11 August 2017 Written by 

నిలువెత్తు అభిమానం

venkఆయన ఎమ్మెల్యేగా నెల్లూరుకొచ్చాడు, ఎంపీగా ఎన్నోసార్లొ చ్చాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చాడు, జాతీయ అధ్యక్షుడిగా కూడా వచ్చాడు... ఆఖరకు కేంద్రమంత్రిగా నెల్లూరులో ఎన్నిసార్లు అడుగుపెట్టాడో లెక్కేలేదు. అవన్నీకూడా ఒక పార్టీకి పరిమితమైన పర్యటనలే! అవన్నీ కూడా రాజకీయ పరమైన కార్యక్రమాలే! ఇంత కాలం రాజకీయాలలో వున్న ఒక కోణం అభిమానాన్నే ఆయన చవి చూసారు. కాని, తొలిసారిగా రాజ్యాంగాధిపతి హోదాలో అన్ని కోణాల నుండి ప్రజల అభిమానాన్ని ఆస్వాదించారాయన! ఆయనే మన నెల్లూరు ముద్దుబిడ్డ, భారతదేశ ద్వితీయపౌరుడు(ఉప రాష్ట్రపతి) ముప్పవరపు వెంకయ్యనాయుడు. నెల్లూరుజిల్లా వెంకటా చలం మండలం చవటపాలెం నుండి ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి పీఠం వరకు ఎదిగిన ధృవతార!

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ప్రమాణస్వీకారానికి ముందే తొలి అడుగు నెల్లూరులో పెట్టాలని, తొలి పలకరింపు నెల్లూరీయులదే కావాలని, తొలి అభినందనను నెల్లూరీయుల నుండే అందుకోవాలని తపించిన నాయకుడు వెంకయ్యనాయుడు. ఆ తపనతోనే ఈ నెల 7వ తేదీన తిరుమలేశుని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 3.30గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరు పోలీసు మైదానంలో దిగిన ఆయనకు... ఈ గాలిని పీల్చగానే, ఈ నేలను తాకగానే వెయ్యేనుగుల బలం వచ్చినట్లయ్యింది.

పోలీసు గ్రౌండ్‌ నుండి ఓపెన్‌ టాప్‌ కారులో బయలుదేరిన ఆయనకు దారిపొడవునా ప్రజలు, వేలాదిమంది విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబట్టి పలికిన అపూర్వస్వాగతం ఒక మరుపురాని ఘట్టంగా మిగిలిపోతుంది. ఇంతకాలం ఆయనను రాజకీయ నాయకుడిగానే చూసిన నెల్లూరీయులు తొలిసారిగా రాజ్యాంగాధిపతిగా స్వాగతం పలికి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకాలం నెల్లూరీయుల నుండి ఒక పార్టీ నాయకుడి గానే గుర్తింపు పొందిన వెంకయ్యనాయుడు తొలి సారిగా 'అందరివాడు'గా నెల్లూరొచ్చి తన జిల్లావాసుల నుండి అపూర్వ ఆదరణ పొందారు. పోలీస్‌గ్రౌండ్‌ నుండి విఆర్‌సి మైదానం వరకు వెంకయ్యపై ప్రజలు అభిమాన పూల వర్షాన్ని కురిపించారు. తన కోసం ఎర్రటి ఎండలో నిలబడ్డ విద్యార్థుల అభిమానానికి చలించిన వెంకయ్య వారందరికీ చిరునవ్వుతో అభి వాదం చేస్తూ ముందుకు సాగారు.

విద్యార్థి దశలో వెంకయ్యనాయుడు పోరాటం ఏ విఆర్‌ హైస్కూల్‌ మైదానంలో అయితే ప్రారంభ మైందో, అదే మైదానంలో ఉపరాష్ట్రపతిగా వచ్చిన వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు విఆర్‌ హైస్కూల్‌ మైదానంలో ఎన్నో బహిరంగ సభలలో పాల్గొని ఉండొచ్చు. అవన్నీ ఒకెత్తు... నిన్నటి సభ ఒకెత్తు. గతంలోవన్నీ కూడా రాజకీయ సభలైతే, ఇప్పుడు జరిగింది మాత్రం ఇక్కడ నుండి ఉపరాష్ట్ర పతి స్థాయికి ఎదిగిన తొలి నెల్లూరీయుడిగా వెంకయ్యకు అభిమానంతో నిర్వహించిన అభినందన సభ. ప్రముఖ వదాన్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారా యణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి. రత్నం, పాత్రికేయుడు నెల్లూరు డోలేంద్రప్రసాద్‌, కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేత పి.చంద్రశేఖర్‌రెడ్డి, అపస్మా అధ్యక్షులు బి.మనోహర్‌రెడ్డి, 'లాయర్‌' వార పత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డిల నేతృ త్వంలో ఏర్పడ్డ కమిటి అద్భుతంగా, అద్వితీయంగా నిర్వహించిన ఆత్మీయసభ ఇది! నెల్లూరీయులు, నెల్లూరు విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి తనకు జేజేలు పలక డాన్ని చూసి వెంకయ్య చలించిపోయారు. నెల్లూరుపై తనలో వున్న ప్రేమను, నెల్లూరు ప్రజలపై తనకున్న మమకారాన్ని, నెల్లూరుజిల్లా అభివృద్ధిపై తనకున్న ఆసక్తిని తన ప్రసంగంలోనే చూపించారాయన! సాధా రణంగా వెంకయ్యనాయుడి ప్రసంగమంటే ప్రాసలు, పదాల అల్లిక, తూటాల్లాంటి మాటల పొందిక, వ్యంగ్యాస్త్రాలు, వాగ్భాణాలు ప్రధానంగా వుండేవి. కాని, తొలిసారిగా నిన్నటి ఆయన ప్రసంగంలో వాటన్నింటికి బదులు నెల్లూరు పట్ల అభిమానం, నెల్లూరీయులపై మమకారం, కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపోతున్నానన్న బాధ ఎక్కువుగా కనిపించింది. ఆయన ప్రసంగంలో ప్రాసలు, చెణుకు లకు బదులు ఆత్మీయత అడుగడుగునా మనసు తట్టింది. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు... సభాప్రాంగణంలో మమకారం వెల్లివెరిసింది. తనకు జాతీయ పతాకా లతో స్వాగతం చెప్పిన విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పడంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన తన రెండోఏట గేదె పొడిచి తల్లి చనిపోయిన దగ్గర నుండి దుర్గాప్రసాద్‌, సోంపల్లి సోమయ్యల సహకా రంతో ఆరెస్సెస్‌లో చేరడం మొదలుకొని ఉప రాష్ట్రపతి పదివిని చేపట్టే వరకు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, తన జీవితంలో తారసపడ్డ వ్యక్తులను, ఎదురైన అనుభవాలను వివరించిన తీరు సభికులను కట్టిపడేసింది. కనకమహల్‌లో జరిగిన ఓ సంఘటనపై యాజమాన్యానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంతో తన ప్రస్తానం ఎలా మొదలైందో వర్ణిం చారు. నెల్లూరుజిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తులను గుర్తుకు తెచ్చుకుంటూ ఏకధాటిగా ఆయన 200 మందికి పైగా పేర్లను సభలో గుర్తుచేసుకోవడం ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏబివిపి నాయకుడిగా, సంఘ్‌ కార్యకర్తగా, జనసంఘ్‌ నేతగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర జాతీయస్థాయి అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా... ఇలా తన రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని ఆయన స్ముృశిస్తూ, ప్రజల హర్షధ్వానాలందుకున్నారు. నా చిన్నప్పుడే తల్లి చనిపోయిందని, కన్నతల్లి ఎలా వుంటుందో చూడని నాకు భారతీయ జనతాపార్టీయే కన్నతల్లి అయ్యిందని, బీజేపీ పార్లమెంటరీ బోర్డే నన్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడంతో కన్నతల్లి లాంటి పార్టీని వీడడం ఇష్టంలేక ఏడ్చేసానంటూ మరోసారి ఏడుస్తూ ఆయన చెప్పడం అభిమానుల చేత కంటతడి పెట్టించింది. గతంలోకన్నా భిన్నంగా నిన్నటి సభలో ఆయన ప్రసంగం హూందాగా, హృద్యంగా సాగింది. ఆయన ప్రసంగం అనంతరం లక్షలాది మంది నెల్లూరీయులు, వేలాదిమంది వెంకయ్య అభిమానుల పక్షాన ఆహ్వాన కమిటి సభ్యులు ఒక్కొక్కరుగా వెంకయ్యను సత్కరించి వీరందరి తరఫున, ప్రత్యేకంగా తయారు చేయించిన రెండు జ్ఞాపికలను నెల్లూరీయుల ''గానాలపట్టి'' యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం చేతులమీదుగా వెంకయ్యకు బహుకరించారు.

ఆహ్వానకమిటి సభ్యులు తుంగా శివప్రభాత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సభలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, కామినేని శ్రీనివాస్‌, పార్లమెంట్‌సభ్యులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఐ.వరప్రసాద్‌, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ బి.రాఘవేంద్రరెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివా సులురెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, మ్యాక్‌ సంస్థ అధినేత ఆదాల మురళీరెడ్డి, మాజీఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, జె.కె.రెడ్డి, బీద మస్తాన్‌రావు, బీద రవి చంద్ర, బెజవాడ ఓబుళరెడ్డి, విజయ డెయిరీ ఛైర్మెన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, పొన్నలూరు సీతారామిరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, వెంకయ్య కుమార్తె దీపా వెంకట్‌, కుమారుడు హర్షవర్ధన్‌, కోడలు రాధ, కరణం బలరామకృష్ణమూర్తి, గ్లోబల్‌ రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొని వెంకయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన గాన గంధర్వుడు, పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెంకయ్యపై వ్రాసిన ప్రత్యేక గీతాన్ని ఆలపించి గానం రూపంలో తన అభిమానం చాటుకున్నారు. చివర్లో వెంకయ్య సభక హాజరైన ప్రతిఒక్కరి చేత స్వచ్ఛభారత్‌ ప్రతిజ్ఞ చేయించి ఏ పదవిలో వున్నా సమాజం పట్ల సామాన్యుడిగా తన బాధ్యతను స్వయంగా నిర్వహిస్తా నని చాటిచెప్పారు. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు హాజరైన సభలో ఎక్కడా క్రమశిక్షణ లోపించలేదు. క్రమశిక్షణే ఆయుధంగా ఎదిగిన నేత వెంకయ్య. అంతే క్రమశిక్షణతో కార్యక్రమాన్ని హూం దాగా నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది ఈ సభ ఆహ్వాన కమిటి! వెంకయ్య పట్ల వున్న ప్రత్యేక అభిమానంతో ఆహ్వానకమిటి సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కె.వి. రత్నం, నెల్లూరు డోలేంద్రప్రసాద్‌, బి.మనోహర్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, తుంగా శివప్రభాత్‌రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సభికుల ప్రశంసలందుకున్నారు. వెంకయ్య దత్తపుత్రుడు ఓయస్‌డి సత్యకుమార్‌ పర్యవేక్షణలో ఏర్పడ్డ ఆహ్వాన కమిటితో పాటు ఆర్గనైజింగ్‌ కమిటి సభ్యులైన రావి మోహన్‌చౌదరి, జనార్ధన్‌రాజు, డా|| కృష్ణకిషోర్‌, శేఖర్‌, కె.వి., రవీంద్రబాబు, బి.విజయ్‌కుమార్‌, ఇ.కృష్ణ చైతన్య, హరిచంద్ర, ఎ.రాజేష్‌బాబు, ఎస్‌.రమేష్‌, రామ్మూర్తినాయుడు, శ్యామ్‌కుమార్‌, పి.సురేంద్రరెడ్డి, వి.సుశీల్‌కుమార్‌, వంటేరు శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి సనత్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి, కె.వినోద్‌రెడ్డి తదితరుల సారధ్యంలో కార్యక్రమం నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో జరిగింది. సభా కార్యక్రమానికి ముందు కళాంజలి అనంత్‌ సారధ్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ మట్టిలో ఏదో మహత్యం ఉంది

ఈ నెల 7వ తేదీన ఉపరాష్ట్రపతిగా ఎన్నికై నెల్లూరు నగరానికి వచ్చిన యం.వెంకయ్యనాయుడుకి విఆర్‌ హైస్కూల్‌ మైదానంలో ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు సభికులను హత్తుకునేలా ప్రసంగించారు. ఆయన మాటలతో మనసులు పులకరించాయి. ఆయన ప్రేమపూర్వక పలకరింపులతో ప్రతిఒక్కరూ ఆత్మీయాను భూతికి లోనయ్యారు. వెంకయ్య పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఈ సాయం సంధ్యాసమయంలో, నా జన్మభూమిలో, నేను పుట్టిపెరిగిన ప్రదేశంలో, నేను పోరాడిన కళాశాల ప్రాంగణంలో ఇంతమంది విద్యార్థులు, పురప్రముఖులు నా కోసం వచ్చారు. వారం దరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా! నేను ఈ ఊరిలో తిరిగాను, ఈ ఊరిలో పెరిగాను, ఈ హైస్కూల్‌లో చదివాను. బుచ్చిరెడ్డిపాలెంలో డిఎల్‌ఆర్‌ హైస్కూల్‌లో కొంతకాలం చదువుకున్నా! ఆర్‌ఎస్‌ఆర్‌ హై స్కూల్‌లో, తర్వాత వి.ఆర్‌ హైస్కూల్‌లో, విఆర్‌ కాలేజీలో చదివాను. ఎలిమెంటరీ స్కూల్‌కు 3కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకునేవాడిని, తర్వాత 5కిలోమీటర్లు నడిచి బస్సెక్కి నెల్లూరొచ్చి చదువుకునేవాడిని. విఆర్‌ కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో 'అవే కళ్ళు' సినిమా కనకమహల్‌లో ఆడుతుంది. కడపకు చెందిన ఓ స్టూడెంట్‌ను హాల్‌ యజమాని 'క్యూ'లో నుండి బయటకు లాగాడు. హాల్‌ యజమాని పహిల్వాన్‌. అతనికి వ్యతిరేకంగా జిల్లా నలుమూలల నుండి విద్యార్థులను రప్పించి పోరాడాము. నా ఉద్యమ జీవితానికి ఇదే పునాది వేసింది. నెలరోజుల పాటు సమ్మె చేసి హాల్‌ యజమానికి శిక్షపడేలా చేసాము. ఆ పోరాట వేదికపై అనేకమంది నాయకులు పరిచయమయ్యారు. వారిలో కెవిఆర్‌ బస్‌ సర్వీస్‌ యజమాని కలవకూరు వెంకటరెడ్డి ఒకరు. పోరాటానికి నేను రెడీ, నా బస్సులు రెడీ, దేనికైనా రెడీ అంటూ నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత జై ఆంధ్రా ఉద్యమంలో కీలకంగా పాల్గొ న్నాను. 1984లో ఎన్టీఆర్‌ వెన్నుపోటుకు గురైనప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాను. ఆ తర్వాత లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో పాల్గొన్నాను. ఇవన్నీ నా సృతిపథంలో మెదులుతున్నాయి.

సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను, నెల్లూరులో చదివాను, లా చేయడానికి వైజాగ్‌ వెళ్లాను. ఆ తర్వాత ఇందిరాగాంధీ పుణ్యమా అని ఎమర్జెన్సీలో జైలుకెళ్లాను. 1978లో ఉదయగిరి నుండి నా రాజకీయ జీవితం ఉదయించింది. అందుకే నేను, నా కుటుంబసభ్యులు కూడా ఉదయగిరిని మరిచిపోము. రాజకీయాల్లో ఎదగాలంటే కులమో, ధనమో వుండాలనుకునే రోజుల్లో కూడా కేవలం ప్రజల అభిమానంతోనే నేను రాజకీయంగా ఎదిగానంటే అది ఈ నెల్లూరునేల తల్లి ఇచ్చిన అవకాశమే! చదువుకునే రోజుల్లోనే స్థంభాలెక్కి జెండాలు కట్టేవాడిని, గోడల మీద రాతలు వ్రాసేవాడిని, వాజ్‌పేయి వస్తుంటే జట్కాబండెక్కి మైక్‌లో ప్రచారం చేసేవాడిని. ఇవన్నీ చేసినవాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వాజ్‌పేయి, అద్వానీల మధ్య కూర్చున్నాడంటే అది పార్టీ నాకు కల్పిం చిన అదృష్టమే.

నాకు మొట్టమొదట పరిచయమైన నాయకుడు ఆనం వెంకటరెడ్డి. నేను జనసంఘ్‌లో చేరుతున్నానంటే... అది ఉత్తరాదిపార్టీ, బ్రాహ్మణులు, వైశ్యుల పార్టీ, శాఖాహారుల పార్టీ అని సూచించారు. కాని, ఆ పార్టీయే ఇప్పుడు అటక్‌ నుండి కటక్‌ వరకు, కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు దేశమంతటా విస్తరించింది. ఇప్పుడు ఆ పార్టీలోనే నేను లేను. అయినా నెల్లూరుని మరచిపోను, బీజేపీని మరచిపోను. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతి పదవికి నా పేరును ప్రకటించినప్పుడు బాధేసింది. నేను బాధపడిన విషయాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయి. కేంద్రమంత్రులు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కాని దేశ చరిత్రలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులుగా చేసిన వారికి స్థానముంటుంది. నేను బాధపడింది ఉపరాష్ట్రపతిని చేసినందుకు కాదు. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన నాకు పార్టీయే అమ్మయ్యింది. నాకు నెహ్రూ, గాంధీల వారసత్వం లేకున్నా అంచలంచెలుగా ఎదిగాను. కబడ్డీ ఆట మీద ఆసక్తితో ఆరెస్సెస్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ సంఘ్‌ ప్రముఖ్‌గా వున్న భోగరాజు దుర్గాప్రసాద్‌ గారి కంట్లో పడ్డాను. ఆయన శిక్షణలో ఎదిగాను. ఆ తర్వాత సోంపల్లి సోమయ్య నన్ను ఆదరించారు. ఆ తర్వాత ఏబివిపి నాకు నాయకత్వ లక్షణాలు నేర్పింది. ఏబివిపి కార్యకర్తగా దేశమంతా తిరిగాను. ఆ తర్వాత పార్టీ... క్రింది స్థాయి నుండి పైస్థాయి వరకు పార్టీ డిక్షనరీలో వున్న అన్ని పదవులను నాకు పార్టీ ఇచ్చింది. కాబట్టే ఇలాంటి పార్టీలో ఇక నేను లేనా? ఈ పార్టీ సభ్యుడిని కానా... అని తలచుకుని బాధపడ్డాను. పార్టీ నాకు క్రమశిక్షణ నేర్పింది. పట్టుదల, చిత్తశుద్ధితో ఎదిగాను. ఇవన్నీ కూడా మీ ముందు మనసు విప్పి చెప్పుకోవాలనిపించి చెప్పుకుంటున్నాను. రేపటి నుండి ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను. ఆనం వెంకురెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, కె.వి.సుబ్బారెడ్డిలతో నాకు పరిచయం వుంది. రామలింగారెడ్డి, నరసింహారెడ్డి, గోవిందయ్య, శివయ్య, మాధవయ్య, చిదంబరం, ఆర్‌.సుబ్బారెడ్డి, ఆనం బుల్లారెడ్డి, విఆర్‌ కాలేజీలో పంచెకట్టుతో ఆకట్టుకునే మేనేజర్‌ తుంగా రమణారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, వెంకటరెడ్డి, జానకిరామిరెడ్డి, నాకు తెలుగు గురువు పోలూరు హనుమజ్జానకిరామశర్మ... వీళ్లంతా విద్యా జీవితాన్ని మెరుగుపెట్టిన మహానుభావులు. వారందరికీ శిరస్సు వంచి నమస్క రిస్తున్నా! కమ్యూనిష్టు నాయకులు వేములపాటి అనంతరామయ్య, గండవరం సేతురామిరెడ్డి నన్ను ఎంతగానో ప్రభావితం చేసారు. జక్కా వెంకయ్య, పి.మధులతో నాకు పరిచయం వుంది. అన్నదాత మాధవరావు కోసం ఎలక్షన్‌ ప్రచారం చేసొస్తే అర్ధరాత్రి వచ్చినా వారి సతీమణి అహల్యమ్మ అన్నం పెట్టేది. శోధన్‌ పెయింట్స్‌ రామచంద్రమూర్తి, నువ్వుల వెంకటరత్నంనాయుడు, ధనెంకుల నరసింహం, జె.సి.కొండయ్య, నవయుగ దశరథరామయ్య, కృష్ణమూర్తి, గొట్టిపాటి కొండపనాయుడు, వేమారెడ్డి వెంకురెడ్డి, రేబాల దశరథరామిరెడ్డి, దొడ్ల కామాక్షయ్య, కమ్యూనిష్టు నాయకులు గునుపాటి రామచంద్రయ్య, పి.రామకోటయ్య, జనసంఘ్‌ నేతలు రావూరు రమణయ్య, దువ్వూరు శేషయ్య, వెంకట నారాయణ, ప్రసాద్‌, మెంటా చలమయ్య, పొన్నలూరు సీతారామిరెడ్డి, మారంరెడ్డి రామిరెడ్డి, వై.సి.రంగారెడ్డి, నాకు రాజకీయ ప్రత్యర్థి అయినా వ్యక్తిగత స్నేహితుడు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి... వీళ్లంతా నా జ్ఞాపకాలలో మెలుగుతున్నారు.

1978లో జిల్లాలో 10సీట్లు కాంగ్రెస్‌ గెలిస్తే, ఉదయగిరిలో నేను గెలిచాను. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో 10సీట్లు తెలుగుదేశం గెలిస్తే, ఉదయగిరిలో నేను రెండింతల మెజార్టీతో గెలిచాను. ట్రంకు రోడ్డులో కోమలావిలాస్‌, నంబి అయ్యర్‌ హోటల్‌, మంజు హోటల్‌, స్వప్న ఏ.సి, అజంతా హోటల్‌, రమణ విలాస్‌, చంద్రభవన్‌, బసోటా హోటల్‌, రంగమహల్‌, శేషమహల్‌, శ్రీరామ్‌ థియేటర్‌ నా జ్ఞాపకాలలో అలాగే వున్నాయి. నేను చదివే రోజుల్లోనే రత్నం, నారాయణ డెమాన్‌ స్ట్రేటర్‌లుగా ఉండేవాళ్ళు. ఈ నేలలో ఏదో శక్తి ఉంది. ఈ మట్టిలో ఏదో మహత్యం వుంది. ఈ మనుషులు చూపిన ప్రేమాభిమానాల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. ఎన్నికల్లో నిలబడితే నా దగ్గర డబ్బులుండేవి కావు. జనమే నాకు డబ్బులిచ్చేవాళ్లు. దువ్వూరు సూరారెడ్డి, గుండాల పరంధామరెడ్డి ఎన్నికలప్పుడు నాకు ఆర్ధిక సాయం చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ పేపర్‌ ఎల్‌.వి.కృష్ణారెడ్డి మంచి విమర్శకులు. శివప్రభాత్‌రెడ్డి నాయన, 'లాయర్‌' పత్రిక వ్యవస్థాపకులు తుంగా రాజగోపాలరెడ్డిది పదునైన కలం. పట్టుదల కలిగిన మనిషి. ఆరోజుల్లోనే ఆనం వాళ్లను రాజకీయంగా ఎదుర్కొన్నాడు. గట్టిగా నిలబడ్డాడు. చీకటిపడితే కాంగ్రెస్‌ వ్యతిరేక నాయకులంతా గుమికూడే చోటు శ్రీనివాసమహల్‌. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాగే వుండే వాడు వాళ్ళ నాయన రాజగోపాల్‌రెడ్డి. జి.సి.కొండయ్య, పెళ్ళకూరు రామచంద్రారెడ్డి వంటి వాళ్లు అక్కడ చేరేవాళ్లు. మేనకూరు గోపాల కృష్ణారెడ్డితో ప్రత్యేక పరిచయముంది. వీళ్లందరి సాన్నిహిత్యంతోనే నాకు రాజకీయాలపై పూర్తి పరిపక్వత వచ్చింది. ఆరోజుల్లోనే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి త్యాగరాజ భిక్షా టనలతో ఎందరో సంగీత సరస్వతీ పుత్రులను నెల్లూరుకు తీసుకు వచ్చారు. రేబాల లక్ష్మీనరసారెడ్డి, పొట్ట ఆదిశేషయ్య, జి.వి.రమణయ్య, చుండి విశ్వనాథం, గునుపాటి రామచంద్రారెడ్డి, జి.వి.కె., టి.సుబ్బ రామిరెడ్డి, జె.కె.రెడ్డి, జె.ఎస్‌.రెడ్డి, సి.సి.సుబ్బారాయులు, నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి... వీళ్లందరినీ మరచిపోను. కమ్యూనిష్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యతో అసెంబ్లీలో పరిచయం ఏర్పడింది. బుచ్చిలో చదువుకునేటప్పుడు అత్తిపల్లి రామలింగారెడ్డి, సుబ్బమ్మ, సుహృలతమ్మలు నన్ను చేరదీసి ఆదరించారు. వారెవరినీ మరిచిపోను.

వాజ్‌పేయి, అద్వానీ, సుందర్‌సింగ్‌ భండారీ, బంగారు లక్ష్మణ్‌, జానాకృష్ణమూర్తి వంటి నాయకులు పనిచేసి బీజేపీని ఒక స్థాయికి చేర్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు బీజేపీని ఇంటింటికి చేర్చాడు. 69ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. దీనికి కారణం మన వనరులను, మన మేధస్సును పూర్తిగా వాడు కోకపోవడమే! స్వాతంత్య్రానికి ముందు తలసరి ఆదాయంలో చైనా కంటే ముందుండే వాళ్లం. తర్వాత తలసరి ఆదాయం పడిపోయింది. ఒకప్పుడు భారత్‌ విశ్వగురువు. ఇప్పుడు అప్పులడిగే దేశంగా చూస్తున్నారు. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, అత్యాచారాలు, ఆర్ధిక అసమానతలు, కొన్ని వర్గాల ప్రజలను దేవా లయాల్లోకి రానివ్వకపోవడం వంటి దురాచారాలు పోవాలి. వేషం, భాష ఏదైనా మనమంతా భారతీయులం అనే భావనతో ముందుకు సాగాలి. స్వాతంత్య్రం వచ్చిన 69ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ రూపంలో దేవుడు మనకు అవకాశం కల్పించాడు. ఆయన నాయకత్వంలో దేశం మళ్ళీ విశ్వగురువుగా అవతరించడం ఖాయం.

ఉపరాష్ట్రపతిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా! విభజన వల్ల ఏపికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి 2.36 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చా! రాష్ట్రానికి 4.23లక్షల ఇళ్లు మంజూరు చేసాను. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు కూడా 2లక్షల26వేల ఇళ్లు ఇచ్చా! ఉపరాష్ట్రపతిగా కూడా నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జిల్లాకు నావంతు సహకారం అందిస్తా! ఇక్కడికొచ్చే ముందే వెంకటేశ్వరస్వామిని దర్శించు కున్నా! ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించా!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter