Thursday, 24 August 2017 11:25

చెంపదెబ్బల బాబాకు భలే క్రేజ్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సిఎం చంద్రబాబు నివాసం. తెల్లారుజామున 4గంటలయ్యింది. చంద్రబాబు అమరావతి కోసం సింగపూర్‌ రాజధాని కల కంటూ మంచి గాఢనిద్రలో వున్నాడు. అప్పుడు మోగింది ఆయన సెల్‌ఫోన్‌... ''తెలుగు వీర లేవరా... నంద్యాల వైపు సాగరా'' అనే రింగ్‌టోన్‌తో! ఆ దెబ్బకు చంద్రబాబు ఉలిక్కిపడి లేచాడు. ఆయన అమరావతి సింగపూర్‌ రాజధాని కల చెదిరిపోయింది. ఈ జామున ఎవరికి ఏ ఆపదవచ్చిందబ్బా అనుకుంటూ ఆయన ఫోన్‌ ఎత్తాడు. అవతల నంద్యాల నుండి కె.ఇ.ప్రభాకర్‌... సార్‌, నంద్యాలలో మన నాయకులంతా అలిగి ప్రచారానికి దూరంగా వున్నారు, మీరు జోక్యం చేసుకోవాలని చెప్పాడు. ఎవరెవరు దూరంగా వున్నారని చంద్రబాబు అడిగాడు. నంద్యాల ఓఎస్‌డి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ టి.జి.వెంకటేష్‌, ఆకే అమర్‌నాథ్‌రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, ఫరూఖ్‌, ఎస్పీవై రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు... పార్టీ కార్యక్రమాలనే పట్టించుకోకుండా దూరంగా వుంటున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఎలక్షన్‌ వుంది. ఇప్పుడెలా అని కె.ఇ.ప్రభాకర్‌ అడిగాడు. అసలు వాళ్లు అంతలా ఎందుకు అలిగారని చంద్రబాబు అడిగాడు. మన లెజండ్‌ బాలకృష్ణ వచ్చాడు కదండి అని కె.ఇ.ప్రభాకర్‌ అనగానే... చంద్రబాబు గుండె గతుక్కుమంది... వెంటనే ఆయన వీళ్లందర్నీ బాలయ్య కొట్టాడా? అని ఆదుర్ధాగా అడిగాడు. అందుకు కె.ఇ... అంత అదృష్టం తమకు లేదనే వాళ్లంతా అలిగివున్నారు. బాలయ్య చేత చెంపదెబ్బలు తినే అదృష్టం కూడా మాకు లేదా? పార్టీకి ఇన్నేళ్లు చేసిన చాకిరికి మాకు ఇచ్చిన గుర్తింపు ఇదేనా? బాలయ్య చెంపదెబ్బలకు కూడా మేము అర్హులం కామా? అని వాళ్లంతా అలిగివున్నారు. బాలయ్య వచ్చి తలా ఒక చెంపదెబ్బ కొడితేగాని వాళ్లు అలకవీడి పనిలో పడేటట్లు లేరు అని చెప్పాడు. ఆ మాటకు చంద్రబాబు తల వెయ్యి కిలోమీటర్ల వేగంతో తిరిగింది. ఎవరన్నా చెంప మీద కొడితే అలుగుతారు, వీళ్లేంటి కొట్టలేదని అలగడం అని మనసులో అనుకుంటూ... అసలేం జరిగింది. బాలయ్య చేత చెంపదెబ్బలు కొట్టించుకోవడానికి వీళ్లెందుకు ఉత్సాహం చూపుతున్నారని చంద్రబాబు అడిగాడు. అవతల నుండి కె.ఇ... ఓహో మీకింకా విషయం తెలీదా... అట్లాగైతే ఏబిసిడి ఛానెల్‌ పెట్టుకుని చూడండి, సబ్జెక్ట్‌ అంతా తెలుస్తుంది అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. చంద్రబాబు వెంటనే టి.వి ఆన్‌చేసి ఏబిసిడి ఛానెల్‌ పెట్టాడు. ''రాష్ట్రంలో చెంపదెబ్బల బాబా'' అనే హెడ్డింగ్‌తో ఒక స్టోరీ రన్‌అవుతుంది. బాలకృష్ణ చేతిలో చెంపదెబ్బలు తినడానికి అభిమానుల తాకిడి, చెంపదెబ్బల కోసం పైరవీలు చేస్తున్న నాయకులు, సీఎం స్థాయిలో ఒత్తిడి తెచ్చయినా బాలయ్య చేత ఒక్క చెంపదెబ్బయినా కొట్టించు కోవాలని పరితపిస్తున్న మంత్రులు... బాలకృష్ణ చేతిలో చెంపదెబ్బ తిన్నవారికి సకల భోగభాగ్యాలు సమకూరుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్న జనం... అని యాంకర్‌ చెబుతోంది. ఆ ఛానెల్‌ స్క్రీన్‌పై నంద్యాలలో బాలకృష్ణ బసచేసిన ప్రాంతాన్ని చూపిస్తున్నారు. బాలకృష్ణ చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరిపో యారు. ఒక్క చెంపదెబ్బయినా కొట్టమని ప్రాధేయపడుతున్నారు. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో... బాలకృష్ణ ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టే సీన్‌ చూపిస్తూ... ''అబ్బనీ తియ్యనీ దెబ్బ... ఎంత కమ్మగా ఉందిరో యబ్బా'' అనే పాట పెట్టారు. మళ్ళీ అక్కడే యాంకర్‌ దివ్యస్వప్న ఎంపి టి.జి.వెంకటేష్‌తో ఇంటర్వ్యూ చేస్తూ... బాలకృష్ణ చెంప దెబ్బల సీన్‌కు ఇంత రియాక్షన్‌ ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. దానికి టిజి వెంకటేష్‌... మొదట్లో బాలకృష్ణ కోపంతో, అసహనంతో అభిమానులను కొడుతున్నారని అందరూ పొరపడ్డారు. కాని, ఆయన ఎవరి మీద ప్రేముంటే వారినే చెంపదెబ్బ కొడుతున్నారు. అలా చెంపదెబ్బలుతిన్న వాళ్ల భవిష్యత్‌ దివ్యంగా ఉంటుంది. మన చెంపను ఆ మహానుభావుడి చేయి తాకాలన్నా అదృష్టం వుండాలి. బాలయ్య చెంపదెబ్బల యాక్షన్‌కు అదృష్టం కలిసివస్తుండడం వల్లే రియాక్షన్‌ ఇంతలా వుందని చెప్పాడు. తర్వాత యాంకర్‌ దివ్యస్వప్న అక్కడేవున్న ఫరూఖ్‌తో... బాలయ్య గారి చెంపదెబ్బలపై మీ స్పందనేంటని అడిగింది. అందుకాయన... బాలయ్య గారు ముందు చెంపదెబ్బల విషయంలో స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలి. ఆ తర్వాతే బయట ప్రాంతాల వారిని పట్టించుకోవాలి. మమ్మల్ని తక్కువ చేసి చూస్తే ఎన్నికలనే బాయ్‌కాట్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చాడు. వీళ్లతో ఇంటర్వ్యూలు ముగిసాక యాంకర్‌ దివ్యస్వప్న లైన్‌లో... చూసారు కదా, బాలయ్య బాబాగారి చెంపదెబ్బలకు వస్తున్న రియా క్షన్‌ను... తెలుగుదేశం పార్టీకి బాలయ్య ఇప్పుడు మంచి ఎస్సెట్‌ కాబోతున్నారు. తెలుగుదేశానికి ఓటేసిన వాళ్లకే బాలయ్య చెంపదెబ్బ ఛాన్స్‌ అని వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు ఆఫర్‌ పెడితే తిరిగి అధికారం తెలుగుదేశందే... ఇట్లు కెమెరామెన్‌ డూప్‌బాబుతో దివ్యస్వప్న... అని ముగించింది. చంద్రబాబు టీవీలో అంతా చూసాడు. అసలేం జరిగిందో అతనికి అర్ధం కాలేదు. వెంటనే ఏబిసిడి ఛానెల్‌ అధినేత గోపాలకృష్ణకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నాడు. అరగంటకల్లా గోపాలకృష్ణ చంద్రబాబు ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. బాలకృష్ణ చెంపదెబ్బల సీన్‌ ఏంటి... మనం రివర్స్‌ అవుతుందనుకుంటే ఇలా పాజిటివ్‌గా మారింది... దీనికి కారణమేంటని అడిగాడు. అందుకు గోపాలకృష్ణ... ఆ క్రెడిట్‌ నాదే. బాలయ్యను కొట్టకుండా ఆపలేం... ఆయన కొట్టడం మొదలుపెడితే దిబ్బిడిదబ్బిడే... కాబట్టి ఆయన చెంపదెబ్బల సీన్‌ను పార్టీకి పాజిటివ్‌గా మలచాలనుకున్నా. అందుకే గతంలో బాలయ్య చేతిలో చెంపదెబ్బలు తిన్న వారితో స్పెషల్‌ ఇంటర్వ్యూలు తీయించాను. చెంపదెబ్బలు తిన్నాక వాళ్ళ బ్రతుకులు మారినట్లు, గుడిసెల నుండి వారి బ్రతుకులు బంగళాకు మారినట్లు ఛానెల్‌లో చూపించాము... బాలయ్య చేతిలో చెంపదెబ్బలు తిన్నాకే కొందరికి ఎంపి పదవులు, మంత్రిపదవులు వచ్చినట్లు కూడా మా ఛానల్‌లో చెప్పించాం, దాంతో జనం బాలయ్య ఎక్కడ కొడతాడో అనే స్టేజి నుంచి ఆయన చేత ఎప్పుడు కొట్టించు కుందామా అనే స్టేజీకి వచ్చారు. ఇప్పుడు బాలయ్య చెంపదెబ్బలు కొట్టినా మన పార్టీకి మైలేజీ పెరుగుతుందేగాని, తగ్గదని చెప్పాడు. అది విన్న చంద్రబాబు తనకు ఇంతగా ఉపయోగపడుతున్న గోపాలకృష్ణ వైపు కృతజ్ఞతగా చూసాడు.

Read 146 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter