Saturday, 04 November 2017 07:52

దోమలతో పాదయాత్రకు బ్రేకులు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌. ప్రఖ్యాత ఇంజనీర్‌ నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులతో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ, సినీ దర్శకులు రాజమౌళి, బోయపాటి శ్రీను, కె.రాఘవేంద్రరావులు సమావేశమయ్యారు. నార్మన్‌పోస్టర్‌ ప్రతినిధులు ఉండి, మీకు ఎటువంటి రాజధాని కావాలో సలహాలివ్వండి, దాని ప్రకారం డిజైన్‌ గీస్తాం అని చెప్పారు. చంద్రబాబు రాజమౌళి వైపు చూసాడు. వెంటనే రాజమౌళి స్పందించి... మీకు మొన్ననే బాహుబలి-1, 2 సి.డిలు చూపించాను, ఆ సినిమాల్లో వున్న కోట మాదిరిగా అసెంబ్లీ భవనం కావాలి. అలాగే అవంతి రాజ్యం యువరాణి చంద్రసేన వుంటున్న కోట లాంటి కోర్టు భవనం కావాలి. శత్రువులు చొరబడకుండా వాటి చుట్టూ కందకాలు తవ్వించాలి. భారీ ఏనుగులు, సింహాల విగ్రహాలు అమర్చాలి. అసెంబ్లీ ప్రాంగణంలో నూరడుగుల చంద్రబాబు విగ్రహం ఏర్పాటు చేయాలి... అని రాజమౌళి చెబుతుండగా, నార్మన్‌పోస్టర్‌ వుండి... లిఫ్టులు ఎన్ని పెట్టమంటారు అని అడిగాడు. దానికి రాజమౌళి... లిఫ్టులు అవసరం లేదు. ప్రతి అంతస్తు నుండి తాళ్ళు క్రిందకు వేలాడదీస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆ తాళ్ళు పట్టుకుని పాకుతూ పై అంతస్థులకు చేరుకుంటారు. నడవలేని వృద్ధ నాయకుల కోసం డోలీలు ఏర్పాటు చేస్తాం. ఆ డోలీలలో వారిని పైఅంతస్థులకు మోసుకెళతారు అని సలహా ఇచ్చాడు. తర్వాత బోయపాటి శ్రీను వుండి... రాజధాని ప్రాంగణంలోనే పెద్ద సరస్సు ఏర్పాటు చేయండి, దేశంలో పుష్కరాలు జరిగే పన్నెండు నదుల జలాలలను ఆ సరస్సులో నింపాలి. అప్పుడు ప్రతి ఏటా రాజధానిలోనే ఏ నది పుష్కరమైతే ఆ నది పుష్కరం చేసుకోవచ్చు. నా పాటికి నేను సెట్టింగ్‌లు వేసుకుంటాను, చంద్రబాబు గారికి చేతి నిండా పని అని చెప్పాడు. తర్వాత కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాజ ధానిలో పండ్ల చెట్లు బాగా వుండేలా డిజైన్‌ చేయండి, అన్ని రకాల ఫ్రూట్స్‌ దొరకాలి. అప్పుడే ఏపిలో ఎప్పుడన్నా సినిమాలు తీయాలంటే మాకు సులభంగా వుంటుందని చెప్పాడు. వీరు చెప్పిన సలహాలను వ్రాసుకున్న నార్మన్‌ పోస్టర్‌... ఈసారి బాగా డిజైన్‌ గీసి తెస్తామన్నాడు. అందుకు చంద్రబాబు... మీరు అంత తొందరగా డిజైన్‌ ఏమీ ఇవ్వబల్లేదు, నేనింకా రాజధాని కోసం పాతిక దేశాలు తిరగాలి, ఆ దేశాల రాజధానులు మాదిరిగా అమరావతిని తయారు చేస్తానని చెప్పాలి. కాబట్టి మునిగిపోయిందేమీ లేదు. ఇప్పుడు నువ్వు డిజైన్‌ ఇచ్చినా వెంటనే మేము కట్టేదేమీ లేదు. కాబట్టి నిదానంగా ఇవ్వండి అంటూ అక్కడనుండి లేచాడు.

------

అమరావతిలో చంద్రబాబు నివాసం. విలేకరుల సమావేశం పెట్టాడు. ప్రజల కోసం నేను 24గంటలూ కష్టపడుతున్నాను. అమెరికాలో వున్నా, లండన్‌లో వున్నా, దుబాయ్‌లో వున్నా నా మనసంతా అభివృద్ధి మీదే వుండింది. దీపావళి పండుగ కూడా చేసుకోకుండా అమెరికాలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశ మయ్యాను, నాగులచవితి రోజు లండన్‌లో నార్మన్‌ పోస్టర్‌తో సమావేశమయ్యాను అని చెబుతుండగా... అప్పుడే భువనేశ్వరీదేవి అక్కడకు వచ్చి... పండుగరోజుల్లో మిమ్మల్నెవరు విదేశాలకు పొమ్మన్నారు, పండుగలను చూసుకునే పొమ్మన్నాను కదా, ఎప్పుడు పోయినా మీరు చేసే పని ఒకటే కదా అని అంది. చంద్రబాబు నెత్తి నోరు బాదుకుని... నా అగచాట్లు ఏవో నేపడుతున్నాను, నువ్వు లోపలకెళ్లు అంటూ ఆమెను లోపలకు పంపించి, నేను దీపావళి చేసుకోవడం నాకు ముఖ్యం కాదు, ప్రతిరోజూ రైతులు దీపావళి చేసుకోవాలి, అందుకే నా ఈ శ్రమంతా అని అన్నాడు. అక్కడేవున్న 'చంద్రజ్యోతి' విలేకరి... సార్‌, జిఎస్టీ దెబ్బకు పెరిగిన టపాసుల ధరలతో సంవత్సరానికి ఒకరోజు దీపావళి చేసుకోవ డమే కష్టంగా వుంది, మరి రోజూ దీపావళి చేసుకోవడమంటే కష్టంగా వుంటుందేమో అని అడిగాడు. అందుకు చంద్రబాబు... నా ఉద్దేశ్యం దీపావళి అంటే రోజూ టపాకాయలు కాల్చాలని కాదు, రోజూ ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలని... అని చెప్పాడు. ఏబిసి న్యూస్‌ ఛానెల్‌ విలేకరి వుండి... సార్‌, అమరావతి రాజధాని రైతులను సింగపూర్‌ పర్యటనకు పంపించడం వెనుక మీ ఉద్దేశ్య మేంటని అడిగాడు. చంద్రబాబు దానికి స్పందిస్తూ... రాజధాని పేరుతో ఇక్కడున్న రైతులందరి భూములు తీసుకున్నాం. ఇక వీళ్ళకు వ్యవసాయం చేసే అవకాశం లేదు. కాబట్టి వ్యవసాయం చేయకున్నా ఎలా బ్రతకాలో తెలియజెప్పేందుకే వ్యవసాయమే లేని సింగపూర్‌లో తిప్పుతున్నామని చెప్పాడు. టీవీ 25.5 విలేకరి వుండి... సార్‌, అమరావతి రాజధాని ఎప్పటికి కంప్లీట్‌ కావొచ్చంటారు అని ప్రశ్నించాడు. దానికి చంద్రబాబు... మీ ప్రశ్న రాంగ్‌... మీరు అడగాల్సింది ఎప్పుడు మొదలవ్వొచ్చంటారు? అని! ముందు మొదలుపెడితే కదా కంప్లీట్‌ కావడానికి. మేమింకా పాతిక దేశాలదాకా తిరగాలి. అక్కడి రాజధానులు చూడాలి... నార్మన్‌ పోస్టర్‌ ఇచ్చిన డిజైన్‌లను పరిశీలించాలి, వాటిని మా రాజమౌళి ఓకే చెయ్యాలి, బాహుబలి సినిమాలాగే అమరావతి రాజధాని కూడా రెండు పార్ట్‌లనుకోండి. మొదటి పార్ట్‌ అంటే ఈ టర్మ్‌లో రాజధాని డిజైన్‌ రూపకల్పన, పరిశీలన, శంకుస్థాపనలుంటాయి. నెక్ట్స్‌ పార్ట్‌ అంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తే రాజధాని నిర్మాణం మొదలవుతుంది అని చెప్పి అక్కడితో ప్రెస్‌మీట్‌ ముగించి అందరినీ పంపించేసాడు.

ప్రెస్‌వాళ్ళు వెళ్ళగానే ఇరు రాష్ట్రాల తెలుగుదేశం నాయకులు మోత్కుపల్లి నరసింహులు, ఎల్‌.రమణ, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు లోపలకు వచ్చారు. మోత్కుపల్లి వుండి... సార్‌, మన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ రేవంత్‌రెడ్డి ఇప్పుడే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి వెళ్లాడు. ఇక మనం తెలంగాణలో కేసీఆర్‌తో హాయిగా చెట్టపట్టాలేసుకుని తిరగొచ్చు. ఆ రేవంత్‌తో అన్నీ తలనొప్పులే, ప్రతిదానికీ కేసీఆర్‌తో ఫైట్‌ అంటాడు. మనకేమో అతనితోనే అన్నీ పనులాయె అని అన్నాడు. తర్వాత యనమల వుండి... అక్కడ రేవంత్‌ తల నొప్పి పోయింది, ఇక్కడ జగన్‌ తలనొప్పి మొదలుకానుంది. ఆ జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడు. నాకు కళ్ళ ముందు వై.యస్‌. పాదయాత్ర, ఆ తర్వాత సీన్‌లు కనిపిస్తున్నాయి. ఆ జగన్‌ పాదయాత్ర చేయకుండా అడ్డుకునే మార్గం లేదా? అని ప్రశ్నించాడు. అప్పుడు చంద్రబాబు సోమిరెడ్డి వైపు నవ్వుతూ చూసాడు. అప్పుడు సోమిరెడ్డి... యనమలన్నా... జగన్‌ పాదయాత్రను బ్రేక్‌ చేయడానికి మా వద్ద స్కెచ్‌ రెడీగా వుంది. జగన్‌ పాదయాత్ర అనంతపురం, చిత్తూరుజిల్లాలను దాటి నెల్లూరుజిల్లాలోకి ప్రవేశిస్తుంది. మొదట వెంకటగిరి వద్ద పదికిలోల నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురు దోమలను సిద్ధంగా వుంచుతాం... అక్కడకు రాగానే ఆయనపై అవి దాడి చేస్తాయి. వాటిని కూడా తప్పించుకుని గూడూరు దాకా వస్తే అక్కడ పాతిక కిలోల దోమలు సిద్ధంగా ఉంచుతాం... ఇక్కడ కూడా మిస్‌ అయ్యాడనుకోండి... ఈసారి నెల్లూరులో టన్ను దోమలను సిద్ధం చేసి వుంచుతా... ఇక్కడ తప్పించుకోవడం చాలా కష్టం... దోమలు కరవడం, చికున్‌గున్యా జ్వరంతో కాళ్ళు నొప్పులొచ్చి జగన్‌ పాదయాత్ర ఆపేయడం... అంతా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది అని వివరించాడు. చంద్రబాబుతో పాటు మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఆ మాటలను ఎంతో ఆనందంగా వినసాగారు.

Read 32 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter