తలు ఇస్తారు. ఆ విధంగా నేను సెట్‌ చేసుకున్నా, ఇక్కడ జరిగేది వాళ్లకు వార్త కాదు, వాళ్లకు ఏది తోస్తే అదే వార్త అని చెప్పాడు. తర్వాత అందరూ కలిసి 'డల్లాస్‌' వెళ్లారు. అక్కడ ప్రవా సాంధ్రుల సదస్సు జరుగుతుంది. అక్కడ మాట్లాడిన ప్రవాసాంధ్రులు చంద్రబాబును వీరుడు, శూరుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... మీరంతా ఇక్కడకు వచ్చి కోట్లు సంపాదించారంటే అది నా పుణ్యమే... బాబొస్తే జాబు గ్యారంటీ అన్నాను... ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పాడు. వెంటనే ట్రంప్‌... బాబొస్తే జాబు అన్నారు సరే... కాని, మీ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు కదా అని అడిగాడు. బాబొస్తే జాబు అన్నాను... అంతేగాని ఆ జాబు ఆంధ్రాలోనే అన్నానా? నేను ఏపిని ఎడారిగా మార్చబట్టే కదా వీళ్లందరూ అమెరికా వచ్చి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నాడు. ఆ మాటకు ట్రంప్‌కు అరికాల్లో మండింది. మీ రాజకీయ వాగ్ధానాలను మాతో తీర్చుకుంటారా... అని మనసులో అనుకుంటూ... 'బాబు వస్తే జాబు' అని మీరన్నారు, 'ట్రంప్‌ వస్తే ఇండియన్స్‌ ఉద్యోగా లన్నీ జంప్‌' అని నేనన్నాను. నీలాగే నేనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా అంటూ అప్పుడే హెచ్‌1బి వీసా బిల్లుపై సంతకం చేసాడు. ఆ దెబ్బకు ప్రవాసాంధ్రులంతా బాబు వస్తే జాబు రావడం కాదు, పోవడం గ్యారంటీ అనుకుంటూ కూలబడ్డారు.

(అయిపోయింది)

Read 97 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter