Friday, 06 October 2017 08:03

నెల్లూరుకు స్వచ్ఛ అవార్డు... నేతల పుణ్యమే!

Written by 
Rate this item
(0 votes)

galpika''ఈ నగరాలకు ఏమైంది... ఎటు చూసినా మసి... ఎవరిలో చూసినా కసి... మురికి పందులు... మురుగు సందులు... ఈ నగరాలను ఎవరూ బాగుచేయలేరా... ఈ నగరాన్ని చూసి నేర్చుకోండి... నెల్లూరు నగరం... స్వచ్ఛతకు కేరాఫ్‌ అడ్రస్‌... రాష్ట్రంలో ఏకైక దోమల ఫ్రీ నగరం నెల్లూరు... అందుకే ఈ ఏటి మేటి స్వచ్ఛ అవార్డుకు ఈ నగరం ఎంపికైంది.'' వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై వుంచిన సైడ్‌స్క్రీన్‌పై డాక్యుమెంటరీ షో ఇది.

అక్కడ జరుగుతున్న స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవ సభకు భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న నారా చంద్రబాబునాయుడు, మంత్రులు నైట్‌రైడర్‌ నారాయణ, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్పలు హాజరైవున్నారు. మున్సిపల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కన్నబాబు సభను నడిపిస్తూ... రాష్ట్రంలో అన్ని నగరాలను కాచి వడపోసి నెల్లూరును స్వచ్ఛనగరంగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ నెల్లూరు నగర అందాలను అందరూ తిలకించే రీతిలో పది నిముషాల నిడివిగల వీడియోను స్క్రీన్‌పై ప్రదర్శించారు. స్క్రీన్‌పై సీన్‌లు ముగిసాక నెల్లూరు నగర స్వచ్ఛ అవార్డును అందుకోవడానికి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును వేదికమీదకు పిలిచారు. ఆయన వేదికనెక్కి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డును అందుకున్నారు. నెల్లూరు నగరం స్వచ్ఛ అవార్డుకు ఎంపిక కావడంపై నెల్లూరుజిల్లాకే చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి షాక్‌కు గురికాగా ముదురుదోమల మంత్రి పి.నారాయణ మాత్రం నింపాదిగా వున్నాడు. స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవం ముగిసాక అందరూ వేదిక దిగారు. వెంకయ్య నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పిలిచాడు. సోమిరెడ్డి వెళ్లాడు... నెల్లూరుకు స్వచ్ఛ అవార్డు రావడమేమిటి నాకంతా కలగా వుంది... ఇరుకురోడ్లు, మురికి పందులు, ముదురుదోమలు... కంపుకొట్టించే డ్రైనేజీ... ఎటుచూసినా ఆక్రమణలు... నేను నెల్లూరువాడినని చెప్పి నా మెప్పు కోసం ఈ అవార్డు ఏమన్నా ఇచ్చారా? ఇలాంటివి నేను సహించను అని అన్నాడు. అందుకు సోమిరెడ్డి... ఇది చూసి నేనూ షాకయ్యాను, ఇలా ఎందుకు జరిగిందో నాకూ తెలియదు... విషయం కలెక్టర్‌నే అడుగుదామని చెప్పి కలెక్టర్‌ ముత్యాలరాజును పిలిచారు. వీళ్లిద్దరూ తమ సందేహం వెలి బుచ్చారు. పిలిస్తే వచ్చాను, ఇస్తే అవార్డు తీసుకున్నాను, అంతకు మించి నాకేమీ తెలియదని కలెక్టర్‌ చెప్పాడు. ఆ క్షణంలో వెనుక నుండి 'నాకు తెలుసు' అనే మాట వినిపించింది. వెంకయ్య, సోమిరెడ్డి, కలెక్టర్‌లు వెనక్కి తిరిగి చూసారు. అక్కడ నైట్‌రైడర్‌ నారాయణ వున్నాడు. నీకు ఏం తెలుసు అని వెంకయ్య ప్రశ్నించాడు. చెప్పను, చూడండి అంటూ నారాయణ వేళ్లతో ఎయిర్‌స్క్రీన్‌ గీసి సీన్స్‌ ప్లే చూపాడు.

-----

అది నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరం. మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌, కమిషనర్‌ ఢిల్లీరావు, మిగతా కార్పొరేటర్లతో సమావేశమై వున్నారు. ముందు నారాయణ మాట్లాడుతూ... త్వరలో ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత పరిశుభ్రంగా వున్న నగరాన్ని ఎంపిక చేసి స్వచ్ఛ నగరం అవార్డును ఇవ్వబోతుంది. నేను మున్సిపల్‌ మంత్రిగా వుండి నెల్లూరుకు స్వచ్ఛ నగరం అవార్డు రాకపోతే నా పరువు జాఫర్‌సాహెబ్‌ కాలువలో కలిసినట్లే! కాని, ఇక్కడ చూస్తే అంత సీన్‌ లేదు. పందులు తమ బిడ్డలతోనే కాదు మనుమళ్ళు, మునిమనుమరాళ్ళతో కూడా కలిసి రోడ్లపై రాజ్యమేలుతున్నాయి. నాసా వాళ్లు అంతరిక్షం నుండి తీసిన అంగారకుడి ఫోటో అని మొన్న ఒక ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అంగారక గ్రహంపై అక్కడక్కడా కొండలు, జలపాతాలు వున్నట్లు ఆ పోస్ట్‌లో చెప్పారు. మన ఇస్రో వాళ్ళు దాని రహస్యాన్ని చేధించారు. ఆ ఫోటో అంతరిక్షం నుండి తీసిందే కాని, అంగారకుడిది కాదని, నెల్లూరు నగరందని, అందులో కనిపించేవి కొండలు, జలపాతాలు కావని, రోడ్లపై చెత్త దిబ్బలు, రొచ్చు గుంటలని తేల్చారు. ఇక ముదురుదోమల సంగతి సరే సరి... ఇలాంటి నగరానికి స్వచ్ఛ అవార్డ్‌ వస్తుందా? రాకుంటే నా పరువేంకావాలి అని వాపోయాడు. అప్పుడు అజీజ్‌... అవార్డ్‌ మనకే వస్తుంది సార్‌, మేం తెప్పిస్తాం అని అన్నాడు. ఎలా? అని నారాయణ ప్రశ్నించాడు. అప్పుడు అజీజ్‌... 50మంది విద్యార్థు లున్న క్లాసులో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి సార్‌ అని అడిగాడు. బాగా చదవాలని నారాయణ సమాధానమిచ్చాడు. బాగా చదవకపోయినా ఫస్ట్‌ ర్యాంక్‌లో నిలబడలాంటే? అని అజీజ్‌ తిరిగి ప్రశ్నించాడు. దానికి నా వద్ద ఆన్సర్‌ లేదని నారాయణ బదులిచ్చాడు. అప్పుడు అజీజ్‌... బాగా చదివే వాళ్లను చెడగొట్టాలి సార్‌... వందకు వంద మార్కులు తెచ్చుకునేవాడు పాతిక మార్కులకు పడిపోతే 50మార్కులోడే క్లాసులో టాపర్‌ అవుతాడు. ఇక్కడ కూడా అంతే! రాష్ట్రంలో మన నెల్లూరుకి అత్యంత ఉత్తమ చెత్త నగరంగా పేరుంది. ఇప్పుడు రాష్ట్రంలో వున్న అన్ని నగరాలను చెత్తనగరాలుగా మారుద్దాం. మన పందులను, మన దోమలను అన్ని నగరాలలో వదులుదాం. అవి అనతికాలంలోనే వ్యాప్తిచెంది, ఆ నగరాలన్నింటిని మన నెల్లూరు కంటే అధ్వాన్న నగరాలుగా మారుస్తాయి. అప్పుడు వాటన్నింటికంటే మన నెల్లూరే బెటర్‌గా కనిపిస్తుంది. చచ్చినట్లు 'స్వచ్ఛ నగరం' అవార్డు మనకే వస్తుందని చెప్పడంతో మంత్రి నారాయణకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా శిష్యరికంలో ఈ మూడేళ్లలోనే ఎంత ఎదిగిపోయావు అజీజ్‌ అని ఆయన మేయర్‌ వైపు అభిమానంతో చూస్తుండగా... అప్పుడే కార్పొరేటర్‌ దొడ్డపనేని రాజానాయుడు సెల్‌ఫోన్‌ ''ఎంత ఎదిగిపోయావయ్యా ఓ బ్రహ్మయ్యా'' అనే పాట రింగ్‌టోన్‌తో మోగింది.

------

ఇక్కడితో సీన్‌లు అయిపోయాయి. నెల్లూరుకు స్వచ్ఛ నగరం రావడం వెనుక కథ ఇది అని నారాయణ ముగించాడు. అది విన్న వెంకయ్య నాయుడు... మీ తెలివి తగలెయ్యా... అవార్డులనేవి ఇతరులను మించి పోయి తెచ్చుకోవాలి గాని, ఇతరులను ముంచి కాదు అంటూ అక్కడ నుండి బయల్దేరాడు.

Read 66 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter