07 September 2017 Written by 

ఓటమి నేర్పిన పాఠమేంటి?

jaganగెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ యోధుడు, ప్రజా నాయకుడు.

నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్‌లలో ఓడిపోగానే వైకాపా పనైపోయిందని, జగన్‌ ఇక పార్టీని క్లోజ్‌ చేసుకోవచ్చన్నట్లుగా తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. ఒక్క ఓటమితోనే ఒక పార్టీ భవిష్యత్‌కు తెరపడే టట్లయితే ఈరోజు దేశ రాజకీయ చిత్రపటంపై కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలతో సహా చాలా పార్టీలు కనిపించవు. 1977లో కాంగ్రెస్‌ మట్టి కరిచింది. ఏడాది కల్లా సునామీలా లేచి నిలబడింది. 1984లో బీజేపీకి వచ్చింది రెండే రెండు సీట్లు. ఈరోజు తిరుగులేని ఆధిక్యతతో అధికారంలో వుంది. 1989లో ఏపిలో తెలుగుదేశం తుక్కుతుక్క యింది. 1994కల్లా ప్రభంజనమై లేచింది. కాబట్టి రాజకీయాల్లో గెలుపు శాశ్వతం కాదు, ఓటమీ శాశ్వతం కాదు. నిరంతర పోరాటం మాత్రమే శాశ్వతం.

కాకపోతే నంద్యాల, కాకినాడ ఓటముల నుండి ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే వున్నాయి. ఈ రెండు చోట్ల గెలవడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతగా అధికార దుర్వినియోగం చేసాడో, ఎన్ని విధాలుగా ప్రలో భాలకు గురి చేసాడో అన్నది వేరే విషయం. 2019 ఎన్నికల్లో కూడా వీటన్నింటిని ప్రయోగించగల శక్తి చంద్రబాబుకు వుంది. వాటిని ఎదుర్కొనే మార్గమే ఇప్పుడు జగన్‌కు కావాలి. 2012లో ఏపిలో 17 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు 15చోట్ల భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఈ గెలుపే 2014లో జగన్‌ కొంప ముంచింది. ఈ గెలుపు ఆత్మవిశ్వాసాన్ని బదులు అతివిశ్వాసాన్ని పెంచింది. ఎన్నికలు జరగడమే తరువాయి, గెలవడమే మిగిలిం దన్నంత ధీమాను పెంచింది. అందుకే వస్తామన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి తీసుకోలేదు. వీళ్లంతా తెలుగుదేశంలోకి వెళ్లి వైకాపాకు చేయాల్సిన నష్టం చేశారు. అదేవిధంగా జగన్‌ రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోవడం కూడా పార్టీ పరాభవానికి కారణమైంది.

2014 ఎన్నికల్లో ఓటమిగాని, నిన్నటి నంద్యాల, కాకినాడ పరాజయాలు కాని ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇంకా ఒక వర్గం ప్రజలకు జగన్‌ దగ్గర కాలేక పోతున్నాడని. ఇక్కడ ఒక వర్గం అంటే ఒక కులం అనో, మతం అనో కాదు. ఎన్నికల సమయంలో పార్టీ అధి నేతల వ్యవహారశైలి, నాయకత్వ లక్షణాలు, వారి భవిష్యత్‌ కార్యాచరణను పరిశీలించి ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకునే తటస్థులని. రాష్ట్రంలో ఇలాంటి వారి శాతం తక్కువే కావచ్చు. కాని ఎన్నికలలో గెలుపోటములను నిర్దేశించే ఓట్లు ఇవేనని గుర్తుంచుకోవాలి. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం అధికారంలోకి రావడానికి ఈ ఓట్లే కీలకమయ్యాయి. ఆ ఎన్నికల్లో తటస్థులు చంద్రబాబు వైపే మొగ్గు చూపారు. రాష్ట్రం విడిపోయి, అప్పుల ఊబిలో వుంది,

ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ స్థితిలో చంద్రబాబు అయితేనే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడని, ఆయనకు ఆ అనుభవం ఉందని, జగన్‌కు అంతటి పరిపాలనానుభవం లేదని చెప్పి తెలుగు దేశంకు ఓట్లేసారు. ఇలా ఓట్లేసిన వాళ్లలో చంద్రబాబును అప్పటిదాకా ద్వేషించిన ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. ఈ వర్గం వాళ్ళు మొగ్గుచూపబట్టే కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారం చంద్ర బాబు చేతుల్లోకి వెళ్లిపోయింది.

నిన్న నంద్యాల, కాకినాడలలో వైకా పాకు తక్కువ ఓట్లేమీ రాలేదు. చంద్ర బాబు అంతగా ప్రలోభాలు పెట్టినా వైకా పాకు 70వేల ఓట్లు వచ్చాయి. నంద్యాల ఫలితం వెల్లడయ్యాక కాకినాడ ఎన్నికలు పెట్టినా, తెలుగుదేశంకు వైకాపాకు మధ్య వచ్చిన ఓట్ల తేడా 20వేలు మాత్రమే. వైకాపాకైనా, తెలుగుదేశంకైనా పార్టీ ఓట్లు నికరంగా వుంటాయి. జగన్‌ ఏం మాట్లా డినా, చంద్రబాబు ఎలా వున్నా ఆ ఓట్లు పక్కకు పోవు. ప్రతి వందఓట్లలో 40ఓట్లు తెలుగుదేశంకు, 40ఓట్లు వైకాపాకు, ఓ 10 ఓట్లు మిగతా పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు వున్నాయనుకుందాం. మిగి లిన పదిమంది ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటారు. నాయకులనుబట్టి, నాయకులు ఇచ్చే వాగ్ధానాలను బట్టి, నాయకత్వ సమర్ధతను బట్టి ఎవరికి ఓటే యాలన్నది ఇలాంటి వాళ్లు నిర్ణయించు కుంటారు. డబ్బులతో కొనే ఓట్లనేవి ఇరు పార్టీలకు వుంటాయి కాబట్టి ఆ ఓట్లను తటస్థులతో కలపలేం. విజ్ఞులు, మేధా వులు, అభ్యర్థిని, పార్టీ రాష్ట్ర నాయకులను, వారి వ్యవహార శైలిని బట్టి తటస్థులు మారుతుంటారు. ఎన్నికల్లో గెలుపుకు వీరి ఓట్లు చాలా కీలకం. కాబట్టి వారి మనసు లకు దగ్గరయ్యేలా జగన్‌ ఇప్పటి నుండే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించు కోవాల్సివుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter