26 May 2017 Written by 

బ్రిటన్‌పై ఉగ్ర పంజా

london atackఉగ్రవాదానికి ప్రాంతాలతో పనిలేదు..ప్రాణాలు తీయడమే పని. అది ఏ ప్రాంతమైనా సరే, జనంపై పంజా విసరడం, అందినంతమందిని పైశాచికంగా మట్టుబెట్టడం..అదే పెద్ద ఘనకార్యంగా తన భుజాలు తానే చరుచుకోవడం ఉగ్రమూకల నైజం. దేశమేదైనా, ప్రాంతమేదైనా సరే.. ఎక్కడికక్కడ ఆత్మాహుతి దళాలను పంపి, అమాయకులను చంపి వారి నెత్తురుని అత్తరులా చల్లుకొని ఆనందించే రాక్షసత్వమే

ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదోన్మాదానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బలి అయిపోతూనే వున్నారు. ఈ విషసర్పాన్ని అంతం చేస్తామని, ప్రపంచంలో దాని ఉనికే లేకుండా చేస్తామని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా అగ్రరాజ్యాలు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నా, తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఉగ్రవాదం బుసలకు తట్టుకోలేక డీలా పడిపోతున్నాయి.

మొన్నటికి మొన్న ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్‌ పరిస్థితి కూడా ఇదే. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్‌ పాప్‌స్టార్‌ అరియానా గ్రాండే సారధ్యంలో అత్యద్భుతంగా నిర్వహించిన సంగీత విభావరి ప్రాంతంలో మరణమృదంగం మోగించాలని ఇస్లామిక్‌ స్టేట్‌ అనే ఉగ్రవాద సంస్థ వ్యూహం పన్నింది. అనుకున్నదే తడవుగా ఆత్మా హుతి దాడితో ఆ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది. ఏకంగా 22 మంది ప్రాణాలను బలితీసుకుని, మరో 120 మందిని తీవ్ర గాయాలపాలు చేసి ఉగ్రవాదో న్మాదం వికటాట్టహాసం చేసింది. బ్రిటన్‌పై ఇస్లామిక్‌ స్టేట్‌ జరిపిన తొలి ఆత్మాహుతి దాడి ఇదే. ఈ ఘటనతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఉగ్రవాద రక్కసుల వల్ల ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి భీభత్సం జరుగుతుందో.. ఎందరు ప్రాణాలు పోగొట్టు కోవాల్సివస్తుందో అర్ధం కాక ప్రపంచ మానవాళి సైతం భయకంపితమవుతోంది. అత్యద్భుతమైన అరియానా గ్రాండే సంగీతం విని తన్మయులై ఆ సంగీత విభావరి పూర్తికాగానే ఆనందోత్సాహాలతో ప్రజలు ఇళ్ళకు తిరిగి బయలుదేరేందుకు బయటకు రాగానే, వేదికకు కొద్దిదూరంలోనే జరిగిన ఈ ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా అక్కడి వాతావరణ మంతా భీభత్సంగా మారిపోయింది. హాహాకారాలతో, ఆర్తనాదాలతో.. అరుపులు కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ మారణకాండ ఉదంతం తెలిసి అరియానా గ్రాండే నిలువెల్లా కంపించిపోయింది.. నోట మాట రాక కన్నీటిపర్యంతమైంది. ఈ దాడి జరిగిన మాంచెస్టర్‌ ఎరీనా హాలు యూరప్‌లోనే అతిపెద్దది కావడం విశేషం. ఇందులో ప్రవేశం ఎంతో కట్టుదిట్టంగా వుంటుంది. అయినా ఒకే ఒక్క ఉగ్రవాది అక్కడకు చేరుకుని, ఆత్మాహుతి దాడి చేయడానికి ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టగలిగాడంటే ఉగ్రవాదులు ఎంత పక్కా వ్యూహంతో వుంటారో తేటతెల్లమవుతోంది. ఉగ్రవాదం పట్ల ఏ ప్రాంతం వారైనా సరే, ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా క్షణాల్లోనే ఎంత ఘోరం జరిగిపోతుందో ఈ సంఘటన ప్రపంచానికి చాటి

చెప్తోంది. అందులోనూ ఈ సంగీత విభావరికి వచ్చిన జనమంతా అత్యధికశాతం మంది యువకులు.. చిన్నారులే. అందులోనూ, అరియానా గ్రాండే అంటే ఎంతో అభిమానం కలిగిన ఎనిమిదేళ్ళ చిన్నారి సఫీ రోజ్‌ ఆ పాటలు వినేందుకు వచ్చింది. గ్రాండే సంగీతం విని ఎంతో ఆనందించి, చిరునవ్వులతో బయటకు వస్తుండగా ఈ భయంకరమైన ఉగ్రదాడి జరగడం.. ఆ చిన్నారి కూడా క్షణాల్లోనే ఈ దాడికి బలి కావడం... ఎంత దారుణం! ఆ చిన్నారి మరణంతో పాటు, ఈ దుర్ఘటన ప్రపంచ ప్రజలను కంటతడి పెట్టించింది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు, ఆత్మీయులను సహచరులను కోల్పోయినవారి వేదనా రోదనలతో...ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది.

అయినా, ఎవరెంతగా రోదించినా.. ఎవరెంత కన్నీరు కార్చినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఉగ్రవాద రాక్షసమూకలకు లెక్కే లేదు. ఆ కిరాతకులకు కావాల్సింది కూడా ఇలాంటి రోదనలే. తమ

ఉన్మాదానికి ఎంతమంది బలైతే అంత సంతోషం ఆ రాక్షసులకు. ఒక్క బ్రిటన్‌లోనే కాదు, దాదాపు అన్నిదేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ..ముఖ్యంగా జనం ఎక్కడ ఆనందంగా వుంటే అక్కడంతా

ఉగ్రదాడులకు తెగబడుతూ వారు తమ రాక్షసత్వం చాటుకుంటూనే వున్నారు... ప్రపంచాన్ని నిత్యం భయకంపితం చేస్తూనే వున్నారు. రెండేళ్ళ క్రితం ఫ్రాన్స్‌లో సాకర్‌పోటీ సమయంలో ఉగ్రవాదులు దాడులుచేసి 128 మందిని హతమార్చారు. గతంలో స్పెయిన్‌లోనూ రైళ్ళలో బాంబులు పేల్చి 200 మంది ప్రాణాలు తీశారు. ఉగ్రవాదుల దాడుల లెక్కవేసు కుంటూపోతే లెక్కకే అందనంతగా వుంటోంది. మాంచెస్టర్‌లో ఈ పైశాచికత్వం తమదేనని, 'మీ పిల్లలను చంపేశాం..ఇంకా చంపుతాం' అంటూ ఐఎస్‌ ప్రకటించడం చూస్తుంటే, ఆ ఉగ్రవాద రక్కసి ఎంత నీచమైనదో..ఎంతగా బరితెగించివుందో.. ప్రపంచా నికి ఎంత ప్రమాదకారిగా మారిందో అర్ధమవుతుంది. ఈ ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో విస్తరించిపోతోందని ప్రపంచం సంబరపడిపోతుంటే, మరోవైపు ఆ సాంకేతిక విజ్ఞానాన్నే ఉగ్రవాదులు అందిపుచ్చుకుని ఇంటర్‌నెట్‌, యూట్యూబ్‌, వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా ప్రపంచమంతా విషబీజాలు నాటుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటూ అమాయక ప్రజల ఉసురుపోసుకుంటున్న ఈ ఉగ్రవాదపు విషవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా కూల్చివేసి ప్రపంచానికి శాంతిని..కాంతిని అందించే రోజు ఎప్పుడు వస్తుందోనంటూ ప్రపంచ మానవాళి అంతా నిరీక్షిస్తూనే వుంది. ప్రధాని మోదీ చెప్పినట్లు, ప్రపంచదేశాలన్నీ ఒకేవేదిక మీదకు వచ్చి ఉగ్రవాదంపై సమిష్టిపోరుకు సమాయత్తమైతే తప్ప ఈ ఉగ్ర వాదం పీడ విరగదు. అందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న మేధావులు..దేశాధినేతలంతా కలసిరావాలి..

ఉగ్రవాదం పీచమణచడమే తక్షణ కర్తవ్యంగా.. అన్ని దేశాలు కలసి తగు కార్యాచరణ పథకంతో ముందుకు రావాలి. అప్పుడే ఈ పిశాచి పీడ విరగడవుతుంది. ఆరోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • ప్రాణాలు తీస్తున్న పందేలు!
  బ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా…
 • నోర్లు తెరిచిన బోర్లు.. మృత్యువుకు రహదార్లు
  బోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • జనం మెచ్చేలా జగన్‌!
  'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని…

Newsletter