09 November 2017 Written by 

విజయమా? విఫలమా?

notesపెద్దనోట్ల రద్దుకు ఏడాది గడిచింది. ఈ రద్దుతోపాటు కలసి వచ్చిన కష్టాలకూ ఏడాది గడిచి నట్లయింది. ప్రధాని మోడీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వం గత ఏడాది నవంబరు 8వ తేది అర్ధరాత్రి నుంచి పెద్దనోట్లు రద్దు చేయడం.. దేశంలో ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఇతర దేశాల్లోనూ చర్చగానే ఉంది. ఆ రద్దు సరైనదా.. కాదా అనే విషయమై ఆర్ధికవేత్తల్లో వాదోపవాదలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చరిత్రాత్మకమైనదని కొందరంటే, ఆర్ధికాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని మరికొందరి అభిప్రాయం. రద్దు మంచిదేనని కొందరు, ఆలోచన మంచిదే కానీ, ఆచరణ పకడ్బందీగా లేదని కొందరు. ఏ కొత్త సంస్కరణ అయినా దానిని అమలుపరచేందుకు కొంత సమయం పడుతుందని, రద్దు వల్ల నల్లధనం పోయి దేశంలో పారదర్శకత వస్తుందని ఇంకొందరు...ఇలా రకరకాల అభిప్రాయాలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూనే ఉన్నా, విపక్షమైన కాంగ్రెస్‌ మాత్రం ఆ రద్దు నిర్ణయం మంచిది కానే కాదని విమర్శిస్తూనే ఉంది. అయితే, ప్రజలు మాత్రం రద్దు నిర్ణయంతో ఎన్నో కష్టాలు పడ్డారు. రద్దు నిర్ణయం వెలువడిన తరువాత దాదాపు రెండు మూడు నెలల వరకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకుల ముందు బారులు తీరినా, గంటల తరబడి క్యూలో నిల్చున్నా డబ్బు చేతికి అందడం గగనంగానే ఉండింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎలాగో ఆ బాధలు తీరాయి. మునుపటిలా ఇప్పుడు బ్యాంకుల వద్ద క్యూలు కనిపించకపోవడం అందుకు నిదర్శనం. కానీ, ఇంత పెద్ద సాహసోపేతమైన రద్దు నిర్ణయం వల్ల ఒనగూరిన ఫలితం మాత్రం సామాన్య ప్రజలు పూర్తిస్థాయిలో పొందలేకున్నారనే అభిప్రా యాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నగదు లావాదేవీల వ్యవహారమంతా డిజిటల్‌స్థాయిలో జరగాలంటే అందుకు తగ్గ పరిజ్ఞానం ఉండేది ఏ కొందరికో మాత్రమే. గ్రామీణప్రాంతాల్లోనైతే ఇదింకా దుర్లభంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించకుంటే ఇది ఎప్పటికప్పుడు కాలయాపన జరిగిపోతూనే ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాల్లో అప్పటికీ ఇప్పటికీ తేడా ప్రజలందరికీ అనుభవమవుతూనే ఉంది. ప్రభుత్వం చేసింది మంచిదేననే అభిప్రాయం సర్వత్రా ఉన్నా, నల్లధనం పూర్తిస్థాయిలో బయటపడలేదనే వాదనలూ ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు ద్వారా నల్లడబ్బుకు చెక్‌ పెట్టినట్లవుతుందన్నది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే విషయం. బ్యాంకుల్లో చేరిన డబ్బు ఎవరిదన్న విషయంలో స్పష్టత ఉండడంతో నల్లధనానికి చెక్‌ పెట్టినట్లయింది. కానీ, అవినీతికి పాతర తవ్వినా అది మాత్రం అందులో పడడం లేదని, పక్కదారులు చూసుకుంటూ హాయిగానే ఉంటోందన్నది బహిరంగ రహస్యమే. కోటానుకోట్ల రూపాయల అవినీతి అక్రమార్జనలు దేశవ్యాప్తంగా ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దును సమర్ధించేవారు ఉన్నప్పటికీ, అదే స్థాయిలో ఆ రద్దును వ్యతిరేకించేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తేమీ కాదు. ఇకపోతే, పెద్దనోట్ల రద్దు, జిఎస్టీల వల్ల దేశ ఆర్ధికరంగం కునుకేసిందని, ప్రైవేట్‌ పెట్టుబడుల్లో వృద్ది గత పాతికేళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయికి పడిపోయిందని, భారత ఆర్ధిక విధానానికి ఇది దారుణమైన దెబ్బ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విమర్శ. అయితే, పెద్దనోట్ల రద్దు చరిత్రాత్మకమని, భవిష్యత్తు తరాలు నిజాయితీతో కూడిన వ్యవస్థలో జీవించేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగకరమని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, నోట్ల రద్దుతో నల్లకుబేరులకు ఎదురుదెబ్బ తగిలిందని, దేశ ఆర్ధికాభివృద్ధి పట్ల భవిష్యత్తరాలు గర్వపడతాయని ఆయన అంటున్నారు. అయితే, ఆర్థికవృద్ధిని అంచనావేసే జీడిపి గతంలో 7.1 శాతం ఉంటే, ఇప్పుడు 5.7శాతమే వృద్ధి కనిపిస్తోందని ఆర్ధికవేత్తల అంచనా. వృద్ధి రేటు క్షీణతను విస్మరించడానికి వీల్లేదని వారి వాదన. ఏదేమైనా ఇక్కడ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దేశాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రవాహం నిలచిపోయేందుకు, కశ్మీర్‌లో సైనికులపై రాళ్ళదాడులు ఆగిపోయేం దుకు, నకిలీ కరెన్సీ నిరోధానికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతగానో దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశభద్రత రీత్యా ఇదెంతో అవసరం కూడా. ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఇంకేమి కావాలి?.. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదుల దాడులు తగ్గిపోవడం, హవాలా లావాదేవీలు సగానికపైగానే తగ్గడం, నకిలీ నోట్లు కనుమరుగు కావడం భారీ లక్ష్యాలను సాధించినట్లే. ఇవేమీ చిన్నవిషయాలు కావు. ఇంకా లక్షలాది డొల్ల కంపెనీల భరతం పట్టడం, బినామీ ఆస్తులను గుర్తించి జప్తు చేయడం, బ్యాంకింగ్‌ వ్యవస్థలో డిపాజిట్లు లక్షలాది కోట్లు పెరగడం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య మునుపెన్నడూ లేనంతగా భారీగా పెరగడం వంటివన్నీ పెద్దనోట్ల రద్దువల్ల ఒనగూడిన ప్రయోజనాలేనని భావించవచ్చు.

అయితే, దేశవ్యాప్తంగా అవినీతిని నిరోధించేం దుకు అవినీతి నిరోధక వ్యవస్థల్ని మరింతగా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధించింది కొంతే అయినా, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ప్రజలపై భారంగా ఉన్న పన్నులను బాగా తగ్గించాలి. ప్రజల కష్టాలు గమనించి ధరలు తగ్గేలా చూడాలి. అసంఘటిత కార్మికుల జీవనోపాధికి, చేతివృత్తులవారు, వ్యాపారస్తులు, పరిశ్రమల వారికి ఇబ్బంది లేని విధానాలను అనుసరించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రాధమిక వసతుల కల్పన వంటి రంగాలకు నిధుల కొరత లేకుండా చూడాలి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ అవసరమైన మార్పులు చేయాలి. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరింతగా కృషి జరగాలి.

ఏదేమైనా, కేవలం ఏ కొన్ని రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆర్ధికాభ్యున్నతిని సాధించినప్పుడే అది దేశ సమగ్రాభివృద్ధి అవుతుంది. ప్రభుత్వం, మేధావులు అందరూ కలసి మరిన్ని మంచి నిర్ణయాలతో దేశాభివృద్ధికి పాటుపడాలి. పెద్దనోట్ల రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలతో సామాన్యప్రజలకు కూడా మేలు జరగాలి. అప్పుడే అలాంటి భారీ సంస్కరణలకు మరింత సార్ధకత చేకూరినట్లవుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter