16 June 2017 Written by 

వెన్నెముక విరుగుతోంది!

farmerదేశానికి అన్నం పెట్టే అన్నదాతైన రైతన్నకే పిడికెడు మెతుకులు కరువైతే?.. దేశాన్ని సస్యశ్యామలం చేసే రైతు బతుకే కష్టాలమయంగా మారితే?.. దేశానికి వెన్నెముకైన ఆ రైతే కుంగిపోతే ఇక దేశం పరిస్థితి ఏమిటి?...ఎంత కష్టించి పనిచేసినా వ్యవసాయం ఫలసాయం ఇవ్వకపోతే ఈ కష్టాల సేద్యం ఎంత కాలం చేయాలి?.. ఆదుకుంటామన్న ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఎలా జీవనం గడవాలి?.. రైతన్నల దీనావస్త ఇది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల దుస్థితి ఇది. సకాలానికి వర్షాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా అకాలంలో వచ్చి కొంపముంచడం, వస్తే కుండపోత..రాకుంటే కరువువాత అన్నట్లుగా.. ప్రకృతి విపత్తులొకవైపు. పంటలు పండించడమే గగనమైతే..గిట్టుబాటు ధరలు లేక..కుటుంబాలను పోషించుకో లేక పడుతున్న నరకయాతనలు మరోవైపు. రైతన్న బతుకంతా వేదనల మయం..కష్టాల సేద్యంతో జీవితమంతా కన్నీటిమయం... ఇదీ మన రైతన్నల ముఖచిత్రం. అందులోనూ ఈ తొలకరి జల్లుల వేళ..రుతుపవనాల రాకతో ఇక ఏరువాక బాగా సాగు తుందని ఏరువాక పౌర్ణమి పండుగ వచ్చిందని సంబరపడుతున్న రోజున, రైతులందరికీ ఈ ఏడాదైనా పంటల సిరులు బాగా పండుతాయని ఆశపడుతున్న శుభవేళ...తాము పండించిన పంట లకు గిట్టుబాటు ధరలు లేవు మహాప్రభో.. అని మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రైతన్నలు దీనంగా వాపోతూ ఆందోళనల బాటపట్టడం రైతన్నల దీన స్థితికి నిదర్శనం. ఆ ఆందోళనలు చివరికి పోలీసు కాల్పులదాకా సాగడం మరెంతో బాధాకరం.

ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు.. దేశంలోని ఆనేక ప్రదేశాల్లో ఇదే దుస్థితి. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎంతోకాలంగా సమస్యల సుడిగుండంలోనే కొట్టు మిట్టాడుతున్నారు. కాడి పట్టిన దగ్గరనుంచీ పంట పండేదాకా, చేతికందిన పంట చేతికొచ్చేదాకా

రైతులు ఎన్నో కష్టాలు పడుతూనే వున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదన్నది రైతుల ఆవేదన. అయినా, ఎన్నెన్నో పథకాలు వస్తూనే వున్నా అనేక సంవత్సరాలుగా రైతన్నల జీవన పరిస్థితుల్లో మార్పేమీ వుండడం లేదు. వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకుని, అప్పోసప్పో చేసుకుని పగలనకా, రాత్రనకా కాయకష్టం చేసే రైతన్నలకు ఎంతోకాలంగా గిట్టుబాటు ధరలు లేకపోవడం ఎంతో విచారకరం!.. రైతుల సమస్యలు తీరుస్తామంటూ నాయకులు చెప్పడమే తప్ప రైతుల అభ్యున్నతికి వారు చేసిందేమీ వుండడం లేదు. చెప్పిన మాటలు నిలబెట్టుకోవడమూ లేదు. అన్నీ శుష్కవాగ్దానాలు.. శూన్యహస్తాలే. రైతుల సంక్షేమమే ధ్యేయమని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా..రైతులు మాత్రం సంక్షోభ క్షోభల్లోంచి గట్టెక్కడం లేదు. ముఖ్యంగా దళారులు, వ్యాపారుల మాయాజాలం నుంచి, దళారీ వ్యవస్థ నుంచి రైతులకు అసలు విముక్తే వుండడం లేదు. రైతులు తమ కష్టాన్ని మార్కెట్లో అతితక్కువ ధరకు నిలువునా తెగనమ్మేసుకోక తప్పడం లేదు. నిత్యం రైతులకు ఇదే వేదన.. రోదన. మరోవైపు, రైతులను తెగ పొగిడే స్తూనే వారి శ్రమను నిలువు దోపిడీచేస్తున్న దళారీలను..రకరకాల మాయగాళ్ళని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమే. అంతేకాదు, ప్రభుత్వాలు కూడా మభ్యపెట్టే మాటలే చెప్తే.. ఇక ఆ రైతులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి?..సాగునీటి రంగానికి ఏటా కోట్లాదిరూపాయలు వ్యయం చేస్తున్నా, అనేకప్రాంతాలు నేటికీ సాగునీరందక పంటపొలాలు వర్షాల మీదే ఆధారపడడం, చివరికి అదునుకు వానలు రాక పంటలు ఎండిపోతూనే వుండడం ఏమిటి?... రైతులకు అందజేస్తామం టున్న పథకాలు అసలైన లబ్దిదారుల దాకా చేరడమే లేదనే వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా?.. దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రానురాను వ్యవసాయరంగం కుదేలైపోతోంది. ఒకవైపు వర్షాభావం.. మరోవైపు సమస్యల భారం. అనేక రకాల పంటలు పండించే రైతులు ఆయా పంటలకు సంబంధించి ఎన్నో రకాల సమస్యల్లో చిక్కుకుని, అనునిత్యం నానా బాధలు పడుతున్నారు. వ్యవసాయశాఖ, నీటి పారుదల శాఖ.. ఉద్యానశాఖ ఇంకా వాటిలో రకరకాల విభా గాలు, బోలెడంత అధికారగణం వున్నా రైతులకు ఒరిగిందేమీ వుండడం లేదు. సంక్షేమం.. అభివృద్ధి.. పథకాల అమలు, అన్నీ మొక్కుబడి తతంగాలుగానే వుంటున్నాయి తప్ప పొలంబాట పట్టే నాధులే లేరు. విత్తనాలు, ఎరువుల మాయాజాలం, పురుగుమందుల మాయాజాలం..మార్కెట్లో దళారుల మాయాజాలం ఇలా అన్నీ రైతులను నిలువు దోపిడీ చేసేవే తప్ప అటు పంటలకు కానీ, ఇటు రైతు జీవితాలకు కానీ భరోసా వుండడం లేదు. ఇక రుణమాఫీ అన్నది మరో పెద్ద ప్రహసనంగా మారింది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అసలైన రైతులకే చేరుతున్నాయా లేదా అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు.

మరోవైపు సాదాసీదా రైతన్నలు మాత్రం ఏ సాయమూ అందక తమ కష్టాలేవో తామే పడుతున్నారు. దేశంలో రైతన్నల జీవనపరిస్థితులు ఎంతో దయనీయంగా వుంటున్నా, వారి జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు శ్రద్ధ చొరవ చూపడం లేదు. ఫలితంగా వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా వుంటోంది. ఇకనైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి అన్నం పెట్టే రైతన్నల అభ్యున్నతికి కట్టుబడి పనిచేయాలి. అన్నదాతలు ఆకలితో అలమటించకుండా వారంతా క్షేమంగా.. సంతోషంగా వుండేలా చూడాలి. నిత్యం ఎన్నో సమస్యలతో అల్లాడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో అమలుచేయాలి. రైతు సంక్షేమమే జాతికి క్షేమం కనుక, కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఇకనైనా వారి సమస్యలు తీర్చి, వారిని అన్ని విధాలుగా ఆదుకుని అన్నదాతల అభ్యున్నతికి బాటలు వేస్తాయని ఆశిద్దాం!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మళ్ళీ చెడింది
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
  ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter