Friday, 13 October 2017 08:43

కోతల రాయుడి వాతలు

Written by 
Rate this item
(0 votes)

galpikaభేతాళకథ

పట్టువదలని హైటెక్‌ విక్రమా ర్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. పెద్దపెద్ద హోటళ్లలో టిఫిన్‌ తింటే తిన్న తిండి కంటే జిఎస్టీ బిల్లే ఎక్కువవుతుందని భయపడి మద్రాసుబస్టాండ్‌ వద్ద రోడ్డు మీదున్న టిఫిన్‌ బండి వద్దే పాతిక దోశలు, పాతిక బోండాలు తిన్నాడు. అప్పుడే అటుగా రాకెట్‌లా దూసుకొచ్చిన ఆటో ఎక్కి పెద్దాసుపత్రికి చేరుకున్నాడు. మార్చురీలోకి వెళ్లి డెంగ్యూ జ్వరంతో చనిపోయిన ఓ ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వైపు నడవ సాగాడు. విక్రమార్కుడికి ఎం.జి.బి. మాల్‌కు సమీపంలోకి రాగానే ఎండ ధాటికి చెమటలు కారసాగాయి. ఎండ చుర్రుమనడంతో బాడీలోని భేతాళుడిలో కూడా చలనం వచ్చింది. అతను వుండి... విక్రమార్క... ఏ ఆటో ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి గుద్దుతుందో తెలియని ఈ నెల్లూరు నగరంలో, ఎప్పుడు ఏ కుక్క కరు స్తుందో తెలియని ఈ రోడ్లల్లో, ఏ క్షణమైనా డెంగ్యూ జ్వరాన్ని తగిలించ గల పవర్‌ వున్న ఐఆర్‌20-420 హైబ్రీడ్‌ దోమలున్న ఈ సిటీలో, చుట్టూ వర్షాలు పడుతున్నా మండు టెండలతో నిప్పుల కొలిమిలా వున్న ఈ సింహపురి సీమలో చెమటలు కక్కుతూ నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు శ్రమ తెలియకుండా వుండేందుకు 'కోతలరాయుడు-వాతల రాయుడు' కథ చెబుతాను విను అంటూ రోడ్డు పక్కనేవున్న బెల్టు షాపులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి చెప్ప సాగాడు.

యూపిఏ పదేళ్ల పాలనలో రోజుకో కుంభకోణంతో నాటి కాం గ్రెస్‌ అవినీతి పాలన పట్ల విసుగెత్తి పోయిన ప్రజలకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆశాదీపంలా కని పించాడు. దేవుడు పంపించిన దయామయుడిలా అనిపించాడు. అప్పట్లో దేశంలో ప్రజల పరిస్థితి చూసి నరేంద్ర మోడీ కన్నీళ్ల పర్యంత మయ్యాడు. కనీసం ఇంటికో కారు లేదని, పేద కుటుంబాలకు బంగ ళాలు లేవని, తినడానికి బిర్యానీ కూడా దొరకడం లేదని తెగ బాధ పడ్డాడు. అమెరికాలో వున్నోడు సూటూబూటూ వేసుకుని తిరుగు తుంటే మనం ఇంకా లుంగీలు, అంగీలు కట్టుకుని తిరగడమేంటని ఆవేదన చెందాడు. మన మీడియా కూడా మోడీ వస్తే 'దేశం' తలరాత మారుతుందని ప్రచారాన్ని దంచే సింది. 'మీ ఓటు... మీ బంగారు భవిష్యత్తుకు రూటు' అంటూ బీజేపీ నాయకులు తెగ ఊదరగొట్టేసారు. 2014 ఎన్నికల్లో మోడీ బంపర్‌ మెజార్టీతో గెలిచాడు. గుజరాత్‌లో సీఎంగా నరేంద్రమోడీ ఏం చేసా డన్నది కేరళలో వున్న రామ్‌ నాడార్‌కు, తమిళనాడులో వున్న పొన్నుస్వామికి, కర్నాటకలో వున్న నంజుగౌడకు, ఏపిలో వెంకట సుబ్బ య్యకు, యూపిలో వున్న సుందర యాదవ్‌కు, పశ్చిమ బెంగాల్‌లో వున్న చతుర్ముఖ ఛటర్జీకి... ఇలా ఎవరికీ తెలియదు. కాని, గుజ రాత్‌లో నరేంద్ర మోడీ ఏదో చేసా డని, ఆయన ప్రధాని అయితే దేశంలో అదే చేస్తాడని, మన తల రాతలు మారుతాయని భావించి అన్ని రాష్ట్రాల ప్రజలు ఓట్లేసారు. మోడీ ప్రధాని అయ్యాడు. ప్రజలందరూ సూటు, బూట్లకు ఆర్డర్‌ ఇచ్చారు. కార్ల షోరూమ్‌లకు పరుగెత్తారు. లగ్జరీ కార్లు బుక్‌ చేసారు. ఇక కొన్ని నెలలే... ఆరు దశాబ్దాల తమ దరిద్రం తీరబోతుందని, కొత్త జీవి తానికి తెర లేవబోతోందని, కొత్త ఉషస్సులు, ఉగాదులతో తమ బ్రతు కులలో కళాకాంతులు రాబోతున్నా యని ఆశపడ్డారు. అయితే, ప్రధా నిగా నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దుతో దేశ ప్రజల బ్రతుకులు అతలాకుతలమయ్యాయి. నోట్ల రద్దు పెద్ద ఫ్లాప్‌ షోగా మిగిలిపోగా ఆర్ధిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. అది చాలదన్నట్లు ఆర్ధిక సంస్కరణలంటూ తెచ్చిన జిఎస్టీతో సామాన్యుడికి పన్ను పోటు పెరిగింది. నరేంద్ర మోడీ వస్తే ఒంటి మీదకు సూటూ బూటూ వస్తుందనుకున్న జనానికి మోడీ ఒంటి మీద బనియన్‌ కూడా మిగల్చ కుండా చేసాడు. ప్రతిఒక్కరి మీద ఆర్ధిక భారం పడసాగింది. మోడీపై ప్రజలు పెట్టుకున్న అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఎన్నికల ముందు కోతలరాయుడు ఇప్పుడు వాతల రాయుడయ్యాడు... అని భేతాళుడు ముగించి... ఇప్పుడు చెప్పు... నేను అధికారంలోకి వస్తే ప్రజలకు స్వర్గం చూపిస్తానన్న మోడీ ఇప్పుడు నరకం ఎందుకు చూపిస్తు న్నాడు. కావాలనే చేస్తున్నాడా? తెలిసీ తెలియక చేస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో అమరావతి రాజధాని భవనాలకు ఇంజనీర్‌వై అష్టకష్టాలు పడతావని హెచ్చరించాడు.

అప్పుడు విక్రమార్కుడు... భేతాళ... ఇందులో చిన్న లాజిక్‌ ఉంది. 70ఏళ్ల పాటూ కాంగ్రెస్‌ వాళ్ళు అభివృద్ధి స్వర్గాన్ని చూపిస్తా మంటూ ప్రజలను ఒక మార్గంలో తీసుకెళ్లారు. ఈ మార్గంలో అవినీతి ముళ్ళు, అక్రమాల రాళ్ళు కూడా వున్నాయి. దీని మూలంగానే ప్రయాణం బాగా ఆలస్యం కాసా గింది. ఉదాహరణకు నెల్లూరు నుండి తిరుపతికి బయలుదేరాం. శ్రీకాళ హస్తి దాకా పోయాక ఈ మార్గం బాగా లేదని చెప్పి అక్కడిదాకా వెళ్లిన వాళ్లని వెనక్కి తీసుకొచ్చి ఈసారి పొదలకూరు, రాపూరు, వెంకట గిరిల మీదుగా తిరుపతికి తీసుకెళితే ఎలా వుంటుంది... అలసటకు అల సట... టైంకు టైమూ బొక్క... దీని బదులు కాళహస్తి నుండే పోయే దారిని కొంచెం బాగుచేసుకుని పోతుంటే తొందరగా తిరుపతికి చేరుకుంటారు. కాని, ఇప్పుడు మోడీ చేసిన పని ఇలానే వుంది. 70ఏళ్ల పాటూ నిలబెట్టుకున్న ఆర్ధిక వ్యవ స్థలో లోపాల్ని సరిదిద్ది సంస్కరణలు తేవాలేగాని ఆ ఆర్ధిక వ్యవస్థనే పూర్తిగా క్లోజ్‌ చేసి కొత్త ఆర్ధిక విధా నాలు తేవడంతోటే ప్రజలకు సూటు కోటు సంగతి ఎలాగున్నా ఒంటి మీద గోచీలు కూడా మిగలడం లేదని, పన్నులతో వాళ్ళ ఒంటిమీద వాతలు తేలుతున్నాయని చెప్పాడు. విక్రమార్కుడి సమాధానంతో సంతృప్తి చెందిన భేతాళుడు తాగిన బీర్‌ సీసాలకు బిల్‌ కట్టకుండా పక్కనేవున్న చెట్టుమీదకు చెక్కేసాడు.

Read 85 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter