21 July 2017 Written by 

నెల్లూరు ముద్దుబిడ్డ

venkaఆరడుగుల ఆజానుబాహుడు..

అడ్డ పంచెకట్టుతో అలరించే తెలుగువాడు...

ఆంధ్రనాట విరిసిన కమలనాథుడు...

అసెంబ్లీ టైగర్‌గా ప్రసిద్ధింగాంచినవాడు...

అందరూ అభిమానించే నాయకుడు...

అద్భుతమన్పించే మాటల మాంత్రికుడు...

ఎవరు... ఎవరు... ఇంకెవరు...

మన నెల్లూరు ముద్దుబిడ్డడు

ముప్పవరపు వెంకయ్యనాయుడు.

ఆధునిక భారత రాజకీయ రంగాన మెరుస్తున్న నెల్లూరు ధృవతార వెంకయ్యనాయుడు. నెల్లూరీయులు మా వెంకయ్య అని చెప్పుకుని గర్వించే స్థాయికి ఎదిగిన నాయకుడు. వెంకయ్య ఉన్నతిని చూసి, ఆయన ప్రస్థానాన్ని చూసి నెల్లూరీయులు ఇప్పటికే ఎన్నో సార్లు గర్వించారు, హర్షించారు. అయితే ఇప్పటిదాకా వెంకయ్య సాగించిన ప్రస్థానం వేరు, ఇప్పుడు సాగించబోయే ప్రయాణం వేరు. ఇప్పటివరకు కొనసాగింది రాజకీయ ప్రయాణం. ఇక నుండి కొనసాగించబోయేది రాజ్యాంగ ప్రయాణం.

నెల్లూరీయుడు, మన ఆంధ్రుడు, మన తెలుగువాడు... అన్నింటికి మించి నిష్కళంక భారతదేశ భక్తుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రతిపాదించగా, ఎన్డీఏ పక్షాలు సమర్ధించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు ఉపరాష్ట్రపతిగా ఆయన అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. దీంతో ఉషాపతికి ఉపరాష్ట్రపతి కాక తప్పడం లేదు. వెంకయ్యనాయుడు అనుభవం, సమర్ధత, దేశంలోని అన్ని పార్టీల నాయకులతో వున్న సంబంధాలు,

ఛైర్మెన్‌ హోదాలో ఆయనైతేనే రాజ్యసభను సమర్ధవంతంగా నడి పించగలరన్న నమ్మకం... ఇత్యాది కారణాలతోనే ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎన్నిక లాంఛనమే:

ఉపరాష్ట్రపతి పదవి కోసం ఆయన యూపిఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో పోటీ పడుతున్నారు. ఈయన మహాత్మగాంధీ మనుమడు. అయినా కూడా ఇప్పుడున్న బలాబలాలను చూసు కుంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నిక లాంఛనమే అనుకోవచ్చు.

తొలి నెల్లూరీయుడు... మూడో తెలుగువాడు

దేశ రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవిని ఇంత వరకు ఇద్దరు తెలుగువాళ్లు మాత్రమే అధిరోహించారు. ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అయితే రెండోవ్యక్తి వి.వి.గిరి. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తమిళనాడులో జన్మిస్తే, వి.వి.గిరి ఒడిస్సాలో జన్మిం చారు. కాబట్టి ఉపరాష్ట్రపతిగా గెలిస్తే తెలుగు గడ్డపై పుట్టి ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలివ్యక్తి ఆయనే అవుతాడు.

కొందరికి పడని వాడు... ఇప్పుడు అందరివాడు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేసే ముందు క్షణం వరకు వెంకయ్య వేరు... నామినేషన్‌ వేసాక వెంకయ్య వేరు. అంతకుముందు ఆయన కాకలు తీరిన రాజకీయ యోధుడు. విపక్షాలకు ఆయనంటే హడల్‌. సరిహద్దుల్లో ఉగ్రవాదుల మీదకు సైనికులు బుల్లెట్లను వదులుతారు. పార్లమెంట్‌లో విపక్షాలపైకి ఈయన మాటలనే బుల్లెట్లుగా చేసి వదులుతాడు. ఏ నిముషంలో ఎవరు ఏ భాషలో ఆరోపణలు, విమర్శలు చేసినా, అదే భాషలో వాటిని తిప్పికొట్టగల ఘనాపాటి వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో నైనా, పార్లమెంట్‌లోనైనా మాటలతో, పడికట్టు పదాలతో ప్రత్యర్థు లను ముప్పతిప్పలు పెట్టేవాడు. మూడు చెరువుల నీళ్ళు తాగించే వాడు. ప్రతిపక్షంలో వుంటే అధికారపక్షం పైన, అధికారంలో వుంటే ప్రతిపక్షంపైన ఎప్పుడూ మాటల యుద్ధానికి సిద్ధంగా వుండేవాడు. కాని ఉపరాష్ట్రపతి అయ్యాక రాజ్యసభ ఛైర్మెన్‌ హోదాలో ఎదురుగా అధికార, విపక్ష సభ్యులు యుద్ధం చేసుకుం టుంటే ఆయన కళ్లప్పగించి చూస్తుండాలి!

ఆ ప్రాసలు ఇక వినలేమా?

ఉప్పు... పప్పు... చెప్పు... అప్పు'.. డిజిటలైజేషన్‌, నేషనలై జేషన్‌, రోడ్‌ కనెక్టివిటి... ఎయిర్‌ కనెక్టివిటి... వాటర్‌ కనెక్టివిటి... వెంకయ్య ప్రసంగాలలో ప్రాసలు వరదలా పోటెత్తుతాయి. ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా లక్షలాది జనం వున్నా వారి చెవులు మాత్రమే పని చేస్తాయి. ఎందుకంటే ఆయన ప్రసంగాలలో మాటల అల్లిక, పదాల పొందిక అంత అద్భుతంగా వుంటుంది. పదాలతో ప్రజల్ని అట్టే కట్టిపడేస్తారాయన. రోజూ పదినిముషాలు ఆయన ప్రసంగం వింటే చాలు... బి.పి, షుగర్‌లకు ప్రత్యేకంగా మందులు వాడనక్కరలేదు. ఆయన ప్రసంగాలలోని ప్రాసలే దివ్యౌషధంగా పనిచేస్తాయి. గలగల పారే సెలయేరుకు అడ్డుకట్ట వేసినట్లు, చెట్టు మీద కూస్తున్న కోకిలమ్మ ముక్కుకు ప్లాస్టర్‌ వేసినట్లుగా ఈ ప్రాసల పిట్ట నోటికి తాళం వేసే పదవి ఇచ్చారు. ఇప్పటిదాకా రాజ్యసభలో ఆయనను కంట్రోల్‌ చేయడానికి ఛైర్మెన్‌ స్థానంలో వున్న వ్యక్తి ఆపసోపాలు పడేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను వెంకయ్యకు అప్పగించారు.

ఉషాపతే కాదు... ఉపరాష్ట్రపతి కూడా!

ఈమధ్య రాష్ట్రపతి పదవికి అభ్యర్థుల పరిశీలనలో వెంకయ్య నాయుడు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన మీడియాతో నేను ఉషాపతినే కాని, రాష్ట్రపతిని కాను అని తనదైన శైలిలో చమత్కరించారు. అయితే వూహించని విధంగా ఉషాపతి ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారు. కన్నతల్లి లాంటి బీజేపీని వదిలిపోవడం ఆయనకు సుతారం ఇష్టం లేదు. చివరివరకు బీజేపీ నాయకుడిగానే వుండాలని కోరిక! కాని క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా అధిష్టానం ఆదేశాలకు తలొంచక తప్పలేదు. భారమైన హృదయంతోనే ఆయన పార్టీ సభ్యత్వానికి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆయన ప్రయాణమే ఒక పాఠం

వెంకయ్యనాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎన్నో కోణాలు ఉండొచ్చు. అభిమానించే వారికి మంచి మాత్రమే కనిపించవచ్చు... వ్యతిరేకించే వారికి చెడు కూడా కనిపించవచ్చు. కాని, ఒక మారుమూల పల్లెటూరిలో సామాన్య రైతుకుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకుండానే, పూర్వీకులు కూడబెట్టిన కోట్ల ఆస్తులు లేకుండానే, గాడ్‌ఫాదర్‌లే కాదు జన్మనిచ్చిన ఫాదర్‌ కూడా ఈ లోకంలో లేకుండానే... ఓ వ్యక్తి చవటపాలెం నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో మలుపులు దాటి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి... ఈరోజు దేశంలోనే అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపికయ్యారంటే... అది నిజంగా భావితరాలకు కాదు నేటి తరాలకు కూడా పాఠ్యాంశమే! ప్రతిఒక్కరూ చదివి తీరాల్సిన అధ్యాయమే! ఒక వ్యక్తి నిబద్ధతతో వుంటే, ఒక వ్యక్తి క్రమశిక్షణతో మెలిగితే... ఒక వ్యక్తి ఒకే జెండాను పడితే ఒకే ఎజెండాను నమ్మితే, ఒకటే సిద్ధాంతాన్ని ఆచరిస్తే, క్రమశిక్షణతో పోరాడితే మనిషి ఏ స్థాయికి ఎదుగుతాడన్నదానికి వెంకయ్యనాయుడే అతిపెద్ద ఉదాహరణ!

నెల్లూరీయులు గర్వించే నాయకుడు

ఉపరాష్ట్రపతి స్థాయికి ఇంతవరకు నెల్లూరుజిల్లా వాసులు ఎదగలేదు. స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పని చేశారు. స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా పని చేశారు. వెంకయ్యనాయుడు రాజకీయ ప్రయాణం కేంద్రమంత్రిగానే ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కాని ఉపరాష్ట్రపతిగా ఎంపిక కానుండడంతో ఆయన ప్రయాణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి నెల్లూరీయుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోనుంది. విద్యార్థి నాయకుడు నుండి సంఘ్‌ కార్యకర్తగా, జనతాపార్టీ నాయకుడిగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర సారధిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, నాలుగుసార్లు వరుసగా రాజ్యసభ సభ్యుడిగా, ఐక్యరాజ్య సమితిలో ఆవాసం ఛైర్మెన్‌గా... ఇలా ఆయన రాజకీయ ప్రయాణంలో ప్రతి పదవీ ఒక మజిలీనే! చేపట్టిన ప్రతి పదవిని సమర్ధవంతంగా నిర్వహించి... వెంకయ్యా... నీకెవరూ సాటిలేరయ్యా అని నిరూపించుకున్నారు. ఎలాంటి పదవినైనా అవలీలగా నిర్వర్తించి అందరి మన్ననలు అందుకునే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిలోనూ సమర్ధవంతంగా రాణించగలడు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. తెలుగుతనానికి నిలువెత్తు రూపం మన వెంకయ్య... ఉపరాష్ట్రపతిగానే కాదు, భవిష్యత్‌లో రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించి భారతావని సేవకు పునరంకితం కావాలని, పుట్టిన నెల్లూరుగడ్డ పేరును చరిత్ర పుటల్లో నిలపాలని ఆకాంక్షిస్తూ... అభినందనలు తెలుపుతోంది 'లాయర్‌'.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter