02 June 2017 Written by 

మేఘాల్లో మెరిసి మాయమైన... దర్శకరత్నం

dasariసినీరంగంలోని వారి జీవితం..ఓ 'అద్దాలమేడ' వంటిది. నిజంగా అదొక అద్భుత మాయా ప్రపంచం. స్వర్గం-నరకం' రెండూ ఇక్కడనే ఉన్నట్లుంటాయి. 'ఎవరికి వారే యమనా తీరే'..అన్నట్లుగా ఇక్కడ ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ప్రతిభ వారిది. అయినప్పటికీ 'నేనే రాజు-నేనే మంత్రి' అన్నట్లుగా సినీలోకంలో రాణించారు. తన సినిమాలకు తానే మేస్త్రీ అయ్యారు. ఎంతో కృషితో..బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో ఎదిగారు. 'తాత మనవడు' ఆత్మీయతలెలా వుంటాయో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు చూపారు. తన సినిమాల్లో సామాజిక సందేశాలకు ప్రాధాన్యతనిస్తూ 'జస్టిస్‌ చక్రవర్తి'గా నిలిచారు. 'జగన్నాధ రథ చక్రాలు'ను కదిలించారు. అక్రమాలను 'బొబ్బిలిపులి'లా ఎదిరించారు. అందరికీ ప్రేమాస్పదమైన 'మేఘ సందేశం' వినిపించారు. ప్రేమకథా చిత్రాలకు ఊపిరిపోసి అద్భుతమైన 'ప్రేమమందిరం' నిర్మించారు. ప్రేమకు ప్రేమతో 'ప్రేమాభిషేకం' చేశారు. అయినా...'జీవితమే ఒక నాటకం'. అలుపూ సొలుపూ లేకుండా చేసిన జీవితప్రయాణం..చివరికి దిగంతాలతో ముగుస్తుంది. చివరి మజిలీ దగ్గరకాగానే....తెరచాప అటే కదిలిపోతుంది. 'బహుదూరపు బాటసారి'...మెల్లిగా కదిలిపోతున్న జాడ కనిపిస్తుంది. అది కన్నీటి కాలువలో కదులుతున్న 'నీడ'లా అనిపిస్తుంది. ఆ నీటిబొట్టే..మనందరి కనుకొలుకుల్లోనూ నిలిచి..కన్నీటిమేఘమై వర్షిస్తుంది.... దర్శకరత్న దాసరికి కన్నీటి నివాళి.

పుట్టుక సహజం..మరణం కూడా అంతే. అయితే, పుట్టి-గిట్టేలోగా ఆ మనిషి తన జీవనయానంలో ఎలాంటి మహత్కార్యాలు సాధించాడన్నదే ముఖ్యం. అందులోనూ అత్యంత పేదరికంలో జన్మించి, కష్టాలతోనే జీవించినా..పట్టుదలతో, స్వయంకృషితో ఎదిగి..అత్యద్భుతమైన ప్రజ్ఞతో రాణించి, 'తెలుగు సినిమా(యా) లోకం'లో అసామాన్యమైన ఖ్యాతిని ఆర్జించడమంటే మాటలు కాదు. అంతటి అసాధారణ ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. అందుకే ఆయన సినీలోకానికి దర్శకుడు కాగలిగాడు. ఎంతోమంది జీవితాలకు మార్గదర్శకుడు కాగలిగాడు. దర్శకులందరూ గర్వించేవిధంగా 'దర్శకరత్న' కూడా కాగలిగాడు. ఆయనే మన దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు చిత్రపరిశ్రమకు ఆయన మణిమకుటం వంటివారు. ఆయన ఆట..పాటా..మాట..బాటా అన్నీ విశిష్టమైనవే..విలక్షణమైనవే. ఏదీ మనసులో దాచుకోని తత్వం...ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయనవి. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహనీయమూర్తి ఆయన. అంతేకాదు, అన్యాయాన్ని ఎదిరించాలనే సాహసికుడు..సామాజిక ఉద్యమకారుడు కూడా. నీతి, నిజాయితీ.. నిష్కల్మషత్వం..నిర్భీతి ఆయన సుగుణాలు. ఎంతటి కష్టాన్నయినా సరే.. అధిగమించి జీవితపథంలో అత్యద్భుతాలు సాధించాలన్నదే ఆయన నైజం. కథా రచయితగా, పాటలు-మాటల రచయితగా, నటునిగా, దర్శకునిగా రాణించి.. తన ప్రతిభను చాటుకున్నారు. 151 చిత్రాలకు దర్శకునిగా దర్శకరత్న దాసరి వెండితెరకు బంగరు మెరుగులు దిద్దారు. నిర్మాతగా ఆయన ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. మరో 250 సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. తెలుగు సినీపరిశ్రమకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'పద్మశ్రీ' పురస్కారం కూడా లభించింది. అదేవిధంగా కళామతల్లి ముద్దుబిడ్డగా ప్రఖ్యాతి చెంది విశిష్టమైన 'కళాప్రపూర్ణ' అవార్డును సాధించుకున్నారు. రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9సార్లు నంది అవార్డులను ఆయన అందుకున్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును, ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకుని సినీ జగత్తులో తెలుగువెలుగుల బావుటాను ఎగురవేశారు. సంచలన దర్శకుడుగా ప్రఖ్యాతిగాంచారు. మేఘాల్లో దర్శకుని పేరును వేసుకుని సినిమారంగంలో దర్శకుని స్థాయి ఎంత ఉన్నతమైనదో తెలియజెప్పిన హిట్‌ డైరెక్టర్‌ ఆయనే. చిత్రసీమకు దాసరి చేస్తున్న విశిష్టసేవలకు గుర్తింపుగా తెలుగు సినీ పరిశ్రమ మరెంతో ఘనంగా ఆయనకు 'దర్శకరత్న' అవార్డునిచ్చి సత్కరించింది.

'తాతా-మనవడు'తో సినీరంగ ప్రస్థానం

తెలుగునాట ఉర్రూతలూగించి..350 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న 'తాతా మనవడు' చిత్రంతో ఆయన దర్శకునిగా తన సినీజీవిత ప్రస్థానం ప్రారంభించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ వంటి అగ్ర హీరోల తోనూ, వర్ధమాన నటీనటులతోనూ ఆయన ఆణిముత్యం లాంటి చిత్రాలెన్నిటినో నిర్మించారు. 'ఎవరికి వారే యమునా తీరే', స్వర్గం-నరకం', బలిపీఠం, శివరంజని, గోరింటాకు, రాధమ్మపెళ్ళి, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి, మేఘసందేశం, గోరింటాకు, ప్రేమాభిషేకం, కంటే కూతుర్నే కను, అమ్మ రాజీనామా, అద్దాల మేడ, మామగారు, మేస్త్రి, ఒసేయ్‌ రాములమ్మా, ఒరేయ్‌ రిక్షా వంటి ఎన్నో చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు.

ఎన్నెన్నో అవార్డులు.. ఘన పురస్కారాలు

1983లో దాసరి నిర్మించిన 'మేఘసందేశం' చిత్రానికి రాష్ట్రప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులే కాక, కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'రజత కమలం' పురస్కారం అందుకుంది. 1999లో ఆయన స్వయంగా నిర్మించిన 'కంటే కూతుర్నే కను' చిత్రానికి జాతీయపురస్కారంతో పాటు, రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. 'తారక ప్రభు' సంస్థను నిర్మించి, జయసుధ కథానాయికగా శివరంజని చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఆయన 53 చిత్రాలను నిర్మించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మోహన్‌బాబుకు నటునిగా జన్మనిచ్చిన తండ్రి దాసరి నారాయణరావే. తన గురువైన దాసరి నారాయణరావు ఇక...లేకపోవడం ఆయన గుండెల్ని తొలిచివేస్తోంది. ఇంకా మురళీమోహన్‌, జయసుధ, జయప్రద, సుజాత, ప్రభ, ఆర్‌.నారాయణమూర్తి వంటి ఉత్తమ నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా దాసరి నారాయణరావుగారిదే. ప్రముఖ దర్శకులుగా పేరెన్నికగన్న కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకులు కూడా దాసరిగారి శిష్యులే. రాజకీయరంగంలోనూ దాసరి ప్రత్యేకత సాధించారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సాధించారు. సామాజిక అంశాలతో సమాజం ప్రభావితం అయ్యేవిధంగా, అత్యంత సహజమన్నట్లుగా వుండేలా ఆయన చిత్రాలు వుండేవి. అందుకే ఆయన చిత్రాలు ప్రజల్లో బాగా ఆదరణ పొందాయి.

రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

1989లో రాజీవ్‌గాంధీ పిలుపుతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలోనే చివరిదాకా కొనసాగారు. కాంగ్రెస్‌ హయాంలో, కేంద్రంలో బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా, పత్రికారంగంలోనూ సాహసోపేతంగా వ్యవహరించారు. 'ఉదయం' పత్రిక ఆయన హృద యంగా వుండేది. దానితో పాటు, శివరంజని, బొబ్బిలిపులి తదితర పత్రికలను కూడా ఆయన సాహసోపేతంగానే నడిపారు.

మంచిని ప్రోత్సహించారు, చెడును దుయ్యబట్టారు. పత్రికా రంగంలో మార్గదర్శకమైన రీతిలో నడిచి అందరికీ స్ఫూర్తి దాయక మయ్యారు.

కన్నీటి వీడ్కోలు

దర్శకరత్న దాసరి నారాయణరావు స్వస్థలం పాలకొల్లు. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన సతీమణి పద్మ కొంతకాలం క్రితమే దివంగతుల య్యారు. సతి లేని శోకంతో ఆయన విల విలలాడిపోయారు. ఆరోగ్యం అస్వస్తతకు గురయ్యారు. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసు పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ నెల30వ తేదిన రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి జారిపోయారు. మేఘాల్లో మెరిసినట్లే మెరిసి మాయ మయ్యారు. ఆ మేఘాల తేరుపైనే గగన వీధుల వెంట.. దూరతీరాలకు తరలి పోయారు. సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియ లకు సినీపరిశ్రమే తరలివచ్చింది. వేలాది మంది కళాకారులు, నటీనటులూ, ప్రజలూ అందరూ కన్నీటితో వీడ్కోలు తెలిపారు. ఏదేమైనా, ఆయన అస్తమయంతో తెలుగు సినీపరిశ్రమ తనకు దారిచూపే ఒక మహాదర్శకుడిని.. మార్గదర్శకుడిని కోల్పో యింది. ఆ మహనీయ మానవతామూర్తికి.. కళామతల్లి ముద్దుబిడ్డకు.. నివాళు

లర్పిస్తోంది 'లాయర్‌'.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • కృష్ణ పోటెత్తింది
  కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేషస్పందన లభించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జిల్లాల్లో కొన్ని వైకాపాకు కంచుకోటలు కాగా, ఇంకో రెండు జిల్లాల్లోనూ బలంగానే వుంది. కాని, అసలు…
 • వేమాలశెట్టి బావిలో... వేలుపెట్టిన వేమిరెడ్డి పట్టాభి
  నెల్లూరు, దర్గామిట్టలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వున్న వేమాలశెట్టి బావి సత్రం స్థలం మరోసారి వివాదంలో కెక్కింది. మంగళవారం రాత్రి ఈ స్థలంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వివాదానికి…

Newsletter