14 July 2017 Written by 

యాత్రికులపై ఉగ్ర తూటా

amarnathకాశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదోన్మాదులు చెలరేగిపోయారు. అభం శుభం ఎరుగని అమర్‌నాధ్‌ యాత్రికులపై తూటాలు పేల్చి పలువురి ప్రాణాలు బలిగొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో అమర్‌నాధ్‌ యాత్రకు వెళ్తున్న ఒక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ఆరుగురు మహిళలు. మరో 32 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు.

అమరనాధ్‌ ఆలయాన్ని దర్శించుకుని బస్సు జమ్మూకు తిరిగివస్తుండగా మార్గమధ్యంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతిచెందినవారంతా గుజరాతీయులు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..చివరికి కొండల మధ్య ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాల్లో హిమలింగంగా ఏర్పడే ఆ పరమేశ్వర రూపాన్ని కన్నులారా తిలకించి తిరిగివస్తుండగా, ఉగ్రవాదుల తూటాలకు బలై కన్ను మూశారు. అమానవీయమైన.. ఈ హేయమైన దాడితో.. ఉగ్రవాదులు నరరూప రాక్షసులేనని, లేశమాత్రం కూడా మానవత్వం వారికి ఏ కోశానా ఉండదనీ, వారికి ఎవరిపైనా ఎలాంటి దయ-కరుణ ఉండవనీ రుజువు చేసుకున్నారు. మృతుల కుటుంబాలు ఎంతగా విలవిలలాడిపోతున్నాయో..వారికి పట్టదు.

2000వ సంవత్సరంలో కూడా ఉగ్రవాదులు అమరనాధ్‌ యాత్రీకులపై కాల్పులు జరిపి 8 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఎక్కడో పొంచి

ఉండి విచక్షణరహితంగా కాల్పులు జరపడం, ఎవరికీ చిక్కకుండా పారిపోవడం ఉగ్రమూకలకు అలవాటై పోయింది. ఈ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కిరాత కాలకు అంతే లేకుండా పోతోంది. కాశ్మీర్‌ రాజధాని అయిన శ్రీనగర్‌కు 142కిలోమీటర్ల దూరంలో భూమట్టానికి సుమారు 1400 అడుగుల ఎత్తున గుహల్లో వెలసిన పరమపవిత్రమైన అమరనాధ్‌ హిమ లింగాన్ని దర్శించుకోవడమంటే ఇక తమ జీవితాలు ధన్యమైనట్లేనని యాత్రికులు భావిస్తుంటారు. అందుకే, ఎంతో వ్యయప్రయాసలతోను, సాహసంతోనూ కూడినదైనప్పటికీ అమరనాధ్‌ యాత్ర చేయాలని ఎంతో భక్తితో ఎంతెంతో దూరప్రాంతాల నుంచి హిమాలయాలకు యాత్రీకులు ఉత్సాహంగా వస్తుంటారు. అందులోనూ జులై-ఆగస్టు నెలల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఆ పరమశివుని హిమలింగాన్ని దర్శించుకునేందుకు తరలివెళ్తుంటారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు ఆ దారుల్లో పొంచిఉండి ఆ యాత్రను భగ్నం చేయాలని దాడులు చేస్తుంటారు. ఎంతోమంది పెద్దలు, వృద్ధులు, మహిళలు ఎంతో ప్రయాసతో ఆ మంచుకొండల దారమ్మట ఎంతో భక్తితో శివనామ స్మరణలు చేసుకుంటూ ఆ భగవంతుని దర్శనం కోసం వెళ్తుంటే వారిని కూడా హతమార్చేందుకు ఉగ్రవాదులు సంకల్పించడం కంటే నీచాతినీచమైన విషయం మరొకటి ఉండదు.

ఉగ్రవాద విషసర్పాలకు విషం కక్కడం తప్ప మానవీయత ఉండదు. 15 ఏళ్ళ క్రితం కూడా ఇలాగే అమరనాధ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. అప్పుడు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పోలీసులు, భద్రతా బలగాలు తమ ప్రాణాలొడ్డి ఆ ఉగ్రవాద ముష్కరమూకలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అమరనాధ్‌ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. అయినా, ఎక్కడో ఒకచోట పొంచివున్న ఉగ్రవాదులు హటాత్తుగా వచ్చి విచక్షణారహి తంగా కాల్పులు జరపడం, పారిపోవడం చేస్తూనే ఉన్నారు. ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండ్‌ బుర్హాన్‌వనీ వర్ధంతి పేరుతో ఉగ్రవాదులు హింసకు పాల్పడవచ్చని భద్రతాదళాలు రెండురోజులపాటు అమర్‌నాధ్‌యాత్రను నిలిపేసి, సోమవారం మళ్ళీ ప్రారంభించారు. అయినా, ఉగ్రవాదులు ఆ రోజు కూడా ఈ దాడికి పాల్పడి యాత్రికుల ప్రాణాలు తీశారు.

'బస్సులో 57 మందిదాకా యాత్రికులున్నారు. అందులోనూ చిమ్మచీకట్లో వెళ్తున్న ఆ బస్సులోకి మూడు వైపులనుంచీ తూటాలు దూసుకొచ్చాయ్‌.. అయితే, బస్సు డ్రైవర్‌ బస్సును ఆపకుండా ఎంతో సమయస్ఫూర్తితో, చాకచక్యంతో బస్సును వేగంగా నడిపాడు. భయపడి బస్సును నిలిపేసి ఉంటే మిగిలినవారమంతా బతికేవాళ్ళం కాదేమో'... అని బస్సులోని యాత్రీకులు తమ ప్రత్యక్షానుభవాన్ని చెప్తున్నారు. అయిదుగురు ఉగ్రవాదులు మోటారు సైకిళ్ళపై వెంటాడి బస్సుపై కాల్పులు జరిపారని పోలీసులు భావిస్తున్నారు.

అయితే, రాత్రివేళ ఈ మార్గంలో ఎలాంటి వాహ నాలు అనుమతి లేకుండా వెళ్ళకూడదని, బస్సు మార్గమధ్యంలో పంక్చరై ఒక గంట ఆలస్యం కావడం ఉగ్రవాదులకు అవకాశాన్నిచ్చినట్లయిందని భావిస్తు న్నారు. మృతుల కుటుంబాలకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వా లతో పాటు అమరనాధ్‌ ఆలయం బోర్డు కూడా భారీగానే పరిహారం ప్రకటించాయి. అయినా, మృతుల కుటుంబాల వేదనా రోదనలు అర్చగలమా?.. తీర్చ గలమా?... ఉగ్రవాదుల ఘాతుకాలతో అమరనాధ్‌ యాత్ర భక్తులకు మృత్యుయాత్రగా మారడంతో ఆయా కుటుంబాల ఆక్రందన వర్ణనాతీతం.

ఏదేమైనా జమ్ముకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూ ఉండడం ఎంతైనా విచారకరం. ప్రతి విషయాన్నీ కాలయాపన చేస్తూ పోతే ఫలితాలు దారుణంగానే ఉంటాయి. ఏమాత్రం జాప్యం లేకుండా ఉగ్రవాద ముష్కరులను ఏరివేస్తే తప్ప జమ్ముకశ్మీర్‌లో ప్రజలకు శాంతి ఉండదు. యాత్రికులకు భద్రతా ఉండదు. భద్రతాదళాలు, పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల్లోనూ ఎలాంటి పొరపాట్లు, ఏమరుపాట్లు లేకుండా చూడాలి!

ఇకనైనా, ప్రభుత్వాలు కళ్ళు తెరచి చీకటిమాటున దాగి ఉండి అమాయకుల ప్రాణాలు తీస్తున్న

ఉగ్రవాద హంతకముఠా చర్యలను నిరోధించాలి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, మేధావులు అందరూ కలసి ఖచ్చితమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. కశ్మీర్‌లో శాంతి వెల్లివిరియాలి. ప్రజలంతా ఆనందంగా జీవించాలి. ఇదే అందరి తక్షణ కర్తవ్యం కావాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • ప్రాణాలు తీస్తున్న పందేలు!
  బ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా…
 • నోర్లు తెరిచిన బోర్లు.. మృత్యువుకు రహదార్లు
  బోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • జనం మెచ్చేలా జగన్‌!
  'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని…

Newsletter