Print this page
23 June 2017 Written by 

జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది

шаблоны RocketTheme
Форум вебмастеров

dist ycpరాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే ఒక ఎమ్మెల్యే జంప్‌ చేశాడు. మిగతా ఆరు గురు ఎమ్మెల్యేలు జగన్‌ వైపు విశ్వాసంతో నిలిచారు.

నెల్లూరుజిల్లాలో వైసిపి బలంగానే ఉన్నప్పటికి 2014 ఎన్నికల్లో కొన్ని లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీద వ్యతి రేకత బలంగా కనిపించింది. కాబట్టే లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీలకు గాను ఐదింటిలో వైసిపి అభ్యర్థులు గెలిచినా మేకపాటి ఎంపీగా కేవలం 13వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలివగలిగాడు. అసెంబ్లీ మెజార్టీలను లెక్కలోకి తీసు కున్నా దాదాపు అతను లక్ష మెజార్టీతో గెలిచి ఉండాలి.

ఇక అసెంబ్లీలలో చూస్తే ఉదయగిరి, వెంకటగిరి, కోవూరులను ఆరోజు వైసిపి కోల్పోవడం జరిగింది. ఎంపి అభ్యర్థి పట్ల అనుకూలధోరణి, ఆయన నుండి పూర్తి స్థాయిలో ఆర్ధిక సహకారం ఉం డుంటే ఉదయగిరి, కోవూరు స్థానాలను కూడా వైసిపి గెలిచివుండేది. ఇక వెంకట గిరి వైసిపి అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నిర్లక్ష్య ధోరణి, వెంకటగిరి పట్టణంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వంటి లోపాల వల్ల ఆ సీటును కోల్పోవాల్సి వచ్చింది.

ఇప్పటికీ జిల్లాలో పార్టీ బలంగానే ఉందిగాని, సరిదిద్దు కోవాల్సిన లోపాలు చాలానే వున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ అభ్యర్థిగా కొత్త నాయకుడిని తెరమీదకు తీసుకురావాల్సిన అవసరముంది. సీని యర్‌ నాయకుడిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి సేవలను పార్టీకి ఇంకో రూపంలో వాడుకోవాలి. లోక్‌సభ పరి ధిలో అసెంబ్లీ అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలిచే అభ్యర్థిపై దృష్టి పెట్టాలి. అసెంబ్లీ వారీగా చూసినా పలు నియోజక వర్గాల్లో నాయకత్వ సమస్య వుంది. నెల్లూరు నగరం, నెల్లూరురూరల్‌, కావలి, సూళ్ళూరుపేటలలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నారు. ప్రజల్లో వాళ్ల మీద వ్యతిరేకత లేదు. ఆత్మకూరు సీటు విషయాన్ని ఆలోచిం చాల్సి వుంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి అయితే సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సరిపోడనిపిస్తుంది. ఎమ్మెల్యేగా గౌతంరెడ్డి మీద వ్యతిరేకత లేకున్నా నియోజక వర్గంలో ఆనంకు ప్రజల్లో పరపతి, పని చేసాడనే పేరు, బంధుగణం బలంగానే వుంది. ఆ దృష్టితో ఆత్మకూరు అభ్యర్థిని అన్వేషించాలి. ఉదయగిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పట్ల వ్యతి రేకత బాగానే వుంది. 2014 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆర్ధికంగా ఇంకొంచెం పోరాడివున్నా, లేక తన నోటి దురుసుతో కొందరిని దూరం చేసుకోక పోయి వున్నా ఇక్కడ గెలిచి వుండేవాడు. ఇప్పుడు కూడా ఉదయగిరికి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గట్టి అభ్యర్థే! కాకపోతే డబ్బు బాగా పెట్టాల్సి వుంటుంది. ఒకవేళ ఆ కోణంలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పక్కకు తప్పుకుంటే ఇక్కడ గౌతంరెడ్డి అయినా మంచి అభ్యర్థే అవుతాడు. కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బలమైన అభ్యర్థే అవుతాడు. కాకపోతే ఆర్ధిక వనరుల్లో కొంత బలహీనంగా కనిపిస్తున్నాడు.

సర్వేపల్లి విషయంలోనూ కొంత ఆలోచన చేయాల్సిన అవసరం వుంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 30వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడనే అంచనాలుండినాయి. అదీగాక ఎన్నికల ముందు దాకా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లిని పట్టించుకోలేదు. అలాంటి సమయంలోనే కాకాణి కేవలం 5వేల ఓట్లతో గెలిచాడు. ఇప్పుడు సర్వేపల్లిలోనూ రాజకీయంగా సీన్‌ బాగానే మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యేగా కాకాణి పట్ల ఎంతో కొంత వ్యతిరేకత వుంది. అటు చూస్తే ఓడినా కూడా సోమిరెడ్డి ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నాడు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం మంత్రిగా ప్రజలకు దగ్గరగా వుంటున్నాడు. నియోజకవర్గమంతటా సంబంధాలు పెంచు కుంటున్నాడు. గత ఎన్నికల్లో తనను వదిలి వెళ్లిన వారందర్నీ దగ్గరకు చేర్చుకుంటున్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకంటే కూడా వ్యక్తిగతంగా సోమిరెడ్డే ఫోకస్‌ అవుతున్నాడు. జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం బలంగా వున్న నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటిగా వుంది. కాబట్టి సోమిరెడ్డిని ఢీకొనే స్థాయిలో ఇక్కడ పార్టీలో మార్పులు జరగాల్సివుంది. ఇక గూడూరులో చూస్తే వైసిపి నుండి గెలిచిన పాశం సునీల్‌కుమార్‌ తెలుగుదేశంలోకి వెళ్లాక మేరిగ మురళీధర్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అతను సరిపోకపోవచ్చు. ఇక్కడకూడా కొత్త అభ్యర్థి ఎంపిక జరగాల్సి వుంది. వెంకటగిరిలో చూస్తే 2014 ఎన్నికల్లో ఓడిపోయాక కొమ్మి లక్ష్మయ్యనాయుడు పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డే ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అతనే అభ్యర్థిగా వుంటాడనే సమాచారం వుంది. అయితే ఎన్నికల్లోపు రాష్ట్ర స్థాయిలో సంభవించే పొత్తుల నేపథ్యంలో అభ్యర్థుల మార్పు జరిగే అవకాశముంది. ఇప్పటివరకైతే వెంకటగిరి విషయంలో రాఘవ తప్ప మరో పేరు లేదనిపిస్తోంది.

జిల్లాలో వైసిపికి ఓటుంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బలంగా వుంది. నాయకుల మధ్య సమన్వయం కావాల్సి వుంది. అలాగే బలమైన ఇంకొందరు నాయకులను కూడా పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరముంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.