Monday, 25 September 2017 06:52

చంద్రబాబును ఆనందంతో ముంచెత్తిన సోమిరెడ్డి డిజైన్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్‌ కార్యాలయం. సీఎం ఛాంబర్‌లో మంత్రి పి.నారాయణ దిగులుగా కూర్చునివున్నాడు. అప్పుడే సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అక్కడకు వచ్చాడు. దిగులుగా వున్న నారాయణను చూసి ఏం అలావున్నావని అడిగాడు. అందుకు నారాయణ... నా బాధ చెప్పేది కాదు, చూపిస్తాను చూడు... అంటూ సోమిరెడ్డి కళ్ల ముందు మస్కిటో కాయిల్‌ను గిరగిరా తిప్పి ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు.

¬¬¬¬¬

అది 2014 నవంబర్‌ నెల. హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం చంద్రబాబు కూర్చుని వున్నాడు. అప్పుడే మంత్రి నారాయణ సింగపూర్‌ కన్సార్డియం ప్రతినిధులు డాఫర్‌ డెన్‌, మిచెల్‌ మిల్లీ, టామ్‌ లొల్లి వచ్చారు. చంద్రబాబు ముందున్న టేబుల్‌పై వాళ్ళు ఒక చార్ట్‌ను పరిచారు. అమరావతి రాజధాని డిజైన్‌ అది. ఫ్లైఓవర్‌లు, నదులు, ఆకాశాన్ని తాకే భవనాలు, పూలవనాలు, చాలా ఆకర్షణీయంగా, రియల్‌ ఎస్టేట్‌ బ్రోచర్‌ మాదిరిగా తయారుచేసి చూపించారు. ఆ డిజైన్‌ చూసి చంద్రబాబుకు నిరుత్సాహం వచ్చింది. ఇలాంటి బ్రోచర్‌లను మా రియల్‌ వ్యాపారులు కుప్పలు కుప్పలుగా తయారు చేస్తారు. నాకు ఇంతకన్నా అందమైన డిజైన్‌ కావాలి అని చంద్ర బాబు చెప్పాడు. ఆయన మాటలతో నారాయణ, సింగపూర్‌ బృందం నీరసంగా వెనుదిరిగారు.

¬¬¬¬¬

2015 మే నెల... హైదరాబాద్‌లోని తన ఇంట్లో చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌తో ఆడుకుంటున్నాడు. అప్పుడే చైనా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రతినిధులు టెన్‌పింగ్‌, జంగ్‌ జూయింగ్‌లను వెంటబెట్టుకుని మంత్రి నారాయణ వచ్చాడు. చంద్రబాబు ముందు వాళ్లు తెచ్చిన అమరావతి రాజధాని డిజైన్‌ను ఉంచారు. అన్నీ చైనా సంస్కృతిని తలపించే రీతిలో డిజైన్‌ చేశారు. ఈ భవనాలు ఎంతకాలం నాణ్యంగా ఉంటాయని చంద్రబాబు అడిగాడు. దానికి చైనా ప్రతి నిధులు... మా చైనా వస్తువులు మాదిరిగానే మేం కట్టే భవనాలకు కూడా గ్యారంటీ వుండదని చెప్పారు. ఇలాంటి గ్యారంటీ లేని కట్టడాలు కట్టడంలో మేం మీకన్నా ఎక్స్‌పర్ట్స్‌మి... ఇలాంటి డిజైన్‌లు మాకు అవసరం లేదని చంద్రబాబు వారిని పంపించేశాడు.

¬¬¬¬¬

2016 జూన్‌ నెల... ఉండవల్లిలోని తన కార్యాలయంలో చంద్రబాబు కూర్చుని వున్నాడు. ఈసారి మంత్రి నారాయణ జపాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రతినిధులు అకిహిటో, టోకోనషి, మిత్సు బుషిలను వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు తమ రాజధాని డిజైన్‌ను బాబు ముందుంచారు. భవనాలన్నీ నిలువెత్తు పొగగొట్టాల మాదిరిగా వున్నాయి. వాటిని చూడగానే చంద్రబాబుకు ముద్దనూరు థర్మల్‌ పవర్‌ప్రాజెక్ట్‌ గుర్తుకొచ్చింది. నేనడిగింది రాజధాని డిజైన్‌... పవర్‌ ప్లాంట్‌ డిజైన్‌ కాదు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి చంద్రబాబు వారిని పంపించేసాడు.

¬¬¬¬¬

2017 సెప్టెంబర్‌... వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబు వుండగా ఈసారి లండన్‌కు చెందిన నార్మన్‌పోస్టర్‌ బృందంతో మంత్రి నారాయణ వచ్చాడు. ఆయన రావడమే నీరసంగా వచ్చాడు. చంద్రబాబు ముందు వాళ్ళు తెచ్చిన అసెంబ్లీ, సచివాలయం డిజైన్‌లను పెట్టారు. ఆ డిజైన్‌ను చూడగానే చంద్రబాబు... ఈ డిజైన్‌ను నేను ఎక్కడో చూసాను అని మనసులో అనుకుంటుండగా... అప్పుడే మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చాడు. ఆ డిజైన్‌ను చూసి ఆయన... అమరావతిలో ఏమన్నా బస్‌ టెర్మినల్‌ కడుతున్నారా అని అడిగాడు. ఎందుకు ఆ డౌట్‌ వచ్చిందని చంద్ర బాబు అడిగాడు. చెన్నైలో కోయంబేడు బస్టాండ్‌ కూడా ఇదే విధంగా ఉంటుందని పత్తిపాటి అన్నాడు. అప్పుడు చంద్రబాబుకు గుర్తొ చ్చింది... తాను చూసాను అనుకుంటున్నది కూడా ఆ బస్టాండేనని. మంత్రి నారాయణకు విషయం అర్ధమైంది... లండన్‌ ఇంజనీర్లను తీసుకుని మౌనంగా బయటకు వచ్చాడు.

¬¬¬¬¬

ఇక్కడితో నారాయణ ఫ్లాష్‌బ్యాక్‌ ముగించి.. సీఎం గారికి ఏ డిజైన్‌ చూపించినా నచ్చడం లేదు... నాకు ఓపిక నశించిపోతుంది. ఇక అసెంబ్లీ, సచివాలయం డిజైన్‌ల విషయంలో ఆయనను ఒప్పించగలనన్న నమ్మకం నాకు పోయింది అని బాధపడసాగాడు. అప్పుడు సోమిరెడ్డి, నారాయణ భుజం తట్టి... నువ్వేం దిగులుపడకు, రేపటికల్లా నీ సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చాడు.

¬¬¬¬¬

ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి, కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు కూర్చుని వున్నారు. అప్పుడే సోమిరెడ్డి, నారాయణలు లోపలకు వచ్చారు. సోమిరెడ్డి తన చేతిలో వున్న ఓ మ్యాప్‌ను నారాయణకిచ్చి చంద్రబాబుకు చూపించమన్నాడు. నారాయణ దానిని మడత విప్పి చంద్రబాబు టేబుల్‌ మీద పరిచాడు. ఆ మ్యాప్‌లో వున్న డిజైన్‌ చూడగానే చంద్రబాబు కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు, అందమైన రహదారులు... చంద్రబాబు దానిని చూస్తూ... ఇది కదా డిజైన్‌ అంటే... ఈ డిజైన్‌ ప్రకారం అసెంబ్లీ, సచివాలయం కడితే వుంటది నా సామిరంగా... అని సంబరపడిపోసాగాడు. మిగతా మంత్రులు కూడా ఈ డిజైన్‌ అద్భుతంగా వుంది... అంటూ నారా యణను అభినందించసాగారు.

సీఎం ఓకే అనడంతో నారాయణ హమ్మయ్యా అనుకుంటూ సోమి రెడ్డిని తీసుకుని బయటకొచ్చాడు. సోమిరెడ్డికి థ్యాంక్స్‌ చెప్పి... ఈ డిజైన్‌ ఏ దేశస్థుల చేత గీయించావని నారాయణ అడిగాడు. అది దేవరహస్యం... ఎవరికీ చెప్పకూడదని సోమిరెడ్డి అన్నాడు. దానికి నారాయణ... అమ్మతోడు... నేనెవరికీ చెప్పను... ఈ రహస్యం మనిద్దరి మధ్యనే సమాదైపోతుంది... ప్లీజ్‌ చెప్పవా అని అడిగాడు. అప్పుడు సోమిరెడ్డి నారాయణ చెవికి దగ్గరగా తన నోరు పెట్టి... చింతారెడ్డి పాళెంలో వున్న మీ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌నే హెలికాఫ్టర్‌ ద్వారా ఫోటో తీయించాను, ఆ ఫోటోనే ఈ డిజైన్‌ అని చెప్పాడు. ఆ మాటలు విన్న నారాయణ అరగంట తర్వాతగాని స్పృహలోకి రాలేకపోయాడు.

Read 144 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter