23 June 2017 Written by 

ఇక... జిఎస్‌టి శకం

gstఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఇక జిఎస్‌టి శకం ప్రారంభం కానుంది. వచ్చే వారానికల్లా జిఎస్‌టి (వస్తు సేవల పన్ను) అమలులోకి రానుంది. ఈ నెల 30వ తేది అర్ధరాత్రి నుంచీ జిఎస్‌టి ఆచరణలోకి వచ్చేస్తుంది. ఇది ఎంతైనా శుభ పరిణామం. చరిత్రాత్మకం కూడా.

ఇదే కాదు, ఏ సంస్కరణ అయినా, ప్రజల జీవనసరళిలో మంచి మార్పులు తెచ్చే ఏ మార్పుకైనా స్వాగతం పలకాల్సిందే. ఇది దేశచరిత్రలోనే ఒక పెద్ద సంస్కరణ. అందులోనూ అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణ. దీనిని ఇంత పెద్దదేశంలో అమలుచేయడమంటే మాటలతో పనికాదు. ఎంతో ముందస్తు కసరత్తు అవసరం. అన్నీ ఒక కొలిక్కి వచ్చాకే దీని అమలుకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోడీ సకలజన సంక్షేమం కోసం చేస్తున్న మరో బృహత్ప్రయత్నమే ఇది. ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను, ఆర్ధికవేత్తలు..మేధావుల సూచనలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, జిఎస్‌టి అమలులో వచ్చే సాధక బాధకాలన్నిటినీ ఆమూలాగ్రం చర్చించారు. దాదాపు పన్నెండువందలకు పైగానే వస్తువులు, అయిదు వందల రకాల సేవలకు ధరలను నిర్ణయించి, నిర్ధేశిత రేట్ల ప్రకారమే అవి ప్రజలకు అందుబాటులో వుండేందుకు భారీ ప్రయత్నాలే చేస్తున్నారు. దీని అమలులో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే వాటిని అధిగమించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. జిఎస్‌టి అమలులోకి వస్తే నిత్యం ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయల ధరలు, ఆహారధాన్యాలు, పండ్లు వగైరాల ధరలు అయిదు శాతం దాకా తగ్గవచ్చని ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు. మరికొన్ని రకాల వస్తువులపై కూడా పన్నులు తగ్గించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇవన్నీ అమలులోకి వస్తే ముఖ్యంగా దేశవ్యాప్తంగా సామాన్య జనానికి, మధ్యతరగతి ప్రజలకు మండే ధరల ప్రభావం నుంచి కొంతమేరకు ఉపశమనం లభించినట్లే అవుతుందని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.

అయితే, కొన్ని పరిశ్రమలకు, చిన్న మధ్య తరగతి సంస్థలకు, ప్రధానమైన ఆలయాలకు జిఎస్‌టి నుంచి మినహాయింపులు లేకపోవడం వంటి విమర్శలూ జోరుగానే వున్నాయి. రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్‌ వంటి యంత్రాలు వగైరాలకు కూడా జిఎస్‌టి వల్ల అదనపు భారం పడుతుందేమోనన్న ఆందోళనలూ అధికంగానే వున్నాయి. జిఎస్‌టితో మందుల ధరలు మరింత పెరుగుతాయేమోననే ఆందోళన ప్రజల్లో వుంది. ప్రజలకు నిత్యావసరాలు, అత్యవసరాలైన వాటి ధరలు పెరగకుండా, వీలైతే ఆయా వస్తువుల ధరలు బాగా తగ్గేవిధంగా చూస్తే జిఎస్‌టికి సామాన్య ప్రజల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ప్రజలకు ఎంతో అవసరమైన మందుల ధరలు ఏమాత్రం పెరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది. పన్నుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళనం చేయాలన్న ఆలోచన ఎంతో ఆహ్వానించదగ్గదే అయినా, అందువల్ల ప్రజలు, వ్యాపారవర్గాలు, పారిశ్రామికవర్గాలు ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు ముందస్తు ఆలోచనలతో అమలుకు ఉపక్రమించడం ఎంతైనా శ్రేయోదాయకమని వేరే చెప్పనక్కరలేదు. అయితే, జిఎస్‌టి వల్ల తమపై ఇంకా వేధింపులు పెరుగుతాయేమోననే అనుమానాలు వ్యాపారవర్గాల్లో బలంగానే వున్నాయి. జిఎస్‌టి అమలులో భాగంగా, వ్యాపారులు రిటర్నులు దాఖలు చేసే విషయంలో సంయమనం ప్రదర్శించాలి. లేకుంటే, కొత్త వ్యవస్థ అందుబాటులోకి రాకుండానే విమర్శల వెల్లువ తప్పదు. దేశ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ఇలాంటి చట్టాల అమలులో అన్నివర్గాల, అన్నిరకాల ఆవేదనలను సహృదయంతో అర్ధం చేసుకుని ఏ మార్గం అందరికీ అనువుగా వున్నదో పరిశీలించి, ఆ మార్గాన్నే అనుసరణీయంగా నిర్ధారించుకోవాల్సి వుంది. అదేసమయంలో అటు జిఎస్‌టి అమలుకు, ఇటు దేశ సౌభాగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా సరళమైన, ఆచరణసాధ్యమైన మార్గంలో మన విధానాలు పయనించాల్సి వుంది. సమస్యలన్నవి సాధారణమే అయినా, వాటిని ఒక సవాల్‌గా తీసుకుని అధిగమించినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కొత్త విధానాలేమైనా అమలులోకి వచ్చినప్పుడు సహజంగానే సమస్యలుంటాయి.. పెద్దనోట్ల రద్దు విషయంలో జరిగిందదే. తొలుత కష్టసాధ్యమనుకున్నది ఆ తర్వాత సులభసాధ్యమే అయింది. కొన్ని సమస్యలు వున్నప్పటికీ, ముఖ్యంగా దేశప్రయోజనాల దృష్ట్యా చేసే ఇలాంటి బృహ త్కార్యాలను అపార్ధం చేసుకోవడం సముచితం కాదు. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలు కూడా ఇలాగే రకరకాల సమస్యలన్నీ బయట పడతాయి. వాటిని సంయమనంతో పరిష్కరించు కోవాల్సి వుంది. పన్ను చెల్లింపుదారులకు జిఎస్‌టి అంటేనే అదేదో భయపడే విషయంగా కాకుండా, ప్రభుత్వం దానిపై అందరికీ ఒక మంచి అవగాహన కలిగించడం, దాని అమలుకు సరళతరమైన దారి చూపడం తప్పనిసరి. రిటర్నులు దాఖలు చేయడానికి నిర్ణయించిన గడువులో తొలి రెండు నెలలు వ్యాపా రులకు కొంత వెసులుబాటు కలిగిస్తామని కేంద్రమంత్రి భరోసా ఇవ్వడం పన్ను చెల్లింపుదారులకు కొంతమేరకు వెసులుబాటే. అయితే, అవసరమైతే ఆ గడువును మరికొంతకాలం పొడిగించేందుకు వీలుంటే ఇంకా మంచిదని, సరికొత్త సంస్కరణలు అందరికీ అలవాటయ్యేదాకా కొంత పట్టువిడుపులు అవసరమనే అభిప్రాయాలూ వున్నాయి.

ఏదేమైనా, దేశ ఆర్ధికవ్యవస్థను ద్విగుణీకృతం చేసే ఇలాంటి సంస్కరణలు మంచివే. వాటిని పారదర్శకంగా, పటిష్టంగా అమలుచేయడమే ఇక ముందున్న కర్తవ్యం. అనేకసార్లు వాయిదాలు పడినా, ఎట్టకేలకు జిఎస్‌టిని అమలులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని మోడీ చేస్తున్న కృషి అమోఘం. ఈ జిఎస్‌టి శకం..దేశానికి ఒక శుభపరిణామంగా, ఆర్ధికాభ్యుదయ శకంగా వర్ధిల్లాలని ఆశిద్దాం!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter