13 October 2017 Written by 

'తండ్రి'ని వీడి... 'తల్లి' వద్దకు సత్యకుమార్‌

satya kuగత 24 సంవత్సరాలుగా వెంకయ్యకు తోడుగా ఆయన నీడగా నిత్యం ఆయనను వెన్నంటి వుండిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్‌ భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక అధికారిగా తన పదవికి రాజీనామా చేశాడు. తండ్రి లాంటి పెద్దాయనను వదిలి ఆయనిప్పుడు తల్లి లాంటి పార్టీ సేవకు శ్రీకారం చుట్టాడు. పార్టీకి సేవ చేయాలి, పార్టీ కోసం పరితపించాలి అన్న సత్య మనోగతాన్ని గమనించిన భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అక్టోబర్‌ 1వ తేదీ సత్యకుమార్‌ను పిలిపించి పార్టీ కార్యకలాపాలలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించడంతో సత్యకుమార్‌ ఇప్పుడు పూర్తిస్థాయి భారతీయ జనతాపార్టీ కార్యకర్తగా అవతరించాడు.

అక్టోబర్‌ 2వ తేదీ నుండి భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో కేరళలో ప్రారంభమైన ''జనరక్షన్‌ యాత్ర'' సమన్వయకర్తగా వ్యవహరించవలసిందిగా అమిత్‌షా కోరడంతో వెంటనే వెంకయ్యనాయుడిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని 'కేరళ' వెళ్ళిపోయాడు.

కేరళకు జాతీయ స్థాయి నాయకులను రప్పించడం, స్థానికంగా వున్న నేతలు, కార్యకర్తలతో సమావేశమై కార్యక్రమాన్ని సజావుగా నడిపించడం, సమన్వయ పరచడంతో పాటుగా మీడియా వ్యవహారాలను చూసే బాధ్యతల్లో ప్రస్తుతం 'సత్య' తలమునకలై వున్నాడు.

వెంకయ్యనాయుడిని వీడి తాను పార్టీ సేవకై వెళ్లవలసిన తరుణంలో ''సామాజిక మాధ్యమంలో'' సత్యకుమార్‌ ఆంగ్లంలో పోస్ట్‌ చేసిన ''అంతరంగాన్ని'' 'లాయర్‌' పాఠకుల కోసం తెలుగులో తర్జుమా చేసి యధావిధిగా అందిస్తున్నాం.

సత్య అంతరంగం ఆయన మాటల్లోనే...

జీవితం అంటే ఎంపిక ద్వారా నిర్ణయాలు తీసుకోవడమే. నా జీవితంలో క్లిష్టమైన సమయాలలో ప్రతిసారీ ఎన్నుకోవడం ద్వారా నేను నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నేను ఎన్నుకున్న ప్రతి మార్గం సరైనదే అని కాలం రుజువు చేసింది. అలా ఎంపిక చేసుకుని తీసుకున్న నిర్ణయాలలో ఓ గొప్ప నిర్ణయమే ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి గారితో నా ప్రస్థానానికి నాంది. దాదాపు పాతికేళ్ల పాటు ఆయనతో నా ప్రయాణం, ఆయనతో మెలిగిన సుదీర్ఘ అనుభవం నా వ్యక్తిత్వంలోను, నా మనస్తత్వం లోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేసింది. ఆయనతో గడిపిన అమూల్యమైన సమయాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు.

క్రమశిక్షణ, కష్టపడి అనుకున్నది సాధించడం వంటి అంశాలను ఆయనలో దగ్గరగా చూసి ఎన్నో విషయాలను నేర్చుకుని నన్ను నేను మనిషిగా మలచుకున్నాను. ఈరోజు నేను ఏ ఉన్నత స్థితిలో వున్నా నా అభ్యున్నతికి ఈనాటి నా ఈ స్థితికి ముమ్మాటికీ ఆయనే నాకు స్ఫూర్తి. నేను బట్రాజును కాదు.. నాకు పొగడ్తలు రావు, కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆయన గురించి ఎవరో ఒక్క మాటలో చెప్పమంటే ఇలా చెప్పినట్లు గుర్తు... ''నేను పెద్దగా మతతత్వవాదిని కాదు, గుళ్ళు గోపురాలకు పెద్దగా వెళ్ళను, అయితే ఎందుకంటే నిత్యం నా కళ్లెదురుగా వుండే నాయుడు గార్నే నేను దేవుడిగా చూసేవాడిని, అందుకే ఆయన నాకు 'కనిపించే దైవం'''.

గత వారం నేనో కష్టతరమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించు కున్నాను. ఈ తరుణంలో భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేక అధికారిగా నా పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. నా అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని ఆయనకు చెప్పవలసి వచ్చింది. నా జీవితంలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడు నాకు రాలేదు. ఆయన ఎంతో అభిమానంతో నా నిర్ణయాన్ని అర్ధం చేసుకుని అందుకుగల కారణాలను కూడా అవగతం చేసుకుని నన్ను ఆశీర్వదించారు. ఆ వెంటనే నా రాజీనామా ఆమోదించడం నేను ప్రత్యేక అధికారి పదవి నుండి తప్పుకోవడం జరిగిపోయాయి.

నేను ఇప్పుడు భారతీయ జనతాపార్టీకి అంకితభావం కలిగిన ఓ కార్యకర్తని. నేను కళాశాల విద్యార్థిగా వున్న రోజుల నుండే నాకు పార్టీతో అనుబంధం ఏర్పడింది. అప్పట్లో నేను చిత్తశుద్ధి కలిగిన ఏబివిపి కార్యకర్తని. వెంకయ్యనాయుడు గారిని తొలిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ నియమించినప్పుడు, ఆయన తన కోసం అలాగే పార్టీ కోసం పూర్తి సమయం పనిచేయగల ఓ సమర్ధవంతమైన ఏబివిపి కార్యకర్త కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో నా అదృష్టం కొద్ది ఆయన కళ్ళల్లో నేను పడడం, వెంటనే ఆయన నన్ను తన దగ్గర చేర్చుకోవడం జరిగిపోయింది. ఈ అనుబంధం, ఆత్మీయ బంధం దాదాపు పాతికేళ్ల పాటు కొనసాగింది. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో నేను ఎన్నో విలువైన విషయాల్ని నేర్చుకుని నా జీవితాన్ని మలుచుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంస్థాపరంగా కానీ, పార్టీ పరంగా కానీ, పార్లమెంటు వ్యవహారాలలో కానీ, ప్రభుత్వ సంబంధిత పనులలో కానీ లేదా ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ నాకు చేతనైన వరకు శక్తివంచన లేకుండా పనిచేసి ఆయనకు ఉపక రించడంలో నా బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదు. ఇక నేనిప్పుడు నా మాతృ సంస్థకు వచ్చేసాను. వెంకయ్యగారి ఆశీస్సులతో పూర్తిస్థాయి కార్యకర్తగా పని చేయాలనుకుంటున్నాను.

''కృతజ్ఞత అన్నది ఓ అనుభూతి, అది ఓ భావోద్వేగంతో కూడిన మాటలలో చెప్పలేని భావన''. ఎంతో కృతజ్ఞతతో నేను ఆయనకి రుణపడి వున్నాను. ఈరోజు నా ఈ ఉన్నతికి ఎన్నటికీ కారణం ఆయనే. నేనెప్పటికీ ఆయనకి బద్దుడనై వుంటాను.

ఉషమ్మ గారు, హర్ష, రాధమ్మ, దీపమ్మ, వెంకట్‌ గారు, ఇతర కుటుంబసభ్యులతో పాటు నాయుడు గారి మిత్రులు, పార్టీ సభ్యులు, సహచరులు అందరూ నన్నెప్పుడూ ఓ కుటుంబ సభ్యుడిగానే చూశారు. అన్ని వేళల్లో వారందించిన మద్దతు, స్ఫూర్తి ప్రతి క్లిష్ట సమయంలో ఇచ్చిన చేయూత నా జీవితంలో విలువైనవి. వారి ప్రేమానురాగాలతో తన్మయత్వం చెందాను. నా హృదయాంతరాల్లో నుండి వారందరికీ నా ధన్యవాదాలు. నాకు పిల్లలతో గట్టి బంధం వుంది. విష్ణు, నిహారిక, సుష్మ, వైష్ణవి మేమందరం మిత్రుల్లా వుండేవాళ్ళం. ఒకరి అనుభూతులను ఒకరం పంచుకునేవాళ్ళం. ఎంతో సహజంగా కలిసిపోయే వాళ్ళం. కొలబద్దత లేని వారి ప్రేమాభిమానాలు ఎన్నోసార్లు నా హృదయాన్ని తాకాయి. వారందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు.

నాయుడు గారు ఆయన అమూల్యమైన ఆశీస్సులతో ఇన్నాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక దిక్సూచిగా, ఓ మార్గదర్శకుడిలా నాకు దశా దిశా నిర్దేశించారు. ఆయనకి ఆయురారోగ్యాలతో కూడిన నిండు జీవితం ప్రసాదించాలని, ఆ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

- వై.సత్యకుమార్‌

భారతీయ జనతాపార్టీ కార్యకర్త.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter