Friday, 20 October 2017 11:15

జిఎస్‌టి దెబ్బకు దీపావళి తుస్‌...

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ద్వారకా నగరం. సత్యభామ టీవీలో జిమ్‌జామ్‌ ఛానెల్‌ పెట్టుకుని 'తన్నితే పెళ్ళాం చేతే తన్నించుకోవాలి' సీరియల్‌ 18,472వ ఎపిసోడ్‌ చూస్తోంది. దాదాపు 10,411వ ఎపిసోడ్‌ నుండి మొగుడిని పెళ్లాం తన్నే సీన్‌లే తిప్పి తిప్పి చూపిస్తూ ఆ ఛానల్‌ వాళ్ళు మగజాతి పట్ల వున్న తమ విద్వేషాన్ని చాటుకుంటున్నారు. కరెక్ట్‌గా పెళ్లాం తంతే మొగుడు ఎగిరి గోడ మీద పడతాడు. ఆ సస్పెన్స్‌లోనే సీరియల్‌లో బ్రేక్‌... అప్పుడే లలితా జ్యూయలరీ యాడ్‌లో గుండు బాస్‌ వచ్చాడు. బంగారం ఎక్కడ కొంటున్నారు... ఇతర షాపులలో సరిచూసుకుం టున్నారా... అంటూ ప్రకటనలో చెబుతుండగా... ''నారాయణ నారాయణ'' అంటూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. రాగానే టీవీలో వస్తున్న లలిత జ్యూయలరీ గుండుబాస్‌ యాడ్‌ చూసాడు. సత్యభామతో... నిన్న ఇతన్ని ఎక్కడో చూసానమ్మా... అని అన్నాడు. ఎక్కడ స్వామీ అని సత్యభామ అడిగింది. ఆ గుర్తొచ్చిందమ్మా... నిన్న మీ శ్రీవారు కృష్ణ భగవానుడు, నేను చెన్నైలోని లలిత జ్యూయలర్స్‌కు వెళ్లాం.. అక్కడే ఈ గుండతన్ని చూసాను అని అన్నాడు. లలిత జ్యూయలర్స్‌కు వెళ్లారా... ఏం కొన్నారు స్వామీ అని సత్యభామ ఆతృతగా అడిగింది. దానికి నారదుడు... అదే 50లక్షల ఖరీదు చేసే డైమండ్‌ నక్లెస్‌ సెట్‌ అమ్మా... ఇంతకీ నీ వద్దకు తేలేదా అని నారదుడు నసుగుతూ అడిగాడు. నా వద్దకు తేలేదు స్వామీ అని సత్య చెప్పింది. అలాగైతే ఎక్కడ ఇచ్చి వుంటాడో, ఎవరికి ఇచ్చి వుంటాడో అంటూ నారదుడు అగ్గిపుల్ల గీసేసాడు. సత్యభామ ఆవేశంతో వూగిపోయింది. అప్పుడే పిల్లనగ్రోవి వూదుకుంటూ శ్రీకృష్ణుడు ఇంట్లో అడుగుపెట్టాడు. అలా అడుగుపెట్టాడో లేదో ఒళ్లంతా సెగ... ఏందబ్బా ఇంత సెగ వుందని లోపలకు చూసాడు. ఎదురుగా నారద మహర్షి కనిపించాడు. అప్పుడే కృష్ణుడి ఎడమకన్ను అదిరింది. గుండెలో రాయిపడ్డట్లయ్యింది. ఈ అగ్గిపుల్ల స్వామి ఏదో మంట పెట్టేసాడు. ఇప్పుడు ఈ మంటను ఆర్పాలంటే ఎన్ని ఫైరింజన్‌లను పిలిపించాలో ఏమో అనుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ బెడ్‌మీద కూర్చుని సత్యభామ బుసలు కొడుతుంది. కృష్ణుడికి పరిస్థితి అర్ధమయ్యింది. సత్య అంటూ ఆమె భుజంపై ప్రేమగా చేయి వేసాడు. అంతే ఆమె విసిరిన విసురుకు బయటకొచ్చి పడ్డాడు. మళ్ళీ లేచి నడుము సర్దుకుని నారదుడి వద్దకు వెళ్లి.... ఈ సెగకు కారణమేంటని అడిగాడు. నిన్న లలిత జ్యూయలర్స్‌లో కొన్న డైమండ్‌ నక్లెస్‌ అని నారదుడు చెప్పాడు. నీ నోటికంటే తెలుగు న్యూస్‌ ఛానెల్స్‌ నయం నారదా అంటూ శ్రీకృష్ణుడు నిదానంగా సత్యభామ వద్దకు వెళ్లాడు. సత్య... నువ్వు నా మనసును అర్ధం చేసుకోలేదు. నిన్న నేను కొన్న ఆ డైమండ్‌ నీ సుందరమైన ముఖానికి ఏ మాత్రం సరిపోదు. అందుకే దానిని రుక్మిణికిచ్చేసా.... రేపు ఎలాగూ దీపావళి... స్వయంగా భూలోకానికే వెళదాం... అక్కడ నీకు సెట్‌ అయ్యే డైమండ్‌ సెట్‌ను నువ్వే సెలక్ట్‌చేసుకో... రుక్మిణికి ఇచ్చింది 50లక్షల నక్లెస్సే! నీకు కోటి రూపాయలు ఖరీదు చేసే డైమండ్‌ సెట్‌ తీసిస్తా కదా అని హామీ ఇచ్చి బయటకొచ్చాడు. అక్కడ నారదుడు... ఏం ప్రభూ... ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యిందా అని అడిగాడు. నువ్వు అగ్గి పెట్టావు కదా... దానిని ఆర్పుకోవాలంటే ఇంకో కోటి ఖర్చు... ఖర్చు మాట ఎలాగున్నా... ఆ మోడీతో ఇన్‌కంటాక్స్‌ బాధ వొకటి అని వాపోయాడు.

చెన్నైలోని లలిత జ్యూయలర్స్‌ షాపు. మారువేషంలో శ్రీ కృష్ణుడు, సత్యభామ, నారదుడు అక్కడకు వెళ్లారు. సత్యభామ ఓ డైమండ్‌ సెట్‌ను చూసింది. దాని మీద రేటు 95,00,000/- అని వుంది. నారదుడు టక్కున... అమ్మా... దీనికంటే కూడా ఆ ఎర్రరాళ్ళ సెట్‌ బాగుంది చూడు అని ఇంకోవైపు చూపించాడు. దాని క్రింద రేటు 1,75,00,000/- రూపాయలు అని వుంది. ఆ రేటును చూడగానే కృష్ణుడి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. పెళ్లికి పోతూ పిల్లిని చంకలో పెట్టుకోవడం అంటే ఇదే... ఈ నారదుడిని వెంటబెట్టుకుని రాకుండా వున్నా బాగుండేది అని అనుకుంటూ బిల్లు చెల్లించడానికి కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. జిఎస్టీతో కలిపి కోటి 90లక్షలు కట్టేసాడు. ఆ షాపు అధినేత గుండూ బాస్‌ వీళ్ళతో... ఇప్పుడు తక్కువ అమౌంట్‌తో షాపింగ్‌ చేసారు సార్‌... ఈసారి షాపింగ్‌కు వచ్చినప్పుడు మేడమ్‌కు ఖరీదైన నగలు తీసివ్వాలి ఆల్‌ ది బెస్ట్‌ అని అన్నాడు. కోటి 90లక్షలు వీడికి చీప్‌గా కనిపిస్తున్నాయా అని కృష్ణుడు మనసులో అనుకుని... అక్కడనుండి బయటపడ్డారు. తెలుగు ప్రజలు దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో చూద్దామని ఐఆర్‌ 20 - 420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరానికి వచ్చారు. మొదట నైట్‌రైడర్‌, మంత్రి నారాయణ ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఎలాంటి బాణాసంచా వెలుగులు లేవు. అక్కడ వున్న సెక్యూరిటీతో... మీ సార్‌, దీపావళి చేసుకోవడం లేదా అని నారదుడు ప్రశ్నించాడు. అందుకు సెక్యూరిటీ... మా సార్‌ ఏ అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడు పోతాడో తెలియదు. ఇక దీపావళి పండుగ కూడానా? అని చెప్పాడు. తర్వాత వీళ్ళు చిల్డ్రన్స్‌పార్క్‌ వద్ద వున్న గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి ముందు కూడా దీపావళి వాతావరణం లేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సతీమణి సునందతో సత్యభామ వుండి... దీపావళి ఎందుకు చేసుకోవడం లేదని అడిగింది. 'మన ఎమ్మెల్యే మన ఇంటికి' అంటూ మావారు వెళ్లిపోయారు. ఆయన మా నియోజకవర్గ ప్రజల ఇళ్లల్లో ఎక్కడో ఒక చోట వారితో కలిసి దీపావళి పండుగ చేసుకుంటాడు. ఈసారి మాకు టపాసుల ఖర్చు తగ్గించాడు. అసలే జిఎస్‌టి దెబ్బకు టపాసులు కొనేటట్లు లేవు అని చెప్పింది. కృష్ణుడు బ్యాచ్‌ అక్కడనుండి బయలుదేరి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పి.అనిల్‌ కుమార్‌యాదవ్‌... ఇలా అందరు ఇళ్ల దగ్గర చూసారు. ఎక్కడా టపాసుల మోతే లేదు. అందరూ జిఎస్‌టి దెబ్బకు టపాసులు కొనలేదని చెప్పారు. అప్పుడే ఏ.సి సెంటర్‌ ప్రాంతంలో ''ఢాం ఢాం తుస్‌... టప... ఫట్‌ ఫట్‌'' అంటూ పెద్దఎత్తున టపాసుల శబ్దాలు రావడంతో కృష్ణుడు, సత్య, నారదుడు అక్కడకు పరుగెత్తారు. అక్కడ కళ్లకు నల్లద్దాలు పెట్టివున్న స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) కనిపించాడు. అక్కడ టపాసులేమీ లేవు కాని... ఢాం ఢాం అంటూ చెవులు పగిలి పోయే శబ్దాలు వస్తున్నాయి. టపాసులు కనిపించడం లేదు. ఈ శబ్దాలేంటి నాయనా అని వివేకాను కృష్ణుడు అడిగాడు. టపాసుల శబ్దాలే స్వామీ... అదిగో శబ్దాలు అక్కడ నుండి వస్తున్నాయి అంటూ ఓ పక్కన చూపించాడు. అక్కడ పెద్దపెద్ద స్పీకర్‌లు వున్నాయి. సి.డి పెట్టి రికార్డ్‌డ్‌ టపాసుల శబ్దాలు వింటూ దీపావళి టపాసులను కాలుస్తున్నంత ఆనందంగా వున్నారు. ఇదేం దీపావళి నాయనా అని కృష్ణుడు అడిగాడు. ఏం చేసేము స్వామీ... జిఎస్టీ దెబ్బకు టపాసులు కొనేటట్లున్నాయా... అందుకే ఈ రకంగా దీపావళి చేసుకుంటున్నాం అని వివేకా చెప్పాడు. ఆ మాట వినగానే కృష్ణుడికి 'అహనా పెళ్లంట' సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి ఒట్టి అన్నం తినే సీన్‌ గుర్తుకొచ్చింది.

Read 32 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter